మెయిన్ ఫీచర్

కొంగు బిగించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలలో ఆసక్తికరమైన నిజాలు వెలుగుచూశాయి. యుక్తవయసులో ఉన్న బాలికలు, యువకులలో దాదాపు 90శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. వారిలో హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే అతి తక్కువగా ఉంది. తల్లడిల్లిపోయిన ఆ గ్రామస్తులు దీనికి కారణాన్ని అనే్వషించారు. సరైన పోషకాహారం అందకపోవటం, రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులేనని గుర్తించారు. ఆరోగ్యదాయకమైన జీవనం సాగించాలంటే ఏమి చేయాలి అని ఆలోచించారు. సేంద్రీయ సాగే సరైన పరిష్కారం అని మహిళలు గుర్తించారు. ఇంకేముందు జిల్లాలోని అనేక పల్లెలు కొంగు బిగించాయి. సేంద్రీయ సాగు బాటపట్టాయి. సొంత భూమి ఉన్న మహిళలు తమ పొలాల్లో ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నారు. ఇంటిచుట్టూ కాస్తంత స్థలం ఉన్నా ఇంటికి కావల్సిన పంటలను పండించుకుంటున్నారు. ప్రతి పల్లె పడుచు మొక్కవోని దీక్షతో ఆచరణ ద్వారా స్వానుభవం పొందుతున్నారు. పండించుకున్న అమృతాహారాన్ని తాము తింటూ.. నలుగురికి పంచిపెడుతున్నారు. ఒక్క ఆశయం జీవితానే్న మార్చేసినట్లు ఇపుడు ప్రకృతి పంటలతో ప్రతి ఇల్లు కళ కళ లాడుతోంది. వివరాల్లోకి వెళితే..
గిరిజనులే అధికం..
గుమ్లా జిల్లాలో 71శాతం గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 65శాతం కుటుంబాలు సాగు మీద జీవిస్తున్నాయి. 20శాతం మంది వ్యవసాయకార్మికులు ఉన్నారు. వీరి రోజూవారీ ఆహారంలో రైస్, ఏదో ఒక ఆకుకూరతో చేసిన కూర, పచ్చడి వేసుకుని తింటారు. ఎపుడో వారానికి ఒకసారి మాంసం తింటారు. పౌష్టికాహార లేమి వల్ల వీరిని రక్తహీనత వెన్నాడుతోంది. వీరు రక్తహీనత నుంచి బయటపడాలంటే మంచి ఆహారం అందించాలి. అందుకే అధికారులు ఆలోచించి గ్రామీణ మహిళలను స్వయం సంఘాలుగా సంఘటితం చేశారు. సేంద్రీయ సాగు చేసేలా చేశారు. అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దారు.
పట్టుదల ఉంటే చాలు..
ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవటం పెద్ద కష్టం కాదు. పట్టుదల ఉంటే చాలు అని నిరూపించారు ఈ గ్రామీణ మహిళలు. ఆవుపేడ, మూత్రం సేకరించి జీవామృతం,ఆకులు అలములను సేకరించి కషాయాలను స్వయంగా తయరుచేసి పంటలకు వాడతారు. ఇపుడు ఈ మహిళలు వరి, గోధుమ, మొక్కజొన్న, తృణధాన్యాలు, పప్పు్ధన్యాలు, వేరుశనగ, ఆవాలు, నూనెగింజలు, ముల్లంగి, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, పాలకూరతో పాటు ఎన్నోరకాల కూరగాయలు పండిస్తున్నారు. వ్యవసాయ భూములలోని మొక్కల వరుసల మధ్య ఆహారపంటలను సైతం పండిస్తున్నారు. తొలుత సేంద్రీయ పంటల విత్తనాలు సంపాదించి, ఆ తరువాత పూర్వ పంటల నుంచి సేకరించిన విత్తనాలను నేడు వినియోగిస్తున్నారు.
మహిళల భాగస్వామ్యమే అధికం..
