మహబూబ్‌నగర్

కొత్త మొల్గరలో పోలీస్ పికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: మహబూబ్‌నగర్ మండల పరిధిలోని ఎదిరే గ్రామశివారులో అతిదారుణంగా హత్యకు గురైన సునీల్‌రెడ్డి(37) మృతదేహాన్ని తన స్వగ్రామం భూత్పూర్ మండలం కొత్త మొల్గరకు తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం హత్యకు గురైన సునీల్‌రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడంతో కొత్త మొల్గర గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే సునీల్‌రెడ్డి హత్యకు ప్రధానకారణం భూతగాదాలు కావడంతో గ్రామంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గ్రహించిన భూత్పూర్ పోలీసులు కొత్త మొల్గర గ్రామంలో ముందస్తు చర్యల్లోభాగంగా పోలీసు పికేట్‌ను ఏర్పాటు చేశారు. సునీల్‌రెడ్డిని వేటకొడవళ్లతో మెడపై నరికి చంపారని ఆయన హత్యకు ప్రధాన కారణం భూతగాదాలేనని రూరల్ సిఐ గడ్డం కాశీ తెలిపారు. అయితే హత్యకు గురైన సునీల్‌రెడ్డికి, వారి బందువు అయిన వెంకటేష్ కుటుంబాల మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. దాంతో ఫిబ్రవరి 11వ తేదిన సునీల్‌రెడ్డి వెంకటేష్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు అప్పట్లో భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌లో హత్యయత్నం కేసు నమోదు కాగా సునీల్‌రెడ్డిని రిమాండ్‌కు కూడా తరలించారు. ఇటివల బెయిల్‌పై బయటకు వచ్చిన సునీల్‌రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేయాలని పన్నాగం పన్నారు. అందులో భాగంగా గురువారం సునీల్‌రెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేసి కారు కిరాయికి రావాలంటూ పిలికారు. దాంతో సునీల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు తన కారులోవచ్చి ఓ మెకానిక్ షెడ్‌లో రిపేర్ చేయించుకుని ఫోన్ చేసిన వ్యక్తిని కూడా అక్కడి నుండి ఏనుగొండ, ఎదిరే మీదుగా కొత్తకోటకు వెళ్లాలని సూచించారు. దాంతో సునీల్‌రెడ్డి ఎదిరే మీదుగా కొత్తకోట వెళ్లేందుకు బయలుదేరారు. ఎదిరే దగ్గరకు వెళ్లగా దుండగులు తమ వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో సునీల్‌రెడ్డిపై దాడిచేసి నరికి చంపారు. అదేకారులో నిందితులు పరారు అయ్యారు. ఈ విషయాన్ని ఎదిరే సమీపంలోని కొందరు చూసి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయారని భావించిన పోలీసులు తీరా మృతుడి దగ్గర ఉన్నటువంటి గుర్తింపు కార్డుల ఆదారంగా మొల్గర గ్రామానికి చెందిన సునీల్‌రెడ్డిగా గుర్తించారు. అయితే గ్రామంలో భూతగాదాలు ఉండడంతో హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే గ్రామంలోమళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని గ్రహించిన భూత్పూర్ పోలీసులు కొత్త మొల్గర గ్రామంలో ప్రస్తుతం పోలీసు పికేటింగ్ నిర్వహిస్తూ సునీల్‌రెడ్డిని హత్యచేసిన దుండగుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు.

సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
* జెసి శివకుమార్‌నాయుడు
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు అందేవిధంగా చూడాల్సిన భాద్యత ప్రతి అధికారిపై ఉందని జెసి శివకుమార్‌నాయుడు అన్నారు. శుక్రవారం రెవెన్యూ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21వ తేది సివిల్ డేగా నిర్వహిస్తున్నందున అందులో భాగంగా అధికారులు ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించి పథకాలను తీసుకువస్తుందని అన్నారు. ఈ పథకాలు సరైన లబ్దిదారులకు అందించే భాద్యత అందరిపై ఉందని సంబందిత అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ భాస్కర్, ఆర్డిఓ లక్ష్మీనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రేషన్ దుకాణాల్లో
1నుంచి బయోమెట్రిక్ ఆమలు
* ఐటి విభాగం డిప్యూటీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు
కోస్గి, ఏప్రిల్ 21: చౌకధర దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సరుకులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన బయోమెట్రిక్ విధానం ఆమలు చేయాలని డిప్యూటీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోస్గి, మద్దూర్, గండ్విడ్ మండలాల డీలర్లకు అవగాహన కల్పిస్తూ మరో రెండు రోజుల్లో అన్నిరేషన్ షాపులకు బయోమెట్రిక్ మీషన్లు పంపిణీ చేస్తామని ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్దిదారులకు సరుకులు అందించాలని ఈ సందర్భంగా వారు డీలర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, టిహెచ్‌ఎస్ మల్లేశ్వర్‌రావు, శారద ప్రియదర్శిని, తహశీల్దార్ బాలచందర్‌రావుతదితరులు పాల్గొన్నారు.

ఎండ ప్రచండంతో..
చెరువులో చేపల మృత్యువాత
గద్వాలరూరల్, ఏప్రిల్ 21: గద్వాల చెన్నకేశవ మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గద్వాల మండలం చెనుగోనిపల్లి పెద్దచెరువులోని చేపలు అధిక ఎండలకు మృత్యువాతపడ్డాయి. శుక్రవారం చెరువులోని 1 నుండి 3 కేజీల బొచ్చ చేపలు చనిపోవడంతో మత్స్యకారులు లబోదిబోమంటూ గుండెలు బాధుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటాయని వాపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెనుగు, ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ప్రధాన కార్యదర్శి డిటిడిసి నర్సింహులు అక్కడికి చేరుకొని మృతి చెందిన చేపలను పరిశీలించారు. ఎండ తీవ్రత వల్ల ఆక్సిజన్ అందక చనిపోయాయని మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప చెప్పారని తెలిపారు. ఈ మధ్యనే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని, మన మత్స్యకారులకు తీరని నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం నష్టపోయిన మత్స్యకారులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంటన ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, తాలూకా అధ్యక్షుడు దౌలన్న, కిట్టులు ఉన్నారు.

గొర్రెల కాపరులు సొసైటీల్లో
సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి
కలెక్టర్ రోనాల్డ్‌రోస్

