మెయిన్ ఫీచర్

మోహమే అజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
అందువలన, సదా ఇతరుల శ్రేయస్సును కోరే గురువుల ఉపదేశ వాక్యములను అనుసరిస్తూ, స్వయుక్తితో వ్యవహరించిన వానికి ఫలసిద్ధి తప్పక లభిస్తుంది. శిష్యా! ఇది సత్యమని గ్రహించుము.
చిత్తశుద్ధిలేక కలుషిత బుద్ధితో విషయానుభూతి తపనతో వక్రమార్గములో పోయేవారికి జీవనయాత్ర సక్రమముగా జరుగదు. అడుగడుగునా వారికి విఘ్నములు తప్పవు. భరింప శక్యముకాని శారీరిక రుగ్మతలు, మానసిక వ్యధలతో జీవనం దుర్భరవౌను. అంతేకాదు, మృత్యువుకూడా ఆసన్నవౌను. అందువలన, విషయేచ్ఛపై మోహమును త్యజించి, అత్యంత సుఖదాయకమైన శ్రేయోమార్గమును చేపట్టి, సద్గురువు హితబోధనలను అనుసరిస్తూ వాటితో తన సుయుక్తులను మేళవించి మోక్షసాధన చేసిన పరమసుఖము తప్పక లభించును.
‘‘విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిఃస్పృహః
నిర్మమో నిరహంకారః స శాంతిమధిమగచ్ఛతి॥
(విషయ వాంఛలను సమస్తము త్యజించి, నేను-నాది అనే భావన లేక, అహంకార రహితుడై జీవనయాత్ర కొనసాగించే మానవుడు శాంతిని పొందును-్భ.గీ.2-71). మనోవ్యాకులత లేని శాంతమనస్కుడే జ్ఞానసాధనకు అర్హుడు.
నిర్మలమైన మనస్సుతోపాటు ఛిన్న సంశయుడైన సాధకుడే కృతనిశ్చయుడై తన గమ్యము చేరుకోగలడు. అందువలన, సంకోచము విడనాడి, తన సంశయములనన్నింటినీ గురువువద్ద నివృత్తిచేసికొని, తదనంతరము ధ్యానావస్థలో తనదైన రీతిలో స్వానుభవయుక్తులను వినియోగించి ఆత్మవిచారణ చేసికొనుటకు ఉద్యుక్తుడైన సాధకునకు, ఆత్మసాక్షాత్కారమై ఆత్యంతిక సుఖము ప్రాప్తించును.
84. మోక్షస్య కాంక్షా యది వై తవాస్తి
త్యజాతిదూరాత్ విషయాన్ విషం యథా

పీయూషవ త్తోషదయాక్షమార్జవ
ప్రశాన్తి దాన్తీ ర్భజ నిత్యమాచరాత్‌॥
శిష్యా! నీకు మోక్షము పొందాలనే కోరిక మాత్రమే ఉన్నచో నీవు విషమున దూరముగా ఉంచినట్లు విషయాసక్తిని పూర్తిగా త్యజించుము. సంతోషము, దయ, ఓర్పు, సత్ప్రవర్తన, శాంతము మరియు ఇంద్రియ నిగ్రహము అనే గుణములను ఆదరించి నిత్యము వాటినే సర్వదా పాటించుము.

