మెయిన్ ఫీచర్
నిజంగా టైమ్ లేదా!?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈ మధ్య ఎవరితో మాట్లాడినా మాటలమధ్యలో టైం లేదనే ఊతపదం విన్పిస్తుంటుంది. నిజమే.. ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరికీ టైం సరిపోవడంలేదు. అందనిదాన్ని అందుకోవడం కోసమన్నట్టు ప్రతివారూ పరుగులు పెడుతూ ఆయాసపడుతున్నారు గానీ ఏ ఒక్కరు కూడా నిలకడగా నిల్చుని పరుగు ఎంత వరకు అసరమనేది ఆలోచించడంలేదు. నా చిన్నతనంలో మా నాన్న తెచ్చిన గోడ గడియారం ఇప్పటికీ అలాగే టైం చూపిస్తోంది తప్ప అందులో మార్పు కన్పించడంలేదుగానీ గోడకు తగిలిస్తున్న క్యాలెండర్లు, టేబుల్ మీది పంచాంగాలు మాత్రం అతివేగంగా మారిపోతున్నాయనిపిస్తోంది. రోజువారీ పరుగుల జీవితంలో అలా అన్పిస్తుందేమోగానీ ఆలోచిస్తే అందులో కూడా మార్పేమీ లేదనిపిస్తోంది. అయితే ఉదయం లేచినప్పటినుండి అందనంత జెట్ స్పీడ్‌లో పరుగెత్తుతున్నా అనుకున్న పనులు పూర్తికావడంలేదనే విసుగు అందరిలోనూ కన్పిస్తోంది. కాలంతోపాటు మనం కూడా పరుగెత్తాలనేవారే తప్ప కొన్ని విషయాల్లో పొరపాటు చేస్తున్నామా అని ఎవరూ ఆలోచించడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు జరుగుతున్నాయా.. కావాలని చేస్తున్నామా.. వేగానికి బలి అవుతున్నామా.. ధనదాహానికి బానిసలవుతున్నామా.. అనుకరణ జీవితాలకు అలవాటుపడుతున్నామా.. పాశ్చత్య జీవితానికి దాసోహమనుంటున్నావా.. లేకున్నా వున్నట్టుండాలనే చట్రంలో బిగుసుకుపోతున్నామా.. ఏమో ఆలోచించడానికి టైం లేదంటూ మళ్లీ అదేమాట మాట్లాడుతున్నాము. అందరి సంగతి కాసేపలా వుంచి కనీసం కొత్తపెళ్లి జంటలైనా రుూ మాట వాడరేమో అనుకుంటే, వాళ్లుకూడా కర్రీ పాయింట్స్‌లో కూరలు తెచ్చుకుంటూ అన్నీ మమ అనిపించుకుంటూ పరుగెత్తుతున్నారే గాని నిలబడి నీళ్లు తాగుతున్న దాఖలాలు కన్పించడంలేదు. వండుకోడానికే సమయం లేకపోతే ఈ పరుగుల జీవితంలో ఆయాసం తప్ప ఆనందమెక్కడుంటుందని! కోరుకుంటున్న లగ్జరీ జీవితం కొరకు, పోటీతత్వంలో అనుకరణకు అలవాటుపడుతున్న మనం తృప్తిని మర్చిపోయి పరుగుకు అలవాటవుతూ ఆయాసంతో రొప్పుతున్నారు తప్ప అనుకున్నట్టు జీవితం ఉండడం లేదనే బాధ అందరిలోనూ కన్పిస్తోంది. పిల్లలకు కూడా బాల్యంలోని ఆనందం తెలియకుండా ప్రీ ప్రైమరీ నుండి స్కూలు, ట్యూషనతో వారికి గానుగెద్దు జీవితాన్ని అలవాటుచేస్తూ వారిచేత కూడా టైం లేదనే మాట వింటున్నాము. గ్రామాలనుండి
వలసవచ్చి ఇక్కడి అపార్ట్మెంట్ కల్చర్‌తో మన జీవన విధానాన్ని మార్చుకుంటున్నాము. ఇల్లు తుడవడానికి, బట్టలకు, బాసన్లకు అన్నింటికీ పనిమనుషులున్నా వండుకుని తినడానికి టైం సరిపోవడంలేదు.