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రొత్సహించే దిశగా పనిచేస్తున్నందున గొర్రెల పెంపకందారులు సోసైటీలలో నూతన సభ్యత్వాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సంబందిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 1వ తేది నుండి ప్రతి గ్రామంలో లబ్దిదారుల ఎంపిక, అవగాహన శిభిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పంచాయతీ సెక్రెటరీ, విఆర్‌ఓలను ఇందులో భాగస్వామ్యం చేస్తామని ఎంపిక విషయంలో క్లియర్ కట్, మార్గదర్శక సూత్రాలు ఇస్తామని తహశీల్దార్, ఎంపిడిఓ, జడ్పి సిఇఓ, డిఇఓ , ఫారెస్టు అధికారులు త్వరలో ఏర్పాటు చేసే సమావేశానికి హజరు కావాలని అన్నారు. జూన్ 20న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా నిజమైన లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శక సూత్రాలను తప్పక పాటించాలని కోరారు. గొర్రెల పెంపకం దారులకు అందించే గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దళారులకు తావు లేకుండా పక్కా ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ గౌతం, పశుసంవర్థక శాఖ అధికారి దుర్గయ్య, టెక్నికల్ అధికారి వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నామినేటెడ్ పదవుల కోసం..
ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 21: టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడోసారి జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశం అనంతరం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారనే నమ్మకంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు నేతలు నామినేటెడ్ పదవులకోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు మార్కెట్‌యార్డు కమిటి తప్ప మరే ఇతర పదవులను భర్తీ చేయకపోవడంతో వాటిని భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారనే ఆశాభావంతో ఆశావహులు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉండే పదవులతోపాటు స్థానికంగా మార్కెట్‌యార్డు చైర్మన్ పదవిని ఆశిస్తూ కొందరు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలోను, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో కలిసిస తమ బయోడేటాను ఇవ్వడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీని ఏ ప్రాతిపదికన చేపడుతారో అర్థం కాక పార్టీ సీనియర్ నాయకులు, టిఆర్‌ఎస్‌తో సంబంధాలు ఉన్న తెలంగాణ వాదులు అయోమయంలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే సిఫారసుతోపాటు పార్టీ అంతర్గతంగా సమాచారం తీసుకొని భర్తీ చేయవచ్చనే అభిప్రాయంతో ఉన్న కొంతమంది నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేలపై తమపేర్లను సిఫారసు చేయాలనే ఒత్తిడి తెస్తున్నట్లు తెలిస్తుంది. పైగా రాష్టప్రార్టీ కార్యాలయంలో కూడా పూర్తి సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నామినేటెడ్ పదవులకోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవ్వరికి ఏ పదవి వస్తుందోననే ఆశతో ఎదురు చూస్తున్నారు. అసైన్‌మెంట్ కమిటీలో సభ్యత్వం, ఆహార సలహా మండలిలో సభ్యులుగా, దేవాలయం అభివృద్ది కమిటి సభ్యులుగా, చైర్మన్‌గా, జిల్లా స్థాయిలో ఉండే వివిధ రకాల పోస్టులకోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంమీద నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆపార్టీ నాయకులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
సమష్టి కృషితో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుదాం
*అధికారులకు కలెక్టర్ శ్రీ్ధర్ పిలుపు
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 21: అందరం కలిసికట్టుగా పని చేసి జిల్లాను ఆదర్శజిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ ఇ.శ్రీ్ధర్ జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం హాల్‌లో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులందరు జవాబుదారి తనాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ అన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాను జిల్లా అధికారులంతా కలిసి కట్టుగా పని చేసి నాగర్‌కర్నూల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శజిల్లాగా దిద్దుదామన్నారు. ప్రతి ఒక్క అధికారి జవాబుదారి తనాన్ని అలవర్చుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలనుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని, వచ్చిన ఫిర్యాదు దారుడి సమస్యను విని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ది చెందితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. జిల్లాలో ఉన్న వనరులను మరింతగా మెరుగుపర్చుకొని అభివృద్ది దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి తమవద్దన ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే అభివృద్దికి నాంది పలకవచ్చన్నారు. ప్రతి ఉద్యోగి వచ్చిన అవకాశాలను సవాల్‌గా స్వీకరిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నారు. ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలపై జిల్లా అధికారులతో చర్చించారు. జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లేలా అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని, అందరు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, జెసి సురేందర్ కరణ్, డిఆర్వో మధుసూధన్‌నాయక్, ఎవో పుష్పలతతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కల్వకుర్తి, ఏప్రిల్ 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను నూతనంగా వివాహం చేసుకున్న వదువరుల తల్లిదండ్రులకు శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి చేతుల పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతుల వివాహాలకు 51 వేల రూపాయాల చెక్కులను అందించడం శుభ పరిణామమన్నారు. ఈకార్యక్రమంలో అర్డీఓ రాజేష్‌కుమార్, తహాశీల్దార్ మంజుల, ఎంపిపి రామేశ్వరమ్మ, వైస్ ఎంపిపి పర్వతాలు, గుండూర్ సర్పంచ్ వెంకటయ్య, ఆర్‌ఐ నజీర్, విఆర్‌ఓలు శిశధర్, రమేష్, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు షాకీర్, సత్యనారాయణరెడ్డి, మిర్యాల శ్రీరివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదతరులు ఉన్నారు.
‘పేట’ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 21: న్యాయవాదుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా లా కమీషన్ సిద్దం చేసిన చట్ట సవరణ బిల్లును నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో దగ్దం చేశారు. బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మెరకు శుక్రవారం నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి కోర్టు భవనాల సమూదాయం ముందు లా కమీషన్ ప్రతిపాదించిన బిల్లు ప్రతులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌యాదవ్ మాట్లాడుతూ న్యాయవాదుల చట్టం 1960ను సవరించాలని, కేంద్రానికి లా కమీషన్ ప్రతిపాదించి పంపించిన బిల్లు ప్రాక్టిస్ చేస్తున్న న్యాయవాదుల ప్రాథమిక హక్కులను హరింపజేస్తాయన్నారు. న్యాయవాద వృత్తిని కించపరచేలా లాకమీషన్ చేసిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించవద్దన్నారు. కేంద్రం ఈ బిల్లును ఆమోదిస్తే న్యాయవాదులకే ఉరితాళ్లు తగిలేలా చట్టాన్ని రూపొందించినట్లవుతుందని కేంద్రం ఈ బిల్లును తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రాజేశ్వర్‌గౌడ్, మల్లికార్జున్, అమీరోద్దీన్, సీతారామారావు, నారాయణ, మదన్, నర్సిములుయాదవ్, కుర్మన్నగౌడ్, భీంరెడ్డి, సోహైల్ అహ్మద్, ఆనంద్, ఆకుల బాలప్ప, విజయభాస్కర్‌రెడ్డి, సలీం, దామోదర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.