మెయిన్ ఫీచర్

అజ్ఞానం.. భ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అందుచేత, పరబ్రహ్మమే విశ్వానికి సర్వాధారము. ప్రపంచంలో నున్న సమస్తమునకు అధిష్ఠానమని చెప్పబడినది. స్వాశ్రయమైన పరబ్రహ్మమునకు ఇంకొక ఆధారము ఏదీ లేదు. దాని ఐశ్వర్యమే దానికి ఆధారము. బ్రహ్మము నిరవయవి. మనోబుద్ధ్యాది ఇంద్రియ రహితమైనా, పరమాత్మ శుద్ధ జ్ఞాన స్వరూపము. ‘సత్సంకల్పః’ ‘సర్వజ్ఞః’ అనే పదములతో పరబ్రహ్మము నిర్దేశించబడినది. అట్టి పరబ్రహ్మ స్వరూపమే నీవు. ఈ భావనతోనే సర్వదా ఉండుము.
259. జన్మవృద్ధి పరిణత్యపక్షయ
వ్యాధి నాశన విహీన మవ్యయమ్‌
విశ్వసృష్ట్య వనఘాతకారణం
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
‘జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి’ అనేవి షడ్భావవికారములు. పుట్టుక, ఉనికి, పెరుగుట, పరిణామము చెందుట, తరుగుట, నాశనమగుట అనే ఆరు వికారములు సమస్త ప్రాణులకు సర్వసామాన్యము. నిర్వికారమైన పదార్థము ఒక్క ఆత్మస్వరూపమే. ఆత్మ అవ్యయము. విశ్వ సృష్టికి, స్థితికి, యుగాంతములో ప్రవిలయనమునకు సహితము పరబ్రహ్మమే కారణము. ఆ పరబ్రహ్మ స్వస్వరూపమే నీ ఆత్మ. అందువలన, నేను బ్రహ్మముననే భావన సదా నీ మనస్సులో నిల్పుకొనుము.
260. అస్త్భేదమనపాస్తలక్షణం
నిస్తరంగజలరాశి నిశ్చలమ్‌
నిత్యముక్తమవిభక్తమూర్తి యద్
బ్రహ్మతత్త్వమసి భావయాత్మని॥
బ్రహ్మైక్యతతో సమస్త భేదములు తొలగిపోవును. పరమాత్మ కెరటములు లేని నిశ్చల జలధి. ప్రశాంతము మరియు ఎట్టి బంధములు లేని నిత్యముక్త స్వరూపము. అట్టి చిదానంద అఖండ పరమాత్మ స్వరూపమే నేనని, మనస్సులో నీవు స్థిరీకరించుకొనుము.
‘‘యో‚ సావసౌ పురుషః సో‚ హమస్మి‘‘ అని శ్రుతి ప్రకటిస్తున్నది (ఆదిత్య మండలములోనున్న పరమపురుషుడనే నేను -ఈ.ఉ.16). లోకసాక్షియైన సూర్యుడు పరబ్రహ్మ వివర్తరూపము.
261. ఏకమేవ సద నేక కారణం
కారణాస్తరవిరాస కారణమ్‌
కార్య కారణవిలక్షణం స్వయం
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
బ్రహ్మమొక్కటే, కాని అదే అనేక కార్యరూపాలకు హేతువు. జగత్తులో సమస్త వికార రూపములను నిషేధించి, సర్వాధిష్ఠానముగా స్థిరీకరించుకొనుటకు ఇంకొక పదార్థములేదు. ‘‘తదేతద్బ్రహ్యాపూర్వ మనపరం’’ (ఈ పరబ్రహ్మము అపూర్వము అనగా కారణములేనిది, మరియు అనవసరం అనగా కార్యములేనిది -బృ. ఉ.2-5-19). అందువలన, ‘కార్యకారణ విలక్షణం’అని నిర్దేశింపబడింది. పరమాత్మ స్వయం సిద్ధము. ‘అజః’ అనాది, పుట్టుక లేనిది. ఆ బ్రహ్మమే నీ ఆత్మ. అందువలన, నేను ఆ బ్రహ్మస్వరూపమనే భావనతో సదా ఉండుము.
262. నిర్వికల్పక మనల్పమక్షరం
యత్ క్షరాక్షర విలక్షణం పరమ్‌
నిత్యమవ్యయసుఖం నిరంజనం
బ్రహ్మ తత్త్వమనీ భావయాత్మని॥
మాయారహితము, వికల్పశూన్యము, అపరిమితము, ఆకాశమువలే సర్వత్రా వ్యాప్తి చెందిన పరమాత్మ. కృత్స్నము, భూమా అని నిర్దేశింపబడినది. ‘క్షరస్సర్వాణి భూతాని కూటస్థో‚ క్షర ఉచ్యతే’’అని స్మృతి వచనం. ప్రాపంచిక భూతములన్నియు నశించేవి, కూటస్థుడైన జీవాత్మ నాశరహితుడు అని ఉపదేశించి అనంతరము ‘‘యస్మాత్ క్షరమతీతో‚ హ మక్షరాదపి చోత్తమః అతో‚స్మిలోకే వేదే చ ప్రథితః పురుషోత్తముః’’అని స్పష్టము చేయబడింది (నేను నాశనమయే క్షరపురుషుని అతిక్రమించినవాడను. నాశరహితుడైన అక్షరునికంటె ఉత్తముడను. కనుక లోకములందు, వేదములయందును పరమాత్మ స్వరూపమై పురుషోత్తముడని ప్రసిద్ధి చెందితిని- భ.గీ.15-18). అందువలన, క్షరాక్షర విలక్షణమని ఇచ్చట చెప్పబడినది. అదియే మాయా రహితమైన పరమాత్మ. నిరంజనమైన ఏ బ్రహ్మము వికార రహితము, అఖండానంద నిలయమో, నీవు ఆ బ్రహ్మస్వరూపమనే భావనతో ఉండుము.
263. యద్విభాతి సదనేకధా భ్రమాత్
నామ రూపగుణ విక్రియాత్మనా
హేమవత్స్వయ మివిక్రియం సదా
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
సద్రూపమైన బ్రహ్మము స్వయముగా వికారరహితము. అయినా, నామ రూపగుణ విశేషములతో అనేక విధములుగా ఈ ప్రపంచములో భ్రమకు తావిస్తూ భాసిస్తున్నది.
ఇంకా ఉంది