మెయిన్ ఫీచర్

శివపూజకు వేళాయె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోళా శంకరుడికి జేజేలు పలుకుతోంది త్రిలింగ క్షేత్రం. తెలుగునేలపై అడుగడుగునా దర్శనమిచ్చే శైవక్షేత్రాలకు మహాశివరాత్రి శోభ వచ్చేసింది. శివభక్తుల నోట పంచాక్షరి మంత్రం జపమై వినిపిస్తోంది. భక్తితో ఉపవాసం చేసి, జాగరణతో లింగోద్భవాన్ని, కల్యాణాన్ని చూసి తరించేందుకు అంతా సిద్ధమయ్యారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఇప్పటికే ఉత్సవశోభను సంతరించుకుంది. మహాశివరాత్రి వైభవం, శివతత్వం, అర్థనారీశ్వర తత్వంలో అంతరార్థం విప్పిచెప్పే విశేష కథనం..

‘శం’ అంటే నిత్య సుఖం, ఆనందం. ‘ఇ’కారము పరమపురుషుడు. ‘వ’కారం అమృత స్వరూపిణియగు శక్తి. ఈ మూడింటి సమ్మేళనమే ‘శివ’ అవుతుంది. అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థము.
సకల విధ కర్మలను తన వశంలో ఉంచుకొనేవాడు ‘వశి’ అని పిలువబడతాడు. ‘వశి’యే ‘శివ’ అయింది. అంటే జితేంద్రియత్వాలు. కనుక శివ అంటే జితేంద్రియుడని అర్థము. జితేంద్రియుడైన శివుణ్ణి ఆరాధిస్తే, అభిషేకిస్తే ఉపాసిస్తే, మనం కూడా జితేంద్రియులమవుతాం. ఇంద్రియాల్ని జయించే శక్తివంతులమవుతాం అని పేర్కొన్నది శివపురాణం.
‘శివం వేదః తద్యోగాత్’ శివమనగా ‘వేదము’ అని అర్థము. ‘ఓం శ్శాంతి శ్శాంతిః’ అని ఈ విశ్వానికి శాంతి మార్గాన్ని చూపించి, శాంతింపజేగల వేదము- శివమవుతుంది. అనగా మంగళప్రదమవుతుంది. దీని యోగము కలవాడు ‘శివుడు’.
త్రిమూర్తులు- శివతత్త్వం
బ్రహ్మ విష్ణు శివులు- ముగ్గురిని త్రిమూర్తులంటారు. మూర్తి అంటే ఆకారం. నిరాకారమైన పరమాత్మ తత్వం ఒక్కటే. అదే మూడు ఆకారాలను ధరించి, ముగ్గురు దేవతలయింది. సృష్టి చేయవలసిన అవసరం ఈ ‘బ్రహ్మ’ అయింది. స్థితిని కాపాడే సందర్భముగా విష్ణువయింది. అలాగే దీనినంతటినీ లయం చేయవలసి శివుడయింది. లయానికి సంకేతమయింది. శివతత్త్వం - నామరూప క్రియాత్మకంగా భాసించే చరాచర పదార్థాలన్నీ లయమయితే, ఇక మిగిలేదేమిటి? ఏది లయం చేసికొన్నదో అది, ‘న భూమి ర్నతోయం న తేజో నవాయః’ అని, సృష్టి అంతా నశించినా, సృష్టికి ఆధారమైన ఏ మూల తత్త్వముందో అది నశించదు. నశిస్తే శవం, నశించకుంటే శివం. నశించేదానికి సాక్షి గనుక అది శివమే ఎల్లప్పుడూ, ఎప్పటికీ. అదే శివతత్త్వం, శివలీలా వైభవం. ఇలాంటి సాక్షి అందరిలో ఉన్నదిప్పుడు.
సాకార భావన తత్త్వం
భావించినా అది శివమే. అప్పుడది అమూర్తమైన లింగం కాదు, మూర్తమైన శివ విగ్రహం. అదే అష్టమూర్తి. శివుడు అష్టమూర్తి అని వర్ణించారు. ఏమిటా అష్టమూర్తులు? పృధ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము- పంచభూతములు, మనోబుద్ధి అంకారములు. మూడూ అంతరమైన జీవభావం. జీవ జగత్తులు రెండూ కలిసి ‘అష్టమూర్తులు’. ఇవి ఈశ్వరుని విగ్రహంలోనే లీనమై, ఏకమై ఉన్నాయి. ఆయన భస్మానులేపనం పృధివికి, గంగాజటాజూటం జలానికి, ఫాలనేత్రం తేజస్సుకి అనగా అగ్నికి, నాగభూషణత్వం వాయువుకి, దిగంబరత్వం ఆకాశానికి సంకేతము. చంద్రశేఖరత్వం మనస్సుకి, వృషభ వాహనం బుద్ధికి, గజచర్మ ధారణం అహంకారానికి చిహ్నాలు. త్రిశూలధారణం త్రిగుణాతీత తత్త్వం సూచిస్తాయి.
శివరాత్రి అంటే ఏమిటి? ఎప్పుడు వస్తుంది?
శివ అనగా మంగళకరము, శుభప్రదము. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి ‘చీకటి’ అజ్ఞానమునకు సంకేతం కదా. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రినాడు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే అది శివరాత్రి, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని, మాస శివరాత్రి పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు.
