మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఇటీవల రాష్ట్రంలో పట్టపగలు ప్రజలను దోచుకోవటం, బస్సులు, రైళ్లల్లో దోపిడీలు ఎక్కువ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ కోసం ప్రజలు ఆ భగవంతుని వేడుకొందామంటే, దేవాలయాల్లో సైతం ఆ భగవంతునికే రక్షణ లేకుండా విగ్రహాలు, నగలు దోచుకుంటుంటే, ఆ భగవంతుడు తన మొర ఎవరికి చెప్పాలి?
భగవంతుడి రక్షణ గురించి, ఆయన పెట్టుకోవలసిన మొరల గురించి మనం బాధ పడనక్కరలేదు. ఆలోచించాల్సింది దేవుడు అంటే కూడా భయం, భక్తి లేకుండా పోయిన మానవ రాకాసుల బారి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్నదే.

పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
భారత్‌లో వుండే ఒక చెప్పుల కంపెనీ తమ వ్యాపార అభివృద్ధికి చెప్పులపై భగత్‌సింగ్ ఫొటో ప్రింట్ చేసి అమ్మకానికి పెట్టారు - అని పేపరులో వార్తలు వచ్చాయి. దేశం గురించి ప్రాణాలు అర్పించిన మహానేతకు అవమానం కదా?!
గణేశుడు, లక్ష్మీదేవి వంటి పవిత్ర దేవతామూర్తుల బొమ్మలనే చెప్పుల మీద, డోర్ మాట్ల మీద ముద్రించి నిర్భయంగా అమ్ముకోగలిగిన వాళ్లకు భగత్‌సింగ్ ఓ లెక్కా?

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, శ్రీకాకుళం జిల్లా
మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎప్పుడూ వినని పేర్లతో వున్న దేశాలు సందర్శిస్తున్నారు. చాలామంది మంత్రులు కూడా ఏదో పేర్లు పెట్టుకొని విదేశీ యానాలు సామాన్యమై పోయాయి. వాళ్లు చేసే విదేశీయానాల ఖర్చుతో మన దేశంలో బీదరికమంతా మాన్పవచ్చును. వీనివల్ల మన దేశానికి ఏమైనా లాభం కలుగుతున్నదా?
మనకు తెలిసిన దేశాలకే వాళ్లు వెళ్లాలంటే ఎలా? ప్రధాని మోదీ చేసేవి విహార యాత్రలు కావు. వాటివల్ల ప్రయోజనం తప్పక ఉంది. పాజిటివ్ న్యూస్‌పై మీడియా దృష్టి పెట్టదు. కాబట్టి ఆ సంగతి మనకు తెలియదు.

మొండివాడు రాజుకన్న బలవంతుడు! ఇంత భారత ప్రభుత్వం విజయమాల్యాని ఏమీ చేయలేక పోతున్నది. ఆతడు విదేశాల్లో జల్సా చేసుకుంటూ వీళ్ల చాతకానితనానికి ఎంత నవ్వుకుంటున్నాడో?! ఇంతకూ 9 వేల కోట్లు కాదు ఒక కోటైనా వెనక్కి వస్తుందా?
వస్తే గొప్పే.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
యూనివర్సిటీల్లో ‘యోగా’ శాఖలు మంచిదేనా?
మంచిదే. యోగం గొప్ప శాస్త్రం. దాన్ని అధ్యయనం చేసి ముందుకు తీసుకువెళ్లడం విశ్వవిద్యాలయాల బాధ్యత.
మజ్లిస్ పార్టీని రాజకీయ పార్టీలు నిషేధించాలంటున్నాయి. సాధ్యమయ్యేనా?
కాదు.

శిరుగుప్ప కిరణ్‌కుమార్ శెట్టి, అనంతపురం
2019లో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అవుతారు. 2017లో జరిగే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం వస్తుందా?
కష్టపడితే మొదటిది కావచ్చు. రెండోది కొంచెం డౌటు.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, మద్రాస్
దిల్లీ విశ్వవిద్యాలయంలో కన్నయ్యకుమార్ ఖలీద్ చేసిన ప్రసంగాల సీడీలు, ఆడియో, వీడియోలు అసలైనవేనని హైదరాబాద్ లేబొరేటరీ నిర్ధారించింది కదా! వారి బెయిల్ రద్దు చేసే అవకాశం లేదా? ఇప్పటికి కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్‌జెడి వంటి పార్టీలు వారినే సమర్థించడం ఏమిటి?
ఆ పార్టీలు ఉన్నదే అలాంటి వారి కొమ్ముకాయడం కోసం. వాటిని నిలదీయాల్సింది మనం.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆరు దశాబ్దాల రంగస్థల సినీ జీవితం గడిపిన రమణమూర్తి మరణించినపుడు గాని, ఆ తరువాత గాని, సంతాప సభలు జరపలేదు. కనీసం పత్రికలో ఆయన మీద వ్యాసాలు కూడా రాయలేదు.
దేనికైనా పెట్టి పుట్టాలి. (సరైన సామాజిక వర్గంలో).

విదేశాల నుండి తెచ్చుకునే పెట్టుబడులు అప్పులా? వాటినెలా తీర్చగలరు.
అవి అప్పులు కావు.

ఎం.కనకదుర్గ, తెనాలి
కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్యాకేజీలు ప్రకటించడం, మంత్రి వర్గంలో ఆయా రాష్ట్రాలకు ప్రాముఖ్యత కల్పించడం వంటి చర్యలు తీసుకోవడంలో దేశంలో ఫెడరల్ వ్యవస్థకు ముప్పు కలగదా? కొన్ని రాష్ట్రాలను అందలం ఎక్కించుకోవడం, కొన్ని రాష్ట్రాలకు రిక్తహస్తం చూపించడం చెడు సంప్రదాయం అనిపిస్తోంది.
ఔను. రానున్న ఎన్నికల దృష్టితో కొన్ని రాష్ట్రాలకు కాబినెట్ విస్తరణలో మరీ పెద్ద వాటా ఇవ్వడం మంచిది కాదు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
మోదీగారు మాటిమాటికీ 60 ఏళ్ల కాంగ్రెసు దుష్టపాలన అనీ, బాబుగారు 10 సం.లు కాంగ్రెసు అస్తవ్యస్థ పాలన అనీ ప్రతి సభలో గంభీర ఉపన్యాసాలు ఇస్తారు కాంగ్రెసును నిందిస్తూ. వీరు ఇరువురూ నాన్ స్టాప్‌గా విదేశీ యాత్రలకు విమానాలు, ఎవరి పాలన మూలంగా అభివృద్ధి చెందాయి?
కాంగ్రెస్ హయాంలో. కాని కాంగ్రెస్ లేకున్నా ఆ అభివృద్ధి జరిగేదే.

మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
గత కృష్ణా పుష్కరాల సందర్భంగా మన ఆంధ్రభూమి ‘కృష్ణవేణి’ అని చక్కని అనుబంధాన్ని అందించారు. మరి ఈసారి కృష్ణా పుష్కరాలకి అటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే భూమి పాఠకులకు ముందుగా తెలియజేయండి. గత సంవత్సరం గోదావరి పుష్కరాల సందర్భంగా మీరు అందించిన పుష్కర గోదావరి అనుబంధం చాలా బాగుంది.
సంతోషం. ఈసారి అలాంటి ఆలోచన లేదు.

పి.రామకృష్ణ, రాజమండ్రి
ఉత్తరాంధ్రలో ఒక పోలీసు అధికారి ఒక రౌడీషీటర్‌తో మిలాఖత్ అయి కోట్లాది రూపాయలు సంపాదించాడట. చట్టాన్ని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలా భక్షకులైతే ఇంక ఈ దేశాన్ని రక్షించేదెవరు?
ఎక్కడో ఎవరో పెడదారి పట్టినందువల్ల దేశానికి వచ్చిన అరిష్టం ఏమీ లేదు. మన దేశాన్ని రక్షించేది అది నమ్ముకున్న ధర్మం.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com