మెయిన్ ఫీచర్

‘అంతరిక్ష’కాంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో మరోసారి చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించబోతోంది. అదే చంద్రయాన్- 2. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ శాటిలైట్‌ను జులై 15, తెల్లవారుజామున 2 గంటలా 51 నిముషాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించబోతున్నారు. ఇంతకు మునుపు ఇస్రో 2008, అక్టోబర్‌లో చంద్రయాన్- 1 ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి పంపించింది. ఇప్పుడు చంద్రయాన్- 2 మిషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఇది మహిళల నేతృత్వంలో జరుగుతున్న మొట్టమొదటి గ్రహాంతర మిషన్. దీనికి రీతూ కరిధల్ మిషన్ డైరక్టర్‌గా ఉంటే.., ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరక్టర్‌గా ఉన్నారు.
చంద్రయాన్- 2 చాలా ప్రత్యేకమైన ఉపగ్రహం. ఇందులో ఒక ఆర్బిటర్, ‘విక్రమ్’ అనే లాడర్, ‘ప్రజ్ఞాన్’ అనే రోవర్‌లు ఉంటాయి. దీని ద్వారా భారత్ చంద్రుడి ఉపరితలంపై మొదటిసారి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయబోతోంది. ఇది చాలా క్లిష్టమైనది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 600 కోట్ల రూపాయలకు పైమాటే.. 3.8 టన్నుల చంద్రయాన్- 2ను జీఎస్‌ఎల్వీ మార్క్- 3 ద్వారా అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. భారత్‌కు తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. ఈ మిషన్ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఇస్రో చెబుతోంది.
ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ మాట్లాడుతూ ‘మాకు మహిళలు, పురుషులు అనే తేడా లేదు. ఇస్రోలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు’ అని తెలిపారు. ఇస్రోలోని ఒక పెద్ద మిషన్‌లో మహిళలు కీలకం కావడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు మార్స్ మిషన్‌లో కూడా ఎనిమిది మంది మహిళలు కీలకపాత్ర పోషించారు. ఈసారీ చంద్రయాన్- 2 మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు రీతూ కరిధల్, ముత్తయ్య వనితలు. వివరాల్లోకి వెళితే..
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా
చంద్రయాన్- 2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్‌ను ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి డిఫెన్స్‌లో పనిచేసేవారు. రీతూ కరిధల్‌కు చిన్నతనం నుంచీ సైన్స్ అంటే ఆసక్తి. ముఖ్యంగా ఫిజిక్స్, మ్యాథ్స్ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టం. అందుకే చిన్నప్పటి నుంచే నాసా, ఇస్రో ప్రాజెక్టుల గురించి వార్తాపత్రిక కటింగ్స్ సేకరించేవారు. స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలని ప్రయత్నం చేసేది. ఆమె చిన్నప్పటి నుంచీ ఆకాశంలోకి చూస్తూ ప్రతి రోజూ చంద్రుడి ఆకారం తగ్గడం, పెరగడం చూసి కంగారుపడేదట. దాని గురించి తెలుసుకోవాలని తహతహలాడేదట. అంతరిక్షంలో చీకట్లు దాటి అవతల ఉన్న విశ్వం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేదట. అలా ఆమె భౌతికశాస్త్రంలో డిగ్రీని పూర్తిచేశారు. తరువాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారు. సైన్స్, అంతరిక్షంపై ఉన్న ఆసక్తే రీతూని ఇస్రో వరకూ తీసుకొచ్చింది. పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక రీతూ ఇస్రోలో ఉద్యోగం కోసం అప్లై చేశారు. అలా.. 1997లో మొదటిసారిగా ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదిగి మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో రీతూ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2007లో రీతూ మాజీ రాష్టప్రతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి ‘ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు కూడా అందుకున్నారు. రీతూ దాదాపు 20-21 ఏళ్లలో ఇస్రోలో చాలా ప్రాజెక్టులపై పనిచేశారు. వీటిలో ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ చాలా ముఖ్యమైనది. రీతూకు ఇద్దరు పిల్లలు. కొడుకుకు పదకొండు సంవత్సరాలు, కూతురుకు ఐదు సంవత్సరాలు. రీతూ తల్లిగా మారిన తర్వాత ఇంట్లో ఉంటూ కూడా ఆఫీసు పని చేసేవారు. అప్పుడు పిల్లల్ని చూసుకోవడంలో రీతూ భర్త సాయం చేసేవారు. ఆఫీసులో బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని చూడగానే ఆమె అలసట మొత్తం తీరిపోయేదట. పురుషులు అంగారక గ్రహం నుంచి వస్తారని, మహిళలు శుక్రుడి నుంచి వస్తారని కొందరు చెబుతారు. కానీ మార్స్ మిషన్ విజయవంతం అయ్యాక చాలామంది మహిళా శాస్తవ్రేత్తలను ‘మార్స్ మహిళలు’ అనడం మొదలుపెట్టారట. అలా రీతూ కూడా దీని గురించి మాట్లాడుతూ.. ‘నేను భూమిపై అద్భుత అవకాశం అందుకున్న భారత మహిళను.. నా కుటుంబ సభ్యుల సహకారంతోనే నా లక్ష్యాన్ని సాధించగలుగుతున్నాను. కుటుంబ సభ్యులు మన ఆసక్తి, కష్టం చూసినప్పుడు వారికి కూడా మనకు అండగా నిలవాలని అనిపిస్తుంది. నాకు మా అమ్మానాన్నలు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చిన ఆత్మవిశ్వాసం నేడు తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్లో చూస్తున్నారు. అమ్మాయిలు నగరాల్లో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, ఆఖరికి పల్లెల్లో ఉన్నా కూడా.. తల్లిదండ్రులు వారికి సరైన సహకారం అందిస్తేనే వారు జీవితంలో ముందుకు వెళ్లి, తమకంటూ పేరుప్రతిష్టల్ని సంపాదించుకుంటారు’ అని చెబుతున్నారు రీతూ..
బెస్ట్ ఉమెన్ సైంటిస్ట్
చంద్రయాన్- 2లో వనిత ముత్తయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇలాంటి బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ వనితనే. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. బృంద సమస్యలను సమన్వయం చేసుకునే శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ఉండాలి. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆమెకు ప్రతి నిముషమూ విలువైనదే.. మిషన్ ఏదైనా సరే దాని పూర్తి బాధ్యతలు ప్రాజెక్టు డైరెక్టర్‌పైనే ఉంటాయి. ఒక మిషన్‌కు ఒకే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. అయితే కొన్ని మిషన్‌లలో ఆర్బిట్ డైరెక్టర్, శాటిలైట్ డైరెక్టర్ లేదా రాకెట్ డైరెక్టర్ అంటూ ఒకరికంటే ఎక్కువమంది మిషన్ డైరెక్టర్లు ఉండవచ్చు. ఈ చంద్రయాన్- 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత. చంద్రయాన్- 2 విజయవంతం అయ్యేలా వనిత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కోణాలను చూసుకోవాల్సి ఉంటుంది. వనిత డిజైన్ ఇంజనీర్‌గా శిక్షణ తీసుకున్నారు. ఈవిడ చాలా సంవత్సరాల నుంచీ ఉపగ్రహాల కోసం పనిచేస్తున్నారు. 2006లో ‘ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నుంచి బెస్ట్ ఉమెన్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు వనిత.