మహబూబ్‌నగర్

హరితహారం భూమాతకు మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జూలై 23: తెలంగాణకు హరితహారం అంటే భూమాతకు మణిహారం లాంటిదని మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్, బస్టాండ్ ఆవరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి మంద జగన్నాథంలు మొక్కలను శనివారం నాటారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితవనంలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వందరోజుల పనిదినాల గురించి కూడ ఏ ఏ గ్రామాల్లో వంద రోజుల పని జరుగకుండా ఉపాధి కార్డులు ఉన్నవారికి కనీసం 51శాతం పనులు కల్పించకపోతే ఫీల్డ్‌అసిస్టెంట్, ఎపిఓ, ఎంపిడిఓలపై చర్యలు తీసుకుంటామని, అధికారులు హరితహారంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తెచ్చుకున్నది బంగారు తెలంగాణ చేసుకునేందుకేనని బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణాను చూసుకుంటామన్నారు. సర్పంచులపై చట్టం తీసుకవస్తున్నట్లు, ఎవరైనా సర్పంచులు సక్రమంగా పనులు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారో వారిపై చర్యలు తీసుకునేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వాటర్‌గ్రిడ్‌ను తీసుకవస్తున్నారని ఒక సంవత్సర కాలంలో గతంలో తాగునీటి కష్టాలు పడ్డారో అలా కాకుండా ప్రతి ఇంటి గడప వరకు ప్రభుత్వ ఖర్చుతో పైపులైన్లు, ప్రతి మనిషికి 3లీటర్ల మంచినీరు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కోతలులేని కరెంటును ఇస్తున్నట్లు, రైతులకు పగలే తొమ్మిది గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని, రెండేళ్లలోపు రైతులకు కూడ 24గంటల విద్యుత్‌ను అందించేలా ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర విద్యుత్, మంచినీరు, గ్రామాల పచ్చదనంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలుపుకొచ్చారు. నియోజకవర్గానికి 1400 ఇండ్లు మంజూరయ్యాయని, టెండర్లకు పిలిచి కట్టిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలోని అలంపూర్, మానవపాడు, అయిజ మండలాల్లో రూ.20కోట్లతో కూడినటువంటి గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయని, గొప్పవాళ్ల పిల్లలు చదువుకునే పాఠశాలల్లా బీదవారికి కూడ అలాచదివే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద శ్రీనాథ్, మహేష్‌గౌడ్, నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, ఇస్మాయిల్, ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, ఎంపిడిఓ, తహశీల్దార్ తదితరులు ఉన్నారు.

