మెయిన్ ఫీచర్

పట్టుదలకు ప్రతిరూపం ఇల్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యానికి దగ్గరి దారులుండవు.. పట్టుదలతో కష్టపడటం తప్ప.. అలా దుర్భర దారిద్య్రాన్ని లెక్కచేయకుండా పట్టుదలతో తను అనుకున్నది సాధించి చూపించింది ఇల్మా అఫ్రోజ్. వివరాల్లోకి వెళితే..
ఇల్మా ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నివసించేది. ఆమె తండ్రి ఓ పేద రైతు. ఇల్మా పధ్నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే ఆమె తండ్రి మరణించాడు. తండ్రి మరణించిన తర్వాత ఆమె తల్లి సుహాలియాపై ఇంటి భారం పడింది. ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. అయినా సుహానియా ఇల్మాకు ఇవేవీ తెలియనివ్వలేదు. సుహానియా వ్యవసాయ బాధ్యతలు తీసుకుంది. పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేది. ఒక్కో సమయంలో ఇల్మా తమ్ముడితో కలిసి తల్లితో పాటు పొలాల్లో పనిచేసేది. కానీ ఇల్మా తన చదువును మాత్రం ఆపలేదు. ఎందుకంటే బాగా చదువుకుని అమ్మని బాగా చూసుకోవాలి, కుటుంబ బాధ్యతల్ని తీసుకోవాలి అనుకునేది ఇల్మా.. అలాగే ఇంటి, వ్యవసాయ పనుల్లో తల్లికి సాయంగా ఉంటూనే ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తరువాత తల్లి ప్రోత్సాహంతో దిల్లీలోని స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ చేరింది ఇల్మా. ‘ఆడపిల్లకు పెళ్ళి చేసి పంపించకుండా, చదువు చెప్పించి నెత్తికెక్కించుకుంటారా?’ అంటూ ఊళ్లోని పెద్దలు, బంధువులు ఇల్మా తల్లి సుహానియాను తిట్టిపోశారు. కానీ సుహానియా ఆ మాటలను పట్టించుకోకుండా కూతురుకు అండగా నిలిచింది. ఇల్మాను కూడా గ్రామస్థులు ఎనె్నన్నో మాటలు అన్నారు. కానీ ఇల్మా ఇవేవీ పట్టించుకోలేదు. ఊర్లో అందరూ ఆడపిల్ల పెళ్లి కోసం డబ్బులు పోగేస్తుంటే, సుహానియా మాత్రం ఇల్మా చదువుకోసం ప్రతి రూపారుూ ఖర్చుచేసేది. ఈ కష్టాన్ని ఇల్మా కష్టపడి ఎలాగైనా స్కాలర్‌షిప్ సాధించి.. తల్లిపై భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివింది. ఆమె కోరుకున్నట్లే డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీలో స్కాలర్‌షిప్‌తో చదివే అవకాశం వచ్చింది. అలా ఇల్మా విదేశాల్లో అడుగుపెట్టింది. విదేశాల్లో చదువుతున్నా దేశం కోసం ఏదైనా చేయాలని ఆమె నిరంతరం కలలు కనేది. ఆక్స్‌ఫోర్డ్‌లో చదివిన తర్వాత ఆమె న్యూయార్క్ నగరానికి వెళ్లింది. అక్కడ మాన్ హట్టన్ ప్రాంతంలో స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేసింది. అక్కడి వెలుగుల జిలుగుల ప్రపంచంతో కొవ్వొత్తులతో కాలం గడుపుకునే తన గ్రామాన్ని, తమ కుటుంబాన్ని పోల్చి చూసుకునేది. ఆమె విమాన ప్రయాణపు ఖర్చులు కూడా వ్యవసాయం నుంచే వచ్చేవి. అప్పుడే ఆమె విదేశాల్లో చదివి విదేశీయులకు సేవ చేస్తే.. నా గ్రామం, కుటుంబానికి మేలు జరగదని భావించింది. తన కోసం ఎంతో శ్రమకోర్చిన తన ఊరి ప్రజల కోసమే పాటుపడాలన్న తపనతో ఆమె ఇండియాకు వచ్చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసింది. 2017లో యూపీఎస్సీ రాసి మొదటిసారే 217 ర్యాంకు తెచ్చుకుంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌లో పోలీసు అధికారిణిగా పనిచేస్తోంది.
