మెయిన్ ఫీచర్

మహా మహితాత్మురాలు శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్మాత ఆదిపరాశక్తి భక్తరక్షణార్థమై భూలోకంలో ఆర్యవైశ్య కులములో జన్మించి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీగా అవతరించింది. కామాంధులను అంతమొందించి హింస రహిత విధానంలో భక్తులకు ధర్మప్రబోధము చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో కలియుగంలో అవతరించిన మహామహితాత్మురాలు వాసవీ కన్యకాపరమేశ్వరి. సుమారు 2500 సం.లకు పూర్వమే కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మాణమైందని చరిత్ర చెపుతోంది. విష్ణువర్ధన మహారాజు చరిత్ర ప్రకారం 5000 సం.లకు పూర్వమే అమ్మవారు అవతరించిందని, ఆ కాలంలోనే ఆలయ నిర్మాణం జరిగిందని ఒక వాదన వుంది. ఎన్ని వాదనలు వున్నా కలియుగం ప్రారంభమైన తరువాత వాసవీ కన్యకాపరమేశ్వరి జన్మించిందనేది వాస్తవం అని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి.
గోదావరీ నదీ తరంగాల తీరాన పెనుగొండలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మాణమైంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే నగరేశ్వరస్వామి మందిరం కూడా వుంది. ఈ స్వామి స్వయంభువుగా వెలిశాడు. ఈ స్వామికి ఎడమవైపు సింహవాహనంపై అష్ట్భుజాలతో ఆయుధాలతో మహిషాసుర మర్ధినీదేవి కొలువైయున్నది. నగరేశ్వరస్వామికి ఎదురుగా రెండు నందులున్నాయి. ఈ ఆలయానికి ఎనిమిది అంతస్థుల గాలి గోపురం, 102 స్తంభాల మండపం వున్నది.
దుష్టశిక్షణ, శిష్టరక్షణ, కామాంధులను అంతమొందించడానికి జగన్మాత ఆదిపరాశక్తి శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిగా అవతరించింది. కుసుమ శ్రేష్ట దంపతులకు జన్మించి ధైర్య, స్థైర్య, సత్య, పాతివ్రత్య మహిమతో అహింసా విధానాన్ని అవలంభించి కామాంధుడైన విష్ణువర్ధనుని అంతమొందించింది. నందీశ్వరుడు భూలోకంలో వాసవీ దేవికి అన్నయ్యగా విరూపాక్షుడిగా జన్మించి ధర్మపరిపాలన చేసాడు. వాసవీదేవి భూలోకంలో అవతారాన్ని ముగించే సమయంలో ఆర్యవైశ్యులకు ఆరాధ్యదేవతగా వుంటానని, ఆర్యవైశ్యులకు రక్షణగా వుంటానని వరమిచ్చింది. ఒక చేతిలో చిలుకను, మరొక చేతిలో కలశాన్ని ధరించి పద్మంలో కూర్చొని లక్ష్మీదేవిలా స్వయంభువుగా అవతరించింది. వాసవీ దీక్షలో తనను పూజించిన భక్తులకు ఏ బాధలు, కష్టాలు వుండవని కన్యకాపరమేశ్వరీదేవి వరమిచ్చింది. శ్రద్ధ్భాక్తులతో మాల ధరించి మండలం (44 రోజులు) దీక్ష చేపట్టి పూజిస్తే తాను సంతోషిస్తానని అమ్మవారు తెలిపిందని, పురాతన గ్రంథాలు చెప్తున్నాయి. సామాన్య మానవ యువతిగా జన్మించి ఆర్యవైశ్యుల కులదైవంగా వాసవీ కన్యకాపరమేశ్వరి పూజలందుకుంటోంది. వాసవీ చరిత్ర గురించి అనేక వాదోపవాదాలు వున్నాయి. భక్తులు తమదైన శైలిలో ప్రామాణికాన్ని మార్పులు చెయ్యకుండా అనేక పుస్తకాలు వ్రాసారు. వాసవీదేవి ఆత్మార్పణ సమయంలో విశ్వరూపం చూపించి అగ్నిప్రవేశం చేసిందని, ఆ కారణంగా వైశ్యుల కులదైవంగా ప్రసిద్ధి చెందింది. వాసవీ చరిత్ర చదివిన భక్తులకు ఈ గ్రంథం పౌరాణికమా, ఐతిహాసికమా అనే సందేహాలు వస్తాయి. అన్ని సందేహాలు భక్తుల నమ్మకాన్నిబట్టి సమర్ధించుకుంటున్నారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆదిపరాశక్తి స్వరూపమని ఆమె జగన్మాత, జగదాంబ, విశ్వమాత, విశే్వశ్వరిగా స్తుతిస్తూ భక్తులు ఆరాధిస్తున్నారు.

-కురువాడ మురళీధర్