ఆన్‌లైన్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు
*పియు రిజిస్ట్రార్ పాండు రంగారెడ్డి
వనపర్తి, జూలై 23: డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేసినప్పటికి తిరిగి ఈనెల 30 వరకు అడ్మిషన్ల గడవును పొడగించినట్లు పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాండు రంగారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ అడ్మిషన్లను ఈ ఏడాది నుండి ప్రవేశపెట్టిందన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం ఆయా గ్రామాల నుండే వారు కొరుకున్న కళాశాలలకు అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కలిగిందన్నారు. గతంలో కళాశాలలకు వెళ్లి అడ్మిషన్‌కు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండేదని ఆన్‌లైన్ విధానం ద్వారా విద్యార్థులకు శ్రమ, ఖర్చు తగ్గిందని ఆయన వివరించారు. కేవలం రూ.100 తోనే కొరుకున్న కళాశాలలకు అడ్మిషన్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని విద్యార్థులు, కోరుకున్న కళాశాలల్లో సీట్లు రాని విద్యార్థులు కూడా ఈనెల 25నుండి 30 వరకు అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇచ్చామన్నారు. వచ్చే నెల 2 వరకు సీట్లను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, లెక్చరర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలపై కదం తొక్కిన టిఎన్‌ఎస్‌ఎఫ్
* కలెక్టరేట్ ముట్టడికి యత్నం...అడ్డుకున్న పోలీసులు
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం టిఎన్‌ఎస్‌ఎఫ్ కలెక్టరేట్ ముట్టడికి యత్నించింది. వేలాది మంది విద్యార్థులతో టిఎన్‌ఎస్‌ఎఫ్ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ముందుగానే పసిగట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం కెజి టు పిజి వరకు ఉచిత విద్య, లక్ష ఉద్యోగాల కల్పన లాంటి హామీల ఆమలులో ఘోరంగా విఫలమైందన్నారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేసే విషయంలో ప్రభుత్వం విఫలమవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బి నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు తెలంగాణ చౌరస్తా వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దె ఎక్కిందని తీరా హామీల ఆమలు విషయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి పెద్ద ఎత్తున విద్యార్థి సమూహం కలెక్టరేట్‌పై దండేత్తే విధంగా తోసుకు రావడంతో ఎదైన ఉపద్రవం ముంచుకువస్తుందని భావించిన పోలీసులు మార్గమధ్యంలోనే వారు ఆందోళనకు అడ్డుకట్ట వేశారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యం విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ చిల్లులు వేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎప్ జిల్లా అధ్యక్షుడు కిషోర్, రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట - కొడంగల్
ఎత్తిపోతలపై కొనసాగుతున్న రగడ
* కర్వెన నుండి నీరు ఇస్తామంటున్న ప్రభుత్వం
* ఎత్తిపోతలే కావాలంటున్న అఖిలపక్షం...వేడెక్కిన రాజకీయం
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూలై 23: నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలంటూ అఖిలపక్షం చేస్తున్న మహాపాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. 2014 మే 23న 69 జిఓ ద్వారా నారాయణపూర్- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అప్పట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలోని పడమర, ఉత్తర ప్రాంతమైన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సాగు, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు జిఓను విడుదల చేశారు. భీమా ఎత్తిపోతల పథకానికి కృష్ణా నికర జలాల ద్వారా 20 టిఎంసిల నుండి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 7.10టిఎంసిల నికర జలాలు వాడుకోవడానికి 69 జిఓ అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకంలో 1.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ధేశించారు. 10 మండలాల పరిధిలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కూడా ఇందులో రూపకల్పన చేశారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎక్సలేటరీ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రాజెక్టు ( వేగవంతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన పథకం) ఈ ప్రాజెక్టు నిర్మించడానికి 90శాతం కేంద్ర ప్రభుత్వం (గ్రాంట్ ఇన్ ఎయిడ్) ద్వారా ఇవ్వనున్నారు. 10శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని 69 జిఓలో పొందుపర్చి ఉందని అఖిలపక్షం నేతలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.1450కోట్లకు పరిపాలన అనుమతులు కూడా ఇస్తూ రూ.113.86 కోట్ల బడ్జెట్‌ను ఆనాడే విడుదల చేసినట్లు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసి ఆర్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పక్కన పెట్టినట్లేనని సంకేతాలు వెలువడడంతో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధన కోసం ఎత్తిపోతల జలసాధన సమితితో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఉద్యమబాట పట్టాయి. కృష్ణానది తీరాన భీమా ప్రాజెక్టు భూత్పూర్ దగ్గర మొదటిరోజు ప్రారంభమైన యాత్ర రెండవ రోజు ఊట్కూర్ మండలంలో కొనసాగింది. అయితే అఖిలపక్ష నాయకులు నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తుండగా కాదు కాదు పాలమూరు ఎత్తిపోతల పథకంలోనే భూత్పూర్ మండలం కర్వెన రిజర్వాయర్ నుండి నారాయణపేటకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెప్పడమేకాకుండా మంత్రి హరీష్‌రావు ఈ విషయాన్ని గత మూడు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. దీంతో మంత్రి హరీష్‌రావు ప్రకటనను తాము ఒప్పుకోమని జలసాధన సమితి నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం సహకరిస్తే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నేరవేరుతుందని ఇక్కడి నేతలు చెబుతున్నారు. అయితే నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధనకై చేపట్టిన మహాపాదయాత్ర రాజకీయ దుమారం రేపుతుంది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలను ఈ పథకం పోరాటం ఏకం చేసింది. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ వేడి వాడివేడిగా కొనసాగుతుంది. అధికార పక్షంపై విపక్షాలు తుర్పార పడుతున్నాయి. అదే తరహాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్షాల నేతలపై మాటల యుద్దం చేస్తున్నారు. జలసాధన సమితి చేపట్టిన యాత్ర ఎటు దారి తీస్తుందోనని రాజకీయ దుమారం మాత్రం రేపిందంటూ రాజకీయ విశే్లషకులు చర్చించుకుంటున్నారు.

పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్
కొల్లాపూర్, జూలై 23: వచ్చే నెలలో జరిగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని కలెక్టర్ శ్రీదేవితోపాటు జిల్లా యంత్రాంగం మండలంలోని మల్లేశ్వరం, మంచాలకట్ట, సోమశిల, అమరగిరి ప్రాంతాలలో ఉన్న పుష్కర ఘాట్లను శనివారం పరిశీలించారు. కలెక్టర్ శ్రీదేవి మంచాలకట్ట, మల్లేశ్వరం ప్రాంతాలను పరిశీలించగా, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ సోమశిల, అమరగిరి పుష్కరఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్కర ఘాట్ల వద్ద మాట్లాడుతూ ప్రభుత్వం కృష్ణా పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద్ధ చూపుతున్నదని, అందుకు అనుగుణంగా అన్నీ పుష్కరఘాట్ల వద్ద వాహనాల పార్కింగ్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పుష్కరఘాట్ వద్ద పూజలు నిర్వహించేందుకు, పిండ ప్రదానాలు చేసేందుకుగాను ప్రత్యేక స్థలాలను కేటాయించాలని అధికారులకు సూచించారు. తాత్కాలిక మరుగుదొడ్లతోపాటు కొత్త, పాత పుష్కరఘాట్లను రెండు వైపుల ప్యారాసెట్‌వాల్‌లను నిర్మించాలని ఎఇలకు ఆదేశించారు. పుష్కరాల సమయం దగ్గర పడుతున్నందున పనులు వేగవంతంగా చేయాలని ఆమె సూచించారు. సోమశిలలో జెసి రాంకిషన్ మాట్లాడుతూ జిల్లాలో అన్నీ పుష్కరఘాట్లకన్న సోమశిలలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇదే ఊపుతో పనులన్నీంటిని పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

మొక్కలు నాటితే రాబోయే తరాల కష్టాలు తీరుతాయి
* హరితహారంలో కలెక్టర్ శ్రీదేవి
భూత్పూర్, జూలై 23: ప్రతి వ్యక్తి కనీసం 10 మొక్కలు నాటితే రాబోయే తరాలకు కష్టాలు తీరుతాయని కలెక్టర్ శ్రీదేవి అన్నారు. మండలంలోని కొత్తూర్ గ్రామంలో శనివారం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. మొదటగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తాటిపర్తి సమీపంలో ఈత మొక్కలు నాటారు. అనంతరం కొత్తూర్ సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆవరణలో మొక్కలు నాటి హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఆంజనేయస్వామి సాక్షిగా గ్రామంలో వెయ్యి మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నారని, మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత మీదేనన్నారు. జిల్లాలో కేవలం 16 శాతంమే చెట్లు, వనాలు ఉన్నాయని, అందుకు రెట్టింపుగా మన జిల్లాలో మొక్కలు నాటే లక్ష్యాంగా ప్రతి ఒక్కరు కర్తవ్యంగా భావించి విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్ అన్నారు. మొక్కలను నాటి లక్ష్యం చేరాలంటే గ్రామప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే విజయం సాధించవచ్చని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎజెసి బాలాజీ రంజీత్‌ప్రసాద్, జడ్పీ సిఇఒ లక్ష్మినారాయణ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వెంకటేష్ నేత, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్, ఇన్‌చార్జి ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ జ్యోతి, జడ్పీటిసి చంద్రవౌళి, ఎంపిపి సుకన్య నారాయణ గౌడ్, ఎంపిడిఓ గోపాల్‌నాయక్, ఎక్సైజ్ సిఐ శంకర్‌నాయక్, ఎస్సై జనార్ధన్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

లండన్‌లో కల్వకుర్తి ఎన్‌ఆర్‌ఐ ఫోరం
* ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
వెల్దండ, జూలై 23: లండన్‌లో త్వరలో కల్వకుర్తి ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 17 నుండి లండన్ నగరంలో ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వచ్చిన వంశీచంద్‌రెడ్డికి వెల్దండ మండల పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నేతలు, ప్రజాపతినిధులు ఘనస్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లండన్ పర్యటన విశేషాలను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాత్రికేయులతో పంచుకున్నారు. ఇంగ్లాండ్ దేశంలో ఉంటున్న కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఎన్ ఆర్ ఐలతో ప్రత్యేక ఫోరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే విధంగా బోనాల ఉత్సవాలు లండన్‌లో జరిగాయన్నారు. లండన్ పార్లమెంట్‌లో భారతదేశ పక్షాన మాట్లాడే అరుదైన అవకాశం తనకు లభించిందన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్ ఆర్ ఐలు పుట్టిన గడ్డకు, చదివిన బడి, గుడిల నిర్మాణాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరడంతో సానుకూలంగా స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపిడిటి కృష్ణయ్య, సర్పంచ్‌లు లక్ష్మయ్య, ముత్యాలు, పెద్దయ్యయాదవ్, మోతీలాల్‌నాయక్, మండల నాయకులు హమీద్, వెంకట్‌రెడ్డి, శేఖర్, శ్రీనుయాదవ్ పాల్గొన్నారు.

ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కృషి
* మంత్రి జూపల్లి కృష్ణారావు
ఇటిక్యాల, జూలై 23: గత పాలకుల కారణంగానే రాష్ట్రంలో పది సంవత్సరాల్లో పూర్తిచేయలేని ప్రాజెక్టులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రెండున్న సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తుందని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కొండేరు గ్రామంలో మాజీ ఎంపి మంద జగన్నాథం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో పూర్తిచేయడానికి కెసిఆర్ కంకణం కట్టుకొని ఉన్నాడని ఆయన అన్నారు. నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల పూర్తికాలేదని, ఇప్పుడు పూర్తి చేసేందుకు సిద్దమైన ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకులు జైపాల్‌రెడ్డి, డికె అరుణ, నాగంజనార్ధన్‌రెడ్డి, బట్టివిక్రమార్కలకు ప్రయత్నిస్తున్నారన్నారు. అనంతరం బీచుపల్లి ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో హరితహారంపై అన్ని మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత హరితహారం కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అధికారులు మొక్కలను నాటి వాటిని సంరక్షించుకునేందుకు ప్రతి మొక్కకు నాలుగు నుంచి 5 వరకు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామాలలో పనిచేయని ఫీల్డ్‌అసిస్టెంట్లపై చర్యలు తీసుకొని మూడు రోజుల్లో సస్పెండ్ చేయాలని ఎంపిడిఓలకు ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, డ్వామ పిడి దామోదర్‌రెడ్డి, ఇటిక్యాల జడ్పిటిసి ఖగ్‌నాథ్‌రెడ్డి, గద్వాల ఎంపిపి సుభాన్, హనుమంత్‌రెడ్డి, సూర్యబాబుగౌడ్ పాల్గొన్నారు.

నారాయణపేట- కొడంగల్
ఎత్తిపోతల సాధనకు ఉద్యమిద్దాం
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఊట్కూర్, జూలై 23: నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సాదించుకునేందుకు పార్టిలకు అతీయితంగా ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బిజెపి ఉపాధ్యాక్షులు నాగురావునామాజీలు పిలుపునిచ్చారు. వారు జల సాధన సమితి అధ్యర్యంలో చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. శనివారం మధ్యాహన్నం పాదయాత్ర ఊట్కూర్‌కు చేరుకోవడంతో రైతులు గ్రామస్థులు ఆయా పార్టీల నాయకులు పాదయాత్ర వస్తున్న వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం జిఓ 69ను 2014 విడుదల చేస్తూ నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 1450కోట్లతో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కృష్ణానది మక్తల్ నియోజకవర్గంలోని 40 కీలోమిటర్ల దూరంలో ప్రవహిస్తుండగా ఈ ప్రాంతానికి తాగునీరు అందించకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ ఉధ్యమ స్పూర్తితో ఎత్తిపోతల పథకం సాదించేందుకు పార్టిల అతీయితంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నడ్డివిరిచి 69జిఒను సాదించుకుని మూడు నియోజకవర్గాల్లో వలసలను నివారించవచ్చని అన్నారు. పక్కనే ఉన్న జూరాల ఎత్తిపోతల పథకం నుండి తాగునీరు అందించలేని ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి తాగునీరు అందిస్తామని ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తుందని వారు విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారని వారు ఆరోపించారు. ఆగష్టు1న జిల్లా కేంద్రంలో జరిగే ముగింపు సమావేశానికి రైతుల ప్రజలు భారి ఎత్తున తరలిరావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యాయన వేధిక కన్వీనర్ రఘవచారి, జిల్లా జెఎసి చైర్మన్ రాజేంధర్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు బక్కని నర్సిములు, సిపిఎం రాష్ట్ర నాయకుల రంగారావు, జాన్‌వేస్లీ, సారబ్‌కృష్ణ, అమ్మకోళ్లు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, నింగిరెడ్డి, సర్పంచ్ భాస్కర్, వెంకటరెడ్డి, సలీం, కృష్ణరెడ్డి, వెంకట్రామరెడ్డి, శేషప్ప, హన్మంతు, సత్యానారాయణరెడ్డి, చిన్నసాయిలుగౌడ్, నారాయణ, లక్ష్మణ్ణ, రాముగౌడ్, రమేష్, భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్ కాల్వకు గండి
నర్వ, జూలై 23: నర్వ మండల పరిధిలోని ఉంద్యాల, నాగిరెడ్డిపల్లి శివారులో ఉన్న స్టేజి-1 పంప్‌హౌస్ నుండి పరిధిపూర్ రిజర్వాయర్‌కు వెళ్లే ఓపెన్ కేనాల్‌కు ఎక్లాస్‌పురం గ్రామం వద్ద శుక్రవారం అర్ధరాత్రి గండి పడింది. కోయిల్‌సాగర్‌కు సరఫరా అవుతున్నా నీరు రాత్రంతా వృథాగా పోయింది. ఇరిగేషన్ శాఖ అధికారులు శనివారం పరిశీలించగా ఎక్లాస్‌పురం వద్ద కాల్వకు భారీ గండి పడడంతో వెంటనే హుటాహుటినా యంత్రాలతో గండి పూడ్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మంత్రులు అట్టహసంగా కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మూడు రోజులకే కాల్వకు గండిపడడం శోచనీయంగా ఉందని రైతులు అంటున్నారు. ప్రధాన కాల్వకు లైనింగ్ లేకపోవడం, తుమ్మచెట్లతో నిండిపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆ ప్రాంత రైతులు అన్నారు. కాల్వపై ఇరిగేషన్ అధికారులు ఏనాడు పరిశీలించకపోవడం కేవలం నీళ్లు వచ్చినప్పుడే కాల్వను చుస్తున్నారని పరిదిపూర్ రిజర్వాయర్ వరకు కాల్వల్లో తుమ్మచెట్లతో నిండిపోయిందని నాణ్యత లేని పనులు చేయడం వలనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అధికారులు సకాలంలో స్పందించి గండి పడిన కాల్వలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి కాల్వలో ఉన్న చెట్లను తొలగించాలని రైతులు అంటున్నారు.

హరితహారంలో సినీనటుల సందడి
బొంరాస్‌పేట, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మేము సైతం అంటూ వర్తమాన సిని నటులు రాజా, అబిజిత్, వెంకీ, తేజస్, నాగశౌర్య శనివారం బొంరాస్‌పేట మండలంలో సందడి చేశారు. మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి వెంట వచ్చిన సినీ హిరోలు గౌరారం, జిల్‌ముల్ మైలారం, చెట్టుపల్లితాండల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ హిరోలు వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో అభిమానులు వారిని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సినీ హీరోలతో సెల్ఫీలు దిగడంతో పాటు ఫొటోలు దిగేందుకు బారులు తీరారు. హీరోలతో కలిసి ప్రజలు కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరోలు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైనదని ఇందుకోసం తాము కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడికి వచ్చామన్నారు.

సకల జీవకోటికి చెట్లే జీవనాధారం
* మొక్కలను సంరక్షించడంలో భాగస్వాములు కావాలి
* ఐజి శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా కెసి ఆర్ హరితహారాన్ని మానసముత్రికగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు బాగస్వాములు కావాలని ఐజి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో పోలీసుశాఖ నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం ఎంతో ఉన్నతమైనదని రానున్న తరాలకు మంచి వాతావరణాన్ని అందించే భాద్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షణ భాద్యత కూడా తీసుకోవాలని ఆయన అన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పంట పొలాల్లో ఆడుకుంటూ ఆనందంగా గడిపేవారిమని, వర్షాలు సంవృద్దిగా కురిసేవని భూగర్భజలాలు నిండుగా ఉండేవని అన్నారు. రానురాను చెట్లు, అడవుల శాతం పూర్తిగా తగ్గిపోవడం వల్ల కాలుష్యం పెరిగి వర్షాలు పడకపోవడం కరువు పరిస్థితి నెలకొనడం వంటి దౌర్భగ్య పరిస్థితులు వచ్చాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ కృష్ణమూర్తి, సిఐలు సీతయ్య, సైదయ్య, రాజు, రామకృష్ణ, గిరిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.