మెయిన్ ఫీచర్

అగ్రరాజ్యపీఠం మహిళదేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ..
సమానత్వం..
పురుష వివక్ష..
అంటూ అదేపనిగా లెక్చర్లు దంచే అగ్రరాజ్యం అధ్యక్షపీఠం.. ఇంతవరకూ ఒక్క మహిళకు దక్కకపోవడం లోతుగా ఆలోచించాల్సిన అంశమే.. రెండు శతాబ్దాలకు పైగా అమెరికా చరిత్రలో ఇంతవరకూ ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠాన్ని అలంకరించలేదు. గత ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఆ ఘనత సాధిస్తుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూసింది. కానీ ఆ ఆశ నెరవేరలేదు. తాజా విషయానికి వస్తే 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఇద్దరు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.. వారు తులసీ గబార్డ్, కమలా హారిస్. వీరిలో కమలా హారిస్ భారతదేశంలోని హిందూ సంతతికి చెందినవారైతే.. తులసి గబార్డ్ భారతదేశంలోని హిందూయిజాన్ని ఇష్టపడేవారు.. వీరిద్దరూ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇలా జరిగితే భారతీయ సంతతి మహిళలు పోటీ చేయడం ఇదే ప్రధమం అవుతుంది. వారి వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..
కమలా హారిస్..
కమలా హారిస్ మద్రాసీ మూలాలున్న భారతీయ మహిళ. కమలా తల్లి శ్యామలాగోపాలన్ చెన్నైకి చెందినవారు. ఆమె ఎండో క్రోనాలజీ చదివేందుకు అమెరికా వెళ్లారు. బెర్కిలా యూనివర్శిటీలో రొమ్ము కేన్సర్‌కు సంబంధించిన పరిశోధన కూడా చేశారు. అక్కడే శ్యామల జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో మొదటి నల్లజాతికి చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్. వారి బిడ్డే కమల. కమల 1964, అక్టోబర్ 20న కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమల ఐదేళ్ల వయస్సులోనే శ్యామల, హారిస్‌లు విడిపోయారు. కమల పూర్తి పేరు కమలాదేవి హారిస్. అమెరికా విలువల పరిరక్షణ కోసం పోరాడేలా తన తల్లి శ్యామల నుంచి ప్రేరణ పొందానని, అదే తనను నడిపిస్తుందని చెబుతారు కమలా హారిస్. కమల డిగ్రీ చదివి, లా చేశారు. 2004-2011 వరకు రెండు పర్యాయాలు శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ (2011-2017)గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళ కమలనే.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ అంశాలపై అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ బ్రెట్ కావనా అభిప్రాయాలకు సంబంధించి ఆయనను కమల బలంగా ప్రశ్నించారు. ఇది డెమోక్రాట్ల దృష్టిని ఆకర్షించింది. కమల 2016లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 2017లో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన రెండో ఆఫ్రికన్-అమెరికన్ మహిళ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి ఈమెనే..
మహిళా ఒబామా
తొలి ఆఫ్రికన్-అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కమలను ‘మహిళా ఒబామా’గా అభివర్ణించేవారు. 2016 సెనేట్ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల్లో కమలకు ఒబామా మద్దతు పలికారు. ఆమెను ఒబామాకు సన్నిహితురాలిగా చెబుతారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ఏడుగురు నేతలు ప్రకటించారు. ఈ పోటీలోకి వచ్చిన ఎనిమిదో నేత కమలా హారిస్. పోటీదారుల్లో ఎలిజబెత్ వారెన్, కిర్‌స్టెన్ గిలిబ్రాండ్, జాన్ డెలనీ, జూలియన్ క్యాస్ట్రో, తులసి గబార్డ్, కమల తదితరులు ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఒకరి కన్నా ఎక్కువ మంది మహిళలు పోటీపడుతుండటం ఇదే తొలిసారి. 2020 డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష ప్రైమరీలో కమల సహా నలుగురు మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేయడానికి కమల ‘మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే(ఎంఎల్‌కే డే)ను ఎంచుకున్నారు. అమెరికా జాతివివక్షపై ఉద్యమించిన మార్టిన్ లూథర్ కింగ్ జానియర్ గౌరవార్థం ఏటా జనవరిలో మూడో సోమవారం ఎంఎల్‌కే డేను జరుపుకుంటారు. ఆయన ఆశయమే తనకు స్ఫూర్తినిస్తుందని, ఆ రోజు అమెరికన్లు అందరికీ చాలా ప్రత్యేకమైన రోజని.. చెబుతూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు కమల. ‘మన అమెరికా విలువల పరిరక్షణ కోసం గళం విప్పే మీరు, మీలాంటి కోట్లమంది ప్రజలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీచేస్తున్నా’ అని కమల ట్విట్టర్ ద్వారా తెలిపారు.