మనోనిగ్రహములేని అవివేకి ఎన్నడూ సంసారబంధము విడనాడి పరమాత్మను చేరుకొని శాశ్వత సుఖము పొందజాలడని శ్రుతి పల్కుతున్నది ‘‘యస్తు అవిజ్ఞానవాన్భవతి అమనస్కః సదా‚ శుచిః న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి॥
యస్తు విజ్ఞానవాన్భవతి సమనస్కః సదా శుచిః స తు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే॥ (ఎవడు వివేకహీనుడో, ఎవని మనస్సు అస్థిరమో, నిత్యమూ ఎవడు అపవిత్రుడో అతడు బ్రహ్మలోకము చేరలేడు. సంసారవలయములో చిక్కుకొని జనన మరణములను తప్పించుకోలేడు. ఎవడు విజ్ఞానవంతుడో, ఎవని మనస్సు మంచిదో, ఎవడు నిత్యము పవిత్రముగా ఉండునో అతడు పరమపదమును చేరుకొని ఇహలోకములో మరల ఏ జన్మనూ పొందడు- క.ఉ.3-8,9.)
దేహాభిమానము వలదు
85. అనుక్షణం యత్పరిహృత్య కృత్య
మానాద్యవిద్యాకృతబన్ధమోక్షణమ్‌
దేహః పరార్థో‚ య మముష్య పోషణే
య స్సజ్జతే స స్వమనేన హన్తి॥
శరీరముతో బంధము అనాదియైన అజ్ఞానమువలన ఏర్పడుతున్నది. ఈ స్థూల శరీరము నిత్యత్వము లేని ఆత్మేతర పదార్థము. దీని పరిత్యాగము చేయవలసినదే. అయినా, బంధవిముక్తికి ప్రయత్నముచేయక, శరీరమే ఆత్మ అనే భ్రాంతితో జ్ఞానములేని వ్యక్తి ఆత్మను విస్మరిస్తాడు. శరీర పోషణలో నిమగ్నమై ఉండే అవివేకి ఆత్మఘాతకుడు, అతనికి బంధవిముక్తి ఎన్నడూ లభించదు.
ఈశావాసోయపనిషత్తు ఆత్మజ్ఞాన పరాయణులకు ఫలసిద్ధిని ఇలా నిర్ధారిస్తున్నది ‘‘సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్‌ం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా‚ మృతమశ్నుతే॥ (ఎవరు ఆత్మతత్త్వమును, శరీర తత్త్వమును రెండింటిని సమగ్రంగా తెలుసుకొని, జ్ఞానతత్పరులై సాధన చేయుదురో వారికి సంసారబంధ విముక్తి లభించి, జన్మరాహిత్యము సిద్ధించును-ఈ.ఉ.1-4).
86. శరీర పోషణార్థీ సన్ య ఆత్మానం దిదృక్షతే
గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం స ఇచ్ఛతి॥
శరీరాభిమానంతో దాని పోషణలో ఆసక్తిచూపుతూ, ఎవడు ఆత్మసాక్షాత్కారము పొందాలనే కోరిక పెంచుకుంటాడో, అతడు మొసలిని కట్టెగా భావించి, దానిపై ఎక్కి కూర్చొని నదిని దాటుటకు ప్రయత్నముచేసే బుద్ధిహీనుడివంటి వాడు.
శరీరము సుఖమునే పొందగోరును. ఆ కోరికను తీర్చుకొనుటకు శరీరపోషణలో ఆసక్తిచూపే వ్యక్తి, ఆత్మసాక్షాత్కారము చేసికొనుటకు ఆసక్తి చూపినవానికి బంధవిముక్తి ఎట్లు లభించును? బుద్ధిహీనుడే మొసలిని అధిరోహించి, నదిని దాటుటకు ప్రయత్నము చేయును.
87. మోహ ఏవ మహామృత్యు ర్ముముక్షో ర్వపురాదిషు
మోహో వినిర్జితో యేన స ముక్తిపద మర్హతి॥
స్థూల శరీరము దాని భాగములైన రక్తమాంసములతో కూడుకొనిన అంగములే మోహమునకు హేతువులు. మోహము అత్యంత వినాశికారియైన మృత్యువు వంటిది. మోహమును జయించిన వ్యక్తియే మోక్షాకాంక్షతో ముక్తిమార్గమును చేపట్టుటకు అర్హుడు.
‘‘క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి’’
అని భగవద్గీత బోధిస్తున్నది (క్రోధమువలన వ్యామోహము కల్గును, వ్యామోహము స్మృతి భ్రమను కల్గించును, స్మృతిభ్రంశమువలన బుద్ధినశించును. బుద్ధి నశించినవాడు మరణం పొందును- భ.గీ.2-63).
మోహమావరించిన వ్యక్తి ఇంద్రియములను జయించలేడు.

ఇంకాఉంది