మహబూబ్‌నగర్

మైనార్టీల అభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 18: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం సాయం త్రం మహబూబ్‌నగర్‌లోని ఆల్మస్, నేషనల్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్‌విందుకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఇఫ్తార్‌విందులో పాల్గొన్న ఎమ్మెల్యే రంజాన్ మాసం సందర్భంగా ఇచ్చిన ఇఫ్తార్‌ను పురస్కరించుని వారికి స్వీట్లు, పండ్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మైనార్టీలకు రాష్ట్రంలో మంచిగౌరవం లభిస్తుందని అన్నారు. గత పాలకులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయాలు చేసేవారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గొప్ప మనుస్సుతో వారిని గౌరవప్రదంగా చూసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇఫ్తార్‌విందు అధికారికంగా ప్రకటించి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభుత్వం పండుగలను జరుపునే ప్రజలను గౌరవిస్తున్న గొప్ప ప్రభుత్వమని అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ముస్లీంలు ఎదుర్కొంటున్న సమస్యలను తనవంతుగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో కబ్రస్తాన్‌లకు స్థలాలు లేకుంటే మూడు ప్రాంతాలలో భూమి ఇచ్చామని తెలిపారు.

చురుకుగా మిషన్ భగీరథ పనులు
ధన్వాడ, జూన్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకం పనులు ధన్వాడ, మరికల్ మండలాల్లో చురుకుగా కొనసాగుతున్నాయి. మరికల్, ధన్వాడ మండలంలో మిషన్ భగీరథ పనులు నేటికి 70 నుండి 80శాతం వరకు పైపులైన్ పనులు పూర్తయ్యాయని మిషన్ భగీరథ పథకం అధికారులు తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ఈ పథకం కింద ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
నేడు ఇఫ్తార్ విందు
మక్తల్, జూన్ 18: ఈనెల 19న ప్రభుత్వం తరపున మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షులు రహీంపటేల్ తెలిపారు. ఆదివారం ఆయన మక్తల్‌లో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 19వ తేది సోమవారం రోజు మక్తల్ పట్టణంలోని స్థానిక రాయల్ పంక్షన్ హాలులో సాయంత్రం 6గంటలకు ప్రభుత్వం తరపున మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందును చేసినట్లు తెలిపారు. ఇట్టి విందు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సమక్షంలోని మైనార్టీ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. ఇఫ్తార్ విందుకు మైనార్టీ సోదరులతో పాటు అన్ని పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం మైనార్టీ పేదవారికి దుస్తుల పంపిణీని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మైనార్టీ మత పెద్దల చేతుల మీదుగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మైనార్టీ సోదరులతోపాటు పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని కోరారు.
బిటి రోడ్డును మంజూరు చేయాలి
ధన్వాడ, జూన్ 18: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామానికి ప్రభుత్వం బిటి రోడ్డును మంజూరు చేయాలని పెద్దచింతకుంట గ్రామ ఎంపిటిసి శ్రీనివాసులు కోరారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపిటిసి శ్రీనివాసులు మాట్లాడుతూ పెద్దచింతకుంట గ్రామ స్టేజీ నుండి గ్రామం వరకు రెండు, మూడు కిలో మీటర్ల దూరం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షంకు రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఇకనైనా జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి పంచాయతీరాజ్‌శాఖ అధికారులు స్పందించి పెద్దచింతకుంట గ్రామానికి బిటి రోడ్డును మంజూరు చేయాలని ఆయన కోరారు. పెద్దచింతకుంట గ్రామంపై పేట ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టిపెట్టి గ్రామానికి బిటి రోడ్డు మంజూరుకు సహకరించాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో గ్రామస్థులు భగవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకట్రాములు, కృష్ణయ్య, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీ: మహిళ మృతి
మక్తల్, జూన్ 18: గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మక్తల్ సమీపంలోని రాయిచూర్ రోడ్డులోగల ఈద్గా వెళ్లే దారిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మక్తల్ పట్టణ సమీపంలోని రాయిచూర్ వెళ్లే దారిలోగల 167 జాతీయ రహదారిపై ఓ గుర్తు తెలియని మహిళను, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా రాత్రి కావడంతో ఇతర వాహనాలు దారిగుండా వెళ్తుండడంతో మృతురాలి శరీరం రోడ్డుపై నుజ్జు,నుజ్జుగా మారింది. మహిళ శరీర ఆనవాలను ఓ గోనె సంచిలో వేసుకొని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి శరీరంపై బ్లూ కలర్ చీరా, చేతికి రెండు వెండి కడియాలు, కుడి చేతిపై మచ్చ, తెల్లటి చెప్పులు ఉన్నాయని చెప్పారు. ఇట్టి విషయమై పోస్టుమార్టం చేసి స్థానిక పంచాయతీ కామాటీలకు పూడ్చేందుకై అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చెప్పారు.