ఒకప్పుడు ఆడపిల్లకు చదువెందుకు? అని తిట్టినవాళ్లు ఇప్పుడు తమ పిల్లల్ని ఇల్మా ఇంటికి తీసుకొస్తున్నారట. వాళ్లను కూడా మీలాగే ఐపీఎస్ చేయండి అని ఇల్మాను అడుగుతున్నారట. ఇల్మా తన ఊరి వాళ్ల ఆశల్ని తీర్చడానికి ‘హోప్.. ఏ గ్రాస్ రూట్ కమ్యూనిటీ నెట్‌వర్క్’ని స్థాపించింది. పేదరికంలో మగ్గుతున్న పిల్లల చదువు కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ హోప్ నెట్‌వర్క్ కుందార్కి పట్టణంలోని ప్రజలకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుంది. యువతకు కెరీర్ కౌన్సిలింగ్ నిర్వహించడం, ప్రతిభ ఉండి చదువుకోలేని చిన్నారులు చదువుకునేందుకు ఆర్థిక భరోసా అందిస్తోంది ఇల్మా. కూతురు బాగా చదివి ఏదో సాధిస్తుందని ఆశపడ్డ ఆ తల్లి ఆశలు వమ్ము కాలేదు. స్కాలర్‌షిప్ ద్వారా దిల్లీ, పారిస్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీల్లో చదువు పూర్తిచేసిన ఇల్మా, ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి కోసం కూడా పనిచేసింది. కానీ భారతదేశంలో ఐపీఎస్ ద్వారా సమాజంలో బలహీనులకు అండగా నిలవాలనే ఇది ఎంచుకున్నానని చెబుతూ ఇలా అంటోంది ఇల్మా.. ‘విజయానికి సునాయాస మార్గాలేవీ ఉండవు. నన్ను కూడా చాలాసార్లు వైఫల్యాలు వెక్కిరించాయి. వకీలు కావాలనుకున్న నాకు స్కాలర్‌షిప్ రాకపోవడంతో కొలంబియా యూనివర్శిటీలో ప్రవేశం దొరకలేదు. ఎప్పుడైతే శ్రమను నమ్ముకుని ముందుకు సాగుతామో.. అప్పుడు విజయద్వారాలు తెరుచుకుంటాయి. విదేశాల్లో చదువుకునేందుకు తనకు ఉపకారవేతనం ఇచ్చి తనను ఇంత ఎత్తు ఎదిగేందుకు చేయూతనిచ్చిన దేశానికి ఎప్పటికీ కృతజ్ఞురాలినే.. కానీ నా ప్రతి విజయం దిక్కుతోచని స్థితిలో ఉన్న బలహీనుడి కోసమే.. మనకు విజయం ఎదురైన ప్రతిసారీ బలహీనుడి గురించి ఆలోచన రావాలి. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆ బలహీనుడి కన్నీళ్లను మీరు తుడవగలిగారా లేదా అని చూడాలి. నేను ఇలాగే ఆలోచిస్తాను. దేశంలో అబ్బాయికైనా, అమ్మాయికైనా సమాన అవకాశాలు రావాలి. భారత రాజ్యాంగంలో, చట్టంలో ప్రతి పౌరుడికీ కల్పించిన సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందరికీ లభించేలా నేను పనిచేయాలనుకుంటున్నాను. నా తుది శ్వాస వరకూ దేశాభివృద్ధి కోసం పనిచేస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది’2 అంటుంది ఇల్మా. యుపీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చిన రోజు కూడా ఇల్మా పొలాల్లో పనిచేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా సమయం దొరికినప్పుడల్లా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటుంది. ఇల్మా వంటివారు ప్రతి విద్యార్థికీ ఆదర్శప్రాయులే..

-మహి