మహబూబ్‌నగర్

డామిట్.. కథ అడ్డం తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 14: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు బుధవారం ఆందోళన బాట పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అధికారులు పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రయత్నించగా ఉదండాపూర్, వల్లూరు గ్రామస్థులు తిరస్కరించారు. తమకు పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని, కొత్తగా నిర్మించే గ్రామాలకు సంబంధించి స్థలాన్ని కేటాయించిన తరువాత ప్లాట్లతో పాటు భూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, అధికారులు ఒకరిద్దరు రైతులకు మహబూబ్‌నగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన భూ పరిహారం చెక్కులను ఆర్డీవో లక్ష్మీనారాయణ కొంతమంది రైతులకు పంపిణీ చేశారు. వీరిని చూసి మరికొందరు రైతులు చెక్కులు తీసుకుంటారని అధికారులు భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. విషయం తెలుసుకున్న ఉదండాపూర్ గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల భూ నిర్వాసితులు ఒక్కసారిగా చెక్కులను తీసుకున్న రైతులపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని ఊరంతా ఒకమాట మీద నిలబడాల్సిన సమయంలో అధికారులు రైతులను విడదీసే కుట్రలకు తెరలేపారని, రైతుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని పంచాయతీ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఒకరిద్దరు రైతులకు చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించారు. అధికారుల కుట్రలకు నిరసనగా అంతా ఒక్కటై నిలదీద్దామంటూ రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో ఉదండాపూర్ నుండి జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయానికి బుధవారం చేరుకున్నారు. తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమలో ఉన్న ఐక్యతను అధికారులు కుట్రలు చేసి దెబ్బతీయడం ఏమిటని ఒకరికి ఒకరు తెలియకుండా పరిహారం చెక్కులు ఎలా ఇస్తారంటూ అధికారులను నిలదీస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వార్ నిర్మాణం కోసం తాము పెద్ద మనస్సు చేసుకుని భూములు ఇచ్చి త్యాగానికి సిద్ధపడగా.. అధికారులు మాత్రం, మాలో మాకే విభేదాలు సృష్టించే విధంగా వ్యవహరించడం తగదని కొందరు రైతులు అధికారులపై దూసుకెళ్లారు. పునారాసం ఏర్పాటు చేసే స్థలాలను కేటాయించిన తరువాతే చెక్కులను ఇవ్వాలని ఆర్డీఓకు గతంలోనే విజ్ఞప్తి చేశామని, అయినా ఇలా కొందరు అధికారులు రైతులను విడదీసే కార్యక్రమాలకు పాల్పడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇవ్వకపోతే పరిహారం డబ్బులను కోర్టులో డిపాజిట్ చేసి భూములను లాక్కుంటామని తెలిపిన అధికారులు, పునరావాస స్థలం సేకరించేందుకు అడ్డేమిటని ప్రశ్నించారు. వెంటనే తమకు ప్లాట్లను కేటాయించి భూ పరిహారంతో పాటుగా పునరావాస సహాయాన్ని సైతం వన్‌టైం సెటిల్‌మెంట్‌గా చేయాలని అధికారులను భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్, తమకు వన్‌టైం సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం పునరావాసం మాటెత్తకుండా భూ పరిహారం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రైతులు అడ్డం తిరగడంతో అధికారులు కంగుతిన్నారు. ఓపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తుండడంతో క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తమకు పునరావాసం కల్పిస్తేనే తాము పరిహారం చెక్కులు తీసుకుంటామని తేల్చి చెబుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అవినీతి బట్టబయలవుతుందనే
భయంతోనే కాంగ్రెస్ సస్పెన్షన్
* ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు లేదు
* మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో చేపట్టిన కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతి బట్టబయలవుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సస్పెన్షన్ చేశారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల పేరుతో సీఎం కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వీటిని సాక్ష్యలతో శాసనసభలో నిరూపించేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుసుకున్న సీఎం కేసీఆర్ పథకం ప్రకారం వారిని సస్పెన్షన్ చేశారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం స్పీకర్‌కు లేదని, పైగా శాసనసభలో చర్చించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి నియంతను గుర్తుచేస్తోంద న్నారు. ఫాంహౌస్‌లో పనిచేసే వారిని తొలగించే అధికారం సీఎంకు ఉంటుందే కానీ ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఈ పద్ధతిని మార్చుకోకపోతే సమాజమే తగిన బుద్ధిచెబుతుందన్నారు. ప్రతినిత్యం మార్గదర్శకాలంటూ మాట్లాడుతున్న సీఎంకు రాబోయే రోజుల్లో అవే ఆయనకు సంకెళ్లు వేస్తాయనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఓ పార్టీ బీ ఫాంతో గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు మంత్రి పదవులను కూడా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ రబీలో వేరుశనగ పంట అధికంగా పండించినప్పటికి కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ప్రత్యేక నిధులతో రైతులను ఆదుకోవాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు సరైన అవగాహన లేకపోవడం వలనే రైతులు భూములు కోల్పోవల్సి వస్తుందన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయని, ఇసుక, మట్టి వ్యాపారం బహిరంగంగా జరుగుతున్నందునే అని ఆరోపించారు. నాగర్‌కర్నూల్ పట్టణంలో భూముల ఆక్రమణలు జరుగుతున్న కలెక్టర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ విలేఖరుల సమావేశంలో సింగిల్ విండో అధ్యక్షులు వెంకట్రాములు, నేతలు అర్థం రవి, కాశన్న, యాదయ్య, బాలగౌడ్, నసీర్ తదితరులు పాల్గొన్నారు.