మీకు మీరే డాక్టర్

‘ఆటిజం’ వ్యాధికి ప్లాస్టికే కారణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫురాణ కాలంలో పూతన లాంటి పిశాచాలు పిల్లల పాలిట యమదూతల్లా తయారయ్యేవి. పుట్టిన పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా తయారై ముప్పుగా పరిణమిస్తారని ఇలాంటి పూతనలను జనకంటకులైన పాలకులు ప్రయోగించేవారు. బాలకృష్ణుడు పూతనను సంహరించాడు. కృష్ణావతారంతో రాక్షస సంహారం పూర్తయ్యింది. ఆనాటి రాక్షస పిశాచాది జాతులు కలియుగంలో ప్లాస్టిక్కులై పుట్టాయి.
పురాణ కాలంలో రాక్షస రాజులందరూ చావు లేకుండా వరాలు అడిగేవాళ్లు. వారందరి కోరికా ప్లాస్టిక్కులుగా పుట్టడం ద్వారా ఇలా తీరాయి. ప్లాస్టిక్కు నాశనం చేస్తుంది గానీ, నశించదు. అందుకే అది రాక్షసి.
2020 ఫిబ్రవరి 19న హెల్త్ డే న్యూస్ వెబ్ జర్నల్‌లో గర్భవతులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలూ థేలెట్స్ అనే విష రసాయనాలు కలిసిన ప్లాస్టిక్ పాత్రలో పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకుంటే అవి ఆ శిశువులో ఆటిజానికి కారణం అవుతాయనే అంశం మీద తాజా పరిశోధనాంశాలను ప్రకటించింది. మనం ఇళ్లలో వాడుకునే ప్లాస్టిక్ సీసాల్లో విషపు పాలను, ఇతర పదార్థాలను నింపి గర్భవతులకు, బాలింతలకు, పసిపిల్లలకు ఇవ్వడంతో పిల్లలు మందమతులై, ఆటిజం వ్యాధి పాలిట పడ్తున్నారు. పూతనలు మళ్లీ ప్లాస్టిక్కులై పుట్టాయి. పిల్లల తల్లుల్లారా హెచ్చరిక!
ఆటిజం వ్యాధి పిల్లలకు 3-4 ఏళ్ల వయసులో బయటపడుతుంది. అసాంఘికత, చేసిన పనులే చెయ్యటం, చెప్పిందే చెప్పటం, దేనిపైనా ఉత్సాహం లేకపోవటం లాంటి అంశాలు ఈ వయసు పిల్లల్లో ప్రముఖంగా కనిపించటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కారణాన్ని కొట్టి పారేయలేమని శాస్తవ్రేత్తలు ఈ నివేదికలో హెచ్చరిస్తున్నారు.
సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్ పాత్రల్లో ఈ ‘్థలెట్స్’ ఎక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు వైద్యులు తప్పనిసరిగా వాడించే ఫోలిక్ యాసిడ్ ఈ ప్లాస్టిక్ దుష్టత్వానికి కొంతవరకూ విరుగుడుగా పని చేస్తుందని చెప్తున్నారు.
మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఔల్హోట్ ఈ పరిశోధనను నిర్వహించాడు. ప్లాస్టిక్ విషం సంగతి అలా ఉంచండి. గర్భవతులకు ఫోలిక్ యాసిడ్ ఎంత ఘనంగా అందించగలిగామన్నదే ముఖ్యం అంటారాయన. గర్భవతుల ఆరోగ్య పరిరక్షణ వైద్యపరంగా సక్రమంగా జరుగుతూ ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించగలిగితే అంత మంచిదని దీని సారాంశం.
కెనడా దేశానికి చెందిన నాలుగు నెలల లోపు గర్భవతులు 2వేల మందిని 2008-2011 మధ్యకాలంలో పరిశీలించి ఈ పరిశోధన చేసినట్టు ఆ నివేదిక చెప్తోంది. ఈ తల్లులలో థేలెట్స్ ఎక్కువగా వాడి, ఫోలిక్ యాసిడ్ తక్కువగా వాడిన వారి పిల్లల్లో 3-4 ఏళ్లు వచ్చేసరికి వారిలో ఆటిజం లక్షణాలు కనిపించినట్టు ఈ పరిశోధకులు నిర్ధారించారు. ఈ పరీక్షల క్రమంలో ఆడపిల్లలకి ఈ వ్యాధి సోకలేదనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. దానికి కారణాన్ని విశే్లషించలేక పోయినప్పటికీ, బహుశా హార్మోన్ల ప్రభావం దీని మీద ఉండవచ్చన్నారు.