ఆర్థిక పరిస్థితుల నెపంతో అవసరమున్నా లేకున్నా ఆడ, మగ అందరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి రుూ రోజుల్లో తప్పనిసరి అంటూ లేడిని మించిన వేగంతో లేడీస్ పరుగెత్తుతున్నా టైం సరిపోక చేయాలనుకున్న పనులన్ని పెండింగ్‌లోనే వుండి చేయలేకపోతున్నందుకు నిరాశ నిట్టూర్పులతోనే బతుకుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలైతే మరీ దారుణం. ఐదారంకెల జీతమన్న మాటేగానీ కంపెనీలెక్కడో దూరాన వుండటంవల్ల ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణానికే టైమ్ పడుతుంది కాబట్టి అలసిపోయి రావడంతో ‘కలిసి’ చేసుకునే పనులన్నీ వాయిదా వేసుకోవడమే మరి. దంపతులిద్దరికీ డే, నైట్ షిప్ట్లైతే మాట్లాడుకోవడానికీ, చూసుకోవడానికి ఫోనే గతి. లేదా శిని, ఆదివారాల కొరకు ఎదురుచూపులు. ఉద్యోగులదీ పరిస్థితైతే రాజకీయ దంపతులది మరీ రసవత్తరంగా వుంటుంది. ఆర్థికంగా కోట్లు కన్పిస్తుంటాయేమోగాని అనురాగం పంచుకోవడానికి అసలు టైమే వుండదు. కలిసి తినడానికి, కలిసి మాట్లాడుకోవడనాకి టైమెక్కడుందంటారు. ఎవరిని కదిలించినా టైం లేదనుకుంటూ పరుగెడుతున్నారే తప్ప సమయపాలన గురించి ఆలోచించడంలేదు. ఈమధ్య పురోహితులు సైతం ఆదరాబాదరగా అయిందనిపించి మరో కార్యక్రమానికి వెళుతున్నారు తప్ప ఆయా కార్యక్రమాలు సవ్యంగా చేయటంలేదనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కైనా, భారత ప్రధాని మోదీకైనా, గూగుల్ సీఇఓ సుందర్ పిచాయ్కైనా, మైక్రోసాప్ట్ సత్య నాదెళ్లకైనా, కేసిఆర్, జగన్, చంద్రబాబు, అంబానీ, అమితాబ్మచ్చన్ వగైరా అందరిక్కూడా రోజుకవే ఇరవై నాలుగుగంటలు. ఉద్యోగస్తుల గురించి కాదు గానీ ఇంట్లో వుంటున్న చాలామందికి కూడా టైం సరిపోవడం లేదంటే తిట్టాలనిపిస్తుంది. ఇదివరకటిలాగా పెద్ద ఉమ్మడి కుటుంబాలు కాదు. రోజంతా చాయ్, కాఫీ చేసి పోస్తూ... అదేపనిగా వండి వడ్డించడానికి పూర్తిగా తగ్గిపోయింది. మనకున్న పనులు మనం చేసుకోవడం చేతగాక పనిమనుషులను పెట్టుకున్నా మనకు టైం సరిపోవడంలేదు. చేసే పనులు చేతినిండా లేనందుకే బద్ధకమెక్కువై చిన్నతనంలోనే వృద్ధాప్యం కన్పిస్తున్నా...ఎందుకంటూ టైం లేక మనకు మనం ఆలోచించుకోవడంలేదు. అందుకే చేతగానితనమెక్కువై కాళ్లు, కీళ్లు పనిచేయడం లేదనిపిస్తోంది.
ఆలూ చిప్స్నుండి అరిసెలవరకూ అన్నీ అంగట్లో దొరుకుతున్నాయి కాబట్టి చేసుకోవడం పూర్తిగా మర్చిపోతున్నారు. టైం లేదు... చేతకాదనే మాట్లాడుతుంటారుకానీ వృథా చేస్తున్న టైం గురించి కాసేపు కూడా ఆలోచించరు.
నిద్రలేస్తూనే పనికిరాని చెత్త ముచ్చట్లు, ఎవరి గురించో ఈసడింపు మాటలు, టీవీ సీరియల్స్‌తోపాటు సెల్లుల్లో గంటలు గంటలు సొల్లు కబుర్లు. టైం లేదనే ఊతపదాన్ని కాసేపు పక్కకు నెట్టి పిసరంత ఆలోచిస్తే చాలు, విలువైన ఎన్నో పనులు చేసుకోవడానికి టైం మిగుల్చుకోవచ్చు గానీ మనమెందుకో ఆవైపు ఆలోచించడంలేదు. మనకున్న అమూల్యమైన సమయాన్ని అడ్డమైన పనులకు ఆహుతి చేస్తూ టైం లేదని చెబుతుంటాముగానీ ఆ కొద్ది సమయానే్న సద్వినియోగం చేసుకుంటే టైం లేదనే మాట మరోసారి చెప్పమేమో మరి.
కాలంతోపాటు మనం కూడా పరుగెత్తాలనే మాట నిజమే కానీ రాయి తాకి బోర్లా పడుకుండా చూసుకోవాలి. మాటిమాటికి టైం లేదనే మాట చెప్పకుండా ఫలా టైములో ఫలానా పని చేయాలని నిర్ణయించుకుంటే కొంతలో కొంత విజయం మన వెంటే వుంటుందనుకుంటాను. అందుకే టైం లేదని చెప్పకండి.