ఇంటి పనులూ చక్కబెట్టుకుంటూ తెలియని విషయాలను వాళ్లనూ, వీళ్లనూ అడిగి తెలుసుకుంటూ ప్రకృతి వ్వవసాయ వౌలిక భావనలపై అవగాహన, అనుభవం సంపాదించారు ఇక్కడ మహిళలు. బెట్టను తట్టుకొని, తక్కువ నీటితో సాగు చేస్తున్నారు.
45 గ్రామాలలో శ్రమైక జీవన సౌందర్యం..
జిల్లాలోని తొమ్మిది పంచాయితీలలో 47 గ్రామాలలో సేంద్రీయ సాగు పెద్ద ఎత్తున మహిళలు చేపట్టారు. భూములు లేని దాదాపు 600 గృహాలలోనూ ప్రకృతి పంటలను సాగుచేస్తున్నారు. పంటలు సాగుచేయటానికి స్థలాలు లేనివారు పరస్పర అంగీకారంతో వారి ఇంటికి కావల్సిన పంటలను స్థలాలు ఉన్నవారి వద్ద పండించుకుంటారు. ఇలా ఇక్కడ శ్రమైక జీవన సౌందర్యం వెల్లివిరుస్తోంది. ఈ పంటల సాగులో 70శాతం మంది మహిళలు పాల్గొంటున్నారు. వీరు రోజుకి కేవలం రెండు గంటల సమయం మాత్రమే పంటల కోసం వెచ్చిస్తారు. మిగిలిన సమయం తమ రోజూవారీ పనుల్లో నిమగ్నమవుతారు. సేంద్రీయ పంటల సాగు అవసరమైన విత్తనాలు సైతం మహిళలే సరఫరా చేస్తుంటారు.
వైవిధ్యమైన పంటల సాగు..
తొలి ఏడాది సరిగా పంటలు చేతికి రాకపోయిన మహిళలు నిరుత్సాహపడలేదు. ఇపుడు సంవత్సరం మొత్తంమీద మూడు రకాలైన చిక్కుళ్లు, ఆకు కూరలు, పండ్లు, తృణధాన్యాలు, దుంపకూరలు, ఏడు రకాలైన కాయగూరలు పండుతున్నాయి. ఇవన్నీ కూడా పోషక విలువలతో కూడుకున్నవే. వంద రూపాయలు ఖర్చు చేస్తే ఇంటికి కావల్సిన పంటలన్నీ పండుతున్నాయని మహిళలు చెబుతున్నారు.
మంచి ఆహారం తింటున్నాం..
నవాగర్ పంచాయతీలోని పత్రాతోలి గ్రామంలో 40 ఏళ్ల రీటాదేవికి ఇపుడు ఎంతో సంతోషంగా ఉంది. ఓరాన్ గిరిజన జాతికి చెందిన ఈమెకు ఎలాంటి భూమి లేదు. రోజూవారీ కూలీగా పనిచేసేది. రోజూ పని కోసం ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లేది. ఆ వచ్చే కూలీ డబ్బులతో సరైన పౌష్టికాహారమే తినేదికాదు. దీంతో కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడేవారు. పౌష్టికాహారం అనేది తమ కంచాల్లోకి వచ్చేది కాదని, కాని ఇపుడు మంచి ఆహారం తింటున్నాం. ధాన్యం, బంగాళాదుంపలు, పప్పులు, కూరగాయలు పండించుకుని తినటం వల్ల ఆరోగ్యదాయకమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించింది. సేంద్రీయ పంటలు సాగుచేసుకోవటం వల్ల తమ ఆదాయం మూడు వేల రూపాయల వరకు మిగులుతుందని వెల్లడించింది.
సుస్థిర సేధ్యమే జీవనంగా మలచుకున్న గుమ్లా జిల్లాలోని మహిళలు ఇపుడు ఆ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ కుటుంబాలతో ప్రజల సైతం.. తమ వంతు బాధ్యతగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకోవాల్సిన ఆవశ్యకతను ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు. అన్ని రకాల పంటలను పండించుకుని తింటూ.. ఆరోగ్యంగా ఉంటున్న ఈ గ్రామీణ మహిళలు చైత్యన దీపాలు.