మెయిన్ ఫీచర్

అభినయ తపస్విని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన తెలుగువారి తలమానికం కూచిపూడి నృత్యం. జీవగంగలా ఈ నృత్యం సాగుతూనే వుంది. కూచిపూడివల్ల భక్తి, రక్తి, ముక్తి అన్నీ చూచేవారికి, చేసేవారికి లభిస్తాయి. కూచిపూడికి కోహినూర్ వజ్రం డా. అలేఖ్య పుంజాల. ఎన్నో దశాబ్దాలుగా ఈ కళకే అంకితమైన అత్యున్నత కళాకారిణి.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, డీన్, నృత్య శాఖాధిపతి, రిజిస్ట్రార్‌గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా ఎంతోమంది నర్తకీమణులను తీర్చిదిద్దిన గురువు. ఈ విధంగా రాబోయే తరాలకు ఒక దారి దీపం అయింది. నాట్యం ఓ యోగం వంటిదని వినమ్రంగా చెబుతారు.
మీ అభిరుచులు ఏమిటి?
జవాబు: నృత్యమే నా జీవితం. నృత్యానికే అంకితం అయ్యాను. అదికాకుండా సంగీతం, చెట్లు పెంచడం, పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం.

మీరు జీవితంలో బాగా గుర్తుపెట్టుకున్న ప్రదర్శనలు ఏవి?
జవాబు: అన్ని ప్రదర్శనలు మనస్సుకు హత్తుకుపోయినవే! ప్రతి ఒక్కటీ గుర్తుకు ఉండిపోయినవే! అయితే నా మొదటి ప్రదర్శన అరంగేట్రం చాలా ప్రియమైనది. రాష్టప్రతి భవన్‌లో, అప్పటి రాష్టప్రతి వెంకట్రామన్ వద్ద ప్రదర్శన, రాష్టప్రతి నారాయణన్ హైదరాబాద్ వచ్చినపుడు చేశాను. అదీ ఎంతో ప్రియమైనది. భద్రాచలంలో తెప్పోత్సవం, ఖజురహో, కోణార్క్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడం బాగా గుర్తుండిపోయింది.

విదేశాలలో పొందిన అనుభవాలు
జవాబు:ఎన్నో దేశ విదేశాలు పర్యటించి నృత్య ప్రదర్శనలిచ్చాను. కాని 1997 గల్ఫ్ దేశాలకు వెళ్ళాను. అక్కడ ప్రదర్శనలో నటరాజును దీపారాధన చేయకూడదు. కాని నా సాత్త్వికాభినయాన్ని ఎంతో అభినందించారు. మత వర్ణ వర్గ దేశ భాషలను అధిగమించాను. మనసుకు సంతోషంగా అనిపించింది.

నృత్యంలో మీరు అడ్డంకులు ఏవైనా ఎదుర్కొన్నారా?
ఒక స్ర్తికి ఏ రంగంలో అయినా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. నృత్యంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. పెళ్లికి ముందు వేరు, పెళ్లికి తర్వాత బాధ్యతలు ఎక్కువ. పిల్లలు పుట్టాక మానసిక, శారీరక శక్తి మారిపోతుంది. అవన్నీ అధిగమించి నృత్యం చేశాను.

నృత్యంలో ఎవరు సహాయం చేశారు?
జవాబు: నా గురువు డా ఉమా రామారావునాకు చీకటినుండి వెలుగును చూపించారు. ఆవిడ భర్త రామారావు కూడా నాకు తండ్రి వంటివారే! ఎంతైనా మా అమ్మ నాకు తొలి గురువు. ఆవిడ నాకు వెన్నుముకలా ఎప్పుడూ ఉండేది. ఈ విధంగా అమ్మ వ్యక్తిగతంగా, నృత్యపరంగా నా గురువు. ఉమారామారావుగారు ఎంతో సహాయం చేశారు.

