మెయిన్ ఫీచర్

ఇదే ప్రేమ.. నేర్చుకోవలసిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాటి పిల్లల్లో చాలామందికి వాళ్ళ నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ ఎంత రుచిగా వుంటుందో తెలియకపోవచ్చునేమో కానీ నాకు మాత్రం అట్టి అదృష్టం లభించినందుకు గర్వపడకుండా ఉండలేకపోతున్నాను.
ఇపుడు మా తాతయ్యకు 95 ఏళ్ళు, నాన్నమ్మకు 90 ఏళ్ళు, ఇద్దరి జీవితాలూ ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంతోనే గడపడం చెప్పుకోతగిన విషయం. అయితే గత ఐదేళ్లుగా వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చిందనే చెప్పాలి.
తాతయ్య చూపు మందగించింది. శరీరం బలహీనపడింది. ఎక్కువసేపు మంచంమీద పడుకొనే ఉంటాడు. కొద్దిసేపు మాత్రం మంచం దిగి అటూ ఇటూ నడుస్తూ కాలం గడుపుతాడు. ఇటీవలికాలంలో శరీరంలోని అంగాలు వశం తప్పడంవల్ల మంచంమీద పడుకొని ఉండగానే మూత్రవిసర్జన జరిగిపోతున్నది. ఒక్కొక్కప్పుడు ఒళ్ళు నొప్పులు పుట్టి మెల్లగా మూలుగుతుంటాడు. నాన్నమ్మ ఆరోగ్యం కొంత నయం. అందువల్ల అప్పుడప్పుడు విసుక్కొంటూ తాతయ్యకు సేవ చేస్తూనే ఉంటుంది.
తాతయ్య, నాన్నమ్మ దాదాపు 75 ఏళ్లుగా భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారు. వాళ్ళమధ్య అనుబంధం ఎంత గట్టిదో వాళ్ళను ప్రత్యక్షంగా చూసిన వారికే తెలుస్తుంది. జీవితంలో ‘సరసం’తోపాటు విరసం కూడా కలగల్పుగా ఉండడం అనివార్యం.
ఇద్దరు వ్యక్తులమధ్య ‘ప్రేమకు’ నిదర్శనం సరసం. కానీ వారి వ్యక్తిత్వాల పట్ల విపరీత ధోరణికి అహంభావానికీ చిహ్నం విరసం.
వాళ్ళిద్దరూ తరచుగా ఏదో ఒక శంకతో ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకొంటూనే ఉంటారు. మళ్లీ అంతలోనే కలిసిపోతూ పరస్పరం సేవలు చేసుకొంటూనే కానవస్తారు. అందుకు కారణం వాళ్ళు వేర్వేరు జీవన స్థాయిలలో పుట్టి, తమ వివాహ పూర్వ జీవనాలను గడిపి ఉండటం అని మనం అర్థం చేసుకోవచ్చు.
నాన్నమ్మ ఒక భూస్వామికి ఏకైక ముద్దుబిడ్డ. తాతయ్య పల్లెటూర్లో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. వాళ్లిద్దరికీ ఎలా జత కుదిరిందో! అది దేవుడు రాసిన రాత అనే చెప్పాలి. తాతయ్య బాగా చదువుకొని మంచి మార్కులతో పరీక్షలు పాసై ఇరవై ఎనిమిదేళ్ళకి ఇన్‌కమ్‌టాక్స్ ఉన్నతాధికారి అయ్యాడు.
నాన్నమ్మ తండ్రి ఒకసారి ఇన్‌కమ్‌టాక్స్ అధికారిగా ఉన్న తాతయ్యను చూడడం జరిగింది. అంతే, ఇతడే తన అల్లుడు అనుకున్నాడు. వెంటనే అతణ్ణి ఒప్పించి పెళ్లి ముహూర్తం పెట్టించి నాన్నమ్మను ఇచ్చి పెళ్లిచేశాడు.
కాని ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువాయే’ అన్నట్లుగా నాన్నమ్మ మాత్రం తాతయ్య పల్లెటూరి జీవితాన్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకుంటూ, పట్టణంలో పెరిగిన తన ముందు నిలబడే అధికారం లేనివాడుగా భావిస్తూ అతడ్ని చిన్నచూపు చూస్తూ ఏవేవో చురకల వేస్తూనే వుంటుంది. తాతయ్య కూడా తక్కువవాడేం కాదు. నాయనమ్మ తన వాదనల్లో వాడే ఇంగ్లీషు పదాలు ఎలా ఎంతటి తప్పుల తడకలో ఆమెకు వివరించి చెబుతూ ఆమెను ఏడిపిస్తూ ఉండేవాడు. ఇందుకు కొన్ని ఉదాహరణలుగా- ‘మా నాన్న నన్ను ఈ పల్లెటూరు మొద్దుకు ఇచ్చి నా గొంతు కోశాడు’ అని నాయనమ్మ రుసరుసలాడింది.
