మెయిన్ ఫీచర్

స్వతంత్రంగా.. సాధికార దిశగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుంది’ అనేది నానుడి. కానీ నేడు ప్రతి మహిళ అధికారం వెనుక పురుషుడి పెత్తనం ప్రస్ఫుటిస్తోంది. మహిళా సాధికారత పురుషుడికి వరంగా మారింది. ‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, స్వతంత్రంగా ఎదగాలి, నిర్ణయాత్మకంగా తయారుకావాలి’.. అంటూనే మహిళల రాజ్యాంగబద్ధ పదవులను అడ్డం పెట్టుకుని పురుషులే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మహిళల నిర్వహణ సామర్థ్యం మరుగున పడుతోంది. సాధికారత కోసం మహిళలే ఉద్యమించాలి. ఇందుకు పార్టీలు అడ్డుగోడలు కాకూడదు. మొన్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన మహిళా సాధికార సదస్సుల్లో ఒక్క మహిళకీ ప్రాధాన్యమివ్వకుండా పురుషాధిక్యాన్ని చాటుకున్నారు. ‘ఆమె ఉద్యమిస్తే.. మేమెందుకు ఊతమివ్వాలి?’ అనే భావనను స్ర్తిలు కూడా విడనాడాలి. ఐక్యంగా ఉంటేనే సాధికారత సాధ్యం.

సత్తాచాటారు..

మహిళా సాధికారత కోసం ఉద్యమించాలి. అది అవసరం కూడా. సాధికారత సాధ్యమవకముందే కుల, మత, వర్గ, రాజకీయ, తదితర తారతమ్యాలతో ఐక్యతను మరచి కొట్లాడటం అవివేకం. సాధికారత సాధించాక దాన్ని మహిళలంతా ఆస్వాదించడం వివేకం. వ్యవహార దక్షత, నిర్వహణా సామర్ధ్యపు సత్తా కలిగిన ఇందిరా గాంధీ, మమతా బెనర్జీ, జయలలిత వంటి నేతలను ఆదర్శంగా తీసుకోవాలి. మహిళా సాధికారతతోనే మహిళకు అన్నిరకాల భద్రతలూ సాధ్యమవుతాయి. వేద కాలంలోనే మహిళలకు ప్రముఖ స్థానం ఉండేదట. ఆరోజుల్లోనే గార్గి, కాత్యాయని లాంటి విద్యావేత్తలు ఉన్నారు. రానురాను పురుషాధికార వ్యవస్థ మహిళను వంటింటి కుందేలుగా మార్చింది. వారి చదువులను చాకలి పద్దులకు పరిమితం చేసింది. బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి మూఢాచారాలతో మహిళలకు అణచివేసింది. దీంతో మహిళల జీవితం పురుషుల చేతిలో ఆటబొమ్మగా మారింది. ఆ కాలంలోనే రాణి దుర్గావతి, రజియా సుల్తానా, జిజియాబాయి, మీరాబాయి వంటివారు ఎన్నో సమస్యల్ని సమర్ధంగా ఎదుర్కొన్నారు. సమస్యల్ని శక్తిమంతంగా, ధైర్యంగా, సొంతంగా పరిష్కరించుకున్నారు. సాంఘిక దురాచారాలకి బ్రిటీష్ కాలంలోనే రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతీరావు పూలే వంటి సంఘ సంస్కర్తలు ఎదురొడ్డారు. మహిళల వెనుకబాటుతనానికి అవిద్యే కారణమంటూ.. తరువాతి కాలంలో ఆడపిల్లల్ని బాగా చదివించడం మొదలుపెట్టారు.

