మీకు మీరే డాక్టర్

తియ్యని విషాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: తీపి తింటే షుగరు వ్యాధి వస్తుందా? తీపి ఎంత తినవచ్చు? ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు?
వివరంగా తెలియజేయగలరు.
-సరళాదేవి (శంఖవరం)
*
జ: ఆధునిక జీవన విధానంలో తీపి వస్తువుల వాడకం మితిమీరింది. అంతకు మునుపు కాఫీ, టీ, కూల్‌డ్రింక్‌ల వంటి పానీయాల వాడకం తెలీని పాత రోజుల్లో, కావాలని పాయసాలు, అప్పచ్చులు వంటి వంటకాలు చేసుకుంటే తప్ప తీపి రుచికి ఆహారంలో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉండేది.
నాగరికులం కావడం అంటే అపరిమితంగా తీపిని సేవించటం అనే కొత్త భాష్యం ఇప్పుడు చెలామణిలో ఉంది. లక్ష్మణవఝుల వారి ఇంట ఒక రూకకు వడ్డించిన పదార్థాలలో చెంచాడు పంచదార కూడా ఉన్నట్టు శ్రీనాథుడి చాటువు చెప్తోంది. ఇలా కావాలని పంచదార తినటమే ఆ రోజుల్లో ఉండేది. అమెరికన్ ప్రజలు ఆహార పానీయాల ద్వారా సగటున 20 చెంచాల పంచదారని కడుపులోకి తీసుకుంటున్నారని అమెరికన్ నిపుణుల తేల్చిన ఒక అంచనా. అమెరికాలో ఏం జరిగితే దాన్ని యథాతథంగా అవలంబించటం తెలుగు వారికి వ్యామోహంతో కూడిన ఒక అలవాటు కాబట్టి, ఇక్కడా అలానే తయారయ్యారంతా! అదనంగా పంచదారను చేర్చటం అనేది ప్రతీ పదార్థంలోనూ ఒక తప్పనిసరి అయ్యింది.
అమెరికాలో ఆల్పెన్ కీరియోస్, మొక్కజొన్న అటుకులు, కోకో క్రిస్పీస్, హనీ స్మాక్స్ ఇలా చాలా పేర్లు మనకు తెలీనివి వాళ్లకు ఉదయం అల్పాహారం. వాటిలో పంచదార కలిసేవే ఎక్కువ. మనకు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగులు టిఫిన్లుగా వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా కూడా కార్బోహైడ్రేట్లు (పంచదార పదార్థాలు), కొవ్వు పదార్థాలు, అజీర్తిని కలిగించే ఇతర అంశాలు ఎక్కువగా మన కడుపులోకి చేరుతున్నాయి.
తెలుగు నేల మీద ఎక్కువ మందికి రోజూ 6-10 సార్లు టీ తాగే అలవాటుంది. టీ స్టాల్స్ వాళ్లు ఒకేసారి పంచదార పానకం మాదిరిగా టీ తయారుచేసి సాయంత్రం దాకా మరిగించి పోస్తూ ఉంటారు.
కొందరికి భోజనంతోపాటు కూల్‌డ్రింక్ తాగటం నాగరికత. కొందరికి భోజనం చేయగానే టీ తాగటం నాగరికత. ఉప్పు కలిసిన బిస్కెట్టుని పాలు కలిసిన టీతో కలిపి నంజుకోవటం కొందరికి నాగరికత. తాము చేసిందల్లా గొప్ప అనుకునే వ్యక్తులు చేసే ఇలాంటి చిత్రాలు ఇతరుల మీద గట్టి ప్రభావానే్న చూపిస్తుంటాయి. ఈ విధంగా చాలామంది తమకు తెలియకుండానే ఈ విధంగా అతి తీపికి దాసులైపోతున్నారు.
