మనలో - మనం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పాక్‌లో భారత పతాకం ఎగురవేసిన వానికి 10 ఏళ్లు కఠిన శిక్ష విధించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాక్‌కు జైకొట్టి పాక్ జెండా ఎగురవేసిన వారిని భారత్ శిక్షించలేదేం?
మనది అసమర్థ సజ్జనత్వం. అందుకే అందరికీ అలుసయ్యాం.

బి.ఆర్.సి.మూర్తి, సూర్యారావుపేట
పోస్టల్ శాఖ అంబేద్కర్ జయంతికి పోస్ట్ఫాసులు మూసేసి, పర్వదినమైన
శ్రీరామనవమికి తెరవడం బాగా ఉందా?
అడిగేవారు లేకపోతే అంతే...

డి.వెంకట్రావు, ఉయ్యూరు
ఒక రైతుకు రుణమాఫీ చేయటానికి చేతులు రాని బ్యాంకులు కార్పొరేట్ వ్యక్తులు/ సంస్థలకిచ్చిన లక్షల కోట్ల రూపాయల మొండి బాకీలు రద్దు చేస్తాయి. మోదీగారు ప్రధాని అయితే వంద రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తాను అని అన్నారు. అటు మెతకతనం, ఇటు ఉదాసీనం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే సోమాలియా సరసన భారత్ చేరుతుందేమో?!
ఇప్పుడే కాదు.

బావన సీతారాం మందసా, కమలాపురం
పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినపుడు ఆ రాజధానిలో వచ్చే ఆదాయంలో వాటా ఈ పదేళ్లయినా అడగలేరా?
అడగలేరు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
బిజెపి మద్దతు మూలంగానే విభజన జరిగింది కనుక, ఎ.పి.కి కొత్త రాజధాని నిర్మాణ ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. విభజనను సపోర్ట్ చేసిన పార్టీయే కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టి కూడా రాజధాని నిర్మాణానికి డబ్బు ఇవ్వడం లేదేమి? బాబుగారు ఎ.పి.లో ప్రతిపక్ష నేతను వెటకారం చేయడంలో దిట్టగానీ, ప్రధానమంత్రిని డిమాండ్ చేయలేరా?
ఆయన ప్రతాపం అంతే...

వి.వి.వి.సత్యనారాయణ, ముంబయి
బొంబాయి లాంటి ప్రాంతాలకు బదిలీ అయిన మాకు మీ ఆంధ్రభూమి పత్రిక లభ్యం కానందున తెలుగు సాహిత్యానికి సంబంధించిన రచనలను చదవలేక పోతున్నాము. ఇంటర్నెట్ ఎడిషన్ ఉన్నను అది చదువుటకు వీలుగా ఉండడం లేదు. వారంలో సాహిత్యమునకు సంబంధించి అనుబంధం (సప్లిమెంట్స్)లను - ‘సాహితి’ మరియు ‘అక్షర’లను పోస్టు ద్వారా లభ్యమయ్యేటట్లు చేయగలరు.
మిగతా పత్రికల కంటే మాది వెల చాలా తక్కువ. మిగతా రోజుల్లో కూడా పత్రిక తీసుకోవచ్చు కదా? వారానికి రెండు రోజులు మాత్రమే బట్వాడా అంటే కొన్ని సమస్యలున్నాయి.

జి.ఎం.రావు, పాలకొల్లు
ట్రాయ్, గ్లాడియేటర్, ఇంకా మరికొన్ని ఇంగ్లీషు సినిమాల్ని మిక్స్ చేసి తీసిన మన ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. సార్... మనం సిగ్గుపడాలా? గర్వపడాలా?
మనం గర్వపడాలి. అవార్డును ఇచ్చిన వారు సిగ్గుపడాలి.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఉగాది పండుగనాడు చంద్రబాబు నాయుడుగారు ఆధ్యాత్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గార్ని నియమించి, వారిని సన్మానించారు సభాముఖంగా. బాగుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ, ఎన్నో టీవీ ఛానెల్స్‌లోనూ, సభలలోనూ ప్రవచనాలు అద్భుతంగా ఆసక్తికరంగా వినిపించే శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఎ.పి. ప్రభుత్వానికి ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడానికి, వాటిని నిర్వహించడానికి టైము, ఖాళీ ఉంటుందా?
అది నియమించిన వారు, నియమించబడ్డ వారు చూసుకోవలసిన విషయం. ఆ సలహాలు ఈ కాలపు సమాజానికి పనికొస్తే మంచిదే.

భాస్కర్ కిల్లి, హైదరాబాద్
ఈ మధ్య వెబ్‌సైట్స్‌కి ఆర్టికల్స్ రాసే ఒక రచయిత కాశ్మీర్ గురించి రాస్తూ, పటేల్ అన్ని రాజ్యాలను భారత్‌లో కలపాలనుకున్నాడు గాని కాశ్మీర్‌ని కాదని.. నెహ్రూ మాత్రమే దానిని భారత్‌లో కలపాలనుకున్నాడని.. అక్కడ హిందూ రాజు ఉన్నా చెడ్డవాడని.. ముస్లిం ప్రజలు తాము భారత్‌లో కలవడానికి సిద్ధపడలేదని.. అందుకే షేక్ అబ్దుల్లా మాట ఇచ్చాడు గనుక నెహ్రూ అతనిని ముఖ్యమంత్రిని చేసి భారత్‌లో కలిపాడని.. భారత్‌కి ప్లెబిసైట్ నిర్వహించే దమ్ము లేదు. ఎందుకంటే భారత్‌కి వ్యతిరేకంగా కాశ్మీరీలు వోటు వేస్తారని అంటూ రాశారు. ఆయన కొంచెం పేరున్న రచయిత. నిజమే అంటారా?
కొంత నిజం.. చాలా వరకు అబద్ధం.

ఆచంట వీరేష్‌కుమార్, పెనుగొండ, ప.గో.జిల్లా
‘అందం కొరుక్కు తింటామా? మంచి మనసు ముఖ్యం’ అంటుంటారు. అందంగా వుండే వారికి మంచి మనసు ఉండదా? అందంగా లేనివారందరూ మంచి మనసుతోనే ఉంటున్నారా? అందం, మంచి మనసు, డబ్బు, తెలివి ఉన్నవారు ఎవరి నీతులూ పాటించాల్సిన అవసరం లేదు. అవునా?
అవి ఉన్నాయో లేవో ఎదుటివారు చెప్పాలి.

‘పెద్దవాళ్లు లేనపుడే వాళ్ల విలువలు తెలుస్తాయి అంటుంటారు. పెద్దవాళ్లందరూ మంచివాళ్లేనా? వారిలోనూ దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి ఎవరితోనూ విరోధం లేకుండా ప్రవర్తించే వారికి పెద్దవాళ్ల విలువలు తెలియనవసరం లేదని’ నా అభిప్రాయం. అవునా? కాదా? చెప్పండి.
డబ్బే అంతా కాదు. కుటుంబం, సంప్రదాయం, ధర్మం, మానవత్వం వగైరాలు ఎన్నో ఉన్నాయి. వాటి విషయంలో పెద్దల విలువ అనుభవం మీద తెలుస్తుంది.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉద్యోగమే సరిపోతుంది. రచనలు చేయడానికి మీకు తీరిక ఎక్కడ దొరుకుతోందో చెప్పండి.
రాత్రి మిగిలే ఉంది కదా? *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com