ఉద్యమ ధీర
సాధికారత కోసం జనాభాలో సగభాగానికి పైగా ఉన్న మహిళలు పురుషులను దేబిరించాల్సిన పని ఉండదు. ఉద్యమం ఉత్తుంగ తరంగంగా ఎగసినప్పుడు సాధికారత దానికదే సాధ్యమవుతుంది. ఇందుకు చక్కటి నిదర్శనమే నెల్లూరు జిల్లాకు చెందిన దూబగుంట రోశమ్మ. ఆమె నిరక్షరాస్యురాలే. అయినా ఆ నిరక్షరాస్యతనూ 70 ఏళ్ల వయసున్న ఆమె ఆత్మవిశ్వాసం జయించింది. ఫలితంగా నాడు ఆమె ఉద్యమంతో మద్యపాన నిషేధం సాధ్యమైంది. ప్రభుత్వానికి మద్యపానంపై ఎక్కువ ఆదాయం లభిస్తున్నా రోశమ్మ పోరాట పటిమకు పాలకులు తలొగ్గక తప్పలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఆమెలోని పోరాట పటిమ.

చదువు ఉంటే ఆత్మవిశ్వాసం మెండుగా లభిస్తుంది. విజ్ఞానం వికసిస్తుంది. శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. స్ర్తిల సర్వతోముఖాభివృద్ధికి విద్య దోహదపడుతుంది. విద్యావంతులు కావడానికీ భారతీయ మహిళలు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. మొదట్లో చాకలి పద్దు చదువు చాలని అనుకునేవారు. ఏడో తరగతి, తరువాత పదో తరగతితో ఫుల్‌స్టాప్ పెట్టేవారు. ఆ మెట్లన్నీ దాటుకుని నేడు మహిళలు ఉన్నత విద్య చదవి డాక్టరేట్లు కూడా పొందుతున్నారు. చదువుకున్న మహిళలు ఉద్యోగావకాశాల్లోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘ది యాక్ట్ ఆఫ్ 1935 ఇండియా’ ఏకంగా కొన్ని సర్వీసులకి అనర్హులుగా మహిళలపై నిషేధం విధించింది. ఇండియన్ సివిల్ సర్వీస్, మెడికల్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఆడిట్ అండ్ అకౌంట్, రైల్వే అండ్ ఏవియేషన్ రంగాల్లో మహిళలకు తలుపులు మూసేసింది. అలాంటిది నేడు ఈ శాఖలన్నింటిలోనూ మహిళలు ప్రవేశించి తమదైన పనితీరుతో ఉన్నతాధికారులుగా రాణిస్తున్నారు. తమ సత్తా చాటుతున్నారు. సవాళ్లను ఎదురొడ్డి గెలుస్తున్నారు. రైళ్లు, విమానాలు నడుపుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో తొలి మెట్రో రైలు నడిపింది కూడా మహిళే. వ్యోమగామి కల్పనా చావ్లాకి జాతి మొత్తం శాల్యూట్ చేయాల్సిందే.
ఇక ప్రైవేట్ రంగంలోనూ మహిళలు ఉద్యోగులుగా అనేక సవాళ్లను అధిగమించారు. నైపుణ్యం అవసరం లేని ప్రాంతాల్లోనే మహిళలు కనిపించేవారు. అదీ మగవారితో సమానంగా వేతనం ఉండేదికాదు. అక్కడా తమ హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకున్నారు. ఇప్పుడు మహిళలు నైపుణ్యం అవసరమైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. న్యాయ, వైద్య, పరిపాలనా రంగాల్లోనూ తమ సేవలను విస్తరించారు. మిలిటరీ అధికారులుగానూ దేశానికి సేవలందిస్తున్నారు. రాజకీయాల్లో 40 శాతం కంటే ఎక్కువ సీట్లలో మహిళలు గెలిచారు. చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత పదవులు సాధిస్తున్నా.. గ్రామాల్లో సామాజికంగా కొన్నిచోట్ల మహిళలు వెనుకబడే ఉంటున్నారు. దేశంలో 18 ఏళ్లలోపు వివాహమైన మహిళలు 26.8 శాతం ఉన్నారు. బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. 40 శాతం బాలికలకి మైనార్టీ తీరకముందే పెళ్లి చేసేస్తున్నారు. బీహార్ 39 శాతం, జార్ఖండ్ 38 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. 7.6 శాతంతో పంజాబ్, కేరళ చివరి స్థానంలో ఉన్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, పోరాటాలు చేసి వరకట్న నిషేధ చట్టం సాధించినా అది కాగితాలకే పరిమితమయింది. మహిళా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రపంచ వ్యాప్తంగా కృషి జరుగుతూనే ఉంది. మన దేశంలో జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది. భారత రాజ్యాంగం స్ర్తిలకి సమాన హక్కులు ఇవ్వడమేగాక, వారికి అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కులు కల్పించింది.
సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ హక్కుల్ని ఉపయోగించుకోవచ్చు. 2012ని ప్రపంచ మహిళా సాధికార దినోత్సవంగా ప్రకటించగా మన ప్రభుత్వం 2001నే మహిళా సాధికార సంవత్సరంగా ప్రకటించింది. ఆ సంవత్సరం మహిళల అభ్యున్నతికి ప్రతినెలా ఒక ప్రత్యేక కార్యక్రమంగా మహిళా హక్కులు, మహిళల ఆర్థిక సాధికారత, సాంఘిక సాధికారత వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రాల్లోనూ మహిళా చైతన్య శిబిరాలు నిర్వహించారు. 2001 నవంబర్‌లోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సహకారంతో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీట్ ఢిల్లీలో జరిగింది.
మొన్నటికి మొన్న నవంబర్‌లో హైదరాబాద్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గ్లోబల్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. 150 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ‘కొందరు’ మహిళల శక్తిసామర్థ్యాలు ప్రస్ఫుటించిన ‘అద్వితీయ’ వేదిక అది. ఈ సదస్సులో 52 శాతం మంది మహిళలు పాల్గొనడం గర్వకారణమని అమెరికా అధ్యక్షుడి కూతురు, శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్ ప్రశంసించారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకి వస్తున్న యువతకి ఆమె స్వాగతం పలుకుతూ.. ‘కాంక్ష వీడకుండా నిరంతరం పనిచేయాల’ని సూచించారు. ఇక్కడ మహిళలు వ్యాపార రంగంలోకి రాలేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయని గమనించాలి. డిగ్రీ, వృత్తి శిక్షణలో సరైన మార్గదర్శక గురువు లేకపోడం, తల్లిదండ్రుల నుంచి సహకారం లేక, సామాజిక అవరోధాలు, రిస్క్ తీసుకోలేకపోడం, పెట్టుబడి సమకూర్చుకోలేక... ఇలా అనేక కారణాలున్నాయి.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు కూడా ఎన్నో అవకాశాలు, మరెన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాయి. అయితే వాటిని అందుకోగలిగిన ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలి. తమ కౌశల్యాన్ని, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. విజయాలు సాధించాలి. ఎన్ని సభలు, సమావేశాలు, సదస్సులు జరిగినా అవి అప్పటికే అంతోఇంతో ఎదుగుదల ఉండి వృద్ధి సాధించినవారికే ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు, ఇంత చెప్పుకున్నా, ఇన్ని చట్టాలున్నా లింగ వివక్షలో 144 దేశాల్లో మన దేశం 136వ స్థానంలో ఉంది. స్ర్తి, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడంలో 139వ స్థానంలో ఉంది. రాజకీయ సాధికారతలో మాత్రం 15వ స్థానంలో ఉంది. ఇక్కడే అసలు ‘రాజకీయం’ దాగుంది. రిజర్వేషిన్లు.. గట్రా అంటూ భార్యల పేరున భర్తలు పెత్తనం చలాయించటం పరిపాటిగా మారింది. అదే.. ఆ వ్యవస్థే మారాలి. సాధికారత సాధ్యమవాలంటే మహిళలు ఆలంబన కోసం ఎదురుచూడకూడదు. వారిలో మార్పు రావాలి. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగాలి.

- జోస్యుల మల్లేశ్వరి