మహబూబ్‌నగర్

పుష్కరుడి ప్రవేశంతో పులకించిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 12: పుష్కరుడి ప్రవేశంతో కృష్ణానది తీరాలు పులకించాయి. శుక్రవారం తెల్లవారుజామున 5.58 నిమిషాలకు మహామంగళహారతితో కృష్ణాపుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గద్వాల డివిజన్‌లోని బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డికె భరతసింహారెడ్డి వేదమంత్రోచ్చరణల మధ్య పుష్కరుడికి హారతితో స్వాగతం పలికారు. గద్వాల పట్టణ సమీపంలోని నదిఅగ్రహారం వద్ద ఎమ్మెల్యే డికె అరుణ పూజా కార్యక్రమాలను నిర్వహించి పుష్కర స్నానాలను ప్రారంభించారు. మొదటిరోజు పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా.. అన్ని దారులు కృష్ణానదివైపే అన్నట్లుగా తరలిరావడంతో నదితీర ప్రాంతాలు జనసంద్రాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా డివిజన్‌లోని పెద్దచింతరేవుల, బీరెల్లి, తెలుగోనిపల్లి, నదిఅగ్రహారం, బీచుపల్లి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కృష్ణమ్మ చెంత సందడి సంతరించుకుంది. అదేవిధంగా ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేయడంతో గద్వాల రైల్వేస్టేషన్, బస్ స్టేషన్‌లు పుష్కర భక్తులతో నిండిపోయాయి. రైల్వే స్టేషన్ నుంచి పుష్కరఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు ఆర్టీసి ప్రత్యేక చొరవను తీసుకోవడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా పుష్కరాల విజయవంతానికి తాముసైతమంటూ ఎందరో స్వచ్చంద సంస్థలు, ధార్మిక సంస్థలు ముందుకు వచ్చి పుష్కర భక్తుల సేవల్లో తరించిపోయాయి. మరింత ముందుకు వచ్చి భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కూడ ఏర్పాటు చేసి పుష్కరభక్తుల రాకకు సహకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని పిలుపునివ్వడంతో అధికార యంత్రాంగం, టిఆర్‌ఎస్ నేతలు, స్వచ్చంద సంస్థలు తమవంతుపాత్రగా పుష్కర భక్తులకు సేవలు అందించి విజయవంతం చేశారు. ప్రధానంగా పుష్కరఘాట్ల వద్ద పోలీసులు, గజ ఈతగాళ్లు సేఫ్టీకంచెను ఏర్పాటు చేసి స్నానాలు ఆచరించేందుకు భద్రత కల్పించారు.
* కృష్ణవేణికి హారతులు
మక్తల్: శుక్రవారం మండల పరిధిలోని పస్పుల ప్రధాన ఘాట్ వద్ద మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి చిట్టెం సుచరితలు ఉదయం 5.58 నిమిషాలకు పుష్కర స్నానం ఆచరించారు. దత్త పీఠాధిపతి అయిన శ్రీ రామప్రసన్నానంద సరస్వతీ మహారాజ్, ట్రీనీ ఐఎఎస్ ప్రమీలా సత్‌పతీ, ప్రత్యేకాధికారి హన్మంత్‌రావు, వేదపండితుల మధ్య కృష్ణమ్మకు గంగా హారతులిస్తూ కృష్ణాపుష్కరాలను ప్రారంభించారు. కృష్ణమ్మ చెంతన కొలువుదీరిన కృష్ణవేణమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీపాద వల్లభుని సన్నిధిలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి దంపతులు విశేష పూజలు నిర్వహించారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు కృష్ణమ్మ తీరంలోని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కర ప్రారంభంలో మక్తల్ వైస్ ఎంపిపి సునితా గోపాల్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పస్పుల సర్పంచ్ లింగప్ప, మాజీ సర్పంచ్ దత్తు, తహశీల్దార్ ఓంప్రకాష్, ఎంపిడిఓ విజయనిర్మల, డిఎస్సీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అడుగడుగునా పోలీసునిఘా
దేవరకద్ర: పనె్నండు ఏళ్లకు ఓసారి వచ్చే పుష్కరం ఆరంభం అయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 5.58నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ పుష్కరుడికి పూజలు చేసిన అనంతరం పుణ్యస్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జూరాల, నందిమళ్ల, తదితర ఘాట్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అడుగడుగున పోలీసులు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దింతో పోలీసుల బందోబస్తు మధ్య భక్తులు పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భక్తుల కోసం మార్గనిర్ధేశాలు చేసేందుకు వాలంటీర్లను నియమించి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కరాల మొదటిరోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఆయా ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన వాలంటీర్లకు, పోలీసులకు సహకరించి పుణ్యస్నానాలు ఆచరించాలని అధికారులు కోరుతున్నారు.