అమెరికాలోని ప్రఖ్యాత మీడియా.. హిల్లరీ క్లింటన్ బద్దలు కొట్టలేని రికార్డును కమలా హారిస్ బద్దలు కొట్టే అవకాశం ఉందని చెప్పింది. 2020లో వచ్చే అమెరికా ఎన్నికల్లో ఆమె అమెరికా అధ్యక్షురాలి పోటీలో కమలా హారిస్‌తో పాటు మరో హిందూ మహిళ తులసీ గబార్డ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
తులసీ గబార్డ్
స్టేట్ సెనేటర్ మైక్ గబార్డ్ కూతురైన తులసి మొదట తన పదవీకాలంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ ఒక చట్టం చేయడానికి మద్దతు ప్రకటించారు. దానివల్ల మిగతా ఇంధనాలపై ట్యాక్స్ తగ్గుతుందని భావించారు. తర్వాత తులసీ గబార్డ్ హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ సర్వీస్‌లో చేరారు. ఒక ఏడాదిపాటు ఇరాక్ యుద్ధంలో తన సేవలు అందించారు. ఆ తర్వాత ఆమె 2011లో ఇండోనేషియా సైన్యంతో కలిసి పీస్ కీపింగ్ ట్రైనింగ్‌లో కూడా భాగం అయ్యారు. 2015లో అమెరికా సైన్యంలో మేజర్ పదవిని సొంతం చేసుకున్న తులసీ గబార్డ్ ఇప్పుడు కూడా సైన్యంతో తన అనుబంధం కొనసాగిస్తున్నారు. 37 సంవత్సరాల తులసీ గబార్డ్ డెమొక్రటిక్ పార్టీలోని ముఖ్యమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఆమె హిల్లరీ క్లింటన్ స్థానంలో బెర్నీ శాండర్స్‌కు మద్దతిచ్చారు. 2016లో ఆమె డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ శాండర్స్‌కు మద్దతిచ్చిన తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తులసీ గబార్డ్ చెప్పగానే భారత్‌లో ఆమె పేరున ట్విట్టర్ ట్రెండింగ్ మొదలైంది. వాతావరణ మార్పులు, ఆరోగ్య పథకాలు, క్రిమినల్ జస్టిస్ తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలను తాను పరిష్కరిస్తానని తులసీ గబార్డ్ హామీ ఇస్తున్నారు. అంతర్జాతీయంగా శాంతిని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపడతానని చెబుతున్నారు. వాస్తవానికి తులసీ గబార్డ్ శే్వతజాతి అమెరికన్. అయితే హిందూ అమెరికన్లకు ఆమె ప్రతినిధిగా నిలిచారు. తులసీ గబార్డ్ హిందూ మతంపై ఎన్నో అధ్యయనాలు చేశారు. మేరీ ల్యాండ్, వర్జీనియా ప్రాంతాల్లోనూ, వాషింగ్టన్‌లోనూ 2012లో ఆమె ప్రమాణస్వీకారం సందర్భంగా పలువురు హిందూ దేవాలయాల్లో గంటలు మోగించారు. గబార్డ్ వాస్తవానికి భారతీయ అమెరికన్ కాదు. కానీ హిందూ మతంపై ఆసక్తి చూపిన మహిళగా గుర్తింపు పొందారు. మెడలో హారం, చేతిలో భగవద్గీతతో కనిపించే తులసి అంటే ప్రవాస భారతీయులకు, భారతీయ అమెరికన్లకు ఎంతో అభిమానం. ఇంతటి విస్తృత, ఆసక్తికర నేపథ్యంగల తులసి ఎన్నికల బరిలోకి దిగితే పార్టీతో పాటు ప్రవాస భారతీయులు, అమెరికన్ భారతీయులు ఆమెకు మద్దతు పలకడం ఖాయం. మొత్తానికి 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమొక్రటిక్ పార్టీ వీరిలో ఎవరిని ఎంపిక చేసినా అది చరిత్రే అవుతుంది. భారతీయులకు గర్వకారణం అవుతుంది. వీరిలో ఎవరు విజేతగా నిలిచినా యావత్ ప్రపంచం జేజేలు పలుకుతుంది.

-మహేశ్వరి