పాలలోను, పండ్ల రసాల్లోనూ, టొమాటో, చింతపండు లాంటి ద్రవ్యాల్లో కూడా పంచదార ఉంటుంది. కానీ, ఈ సహజ పంచదార బజార్లో మనం కొలి తెచ్చుకునే పంచదారకన్నా తక్కువ ప్రమాదకరమైంది. ఆరోగ్యం కోసం పండ్ల రసాలు తాగేవారు అదనంగా పంచదారను చేర్చటం వలన ఎక్కువ అపకారాన్ని కొని తెచ్చుకుంటున్నారు. షుగరు వ్యాధి స్థూలకాయం లేనివారిక్కూడా వర్తించే సూత్రం ఇదే.
చాలా హోటళ్లలో సాంబారు బెల్లం పానకం మాదిరిగా ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో వండుకునే పులుసు కూరల్లో ఎత్తుకెత్తు బెల్లం వేస్తూంటారు. ఇలా మనకు తెలీకుండానే మనం అనేక రెట్లు అదనపు తీపిని తీసుకుంటున్నాం. ఇంత తీపి మనకు అవసరమా? అంతకు తగిన శరీర శ్రమ ఉన్న కష్టజీవులకు అవసరం కావచ్చేమో గానీ, మామూలు మధ్యతరగతి జీవులకు ఇంత తీపి అపకారం చేసేదే అవుతుంది.
శరీరానికి తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగుపాళ్లలో అందుతూ ఉంటేనే శరీరం, మెదడు, మనసు కూడా దృఢంగా ఉంటాయి. మన ఆహార విధానంలో తీపి, పులుపు మితిమీరి కడుపులోకి వెడుతోన్న వాస్తవాన్ని మనం మొదట గుర్తించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు తెలీకుండానే మనలో చాలామంది తీపిక బానిసలౌతున్నారు. తీపి లేకుండా కాఫీ టీలు తాగలేకపోతున్నారా? అయితే మీరు తీపికి ఎడిక్ట్ అయ్యారనే అర్థం. ఎడిక్షన్లకు ‘తీపి ఎడిక్షన్’ పునాది అవుతుంది. జీవితానికి సంతృప్తి చెందాలే గానీ ఆహారానికి సంతప్తృతో సరిపెట్టుకోవటం సరికాదు.
పంచదార, బెల్లం వీటిని ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం తినేవారికి కొంతకానికి వారి పేగులు తీపిని జీర్ణించుకునే శక్తిని కోల్పోతాయి. తీపిని జీర్ణించుకోవటం అంటే తీపి వలన కలిగే శక్తి ఉత్పత్తి అనే యంత్రాంగం విఫలమవుతుందని అర్థం. తీపి అతిగా వెడితే జఠరాగ్ని బలహీనవౌతుంది. శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. మనసు ఉత్సాహాన్ని కోల్పోతుంది. శరీరంలో మందత్వం ఏర్పడుతుంది. ఏ పనీ చేయబుద్ధి కాకపోవటం, శరీరం బరువుగా అనిపించటం, కదిలితే ఆయాసం, స్థూలకాయం ఏర్పడటం, మలబద్ధత, శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోవటం లాంటి లక్షణాలు ఏర్పడతాయని చరకుడు 2వేల సంవత్సరాల క్రితమే పేర్కొన్నాడు.
తీపి ఎంత అవసరమో అంతే తినాలి. బలమైన జీర్ణశక్తి లేనివారు, తగినంత శరీర శ్రమ లేనివారు, మానసిక వత్తిడిలో ఉన్నవారు తీపిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బాలురకు, 70లు దాటిన వయో వృద్ధులకు తగినంత తీపి ఇవ్వండి. తక్కినవారు అదనపు తీపిని ఎంత మానేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. సన్నగా ఉన్నవారు ఎంత తీపైనా తినవచ్చు అనుకోవటం కూడా సబబు కాదు. తీపి కష్టంగా అరిగే స్వభావం కలిగి ఉంటుంది. అందువలన జీర్ణశక్తిని అనుసరించే తీపిని తీసుకోవాలి. అతి తీపి విషమే! పంచదార, బెల్లం ఇలాంటివి తియ్యని విషాలుగా మారిపోకుండా చూసుకోవటం అవసరం.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com