వర్తమానంలో టీవీ, సినిమా బాగా ప్రభావం చూపిస్తున్నాయి. మరి మన సంప్రదాయ కళలకు పేరు ఎలా వస్తుంది?
జవాబు:అది ఒక బాధాకరమైన విషయం. పసివాళ్ళకు, యువతపై సినిమా ప్రభావం చాలా ఉంది. అలాగే పాశ్చాత్య కళల ప్రభావం కూడా ఉంది. అందుకే మీడియా కూడా బాధ్యత తీసుకొని పిల్లలకి సహాయం, చేయూతని ఇవ్వాలి. వారికి అవగాహన పెరిగితే, అభిరుచి పెరిగి మన కళల విలువ తెలుస్తుంది.

అవార్డులు తెచ్చుకోవడంలో కొంతమందికే దొరుకుతుంది. ఆర్థిక స్థోమత, రాజకీయ పలుకుబడి సహాయపడుతుంది అని కొందరు అంటారు. మరి మీరు ఏమంటారు?
జవాబు:కొంతవరకు నిజం. అది మారాలి. ప్రతిభని గుర్తించాలి. ప్రతిసారి అవకాశం రాకపోయినా, ప్రతిభకు ప్రాధాన్యత వుండాలి. రాజకీయాలకు ఇందులో చోటు ఉండకూడదు. అప్పుడే ఇచ్చేవాడికి, పుచ్చుకునేవాడికి విలువ వుంటుంది. వ్యవస్థ ఒక అవస్థగా మారకూడదు.

కళాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జవాబు:ప్రతిభ ఉంటే దాన్ని బాగా పైకి తెచ్చుకోవాలి. అడ్డదారులు తీసుకోకుండా కష్టపడి పైకి రావాలి. అలా కళాకారుడిగా, ఒక ఉన్నత మనిషిగా అవ్వాలి. నాట్యం అంటే ఒక యోగం, యాగము.
అవార్డులు: 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది విశిష్ట పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2003లో హంస పురస్కారం, 2009లో ప్రతిభ రాజీవ్ పురస్కారం, 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డు, ఇలా అసంఖ్యాకమైన గౌరవాలు లభించాయి.
విదేశాలలో ప్రదర్శనలు: వేల ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో విదేశాలలో మన కీర్తి పతాకను ఎగురవేశారు. యుకె, అమెరికా, సిరియా, అబుదాబి, దుబాయి, మస్కట్, ఖతర్, లెబనాన్, బెహరిన్, సిప్రస్, పోలాండ్, టర్కీ, బల్గేరియా, మారిషస్, మొదలగు ఎన్నో విదేశాలలో ప్రదర్శనలిచ్చి నృత్యానికి ఎంతో సేవ చేశారు.
డాన్స్ ఫెస్టివల్స్: ఎంతో ప్రతిష్ఠాత్మకమైన హరిదాస్ సమారోహ్, కాళిదాస్ మహోత్సవ్, సూర్య ఫెస్టివల్, ఖజురహో, నిషాగంధి, నాట్యాంజలి, సిద్ధేంద్రయోగి, పరంగత్, కళాక్షేత్ర, నృత్య సమ్మేళన్, మారిషస్ ఉత్సవ్, విశ్వరూప ఇలా ఎన్నో ప్రముఖమైన ఫెస్టివల్స్‌లో నృత్యం చేశారు.
నాయిక: అలమేలుమంగ, గౌరి, పార్వతి, లకుమ, మందాకిని, దుర్గ, శశిరేఖ, ఆండాళ్, ద్రౌపది, రాధ, అష్టవిధ నాయిక అవస్థలు, రుద్రమదేవి- ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోశారు.
ఎన్నో బాధ్యతలు : ఒక తల్లిగా, గృహిణిగా, గురువుగా, నర్తకిగా, పరిశోధకురాలిగా, రచయిత్రిగా, విశ్వవిద్యాలయం డీన్, నృత్యశాఖాధిపతి, ప్రొఫెసర్‌గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు ఈవిడ మార్గదర్శకత్వంలో ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలు పొందారు. ఎంతోమంది కళాకారులకు డా. అలేఖ్య పుంజాల దారిదీపం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి