మెయిన్ ఫీచర్

బోగీలో సుస్తీ.. ట్వీట్‌తో హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలు ప్రయాణంలో.. అదీ అర్ధరాత్రి సమయంలో.. ఆకస్మికంగా ఆరోగ్యసమస్య తలెత్తితే ఆదుకొనేదెవరు..? భరించలేని నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపన్నహస్తం అందించేదెవరు..? సరిగ్గా.. ఇలాంటి సమస్యే ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్న ఓ యువతికి ఎదురైంది.. ఆ క్షణాన తనతో పాటు ప్రయాణిస్తున్న సహోద్యోగి వెంటనే స్పందించి రైల్వే మంత్రికి నే రుగా ‘ట్వీట్’ పం పాడు. రుతు సమయంలో తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటున్న ఆమెకు శానిటరీ నాప్కిన్లు, మాత్రలు పంపాలని ఆ యువకుడు చేసిన ‘ట్వీట్’కు అనుకోని స్పందన లభించింది..
రైల్వే అధికారులు నాప్కిన్లు, మాత్రలను సకాలంలో అందించడంతో ఆమెకు కొద్దిసేపట్లోనే ఉపశమనం కలిగింది.. అర్ధరాత్రి సమయంలో రైల్వే మంత్రికి పంపిన ‘ట్వీట్’ను సంబంధిత అధికారులు చూడడం, ఆపదలో ఉన్న యువతిని ఆదుకోవడం.. ఇదంతా చకచకా జరిగిపోయింది.. అందరికీ.. అన్ని వేళలా ఇలా స్పందన లభించకపోవచ్చు.. కానీ- బాధతో విలవిలలాడిన యువతికి సకాలంలో సాయం అందడంతో రైల్వే అధికారులకు ప్రయాణీకుల ప్రశంసలు లభించాయి..
వినడానికి వింతగా ఉన్నా, ఇదేదో అభూత కల్పనలా అన్పించినా.. ముమ్మాటికీ ఇది నిజం. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే...
కలబురిగి (కర్నాటక)కి చెందిన విశాల్ ఖనపురే గత సోమవారం రాత్రి పదింపావుకు బెంగళూరు-హోస్పేట రైలు ఎక్కాడు. హైదరాబాద్‌లో అతనితో పాటు పనిచేస్తున్న యువతి కూడా అదే రైలులో ప్రయాణిస్తోంది. రైలు ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికి ఆమెకు కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఊహించని రీతిలో రుతుస్రావం కావడంతో ఆమె కడుపు నొప్పితో ఇబ్బంది పడసాగింది. ఆమె అవస్థను గమనించిన విశాల్‌కు ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలో ఆమెకు నొప్పి నివారణ మాత్రలు, శానిటరీ నాప్కిన్లు అవసరమని గ్రహించాడు. అర్ధరాత్రి వేళ ఏ రైల్వే స్టేషన్‌లోనూ అవి లభించే అవకాశం లేదు. దీంతో ఆమె దీనపరిస్థితిని వివరిస్తూ రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌కు ‘ట్వీట్’ చేశాడు. తన ‘ట్వీట్’కు ఆ సమయంలో స్పందన వస్తుందని అతను అనుకోలేదు.
విశాల్ పంపిన ‘ట్వీట్’కు ‘ఇండియన్ రైల్ సేవ’ విభాగంలోని అధికారులు వెంటనే స్పందించి, వాస్తవాలను తెలుసుకొనేందుకు పూర్తి వివరాలు పంపాలని సమాధానం పంపారు. ఆ స్పందనకు విస్మయం చెందిన విశాల్ వెంటనే తాను ప్రయాణిస్తున్న రైలు నెంబర్, కోచ్ నెంబర్, బెర్త్ వివరాలను పంపాడు. కాసేపటికి ఆ బోగీలోకి ఓ రైల్వే ఉద్యోగి వచ్చి విశాల్‌ను, అతని స్నేహితురాలిని పలకరించి వివరాలన్నీ నిజమేనని నిర్ధారణ చేసుకొని వెళ్లిపోయాడు. ఆ ఉద్యోగి వెళ్లిపోయి చాలాసేపు అయినప్పటికీ ఎలాంటి సాయం అందకపోవడంతో ‘ట్వీట్’కు స్పందన ఉత్తిదే అని విశాల్ భావించాడు.
రాత్రి రెండు గంటల సమయంలో ఆ రైలు అరిసెకెరి జంక్షన్‌లో ఆగింది. కొందరు రైల్వే ఉద్యోగులు విశాల్ ఉన్న బోగీలోకి వచ్చి, నొప్పితో బాధపడుతున్న ఆ ప్రయాణీకురాలికి మాత్రలు, శానిటరీ నాప్కిన్లు అందజేశారు. స్నేహితురాలికి సకాలంలో సాయం అందడంతో ‘ఇదంతా కలా? నిజమా?’ అని ఆశ్చర్యపోవడం విశాల్ వంతయ్యింది. అనుకోని రీతిలో అర్ధరాత్రో, అపరాత్రో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రయాణీకులకు సాంత్వన కలిగించేందుకు రైళ్లలో కనీస వైద్య సౌకర్యం అందించేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఈ ఘటన చెప్పక చెబుతోంది.
అన్ని వేళల్లోనూ అధికార యంత్రాంగం ఇలాగే స్పందిస్తుందని భావించలేం. గనుక అర్ధరాత్రి వేళ ప్రయాణాలు చేసేవారు తమకు అవసరమైన మందులు తదితరాలను తమ వెంటే తీసుకొని వెళ్లడం కూడా మంచిదే.
*
నాణెం వేస్తే నాప్కిన్..
కాలం ఎంతగా మారినా ఇప్పటికీ ఎంతోమంది మహిళలు రుతుసమయంలో తమ బాధను ఇతరులతో చెప్పుకొనేందుకు సంశయిస్తుంటారు. రుతుక్రమం అనేది శారీరకమైన, సహజమైన ప్రక్రియ అని వైద్యులు ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలామంది మహిళలు వౌనంగా బాధను భరిస్తుంటారు. ఈ విషయమై చైతన్యం తెచ్చేందుకు పలు నగరాల్లో ఇప్పటికే ‘శానిటరీ నాప్కిన్ మిషన్ల’ను ఏర్పాటు చేస్తున్నారు. హర్యానాలోని కొన్ని కళాశాలల్లో విద్యార్థినుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మిషన్లను ఏర్పాటు చేసింది. అయిదు రూపాయల నాణాన్ని ఈ యంత్రంలో వేస్తే శానిటరీ నాప్కిన్‌ను పొందవచ్చు. కోల్‌కత నగరంలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మహిళలు తెలుసుకొనేందుకు కొందరు విద్యార్థులు వినూత్న రీతిలో ఓ ‘యాప్’ను రూపొందించారు. ఈ ‘యాప్’కు ‘బంధన్ శానిటరీ ప్యాడ్’ అని పేరు పెట్టారు. జంషెడ్‌పూర్ వంటి నగరాల్లో మహిళలు ఉపయోగించే పబ్లిక్ టాయిలెట్ల వద్ద శానిటరీ నాప్కిన్లను పొందేలా ‘వెండింగ్ మిషన్ల’ను ఏర్పాటు చేశారు.

చిత్రం..అరిసెకెరి రైల్వే స్టేషన్