మెయిన్ ఫీచర్

వైరాగ్యభావనతో మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
గురువుచేసిన ఉపదేశము, బంధవిముక్తికి ఔధము వంటిది. దానిని ఉపదేశానుసారము స్వీకరించినపుడే తత్ఫలితమైన మోక్షము లభించును.
69. యస్త్వయాద్య కృతః ప్రశ్నో వరీయాన్
శాస్తవ్రిన్మతః
సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞాతవ్యశ్చ ముముక్షుభిః॥
శిష్యుని నిశ్చతబుద్ధిని ప్రశంసిస్తూ గురువు ఇలా పల్కెను- ‘‘నీవు ఆత్మ- అనాత్మలపై అడిగిన ప్రశ్న చాల గంభీరమైనది. దీనివలన నీ బుద్ధిబలము బహిర్గతవౌతున్నది. ఇటువంటి ప్రశ్న అడుగుటకు చక్కని శాస్త్ర పరిచయమున్నవారే సమర్థులు. నీవు సంసారబంధవిముక్తిని ఆశించి ఏమి అడిగితివో అది అత్యంత సూక్ష్మము. సూత్రప్రాయమైనది మరియు నిగూఢమైనది. ఇది జిజ్ఞాసువులు తప్పక తెలిసికోవలసినది.’’
70. శృణుష్వావహితో విద్వన్ యన్మాయా సముదీర్యతే
తదేతచ్ఛ్రవణాత్సద్యో భవబన్ధాద్విమోక్ష్యసే॥
విద్వాంసుడవైన ఓ శిష్యా! నేనిప్పుడు నీకు చెప్పబోతున్నది సావధానముగా, నిశ్చలమనస్సుతో వినుము. దీనికి నీవు శ్రద్ధగా ఆలకించినచో ప్రాపంచిక బంధమును ఛేదించుకొని, శీఘ్రముగా విముక్తి పొందగలవు.
71. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే
వైరాగ్యమత్యన్త మనిత్యవస్తుషు
తతః శమశ్చాపి దమస్తితిక్షా
న్యాసః ప్రసక్తాఖిలకర్మణాం భృశమ్‌॥
మోక్షమునకు ముందుగా నశించే ధర్మముగల వస్తువులపై ఆసక్తి చూపక వైరాగ్యభావన కల్గి ఉండవలెను. తదనంతరము ఇంద్రియ నిగ్రహము (శమము, దమము), తితిక్ష (సహనత), మరియు కర్మలన్నింటిని త్యజించుట అనేవి ప్రధాన హేతువులు.

72. తతః శ్రుతి స్తన్మననం సతత్త్వ
ధ్యానం చిరం నిత్యనిరన్తరం మునే.
తతో‚ వికల్పం పరమేత్య విద్వా
నిహైవ నిర్వాణసుఖం సమృచ్ఛతి॥
నిత్యానిత్య వివేకముతో వైరాగ్య ప్రవృత్తిని, దాని ద్వారా శమదమాది సంపత్తులనార్జించి, పిదప గురుముఖంగా వేదాంత వాక్యములను మంత్రముల శ్రవణము, ఆ వాక్యముల పునఃపునః విచారణ అనగా మననము, నిదిధ్యాసనములతో వాటిని పలుమార్లు జ్ఞప్తికి తెచ్చుకొని ఏకాగ్రత సాధించవలెను.
తదనంతరము, శ్రేష్ఠతమమైన నిర్వికల్ప సమాధి స్థితిలో, బ్రహ్మీభూతుడై పరమాత్మ ధ్యానము నిరంతరము సల్పిన ఫలితముగా అతడు ఆత్మదర్శనమును చేసికొనుటకు యోగ్యుడౌను.
దుర్లభమైన ఆత్మసాక్షాత్కారము లభించిన బ్రహ్మజ్ఞాని, మృత్యువునధిగమించి ఇహలోకములోనే నిర్వాణ సుఖరూపమైన బ్రహ్మానందమును, శాశ్వతముగా పొందును.