క్రికెట్ బెట్టింగుల జోరు
*ఇండియా పాక్తిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌తో
టివీల ముందు సందడే సందడి
మక్తల్, జూన్ 18: లండన్‌లో ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్తాన్ దేశాల దాయాదుల క్రికెట్‌తో మక్తల్ రెండు దేశాల మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు ఆసక్తిని కనబరిచారు. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ ప్రారంభానికి గంట ముందే యువకులు, చిన్నారులు, క్రికెట్ అభిమానులు టివీలకు అత్తుకు పోయారు. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ అంటే ఇరుదేశాల యుద్ధరంగానే్న తలపించేంత ఉత్కంఠ నెలకొంటుంది. భారత్ నెగ్గాలని అభిమానులు విజయపరంపర తమకే దక్కాలని ఆసక్తితో ఎదురుచూశారు. మరోవైపు ఇండియా, పాకిస్తాన్ జట్ల క్రికెట్ పోటంటేనే బెట్టింగ్ రాయుళ్లు లేచి కూర్చుంటారు. ఇలా మక్తల్ పట్టణంతోపాటు మండలంలో చాలా మంది యువకులు వేలకు వేలు క్రికెట్ బెట్టింగులు వేసుకున్నారు. మొత్తంపై ఎంతో ఉత్కంఠ భరితంగా దాయాదుల పోరు కొనసాగడాన్ని వీక్షకులు టివీలకు మాత్రం అత్తుక్కొని చూశారు.

తెలంగాణ అమరుల గురించి
మాట్లాడే నైతికహక్కు టిడిపికి లేదు
*టిఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు శివకుమార్

మహబూబ్‌నగర్, జూన్ 18: తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు టిడిపి నాయకులకు లేదని టిఆర్‌ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఆరోపించారు. ఆదివారం తెరాస నాయకులు మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి పాలిభిషేకం చేశారు. గత రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పిచడంతో టిడిపి నాయకులు అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించడంతో స్థూపం అపవిత్రం అయిందని ఆరోపిస్తూ తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరవీరుల స్థూపాన్ని తాకడంతో అపవిత్రం అయిందని అన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్కును నేలకు రాసి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్లాలని అప్పుడు కూడా తెలంగాణ అమరవీరుల గురించి గానీ వారి పేరిట గల స్థూపాలను గానీ తాకే అర్హత లేదని ద్వజమెత్తారు. తెలంగాణ సద్యమంలో కలిసిరావాలని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజల రమ్మిని చెబితే అప్పుడు ఆంధ్రాబాబు మోచేతి నీరు తాగుతూ భజన చేశారని ఆరోపించారు. వందల మంది చనిపోవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఎలా తాకుతారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని జిమ్మికులు చేసిన తెలంగాణ ప్రజలు వారిని నమ్మరని అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగై పోతుంటే కొందరు నాయకులు ఇకా తమ ఉనికి ఉందని చాటుకోవడానికి కొత్త బిచ్చగాళ్ల మాదిరి తయారయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మున్సిఫల్ చైర్మన్ రాదా అమర్, కోట్ల కిషోర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశం, మొహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుజాతి పాట సినారె
*సంస్మరణ సభలో జూలూరి గౌరీశంకర్

మహబూబ్‌నగర్, జూన్ 18: తెలుగు సాహితికి నౌక, తెలుగుజాతికి వనె్నతెచ్చిన మహాకవి, ఆచార్య సి.నారాయణరెడ్డి, తెలుగు సాహిత్యానికి ఓ వృక్షమని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అన్నారు.
ఆదివారం ధ్వని, సాహితి సంస్థ, పాలమూరు సాహితి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ హైస్కూల్‌లో నిర్వహించిన మహాకవి సినారెకు అశ్రునివాళి కార్యక్రమంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె గుంచి మాట్టాడడం అంటే భూగోళాన్ని అద్దంలో చూపించడమన్నారు. మాటకు పాట నేర్పిన మహాకవి సినారె అన్నారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని గొప్పగా చాటిన గొప్ప కవి అని పేర్కొన్నారు. కవిత్వాలతో కరచాలనం చేసి సాహిత్యాన్ని పెంపొందించారన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ అని నినదించారని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులను కవులుగా ఫ్రొఫెసర్లుగా తీర్చిదిద్దిన మహామనిషి అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో ఎన్నో గ్రంథాలను పాలనలోకి తీసుకువచ్చారన్నారు. విశిష్ట అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్ రఘు మాట్లాడుతూ సినారె జీవితమంతా ఆధునిక కేంద్ర పరితత్వంతో ముడిపడి ఉందని అన్నారు. ఆయన రాసిన ప్రతి కవిత కొటేషన్‌లాగా ఉంటుందని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన ధ్వని సాహితి సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ సినారె రాసిన ప్రతి కవిత ఒక సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. ఆయన కవిత్వానికి జోకే తూనికరాళ్లు మన దగ్గర లేవన్నారు. సినారె ఎంతో మందికి స్ఫూర్తిదాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, జనార్ధన్, లక్ష్మణ్‌గౌడ్, భీంపల్లి శ్రీకాం త్ తదితరులు పాల్గొన్నారు.