ఆటిజం రావటానికి మానసిక కారణాలు, ఆనువంశిక కారణాలు, మాతృభాషలో పిల్లల్ని పెంచకపోవడం, ఆహార పదార్థాలలో విష దోషాలు ఇంక ఐతర సామాజిక కారణాలు, కుటుంబ కారణాలు చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం కూడా ఒక ప్రముఖ కారణంగా కనిపిస్తోంది. ఇది తేలికగా తీసిపారేయటానికి వీల్లేని విషయమే! ఎందుకంటే మన జీవితంలోంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించలేక పోతున్నాం కాబట్టి!
థేలెట్స్ ఉన్న ప్లాస్టిక్ పాత్రల్ని మనం ఆపినా వ్యవసాయోత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, ఔషధాలను ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పౌచిల ద్వారా విక్రయిస్తున్నారు. పాల పాకెట్లు, దగ్గు మందులు, టానిక్కులు ఒకటేమిటి సమస్తం ప్లాస్టిక్‌మయంగానే ఉన్నాయి వాటి వలన సంక్రమించే హానిని మనం ఆపలేం. ప్రభుత్వం వారు కూరగాయల్ని ప్లాస్టిక్కు కవర్లలో తీసుకెళ్ల వద్దంటున్నారు గానీ, కర్రీ పాయింట్లలో వండిన కూరల్ని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయకుండా ఆపటంలేదు. ఆపితే ఆ వ్యాపారులకు ప్రత్యామ్నాయం లేదు.
మనుషుల్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం మాన్పించాలంటే మళ్లీ మరచెంబుల కాలానికి వెనక్కి తీసుకుపోవాలి. అందుకు ఎంతమంది సిద్ధంగా ఉంటారో చెప్పలేం. నామోషీ పడేవారే ఎక్కువ! సరే, ప్రయత్న పూర్వకంగా వీటిని ఆపినా రోజూ మనం వాడుకునే షాంపూలు, సెంట్లూ, డిటర్జెంట్ సబ్బులు, ఆఖరికి నేల మీద పరచుకునే వినైల్ ఫ్లోరింగ్‌లు వీటన్నింటిలోనూ థేలెట్సున్నాయి. అత్యవసర స్థితిలో వాడవలసి వచ్చే రక్తం పాకెట్లు కూడా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పౌచిల్లోనే ప్యాకింగ్ చేస్తున్నారు.
సాధ్యమైనంత వరకూ బయటవి కొని తినటం ఆపేయండి. తప్పనిసరి అయితే, హోటల్లోంచో, కర్రీ పాయింటుల్లోంచో, స్వీటు షాపుల్లోంచో వండిన పదార్థాలు తెచ్చుకునేప్పుడు స్వంతంగా క్యారియర్ తీసుకు వెళ్లి అందులో తెచ్చుకోండి. ముఖ్యంగా వేడివేడివీ, అతి చల్లనివీ ప్లాస్టిక్ కవర్లో పెట్టి ప్యాక్ చేయకండి.
వండిన కూరని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి గుడ్డ కవర్లో పెట్టి ఇస్తే ఏం ప్రయోజనం..? సంచీని మారిస్తే సంచితాలు ఆగవు.
వాటర్ బాటిల్సుకు ప్రత్యామ్నాయంగా గాజుసీసాలు, మట్టి సీసాలు అంటున్నారు. ఆర్.వో ప్లాంట్ల నుండి ప్లాస్టిక్ కంటైనర్లలోనే ఆ నీటిని తెచ్చి సీసాల్లో నింపుతారు. బాటిల్ మార్చినా ప్రయోజనం ఏమీ దక్కకుండా పోతుంది. చాలా ఇళ్లపైన వాటర్ ట్యాంకులు ప్లాస్టిక్కువే ఉంటున్నాయి. వీలైతే వాటిని మార్చుకోండి. పాల ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, నేతి ప్యాకెట్లు అన్నీ ప్లాస్టిక్కే కదా! వీటిని వ్యక్తులుగా మనం ఏం చెయ్యగలం?
పూర్వం కూల్‌డ్రింకులు గాజు సీసాల్లోనే వచ్చేవి. వాటిని తిరిగి వాడేప్పుడు శుభ్రత పాటించటం లేదని, వాటిల్లో ఎలుకలు, బల్లులు ఊడా ఉండిపోతున్నాయని అప్పట్లో ప్లాస్టిక్ సీసాలను వాడకంలోకి తెచ్చారు. ఇంతవరకూ ప్లాస్టిక్కుకి చవకైన, నాణ్యమైన, ఆరోగ్య దాయకమైన ప్రత్యామ్నాయం లేదు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మనం కూడా శ్రద్ధ పెట్టి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి. మన సహకారం లేకుండా ప్లాస్టిక్ వాడకం ఆగదని ప్రజలందరూ భావించాలి. దగ్గు మందులు, టానిక్కులు గాజు సీసాల్లో పోసినా ప్లాస్టిక్ మూతలు పెడితే కథ మొదటికే వస్తుంది.
బజారు తిళ్లకు స్వస్తి చెప్పటం మొదటి చర్య. కూల్‌డ్రింకులు, పండ్ల రసాలు, ఇతర పానీయాలు ప్లాస్టిక్ సీసాల్లో ఉన్న వాటిని వదిలేయండి. అంతగా త్రాగాలనిపిస్తే సహజమైన పండ్ల రసాలు తాగండి. వాటిని కూడా మీ స్వంత స్టీలు గ్లాసులో తాగటం మీకే మంచిది. నామోషీ ఫీలవకండి. కాఫీ టీ తాగటానికి పూర్వ పద్ధతిలో పింగాణీ కప్పులే నయం. శుభ్రత పాటించే హోటళ్లలోనే తాగండి. పేపర్ కప్పులు కూడా ప్లాస్టిక్ వాసనే వేస్తున్నాయి. అవి ఎంతవరకూ నమ్మదగినవో చెప్పలేం. లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు స్టీలువే వాడండి.
ఇంట్లోంచి బయటకు వెళ్లేప్పుడు చేతి సంచీ పుచ్చుకు వెళ్లండి. పూర్వం పచారీ సరుకుల్ని పొట్లాలు కట్టేందుకు పాత వార్తాపత్రికల్ని వాడేవారు. ఆ పేపరు మీద అచ్చయిన రంగుల ద్వారా సీసం పాయిజనింగ్ జరుగుతోందని దాని స్థానే ప్లాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా అయితే కొనుక్కోవటం సులువయ్యింది. కానీ సురక్షితం కాదు గదా! గుడ్డ సంచులే నిజమైన ఆరోగ్య దాయకమైన ప్రత్యామ్నాయం కావచ్చు. ధాన్యం, పప్పులు ఇతర సరుకులు నిలవబెట్టుకోవటానికి స్టీలు డ్రమ్ములు లేదా డబ్బాలనే వాడండి. వంటింట్లోకి ప్లాస్టిక్‌ను రానీయకండి. లిక్విడ్ సోపులు, పౌడర్లు, షాంపూలు, స్నోలూ, ఇతర సౌందర్య సాధనాలూ ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఉంటే, అలాంటివి ఆపటమే మంచిది. ప్లాస్టిక్ టూత్‌బ్రష్‌ల వాడకం కూడా మంచిది కాదు. ఆఖరికి వ్రాత కోసం ప్లాస్టిక్ పెన్నులకన్నా లోహంతోనో చెక్కతోనో చేసినవి వాడటమే మంచిది.
ప్లాస్టిక్ వాడకం మనకు 1970ల తరువాతే ఇంత విచ్చలవిడి అయ్యింది. అది లేనప్పుడు మనం ఎలా జీవించామో అలా జీవించటానికి అలవాటు పడటమే శ్రేయస్కరం. ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయం కనుగొనేవరకూ!

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com