మెయిన్ ఫీచర్

ముక్తికి మార్గాలు శ్రద్ద, ధ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
పరిశుద్ధమైన నీ వాక్‌కలశమునుండి జాలువారిన శీతలము, అమృతమయమైన వాక్కులను నాపై వర్షించి నన్ను తడిపివేయుము.
42. కథం తరేయం భవసింధుమేతం
కా వా గతి ర్మే కతమో‚ స్త్వు పాయః
జానే న కించిత్కృపయా‚ వ మాం భోః
సంసార దుఃఖ క్షతిమాతనుష్వ॥
స్వామీ! నేను ఎట్లు ఈ సంసార సాగరమును దాటి ఆవలి ఒడ్డున చేరగలను? దుఃఖమును సమాప్తము చేసుకొనే మార్గము ఏమైనా ఉన్నదా? ఎట్టి ఉపాయమున్నదో నాకు ఎంత మాత్రమూ తెలియదు. నీవే కరుణించి, ఈ సంసార దుఃఖమును పరిసమాప్తంచేసి నన్ను రక్షింపుము.
43. తథా వదన్తం శరణాగతం
స్వం సంసార దావానల తాపతప్తమ్‌
నిరీక్ష్య కారుణ్య రసార్ద్రదృష్ట్యా
దద్వాదభీతిం సహసా మహాత్మా॥
తనను శరణుగోరి సంసారమనెడు అగ్నిలోపడి తపిస్తూ దుఃఖమనుభవిస్తున్న శిష్యుని వీక్షించి, దయార్ద్ర రసభరిత దృష్టితో వాని పరితాపమును నివృత్తిచేయుటకు తక్షణమే అభయమునిచ్చి గురువుగా తన విధ్యుక్త్ధర్మమును ఆచరించవలెనని ఇచ్చట భగవత్పాదులవారు సూచిస్తున్నారు.
44. విద్వాన్సతస్మా ఉపసత్తిమీయుషే
ముముక్షవే సాధుయథోక్త కారిణే
ప్రశాన్తచిత్తాయ శమాన్వితాయ
తత్త్వోపదేశం కృపయైవ కుర్యాత్‌॥
‘‘ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ’’(శుభకర్మలు చేసే దుఃఖ భాగులు, జిజ్ఞాసువులు, ధనాదులు కోరేవారు, మరియు జ్ఞానేచ్ఛగలవారే భగవంతుని శరణు వేడుకుందురని స్మృతి బోధిస్తున్నది (్భ.గీ.7-16). భగవత్సమానుడైన బ్రహ్మవేత్తను జ్ఞానోపదేశముతో తన దుఃఖమును తీర్చుమని సద్గుణసంపన్నుడూ. మోక్షేచ్ఛగల శిష్యుడు శరణాగతుడై తన వద్దకు వచ్చినప్పుడు వాని కోరిక మన్నించుటే గురువుల ధర్మమని పై రెండు శ్లోకముల సారాంశము.
శ్రీ గురురువాచ
45. మాభైష్ట విద్వంస్తవ నాస్త్యపాయః
సంసారసింధోస్త రేణే‚ స్త్యుపాయః
యేనైవ యాతా యతమో‚ స్య పారం
తమేవ మార్గం తవ నిర్దిశామి॥
గురువు ఇలా పల్కెను ‘‘ఓ విద్వాంసుడా! భయపడకుము. నీకు ఎట్టి అపాయము లేదు. సంసర సాగరమును దాటుటకు ఉపాయము ఉన్నది. యతులు ఏ మార్గములో పయనించి ఈ జలధిని దాటి ఆవలి తీరమును చేరితిరో, ఆ మార్గమునే నేను నీకు బోధపరచెదను.’’
సమస్త ఇంద్రియములను జయించినవారే యతులు. వారే సన్న్యాసులనబడుదురు. జనన మరణములకు కారణమైన ఈ సంసార బంధమునుండి విముక్తి లభించుటకు, శ్రవణ, మనన, నిదిధ్యాసనములనే సాధనలతో యత్నశీలురు పరమాత్మయందు లయమగుటకు నిర్విరామ కృషిని చేసినట్లైతే. తత్పలితమైన ఆత్యంతిక సుఖమును పొందుదురని బ్రహ్మవాదుల విశ్వాసము. అందువలనే, తత్త్వవేత్తలు ఆ మార్గమునే శాశ్వత సుఖప్రాప్తికి ఉపదేశింతురు.
46. అస్త్యుపాయో మహాన్ కశ్చిత్సంసారభయనాశనః
తేన తీర్త్వా భవామ్బోధిం పరమానన్ద మాప్స్యసి॥
నీ భయనివృత్తికి ఒక గొప్ప ఉపాయము ఉన్నది. ఈ అగాధ సంసార సాగరమును దాటే బృహత్తర మార్గమును నీకు నేను తెలియపరచెదను. ఆ మార్గమును చేపట్టి, ఈ జలధిని ఓర్మితో దాటివేసి, నిశ్చింతగా నీవు శాశ్వత సుఖమును, బ్రహ్మానందమును పొందెదవు.
47. వేదాన్తార్థవిచారేణ జాయతే జ్ఞానముత్తమమ్‌
తేనాత్యన్తిక సంసార దుఃఖ నాశో భవత్యను॥
పరబ్రహ్మమును నిర్దేశించే ఉపనిషత్తులు, నాల్గువేదముల అంత్యభాగములు. ఇవియే వేదాంతములు లేక ఆరణ్యకములుగా ప్రసిద్ధి. గుహ్యమైన పరబ్రహ్మ తత్త్వమును తెలిసికొనుటకు గురుముఖంగా వేదాంత అధ్యయనము అనివార్యము. వేదంత విచారణ ద్వారా బ్రహ్మీభూతులైన సాధకులకు అచిరకాలంలోనే పరమ సుఖమునిచ్చే మోక్షము ప్రాప్తించునని శ్రుతి పల్కుతున్నది. ‘‘అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవ నాశనమ్’’ (ఆత్మజ్ఞానముతో సంసార జలధిని అధిగమించి కైవల్యమును పొందుదురు- కై.ఉ.2-5)

