మెయిన్ ఫీచర్
స్ర్తీకి గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఒక దేశ మహిళ స్థితిగతులను చూసి ఆ దేశ పరిస్థితి ఇట్టే చెప్పవచ్చని’’ అంటారు పండిట్ నెహ్రూ. నిజమే.. ఒక దేశానికి చెందిన మహిళలు ఆ దేశ నాగరికతకు ప్రతిబింబాలు. నేటి సమాజంలో స్ర్తిలు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో హింసకు గురవుతున్నారు. యూరప్‌లోని డొమినికా రిపబ్లిక్ అనే దేశాన్ని రాఫెల్ ట్రాజిలా పాలించేవాడు. అతని నియంతృత్వ పాలనకు వ్యతిరేకగా మిరాబాల్ సిస్టర్స్ అనే నలుగురు మహిళలు పోరాటం సాగించారు. విషయం తెలుసుకున్న ట్రాజిలా మిరాబుల్ సిస్టర్స్ ముగ్గురిని 1960 నవంబర్ 25న హత్య చేయిచాడు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి నవంబర్ 25న స్ర్తి హింసా వ్యతిరేకతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. మహిళలపై జరుగురతున్న హింసపై అందరికీ అవగాహన కల్పించేందుకు నవంబర్ 25ను అంతర్జాతీయ స్ర్తి హింసా వ్యతిరేక దినం 1999లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అప్పటినుంచి ఈ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది.
వాస్తవానికి గర్భంలో వున్నప్పటినుంచి మరణించేవరకూ హింస దశలవారీగా జరుగుతోంది. హింసల్లో గృహహింస, శారీరక, మానసిక, ఆరోగ్య, రాజ్యహింసలని రకరకాలుగా జరుగుతున్నాయి. నిరక్షరాస్యత, అవిద్యలవల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని గతంలో అనుకునేవారు. కానీ నేడు విద్యావంతులు, ఉద్యోగినులపై హింసలు జరగడం శోచనీయం. ప్రాచీన భారతంలో అన్ని కోణాల్లోనూ పురుషులతో సమానంగా తమ స్థాయిని అనుభవించేవారు. పూర్వం ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అని చెప్పేవారు. ఎక్కడ స్ర్తిలు పూజింపబడుదురో అక్కడ దేవతలు నివసిస్తారు అని. మహిళలపై హింస నిస్సందేహంగా మానవ హక్కుల ఉల్లంఘనే. 70 శాతం మహిళలు జీవితంలో ఏదోఒక దశలో ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు. ఆ హింసను నిర్మూలిస్తేనే కాని సమానత్వ సాధన సాకారం కాదు. ‘‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ అంటారు. కానీ ఆమెను ఆమెలా చూడ్డం మాత్రం మరిచిపోతుంటారు. సమాజంలో మహిళా ప్రాధాన్యత పెరగాలంటే, స్ర్తిలపై హింసలు తగ్గాలంటే పురుషుల్లో మార్పు రావాలి. వయస్సుతో నిమిత్తం లేకుండా స్ర్తిలపై జరిగే అత్యాచారాను, హింసలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి. అనేక సందర్భాల్లో మహిళలపై హింస హత్యలకు దారితీస్తుంది. అయితే మహిళలను, బాలికలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు పాల్పడుతున్న నేరస్తులు, నేరాలు నిరూపితం కావటంలేదు. దీంతో వారు శిక్షలనుంచి తప్పించుకుంటున్నారని అనేక సంఘటనలు, నివేదికలు తెల్పుతున్నాయి. ఈ నేలపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మహిళలకు ఇల్లేనట. జీవిత భాగస్వాములనుంచి లైంగిక, శారీరక హింసను ఎదుర్కొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. నేపాల్‌తో పోలిస్తే, భారత్, బంగ్లాదేశ్‌లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలు ఈ తరహా హింసను ఎదుర్కొంటున్న 13 ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో భారత్ రెండో స్థానంలో వుంది. బంగ్లాదేశ్‌లో ఇలా మహిళలు అధిక సంఖ్యలో ఉన్నట్లు ‘గట్ మషెర్ - ఆనె్సట్ కమిషన్’ నివేదిక గత సంవత్సరం వెల్లడైంది. ఈ తరహా సంఘటనలు ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య సింగపూర్‌లో అత్యల్పమని పేర్కొంది. శారీరక, లైంగిక హింసతోపాటు పరువు హత్యలు, బాల్య వివాహాలు, లింగ నిర్థారణ అనంతరం భ్రూణహత్యలు, లైంగిక వేధింపులన్నీ మహిళల పాలిట శాపాలైనాయన్నది ఈ నివేదిక సారాంశం.
