తెలంగాణ

ఫిర్యాదుదారులతో అధికారుల వీడియో కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 2: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రజావాణి కార్యక్రమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఆశించిన స్థాయిలో పరిష్కరించడం లేదనే అపవాదు రావడంతో అందుకు చెక్ పెట్టడానికి కలెక్టర్ రంగంలోకి దిగారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను కలెక్టర్‌కు ఫిర్యాదు రూపంలో విన్నవించుకుంటారు. అందులో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ రెవెన్యూ శాఖ మీటింగ్ హల్‌లో ప్రజావాణి ప్రారంభం కాగానే కలెక్టర్ వీడియోలను ఆన్ చేయించారు. అక్కడికి వచ్చిన జిల్లా అధికారులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో ఖంగుతిన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరిస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లో అక్కడికక్కడే సంబంధిత మండలాల అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా ఫిర్యాదుదారులతో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ ఎవరైనా ఫిర్యాదుదారుడు అధికారులపై ఫిర్యాదు చేసినట్లయతే ఆ ఫిర్యాదుదారుడి నుండే వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో మాట్లాడించారు. అందులో భాగంగా గండ్విడ్ మండలం వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన నారాయణ కలెక్టర్‌కు తన భూమి గురించి ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, విఆర్‌ఓ తమ తండ్రికి సంబంధించిన భూమిని తనకు విరాసత్ చేయడం లేదని, తమ తండ్రి చనిపోయి రెండేళ్లు దాటినా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని అన్నాడు. రూ.2 వేలతో పాటు పాస్‌పుస్తకాలను కూడా అప్పజెప్పానని, ఇప్పటివరకు భూమిని విరాసత్ చేయడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ రైతు నారాయణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గండ్విడ్ తహశీల్దార్‌తో పాటు విఆర్‌ఓతో మాట్లాడించారు. దీంతో రైతుకు అన్యాయం జరిగిందని, రైతు సమస్యను నిర్లక్ష్యం చేశారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్‌ఓ కృష్ణారెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును ఇబ్బంది పెట్టినందుకు విఆర్‌ఓ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నానని ప్రకటించారు. వారం రోజుల్లో తహశీల్దారే ప్రత్యేకంగా చొరవ తీసుకుని రైతు నారాయణకు న్యాయం చేసి భూమి విరాసత్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచి పట్టా ఇవ్వాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ నేరుగా ఫిర్యాదుదారులతోనే మండల అధికారులతో మాట్లాడిస్తుండడంతో అధికారుల్లో వణుకుపుట్టింది. ఏ ఫిర్యాదుదారుడు ఏ అధికారిపై ఫిర్యాదు చేస్తాడోనని ఆందోళన చెందారు. మొదటిరోజు వీడియో కాన్ఫరెన్స్ కావడంతో కొన్ని ఫిర్యాదులు వచ్చినా వచ్చే వారానికి న్యాయమైన ఫిర్యాదులకు పరిష్కారం లభించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, మండల స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

చిత్రం..రైతును మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిస్తున్న కలెక్టర్