‘హిందీ సినిమాలు చూసి చూసి ఈ మహారాణికి కాళ్ళు భూమిమీద నిలవడం లేదు. నేల విడిచి సాము చేస్తే నడుం పుటుక్కున విరుగుతుంది’ అని తాతయ్య విమర్శించేవాడు.
ఈయనగారు తన కుటుంబం ఎంత పెద్దదో చెప్పుకుంటూ గర్వపడతాడు. కాని ఎంత పేదదో తెలుసుకోలేక గోతిలో పడతాడు అంటుంది నాన్నమ్మ.
‘ఈవిడగారికి మొగుడితో పనే లేదు. ఫోన్‌కు అతుక్కొనిపోయి వాళ్లకీ వీళ్ళకీ ఫోన్లు చేస్తూ అహోరాత్రులు గడిపేస్తుంది’ అని తాతయ్య విమర్శ.
ఇలా తరచుగా తాతయ్య- నాన్నమ్మ మధ్య ‘విరసం’ రాజ్యం ఏలుతున్నా ఎపుడెపుడు ‘సరసానికి’ ఎలా చోటు దొరికిందో, దానికి రుజువుగా అరడజనుమంది పిల్లల్ని వాళ్ళు ఎలా కనిపెంచారో తలచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది.
కాని తాతయ్య పరిస్థితి ఇపుడు కొంత ఆందోళన కలిగిస్తున్నది. మంచంలో పడుకున్నపుడే శరీరం పట్టు తప్పి, మూత్రం పోసేసి పక్క తడిపివేస్తున్నాడు. అపుడపుడు నాయనమ్మ ఆ వయసులో కూడా భార్యగా తన విధిని మరిచిపోవడం లేదు.
తాతయ్య అశక్తత్వాన్ని గురించి విసుక్కుంటూనే ఆ తడిసిపోయిన పక్క బట్టలు తొలగించి పొడి బట్టలు వేసే ప్రయత్నం అంతా చేస్తూనే అవసర సేవలు అన్నీ చేస్తున్నది. ‘్భర్తకు సేవ చేయడమే భార్య విధి’ అని నిర్థారిస్తున్నట్లుగా, తరచు ఇద్దరూ తమ మధ్య ఉన్న చనువును బట్టి తమ తమ గొప్పలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు విమర్శించుకొంటూనే ఉంటారు.
కాని వారిద్దరిమధ్య విరోధం లేదు. ఇద్దరికీ మధ్య ఉన్నది ‘విడదీయరాని ప్రేమ’ విపరీతమైన ఇష్టమే. ఆది ఆశ్చర్యకారకమైన విషయం. ఇందుకు ఉదాహరణగా సర్వసాధరాణమైన ఒక సందర్భానే్న పేర్కొనవచ్చు.
ఒకరోజు ఉదయం నాన్నమ్మ నన్ను పిలిచి ‘ఒరేయ్ బుజ్జీ! ఈ టేప్ రికార్డర్ వాల్యూం పెంచి వెళ్లరా’ అంది. అది విన్న తాతయ్య తన పళ్ళు పట పట కొరుక్కొంటూ గదిలోంచి బయటకి వెళ్లిపోయాడు.
కాని అలా వెళ్ళేప్పుడు ఏం చేసాడో తెలుసా! బయటనుంచి సూర్యుని వేడి కిరణాలు లోపల మంచంమీద పడుకొని ఉన్న నానమ్మపైన పడి ఆమెను బాధించే వీలు లేకుండా కర్టెన్‌ను అడ్డంగా లాగి వెళ్లాడు.
ఆ క్షణంలో తాతయ్య ఆమెమీద చూపిన ప్రేమ ఆమెలో ఎట్టి అద్భుత ప్రభావాన్ని కలిగించిందో తెలుసా!
‘ఒరేయ్ బుజ్జీ! వచ్చేవారం తాతయ్య పుట్టినరోజు పండగ జరుపడానికి ఏం ఏర్పాట్లు చేస్తున్నార్రా!’ అని పిలిచి అడిగేవరకు- ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి.
‘ఈ తాతయ్య, నాన్నమ్మ’లమధ్య ప్రేమకు నిర్వచనం ఎలా చెప్పాలి? అని ఈ ప్రశ్నకు దాదాపుగా అందరినుండే లభించే జవాబు ఒక్కటే-
ఈ ‘ప్రేమ’ అనిర్వచనయం, అద్వితీయం, అనంతం, అవిభాజ్యం అని!

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి