మనలో - మనం

ఎడిటర్‌తో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశరావు, మర్రివాడ, కృష్ణాజిల్లా
మా దళితవాడ (మాలపల్లె)లో ఐదు చర్చిలున్నవి. ఐదుగురు పాస్టర్లున్నారు. పాస్టర్లతోసహా దళిత క్రైస్తవులందరిని రెవిన్యూ వారు ఓటరు లిస్టులో షె.కు.లుగా రాస్తున్నారు. వారిలో ఎవరికైనా ఎస్.సి. సర్ట్ఫికెట్ కావాలంటే పంచనామా ద్వారా మంజూరు చేస్తున్నారు. దళితులెవరో, దళిత క్రైస్తవులెవరో తెలియుట లేదు. ఒకవైపు దళిత క్రైస్తవులుగా జీవిస్తూ దళితులుగా ధృవీకరణ పత్రాలు తీసుకొని నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ప్రార్థనా మందిరాలలో హిందువులను ద్వేషిస్తూ ప్రసంగిస్తారు. రాజకీయ అవసరాల దృష్ట్యా దళితులమంటారు. ఎంతకాలమిలా ద్విపాత్రాభినయం చేస్తారు?
అసలైన దళితులకు ఓపిక నశించనంతవరకూ! వారిలో మతాభిమానం ప్రజ్వరిల్లనంతవరకూ!

సమస్యకు తగు పరిష్కారం చూపించండి.
పరిష్కారం దళిత సమాజంలోనుంచే రావాలి. వస్తుంది.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా
నేడు నోట్ల రద్దు సంక్షోభ వలయంలో ప్రజలు అగచాట్లకు గురియై సామాన్య ప్రజానీకం నిత్యావసర వస్తువులు కొనుగోలుకు చిల్లర నోట్లు లేక పిల్లలతో పస్తులుండే ఈ సమయంలో ఓ ప్రబుద్ధుడు కోట్ల వ్యయంతో, వివాహ కార్యక్రమం ఎలా చేపట్టారు? మరి ప్రభుత్వం ఈ చర్య వింతగా చూస్తున్నదా? సరియైన చర్య తీసుకొంటుందా?
నమ్మకం లేదు.

టీవీ ఛానెళ్లలో స్వాముల వారు ప్రసంగించు ప్రవచన సందర్భంలో వ్యాపార ప్రకటనలు ఆంగ్ల పదములతో ప్రదర్శించుట అవసరమా? ఆ ఆధ్యాత్మిక సమయంలో దైవ నామాలు ‘ఓం నమః శివాయః’ ‘హర శంకరా’ అనుసరించుట ప్రాధాన్యత కాదా?
నిజమే. కాని ఛానెళ్లు బతికేది అడ్వర్టయిజ్‌మెంట్ల మీద. ఏ కార్యక్రమంలో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు వేయకూడదన్నది వారి విజ్ఞతకు సంబంధించిన విషయం.

యామా జనార్దన్, సూర్యాపేట
రెండు సంవత్సరాల నుండి నేను వ్రాసిన లేఖలు (ఉత్తరాయణంకు) కొన్ని, మనలో మనంకు వ్రాసిన ప్రశ్నలు కొన్ని ప్రచురించడం లేదు. మూడవ వ్యక్తి ఎవరో ఎంపిక చేసి మీకు అందించిన వాటినే ప్రచురిస్తున్నట్లుగా నున్నది. ఔను అంటారా లేక కాదు అంటారా?
కాదు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
అన్నింటా తెలుగు ఉండాలని తెలుగు భాషా ఖ్యాతి పెంపొందించాలని చెప్పుచున్నారు. కాని కవులు వ్రాసిన గేయాలులో ఇంగ్లీషు పదాలు ఇనుమడింపజేస్తున్నారు. ఎందుకు?
తెలుగు రాయటం చేతకాక. ఒక్కోసారి సరైన తెలుగు పదాలు దొరకక.

సూర్యనారాయణ, రాజమండ్రి
పాతవి 500 రూపాయల నోట్లు, 1000 నోట్లు కొందరు ప్రముఖులు కాలవల్లో, చెత్తకుప్పల్లో చింపేసి పారవేస్తున్నారు. ఆ ధనాన్ని వృద్ధాశ్రమం, జీవకారుణ్య సంఘం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు చేరవేస్తే పది మంది బీదవాళ్లకు పట్టెడు అన్నం పెట్టే పుణ్యపురుషులవుతారు కదా. నోట్లను చింపేస్తే వారికి వచ్చిన లాభమేమిటి?
వారిది లాభం పోయిందన్న కసి! ఉక్రోషం!! అలాంటి వాళ్లకు ఇలాంటి వివేకం ఉండదు.

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
పెద్ద నోట్లు రు.500, 1000లను రద్దు చేసి, మరింత పెద్ద నోటు రు.2000 ను విడుదల చేయడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీగారి ఆంతర్యమేమిటి?
సమయం చూసి దాన్నీ సాగనంపాలని.

హరిచందన్ కుమార్ శ్రీ్భష్యం
ఈ మధ్య బ్రాహ్మణవాదమంటూ బ్రాహ్మణులను తిట్టడం అటు సాహిత్యంలోనూ, బైట కూడ ఎక్కువైంది. వారిని నిర్మూలించాలి అన్నంతగా కూడా.. నిజంగా బ్రాహ్మణులు అంత నిరంకుశమైనవారా... ఈ వర్ణ వ్యవస్థను తయారుచేసింది వారా లేక వారు కూడా అందులో ఒక భాగమా..? అసలు ఈ విషయంగా చరిత్రలో ఏమి జరిగింది? దీనిపై సత్యాసత్య వివేకాత్మకంగా నిష్పక్షపాతంగా పరిశోధనాత్మక గ్రంథం వ్రాయవచ్చు కదా మీరు?
రాయాలనే ఉంది. ఎప్పుడన్నది చెప్పలేను.

డొక్కా నాగభూషణం, వక్కలంక
నోట్లు రద్దు విషయంలోనూ, ఆపైన రకరకాల ప్రభుత్వ ప్రకటనలనూ చూస్తే మన దేశంలో మేధావుల కొరత ఏర్పడిందని అనిపిస్తున్నది. ఏమంటారు?
మేధావులు ఎక్కువై బాధపడుతున్నాం.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మంగళంపల్లి వారి అంత్యక్రియలకు అంతా కలసి ముప్పై మంది మాత్రమే వెళ్లారుట. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క మంత్రి కూడా వెళ్లలేదట.
అదీ మన సంస్కారం.

తమిళనాడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వ లాంఛనాలతో జరుపవలసిన ఈ కార్యక్రమానికి అనుమతి నివ్వలేకపోవడానికి కారణం జయలలితగారు కోలుకోకపోవడమేననో వార్త.
ఔను. అక్కడ ప్రభుత్వం ఐ.సి.యు.లో ఉంది.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
దేశ విదేశాల సభలలో అనర్గళంగా మాట్లాడే ప్రధాని పార్లమెంటు ముఖం చూడ్డానికి భయపడ్తారెందుకు?
భయం కాదు... పంతం. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com