చతుర్దశినాడే ఎందుకు చేయాలి?
మహాశివరాత్రి మాఘమాసంలోనే ఎందుకు చేయా లి? చతుర్దశి నాడే ఎందుకు చేయాలన్న సందేహం అందరిలో వస్తుంది. మఖా నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం గల మాసం మాఘమాసం. మానవుని అఘములను అనగా పాపములను హరించే మాసం- మాఘమాసం. త్రిమూర్త్యాత్మకుడైన సూర్యభగవానుని జయంతి మాఘమాసంలోనే వస్తుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. మాఘశుద్ధ సప్తమినాడు సూర్యుడు మొదటిసారిగా భూమిమీద తన కిరణములను ప్రసరింపచేశాడని పురాణములు చెప్తున్నాయి. చతుర్దశి అమావాస్యలలో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు. ‘చంద్రమా మనసో జాతః’ చంద్రుడు మనస్సుకు కారకుడు, అధిదేవత. చంద్రకళలు కృష్ణపక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒక కళే వుంటుంది. అలాగే మనసుకు చేరిన పదహారు మాలిన్యములలో (అష్టమదములు=8, అరిషడ్వర్గములు=6 మనస్సు - 1, అహంకారం - 1) ఒక్కటే మిగిలి ఉంటుంది. ఈ శేషించి ఉన్న ఒక్క మాలిన్యాన్ని దూరం చేసికోటానికి మాఘ కృష్ణ చతుర్దశి శ్రేష్ఠమైన తిథిగాను, ఆ రాత్రి జ్ఞాన వెలుగునిచ్చే మహాశివరాత్రి చెప్పబడింది.
ఉపవాసము
‘ఉప’ అనగా సమీపము, వాసము అంటే ఉండటము. ఈశ్వరునికి సమీపముగా ఉండటమే ఉపవాసమంటే. అనగా ఆ రోజంతా దైవ చింతనలో ఉండటం.
అభిషేకము, బిల్వార్చన
ఈశ్వరుడు అభిషేకప్రియుడు, విష్ణువు అలంకారప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. నమక చమకములతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వివిధ కరకములైన అభిషేక ద్రవ్యములతోనూ పంచామృతములతోను ఆచరిస్తారు. ‘త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణమ్’
మానవులను ప్రభావితం చేసే సత్వ, రజో, తమో గుణములకు, త్రికాలములకు, తాపత్రయములకు మూడు దళములతో కూడిన బిల్వ పత్రము బిల్వ దళము శ్రీ మహాలక్ష్మీ కటాక్షం. పుష్పించకుండా ఫలించే వృక్షం- మారేడు వృక్షం. ఈ శరీరమే ‘బిల్వదళము’. త్రిగుణముల ఏకత్వాన్ని సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఏకత్వాన్ని తెలియపరచేదే రుూ బిల్వదళము.
ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు వెరసి పదకొండు తత్వాలు మానవుని విషయ వాసనల్లోకి దింపి బంధములకు కారణభూతులౌతాయి. వాటిని మన అధీనంలో ఉంచుకోవటానికే రుద్రాభిషేకం.
జాగరణ
అంటే నిద్రను జయించటం. ఏ విధంగా జయించాలి? నిరంతన భగవత్ చింతన, నామ సంకీర్తనములతో రాత్రి అంతా సత్కాలక్షేపము, సద్గోష్ఠితో గడుపుటయే జాగరణ. లక్ష్మణుడు అరణ్యవాస దీక్షను జాగరణతోనే గడిపాడు. పరబ్రహ్మ స్వరూపుడు, నాద సుధా రస స్వరూపుడు అయిన, ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు, చేతనా చేతన జీవరాశికి ప్రతీక అయినా లోకపావని సీతామాతను సేవిస్తూ గడిపాడు తరించాడు గదా.
భస్మధారణ ఏం చెప్తుంది?
మనిషి భూమి మీదకు వస్తూ తెచ్చిందేమీ లేదు, పోయేటప్పుడు తీసికొనిపోయేదేమీ లేదు. పుట్టుక మరణం మధ్యజీవితం ఒక నాటకం. చివరకు మానవుడు రూపాంతరం చెందేది భస్మంగానే. ‘నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము’ అన్నాడు గదా అన్నమయ్య.
శ్మశానవాసిగా ఎందుకు
ఎంతటివారైనా ఏదో ఒక రోజు శ్మశానానికి చేరవలసిందే. తనతో వచ్చిన వారందరూ వెళ్లగా, దుఃఖిస్తుంది సూక్ష్మప్రాణి. ఒంటరి అయిన నీకు ఈ శ్మశానంలో నేనున్నానని అభయాన్నివ్వటానికే శ్మశానవాసిగా ఉంటాడు పరమశివుడు.

లింగోద్భవం.. కల్యాణం
శ్రీరాముడు జన్మించిన రోజునే కల్యాణం చేస్తాం. ఇది ఆగమ శాస్తర్రీత్యా జరుపుతారు. అలాగే లింగోద్భవకాలంలోనే శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత లింగస్థల దేవాలయములు, దేవతా ప్రతిష్ఠితములైనవి, మహర్షులచే ప్రతిష్ఠింపబడిన లింగములు, ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామములు యిలా ఎన్నో శైవక్షేత్రాలు ప్రసిద్ధి చెందినవి. శివరాత్రి రోజున వాటిని తలచుకుంటే మోక్షప్రదం. విశ్వనాథుని దర్శనంలో ఈ విశ్వమంతా ఆయన వెలుగేనన్న సత్యం ద్యోతకమవుతుందని, మహాశివరాత్రి రోజున సద్గురు త్యాగరాజస్వామి తన ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట’ అన్న కీర్తనలో దర్శింపచేస్తున్నాడు.

నంది వాహనం ఎందుకు?
పరమశివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు? పరమమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో జీవతత్త్వానికి నంది చిహ్నము. పశుత్వముతోకూడిన జీవతత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని త్రిప్పక ఈశ్వరునివైపుకి త్రిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందింది నంది. నందికి ఈశ్వరునికి ఎవరూ అడ్డుతగలకూడదు. అనగా జీవునకు, దేవునకు మధ్యలో ఎవరూ అడ్డుతగలకూడదు. నంది శృంగముల మధ్యనుండి దేవుణ్ణి- ఈశ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు. పశుత్వము నుండి శ్రవణమును ఆధారము చేసికొని దైవత్వాన్ని చింతించటం ద్వారా, ఈ నంది ఈశ్వరుడుగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు. పశుతత్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరునివైపు మరల్చటం చేత నందీశ్వరునిగా మారిపోయాడు.

లింగరూపం వైశిష్ట్యం
నశించేదానికి సాక్షి శివమే. మన శరీరాన్ని దీని చుట్టూ పరచుకొని ఉన్న ఈ ప్రపంచాన్ని నిత్యమూ గమనిస్తున్న మన ‘జ్ఞానం’. దీనికే ‘చిత్’ అని పేరు- వేదాం త పరిభాషలో. తానుం డి గదా దేనినైనా గమనించవలసింది. ఈ ఉండటానికే ‘సత్’ అని పేరు. పరిపూర్ణమైన ‘సత్ చిత్’ల సమాహారమే శివస్వరూపం. అవి నామరూపాలన్నింటినీ లయం చేసికొని నిరాకారంగానే శేషించిన భావాలుగనుక లింగరూపం. రూపంగాని రూపమిది. శివతత్త్వానికి ఆది మధ్యాంతరాలు లేవని చెప్పటానికే దాన్ని లింగరూపంగా భావన చేశారు. ఇది నిరాకార తత్త్వం, ‘వీనం గమయతీతి లింగం’.

- పసుమర్తి కామేశ్వర శర్మ (94407 37464)