మెయిన్ ఫీచర్

బ్రహ్మైక్యత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ఆత్మను ఉపేక్షించి (నిర్లక్ష్యము చేసి) నీవు విస్మరణకు ఎన్నడూ అవకాశమీయవద్దు. పరమాత్మ స్వరూపమైన నీ ఆత్మనే నిత్యము స్మరించుము.
288. మాతాపిత్రోర్మలోద్భూతం మలమాంసమయం వపుః
త్యక్త్వాచణ్డాలవద్దూరం మ్రహ్మీభూయ కృతీ భవ
మాతాపితరుల శుక్ర శోణితములు కలిసి ఏర్పడిన ఈ శరీరము, మల మాంసాది మలిన పదార్థములకు ఆలవాలము. అశుచివ్యక్తిని కడు దూరములోనుంచి వ్యవహరించినట్లు, కల్మష భరితమైన శరీముపై మమకారమును విడచి, శుద్ధజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమే నేననే భావనతో కృతకృత్యుడవు కమ్ము.
289. ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని
విలాప్యాఖండభావేన తూష్ణీం భవ సదా మునే॥
ఘటమునకు పరిమితమైనది ఘటాకాశము. అట్లే ఉపాధివశమున జీవి, శరీరమునకు పరిమితము. ఘటాశ్రయము లేనప్పుడు ఘటాకాశము, మహాకాశములో విలీనమైనట్లు, ద్వంద్వ భావన నశించినపుడు, ఆ పరమాత్మ స్వరూపమే నేను అనే ఏకైక (అద్వైత) మనోభావన సునిశ్చితవౌను. అందువలన, ఓ మునివర్యా! నిశ్చల మనస్సుతో బ్రహ్మైక్యత సాధించి, నీవు అఖండ స్వరూపుడవు కమ్ము. ధీమంతుడవైన నీవు వౌనముగా ఎట్టి కార్యాసక్తిలేక ఎల్లవేళల ఉండుము.
290. స్వప్రకాశమధిష్ఠానం స్వయం భూత్వా సదాత్మనా
బ్రహ్మాణ్డమపి పిణ్డాణ్డం త్యజ్యతాం మలభాణ్డవత్‌॥
నీ ఆత్మ స్వయంప్రకాశ ధర్మముతో స్వతఃసిద్ధమైన సద్రూపము. చిద్రూపమైన పరమాత్మ స్వరూపమే నీ హృదయ స్థానములో ప్రతిష్ఠితమై ఉన్నది. స్వస్వరూప భావనతో, సర్వకల్పనలకు, నీవే సర్వదా ఆధారభూతము (అధిష్ఠాన రూపము). హేయమైన మలభాండము ఎట్లు వర్జనీయమో, అట్లు నశ్యమయే పిండాండమును అనగా ఈ నీ శరీరమును, సమస్త జగత్తును (బ్రహ్మాండమును) మిథ్యారూపములని విస్మరించుము.
291. చిదాత్మని సదాననే్ద దేహారూఢామహం ధియమ్!
నివేశ్య లింగముత్సృజ్య కేవలో భవ సర్వదా॥
దేహసంబంధమైన అహంకారము అభాస రూపములో తాదాత్మ్యభావము కల్పిస్తున్నది. అహంకారమును, నిరంతర బ్రహ్మాత్మ భావనతో చిదానంద స్వరూపమగు ప్రత్యగాత్మయందు లయము చేయగా, సూక్ష్మ శరీరముపై మమకారము, అభిమానము నశించిపోవును. బ్రహ్మచింతనలో సదా నిమగ్నమై ఉన్నదో, నీవు సంగరహితుడవై (కేవలుడవై) బ్రహ్మైక్యత తప్పక పొందెదవు.
292. యత్రైష జగదాభాసః దర్పణాన్తఃపురం యథా
తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి॥
నిర్మలమైన అద్దములో ప్రతి బింబ రూపములో కనబడే చరాచర దృశ్యములన్నియూ ఆభాస రూపములు. దర్పణము అభావమైనా, అంధకారము అలముకున్నా అవి ప్రతిఫలించవు. స్వయంజ్యోతిస్స్వరూపమైన పరమాత్మ కారణముగా జగత్సర్వమూ తేజోవంతవౌతున్నది. అదే విధముగా, హృదయస్థిత భారూపమైన ఆత్మ, దేహేంద్రియాదులకు ప్రకాశత్వమును కల్పిస్తున్నది. ప్రకృతః అవి జడములు. స్వతఃసిద్ధముగా ప్రకాశత్వము లేని కోశాదులందు ఆభాసవౌతున్న ప్రతిబింబములు, అద్దములో కన్పించే నగరంలో మిథ్యారూపములు. అందువలన, సద్రూపమైన బ్రహ్మమే సత్యము, నేను పరబ్రహ్మ స్వస్వరూపమును అనే జ్ఞానముతో మిథ్యారూపమైన ప్రపంచమును నిరాకరించి నీవు కృతకృత్యుడవు కమ్ము.
ఇదే విషయాన్ని భగవత్పాదులవారు తమ దక్షిణామూర్తి స్తోత్రంలో ఇలా బోధించారు-
‘‘విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహరివోద్భూతం యథా నిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే
స్వాత్యానమేవాద్వయం తస్మై
శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥
293. యత్సత్యభూతం నిజరూపమాద్యం
చిదద్వయానన్ద మరూప మక్రియమ్‌
తదేత్య మిథ్యావపు రుత్సృజైత
చ్ఛైలూషవద్వేష ముపాత్త మాత్మన.॥
చిదానందస్వరూపమైన నీ ప్రత్యగాత్మ క్రియాశూన్యము. త్రికాలాతీతము, ఆద్యంతములు లేని, అద్వితీయమైన ఆ పరబ్రహ్మ స్వస్వరూపమే నీవు. కాని, నాటకములో వేష భూషణలతోనున్న నటుడివలె, ఈదేహములో నీ అహంకారమే, నీ నిజ స్వరూపమును కప్పిపుస్తూ మభ్యపెడుతున్నది. దేహమందు మోహమునకు కారణమైన ఈ అహంకారమును విడనాడి, నీవు బ్రహ్మస్వరూపమని తెలుసుకొనుము.

ఇంకా ఉంది