73. యద్బోద్ధవ్యం తవేదానీ మాత్మానాత్మ వివేచనమ్‌
తదుచ్యతే మయా సమ్యక్ శ్రుత్వాత్మ స్యవధారయ॥
శిష్టా! ఆత్మ-అనాత్మల విషయమై ఏమి తెలిసికొనవలెనో, నేనిపుడు నీకు దానిని విపులముగా తెల్పెదను. సావధానముగా ఈ బోధనను విని, నీ మనస్సునందు స్థిరీకరించుకొనుము.
స్థూల శరీరం..
74. మజ్జాస్థిమేదః పల రక్తచర్మ త్వగాహ్వయైర్ధాతుభి
రేభిరన్వితమ్‌
పాదోరువక్షో భుజవృష్ఠమస్తకై రంగైరుపాంగై
రుపయుక్త మేతత్‌॥
అహం మమేతి ప్రథితం శరీరం
మోహాస్పదం స్థూలమితీర్యతేబుధై.
‘‘అన్నమ శితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో ధాతుః తత్పురీషం భవతి యో మధ్యమస్తత్మాంసగ్‌ం యో‚ ణిష్ఠస్తన్మన.’’
(తినే అన్నము మూడు విధములుగా మార్పుచెందును. స్థూలభాగము మలముగాను, మధ్యమభాగము మాంసముగాను, సూక్ష్మభాగము మనస్సుగాను పరిణామము చెందును).
ఇంకనూ, ‘తేజో‚ శితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠో ధాతుస్తదస్థి భవతి యో మధ్యమః స మజ్జా యో‚ ణిష్ఠ. సా వాక్’’
(నేయి, నూనె వంటి తేజోమయ పదార్థములు మూడు విధములైన ధాతువులుగా పరిణామము చెందును. స్థూల భాగము ఎముకలు, మధ్యమభాగము మజ్జా, సూక్ష్మ భాగము వాక్కు అగును - ఛా.ఉ.6-5-1,3).
పైన పేర్కొన్న శ్రుతి వాక్యముల ఆధారముగా, వివిధ శరీర భాగములను విద్వాంసులు ఈ విధంగా ప్రస్తావించినారు-
అస్థికలు, మజ్జ, మాంసము, రక్తము, పై చర్మము మరియు త్వక్. వీటితోనున్న పాదములు, తొడలు, వక్షస్థలము, భుజములు, పృష్ఠ్భాగము, శిరస్సు అనే అంగములతోను, పిక్కలు, మోకాళ్ళు, వ్రేళ్ళు మొదలగు ఉపాంగములతో కూడుకొనినదే స్థూల శరీరము అనబడుచున్నది.
ఈ స్థూల శరీరము జడపదార్థముల సముదాయము. ఈ శరీరమే అజ్ఞానమునకు ఆలవాలము. నేను-నాది అని ప్రసిద్ధమైన స్థూల శరీరము, ఆత్మకు భిన్నమైనది. యథార్థతః చేతన ధర్మముగల అంతరాత్మే ‘‘నేను’’. కాని, అనిత్యమైన శరీరమును మోహాస్పదంతో లోక వ్యవహారములో నేను అని భావించటము జరుగుతున్నది.
75. నభోనభ స్వద్దహనాంబుభూమయః
సూక్ష్మాణి భూతాని భవన్తి తాని॥
పరస్పరాంశై ర్మిలితాని భూత్వా
స్థూలాని చ స్థూలశరీరహేతవః
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచ భూతములు సూక్ష్మరూపములో తొలుత ఆవిర్భవించినవి. వాటినే భూతతన్మాత్రలు అందురు. ఆ భూతతన్మాత్రలను పరమాత్మ త్రివృత్కరణ ప్రక్రియలో పరస్పరాంశములను కలిపి ఆకాశాది భూతపంచకమును సృష్టించెనని శ్రుతి ప్రకటిస్తున్నది. ‘‘తాసాం త్రివృతం త్రివృతమేకైకాం కరవాణీతి’’ (చా.ఉ.6-3-3). ఈ త్రివృత్కరణ ప్రక్రియే పంచీకరణకు నాంది.
ఇంకాఉంది