48. శ్రద్ధ్భాక్తి ధ్యాన యోగాన్ముముక్షో
ర్ముక్తేర్హేతూ న్వక్తి సాక్షాచ్ఛ్రుతేర్గీః
యో వా ఏతేష్వేవ తిష్ఠత్యముష్య
మోక్షో‚ విద్యాకల్పితా ద్దేహబన్ధాత్‌॥
శ్రద్ధ, భక్తి, ధ్యానము అనేవి ముక్తికి కారణములు. గురు బోధనలోను, వేద వాక్యములందుగల విశ్వాసమే శ్రద్ధ అని ముందు నిర్వచించబడినది. శ్రవణ, మనన, నిదిధ్యాసనములు బ్రహ్మజ్ఞానమునకు సోపానములు. దేహసంబంధము అనగా జననమరణములు, అవిద్యవలన ప్రాప్తించును. దేహబంధమును ఛేదించి, జన్మరాహిత్యము పొందుటకు వేదాంత జ్ఞానమును ఆకళించుకొనుట ప్రథమకర్తవ్యము. తదనంతరము మనస్సును పరబ్రహ్మమందు స్థాపించి, నిరంతర ధ్యానము సల్పిన వ్యక్తి బ్రహ్మతో ఏకమై ముక్తిని పొందును.
49. అజ్ఞానయోగాత్పరమాత్మనస్తవ
హ్యనాత్మ బన్ధస్తత ఏవ సంసృతిః
తయోర్వివేకోదిత బోధవహ్ని
జ్ఞానకార్యం ప్రదహేత్సమూలమ్‌॥
నీవు పరమాత్మ స్వరూపుడవు. అజ్ఞానము ఆవరించిన నీకు ఆత్మేతర పదార్థమైన శరీరముతో సంబంధము ఏర్పడినది. అందువలన, సంసార బంధమును ఛేదించలేక వ్యధ చెందుచున్నావు. నీవు ఆత్మ-ఆత్మేతర పదార్థముల భేదమును సమగ్రంగా తెలిసికొన్న పిదప, తద్వివేకము ద్వారా ప్రజ్వలిత జ్ఞానాగ్ని, పూర్తిగా అజ్ఞాన సంబంధిత కార్యములను దగ్ధముచేసివేయును.
స్మృతివాక్యము ఇట్లున్నది ‘‘యథైధాంసి సమిద్ధో‚ గ్నిః భస్మసాత్కురుతే‚ ర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుణే తథా॥
(ప్రజ్వలిస్తున్న అగ్నిలో ఎట్లు సమిధలు భస్మవౌతున్నవో, అట్లే జ్ఞానాగ్ని సమస్త కర్మఫలమును భస్మము చేసివేయును- భ.గీ.4-37).

- ఇంకావుంది...