మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

121. అహంకారము ఎట్లును అడగునట్లు నీకు కాన్పింపని యెడల ‘దాసోహం’ అను రూపమున దానిని నిలిచి యుండనిమ్ము. ‘‘నేను భగవంతుని కింకరుడను, నేను వాని భక్తుడను’’ అను అంకారమువలన నంతగా భయపడవలసినది లేదు. మిఠాయిలు అజీర్ణవాతమును గలిగింపవచ్చును, కాని కలకండ అట్టిది కాదు. భక్తుని ‘దాసోహం’ అను నహంకారమును పసివాని ‘నేను’ అను నహంకారమును -పుల్లతో నీటిపై గీచిన గీతవంటివి, అది ఎంతో సేపుండవు.
122. కలకండయందు ఇతరమగు తియ్యని వస్తువులవలె దుర్గుణములు లేని చందమున భగవంతుని కింకరుడనని , భక్తుడనని కాని భావించు పక్వమైన అహంకారములో దోషము లేదు, దానివలన హాని కలుగదు. కాని అపక్వమైన అహంకారము అట్టిది కాదు, దానివలన అనేక బాధలు కలుగును. పక్వమైన అహంకారమో, భగవత్ప్రాత్తిని గలుగజేయుచు భక్తియోగమనదగియున్నది.
123.‘దాసోహం’ అనుభావము కలవాని కామ క్రోధాదులు ఏ విధముగా నుండును? ఆ మనోభావన సత్యమును మనఃపూర్వకమునైన పక్షమును వాని పూర్వపు కామక్రోధాదులు పేరునకు మాత్రముండును. భగవంతుని దాసుడనను అహంకారము కాని, భక్తుడనను అహంకారము కాని నిలిచి యున్నను సాక్షాత్కారము పొందినవాడెవ్వనికి హాని చేయడు-చేయజాలడు. అట్టి అహంకారమున తానొక వ్యక్తినను విషయమంతయు హరించిపోవును. దాని పూర్వపు రూపు నిలిచియున్నను అది ఎవ్వనికిని హానిచేయజాలదు.
124.నీకు అహంభావమున్న యెడల భగవంతుని సేవకుడనియో పుత్రుడననియో భావన చేసి గర్వపడుము. మహాత్ములు శిశు స్వభావము గలవారై యుందురు. భగవంతుని మ్రోల వారెప్పుడును బిడ్డలే. కావున వారికి అహంభావము ఉండదు. వారి బలమంతయు భగవంతునిదే కాని వారిది కాదు. భగవంతుని నుండియే వారికి బలము లభించును.
125.సమస్తము ఈశ్వరేచ్ఛ చేతనే జరుగుచున్నదను దృఢ విశ్వాసము గలవాడు తాను ఈశ్వరుని చేతిలో కేవలము ఉపకరణమని భావించును. అట్టివాడీ జన్మమునందే ముక్తుడగును. సర్వేశ్వరా! నీవే నీ కార్యమును జేయుచుండ, వీరు, ఆహా! ‘నేను జేయుచున్నాను’ అందురు.
126.‘నేనేరుగుదును’ అని కాని, ‘ఎరుగను’ అని కాని పలుకుచున్నంతవరకు నరుడు తానొక వ్యక్తినని భావించుచుండును. ‘‘నీలోని రుూ అహంకారమును పూర్తిగా నేను తొలగించినపుడే అఖండ బ్రహ్మ సాక్షాత్కారము సమాధి స్థితియందు గలుగగలదు’’ అని నా జగజ్జనని పలుకుచున్నది. అంతవరకు ‘నేను’ అనునది నాలోను నా యెదుటను గూడా నిలిచియేయుండును.
127.కామక్రోధాదులతో తీవ్రమైన పోరాటము సలిపి, ఆత్మజ్ఞానముకొరకై అఖండ సాధన చేసిన పిమ్మట గాని సమాధి స్థితి లభింపదు. అప్పుడే అహంకారము సపరివారముగా తరలిపోవును. కాని సమాధి స్థితిని బొందుట చాలా దుర్లభము. అహంకారమును వేయిసార్లు అణచినను మరల మరల తల యెత్తుచునే యుండును. దాని మూలముననే మరల మరల మనము ఈ లోకమున జన్మమెత్తుచుండుట!
128.ఈశ్వర సాక్షాత్కారము లభింపనిదే, క్షుద్రమైన లోహము పరుసవేది యొక్క స్పర్శచే బంగారముగా మారనిదే, ‘నేను క ర్తను’ అను భ్రమ తొలగదు. ఈ భ్రమ తొలగకుండునంతవరకు ‘నేనీ సత్కార్యమును జేసితిని, ఆ దుష్కార్యమును జేసితిని’ అను భేదభావము గలుగుచునేయుండును. ఈ భేదభావమే- ఈ భేద దృష్టియే మాయ- దీని మూలముననే సంసార భ్రమణము నిరంతరముగా సాగుచున్నది.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి