మెయిన్ ఫీచర్

బ్రహ్మనిష్ఠతో ఆత్మ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
పునర్జన్మ అనివార్యవౌను. కర్మఫలము పూర్తిగా నశించేవరకు అంతర్ముఖుడై ముముక్షువు దృఢ సంకల్పముతో ఆత్మావలోకనముకొరకు తీవ్ర ప్రయత్నము చేయవలసినదే. ఆత్మసాక్షాత్కారము పొందిన జ్ఞానులకు, సుకృతదుష్కృతములు రెండునూ శేష రహితముగా అంతమగును. పూర్వవాసనలు నశించిన కారణంగా వారు జనన మరణములను అధిగమించి శాశ్వత బంధవిముక్తి పొందుదురని జ్ఞానసంపన్నులైన మునులు నిర్ధారించారు. ఈ నిర్ధారణకు శ్రుతి తార్కాణము ఇలా ఉన్నది.
‘‘పుణ్యపాపే విధూయ నిరంజనం పరమం సామ్యుపైతి’’ (పరమాత్మను సాక్షాత్కారము చేసికొనిన జ్ఞానవంతుడు సమస్త సుకృత దుష్కృతములను అంతముచేసికొని దుఃఖాతీతుడై అద్వైతరూపమైన పరమసామ్యమును పొందును-
‘‘జ్ఞాత్వా దేవం సర్వపాశాపహానిః క్షీణైః క్లేశైర్జన్మమృత్యు ప్రహాణిః’’ (పరమాత్మ తత్త్వం తెలిసికొనిన జ్ఞాని, అవిద్య నాశనమైనందువలన, బంధములన్నీ విడిపోయి, జనన మరణ వలయంనుండి బయటపడును- ‘‘తేషు బ్రహ్మలోకేషు పరాః పరావతో వసన్తి తేషాం న పునరావృత్తిః’’ (బ్రహ్మలోకమందు వారు స్థిరముగా ఉందురు. వారికి పునరావృత్తిలేదు-)
269. అహంమమేతి యో భావో దేహాక్షాదావనాత్మని
అధ్యాసో‚ యం నిరస్తవ్యో విదుషా స్వాత్మనిష్ఠయా॥
దేహము, ఇంద్రియములు, మనోబుద్ధ్యహంకారములు, ప్రాణములు ఆత్మేతర పదార్థములు. కాని, దేహాభిమానముతో ఆత్మ అనే భావన అధ్యస్తమై, నేను-నాది అనే అపోహ వాటిలోనే కలుగుతుంది. ఆత్మనిష్ఠతో, హృదయస్థిత ఆత్మయే నేను అని స్థిరీకరించుకొని, దేహాత్మభావన అంతమొందించుకొనవలెను.
270. జ్ఞాత్వా స్వం ప్రత్యగాత్మానం బుద్ధితద్విృత్తి సాక్షిణమ్‌
సో‚ హమిత్యేవ సద్వృత్త్వా‚ నాత్మన్యాత్మమతిం జహి॥
హృదయాంతరాళములో సాక్షిగా ఉండే ప్రత్యగాత్మ బుద్ధి నడవడికను సదా గమనిస్తునే ఉండును. నీవు ఆ ప్రత్యగాత్మను తెలిసికొని, పరమాత్మ స్వస్వరూపమే నేను, ‘సో‚ హం’ అనే భావన కల్గిఉండును. సత్స్వరూప ఆవలంబనతో, ఆత్మేతరములైన మనోబుద్ధ్యహంకారములందు అభిమానమును విడచిపెట్టుము.
271. లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనమ్‌
శాస్త్రానువర్త్నం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు॥
లోకములో జనులందరి ఆదరాభిమానములను పొంది వారిని మెప్పించాలనే ప్రవర్తన, దేహమే నేననే అహంకారభావన మరియు మోక్షేచ్ఛకాక, శాస్తప్రఠనతో పాండిత్యప్రతిభ ప్రదర్శించాలనే దురభిమానము పూర్తిగా త్యజించవలెను. ఆత్మపై అధ్యారోపితమై కల్గుతున్న అహంకార, మమకారములను అంతముచేసికొన్న వ్యక్తియే ముక్తిని పొంద శక్యము.
272.లోకవాసనయా జన్తోః శాస్తవ్రాసనయాపి చ
దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే
లోకవాసన, శాస్తవ్రాసన మరియు దేహవాసన ఉండే వ్యక్తులకు యథార్థ జ్ఞానము ప్రాప్తించదు. ఈ మూడు వాసనలలో ఏది కొనసాగినా అది ప్రతిబంధక మై బ్రహ్మాత్మ భావన, బ్రహ్మనిష్ఠ కలగనీయదు. సర్వాత్మకతా భావముగలవారికి కరుణ, భూతదయ ఉండుట సహజము. అట్టి మహాత్ములు లోక శ్రేయస్సు తప్ప మరేమి యూ కోరరు. వారు ఆప్తకాములు, ఆత్మకాములు. తద్వ్యతిరిక్త ప్రవృత్తిగల్గి, స్వలాభాపేక్షతో సేవాతత్పరులైన వారు మాత్రము లోకవాసనగలవారుగా పరిగణింపబడదురు. వారు తమ అనుచరులపై దయ, జాలి చూపినా తమ లక్ష్య సాధనకు మమకారాదులు త్యజించలేరు. జుగుప్స ఈర్ష్య, మరియు కార్పణ్యాది దోషములు వారి వ్యవహారములో కాననగును.
శాస్త్ర వ్యసనముగలవారికి పఠనపాఠనాదులపై రక్తి పెరుగును కాని, ఏకాంతముగా బ్రహ్మాత్మభావనతో నిరంతరం సాధన చేయుట శక్యం కాదు. పాండిత్యాభిలాషగలవారు సమావేశములందు, సభాముఖముగాను, తమ ప్రజ్ఞను ప్రదర్శించి కీర్తిప్రతిష్ఠలను ఆర్జించుటలో ఎక్కువ మక్కువ కనబరచుదురు. బ్రహ్మనిష్ఠతో శాంత మనస్కులై నిరంతర ఆత్మ పరిశీలన చేసుకొనలేరు.
దేహసౌష్ఠవమందు, దేహాలంరమందు ప్రీతిగలవారికి దేహాభిమానము పెరిగి దేహపోషణ ముఖ్యవౌను. విలాస జీవితము, భోగలాలసపై ఆసక్తి పెరుగును. నిత్యా నిత్య వివేచనం లేని కారణంగా, దేహాతిరిక్తమైన స్వస్వరూప ఆత్మజ్ఞానము పొందుటకు వారు ఇచ్చగించరు. అందువలన దేహవాసన వీడబడదు.
లోకవాసన, శాస్తవ్రాసన, దేహవాసన అనే ఈ మూడూ మోక్షప్రాప్తికి అవరోధములు. అందువలన జనన మరణములను అధిగమించబడదు.

ఇంకా ఉంది