21న కెఎల్‌ఐ పనుల పరిశీలన

కల్వకుర్తి, జూన్ 18: కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం పనులను ఈ నెల 21న స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరుగుతుందని పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు బండెల రాంచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోత్తల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు నత్తనడకగా సాగుతున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించాలంటే పనులలో పురోగతి పెరగాలని, ప్రభుత్వ ప్రకటనలలో వాస్తవాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే పనుల పరిశీలన తర్వాత కెఎల్‌ఐ పనుల స్థితి గతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రైతులు సింహారెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు ఉన్నారు.

కురుక్షేత్ర సభను విజయవంతం చేయాలి

నాగర్‌కర్నూల్‌టౌన్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 7న అమరావతిలో కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అధికార బలంతో అరెస్టు చేయించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆదివారం పట్టణంలోని నల్లవెల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మాదిగ ఉద్యోగ ఫెడరేషన్, దళిత సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎం ఇ ఎఫ్ నాయకులు దేవరపాగ ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాదిగలను అణగదొక్కడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మందకృష్ణ మాదిగ చేసే పోరాటాలతో బహుజనులు ఏకమైతే మరోసారి రాజ్యాధికారాన్ని కోల్పోతామనే భయంతో కుప్పంలో చంద్రబాబునాయుడు అరెస్టు చేయించాడని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అధికార బలంతో పోలీసులతో అరెస్టు చేయించడాన్ని చూస్తే మాదిగల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా ఉందని అన్నారు. జూలై 7న అమరావతిలో నిర్వహించే మాదిగల కురుక్షేత్ర మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలు, మాదిగ సోదరులు, దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఇ ఎఫ్ నాయకులు కొంగరి జానయ్య, రాంచందర్, మద్దిలేటి, వంకేశ్వరం శ్రీనివాసులు, విష్ణుమూర్తి, న్యాయవాది మాధవలక్ష్మణ్, పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన బుక్ స్టాళ్లు

మక్తల్, జూన్ 18: 2017-18 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యాపరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు తల్లి తండ్రులతో కలసి బుక్ సెంటర్లకు వెళ్లడంతో అవన్నీ కిక్కిరిసి పోయాయి. ఇదే అదునుగా భావించిన కొందరు యజమానులు అందినంత దండుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నోటు పుస్తకాలు సేల్‌చేసే కంపెనీలు వారికి 40 నుండి 50 శాతం వరకు రాయితీలు ఇస్తుంటే బుక్ సెంటర్ యజమానులు మాత్రం ఎలాంటి రాయితీ ఇవ్వకుండా వాటిపై ఉన్న రేటుకంటే అధికంగా ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో సంబంధిత అధికారులు అధిక రేట్లకు విద్యాపరమైన వస్తువులను విక్రహిస్తున్న బుక్ సెంటర్స్‌ను అకస్మికంగా పరిశీలించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దుకాణదారులపై విద్యార్థి సంఘాలు సైతం పరిశీలించి నిలదీయాలని తల్లి దండ్రులు కోరుతున్నారు.

వర్గీకరణ సాధనే లక్ష్యం
నర్వ, జూన్ 18: వర్గీకరణ సాధనే లక్ష్యంగా పని చేస్తామని ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు ఆటో వెంకటయ్య అన్నారు. ఆదివారం నర్వలో పోస్టర్లను విడుదల చేశారు. మందకృష్ణ మాదిగ ఆంధ్రలో చేపడుతున్న కార్యక్రమాలకు ముందుంటామన్నారు. వచ్చే నెలలో జరిగే మహాసభలకు పోస్టర్లను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణపై ద్వంద వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. వర్గీకరణ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపలేమన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు శంకర్, శేఖర్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.