మన దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక ఆత్మహత్య జరుగుతోందట. అయితే స్ర్తిలపై పెరుగుతున్న హింసను నియంత్రించడానికి ప్రత్యేక దినాలు జరిపితే సరిపోదు. వారి స్థితిగతులపై అధ్యయనం జరగాలి. స్ర్తిపై పెరుగుతున్న హింసను సమూలంగా రూపుమాపడానికి ప్రతిఒక్కరూ ముందడుగు వేయాలి. స్ర్తిలపై హింసకు వ్యతిరేకంగా స్ర్తిలే కాదు, మగవారు సైతం ఉద్యమించాలి. రోజూ ఆడవారిపట్ల అమానుషాలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే వున్నాయి. అలాంటివి జరుగకుండా ఉండాలంటే ఆడవారిని గౌరవించే సంస్కారం పిల్లలకు మొదటగా ఇంటిలోనే నేర్పాలి. మంచైనా చెడైనా పిల్లలు పెద్దవారిని చూసే అనుకరిస్తారు. పిల్లలను ఆడ మగ అనే వివక్ష లేకుండా పెద్దలు ఇద్దరిని సమానంగా చూడాలి. ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరిని తమ సన్నిహితులే హింసిస్తున్నారట. ఆడపిల్లలంటే వివక్ష ఇంకా కొనసాగుతూనే వుంది. అత్యాచారాల పర్వం మహిళలను క్రూరంగా బలిగొంటోంది. వ్యాపార ప్రకటనలు, అందాల పోటీలు స్ర్తిలను బజారుకీడుస్తున్నాయి. అన్నిరకాలుగా మగ్గుతున్న మహిళల విముక్తికి సామాజిక మార్పు చాలా అవసరం. స్ర్తిల కోసం ప్రత్యేక చట్టాలున్నాయి. అయినప్పటికీ ప్రతి ఏటా ప్రపంచంలో 40 శాతం మహిళలు లైంగి వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజంలో స్ర్తిలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు, హింసల నుంచి రక్షణ కల్పించడానికి, వారికి అవసరమైన అన్ని సహాయాలను అందించడానికి ‘సఖి’ కేంద్రాలున్నాయి. గృహహింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, స్ర్తిలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్ దాడులు తదితర హింసలనుంచి రక్షణ కల్పిస్తోంది. ఇప్పటికే షీ టీమ్స్, 181 హెల్ప్‌లైన్, డీవీ సెల్ వంటి అనేక సంస్థలు మహిళలకు సేవలు అందిస్తున్నాయి. భారతదేశంలో 186 సఖీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
మహిళలపై హింస ప్రపంచ వ్యాప్తంగా ఓ వ్యాధిలా మారింది. అందుకే ప్రతి మహిళ విద్యార్థి దశనుంచే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుని సమాజంలో ఎదురవుతన్న సవాళ్లను ఎదుర్కోవాలి. సహజంగా మహిళల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఇదే పురుషాధిక్యతకు కారణం.
మహిళలకు రక్షణా చట్టాలు
మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయి. అయితే ఈ చట్టాలను అమలుచేసి నిందితులను కఠినంగా శిక్షిస్తే మహిళలపై జరిగే దాడులు, హింసలు కొంతవరకైనా నియంత్రించవచ్చు. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు వారి రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన లేకపోవడం గమనార్హం.
* 498ఏ: అదనపు కట్నం కోసం వేధిస్తే ఈ చట్టం వర్తిస్తుంది. నిందితులకు కోర్టు మూడేళ్లు జైలు శిక్షతోపాటు జరిమానాను విధిస్తుంది.
* 497: ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఐదేళ్ల జైలుశిక్ష జరిమానా ఉంటుంది.
* 312: గర్భిణీ అనుమతి లేకుండా భర్త, అత్తమామలు అబార్షన్ చేస్తే ఏడేంళ్ల శిక్ష, జరిమానా.
* 313: భార్య ప్రమేయం లేకుండా ఒత్తిడితో అబార్షన్ చేయిస్తే పదేళ్ల జైలుశిక్ష, జరిమానా.
* 363: బాలికను కిడ్నాప్ చేస్తే ఏడేళ్ల శిక్ష, జరిమానా.
* 372: ఆడపిల్లలను అమ్మితే పదేళ్ళ శిక్ష, జరిమానా.
* 376: రేప్ కేసులో ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానాతోపాటు ఒక్కొక్కసారి జీవితఖైదు పడవచ్చు.
స్ర్తిలు, బాలికలను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని సెక్షన్ 366 ఐపిసి చెబుతోంది. 354 ప్రకారం స్ర్తి శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు. 509 సెక్షన్ ప్రకారం మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.
చట్టాలు ఎన్ని ఉన్నా, మహిళలు సమాజంలో ముందుండాలంటే చదువే ముఖ్యమైన మార్గం. చదువుకుంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు.
గృహహింస నుండి రక్షణ చట్టం మొదలు నిర్భయ చట్టందాకా ఎన్ని చట్టాలు చేసినా వివక్ష తొలగించలేకపోతున్నాయి. కొంతవరకూ మార్పు వచ్చినా ఇంకా ఎంతో రావాల్సిన అవసరం వుంది. స్ర్తిని ఒక వస్తువుగా చూసే దృష్టికోణం మన సమాజ మూలాలలోనే వుందన్నది కాదనలేని సత్యం. సామాజిక రుగ్మతలకు పరిష్కారాలు వెతకాలి. కేవలం ఉపశమన చర్యలు తీసుకుంటే స్ర్తి హింసకు శాశ్వత పరిష్కారం దొరకదు. ‘ఆడపిల్ల ఒంటరిగా తిరిగినపుడే అసలైన స్వాతంత్య్రం’ అన్నారు. కానీ అంతర్జాతీయ సర్వే ప్రకారం మహిళలకు భద్రతలేని దేశాల జాబితాలో భారత్ ప్రథమస్థానంలో వుంది. 2013లో నిర్భయ చట్టం వచ్చినప్పటికీ ఎన్నో హింసాఘటనలు జరగడం శోచనీయం. అందుకే మహిళలపై హింసలేని సమాజాన్ని సాధించే దిశగా ఐక్యమత్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉండాలి.