మీకు మీరే డాక్టర్

పూల కూరలు-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలువఫూల హల్వా
ఎర్రకలువ, తెల్లకలువ, తామరపూలకు సమాన గుణాలున్నాయి. వినాయక చవితికో దసరాకో పూజలు చేసే సమయంలో ఈ పూలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని సన్నగా తరిగి, కొద్దిగా నెయ్యి వేసి వేయించి, మిక్సీ పట్టి ముద్దగా చేసి, పాకం పడతారు. పచ్చకర్పూరం, ఏలకులు, బాదం, జీడిపప్పు, పిస్తాల్లాంటివి కలుపుకుని, హల్వా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. రోజూ తినవచ్చు. స్కూల్ నుండి అలసి వచ్చిన పిల్లలకు పెడితే తక్షణ శక్తినిస్తుంది. వేడిని తగ్గిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అరికాళ్లు అరిచేతుల్లో మంటలు తగ్గుతాయి. ఎసిడిటీ తగ్గుతుంది. కడుపులో అల్సర్లున్న వారికి త్వరగా వ్యాధి తగ్గుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. మూత్రంలో మంటని పోగొడుతుంది.
కొబ్బరి పూల టీ
కొబ్బరి పూలు చెట్టు కింద కుప్పలు కుప్పలుగా రాలి పడుతూ ఉంటాయి. రాత్రిపూట చెట్టుకింద ఒక దుప్పటి పరచి ఉంచితే తెల్లవారేసరికి చాలా పూలు దొరుకుతాయి మనకి. పట్టణాల్లో కూడా చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి ఇవి అపురూపంగా దొరికేవేమీ కావు. తేలికగానే దొరుకుతాయి. మనం నిత్యావసరాలకు కొబ్బరికాయను తప్ప కొబ్బరి చెట్టుకి సంబంధించిన దేన్నీ వాడుకోవటం లేదు. ఇప్పుడు ప్లాస్టిక్ చీపుర్లు వచ్చాక కొబ్బరీనల చీపిరి కూడా నామోషీ అయ్యింది. ఇలాంటి నామోషీలు మనకు మనం చేసుకునే చెరుపులే!
కొబ్బరి పూలతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ప్రధానమైంది వేడిని తగ్గించటం, షుగరు వ్యాధిలోనూ, రక్తప్రసార వ్యాధుల్లోనూ చర్మం మీద కారం పోసినట్లు మంటలు పుట్టే వారికి ఇది అద్భుత ఔషధం. ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడివలన అయ్యే విరేచనాలను తగ్గిస్తుంది. నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. నెలసరి సమయంలో ఋతుస్రావం అమితంగా అవటాన్ని ఆపుతుంది. స్ర్తిలలో వచ్చే తెల్లబట్ట వ్యాధిని కూడా తగ్గిస్తుంది. దీని కషాయాన్ని పుక్కిలిస్తూ ఉంటే తక్షణం నోటిపూత తగ్గుతుంది. బీపీని అదుపులోకి తెస్తుంది. గుండె ఎక్కువసార్లు కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. షుగరు వ్యాధిలో కలిగే ఉపద్రవాలను త్వరగా తగ్గిస్తుంది.
ఈ పూలు గట్టిగా ఉంటాయి. తేలికగా దంచేయగలిగేవి కావు. నీళ్లలో వేసి కాయగానే ఎర్రగా అవుతాయి కాబట్టి ఆ నీటిని టీలాగా తాగవచ్చు. వడగట్టినాక మిగిలిన కొబ్బరిపూలను మళ్లీ కాచినా ఎర్రనీళ్లే వస్తాయి. రెండు మూడుసార్లు కషాయంలా కాచుకోదగినవిగా ఉంటాయి. ఒకసారి కాచి బయట పారేయనవసరం లేదు.
కొబ్బరి పూలు, ఈతపూలూ, ఖర్జూరం పూలూ ఈ మూడింటికీ ఇవే గుణాలున్నాయి. వీటిలో ఏది దొరికినా ఇలా కాచుకోవచ్చు. చారు కూడా పెట్టుకోవచ్చు.
కొబ్బరికాయ లోపల వెన్నముద్దలా పువ్వు ఉంటుంది. దీన్నీ కొబ్బరి పువ్వు అనే అంటారు. ఇది కొబ్బరి రుచిలోనే ఉంటుంది. దీన్ని నేరుగానే తినవచ్చు. లేత కొబ్బరికి, కొబ్బరి నీళ్లకు, కొబ్బరి పూలకు ఏ గుణాలుంటాయో దీనికీ ఆ గుణాలే ఉంటాయి.
గుమ్మడిపూల పప్పుకూర, పులుసుకూర, హల్వా
గుమ్మడి కాయలంటే ఖరీదుగానీ, దాని పూలు వృథాగా వదిలేసేవే! వాటి ఉపయోగాలు తెలియక పోవటం వల్లనే మనం చాలా ప్రకృతి సంపదలోని ఔషధ విలువలను కోల్పోతున్నాం. గుమ్మడిపూలతో పప్పు లేదా పులుసుకూరగా వండుకునే అలవాటు మన పూర్వులకుండేది. ఆ రోజుల్లో ఇన్నన్ని ఆసుపత్రులు, ఇంత వైద్య విజ్ఞానం అందుబాటులో లేకపోయినా వాళ్లు ఒక్క ఇంజెక్షన్ కూడా చేయించుకోకుండా ఎలా ఆరోగ్యంగా బతికారో తెలియాలంటే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నారో మనం గమనించాలి. గుమ్మడికాయనే మనం దిష్టి తీసి కాయని పగలగొట్టడం లాంటి పనులకు తప్ప అది ఒక కూరగాయ అనే సంగతే మరచిపోయాం. కాయకే దిక్కులేకపోతే ఇంక వాటి పూల గురించి ఆలోచించేది ఎవరూ..!
శరీరంలో వేడిని తగ్గించడం ఈ పూల కర్తవ్యం. విష దోషాలను హరిస్తాయి. ఎసిటిడీని తగ్గిస్తాయి. జ్వరాల్లో మేలు చేస్తాయి. పథ్యంగా పెట్టదగిన ఆహార పదార్థం. ఏ వంటకంగానూ చేసుకోలేక పోతే నేతితో వేయించి పాకం పట్టి హల్వా చేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు మంచిది. అలసట తీరుస్తుంది.
గులాబీ పూల హల్వా, కారప్పొడి
గుల్కందు పేరుతో కిళ్లీల్లో వేసే గుజ్జు లాంటి పదార్థం గులాబీ పూల హల్వానే! బలకరం. నీరసాన్ని పోగొడుతుంది. మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇది తిన్న వారి శరీరంలోంచి చక్కని పరిమళం వస్తుంది. శరీరంలోని ధాతువులన్నింటికీ పోషణ నిస్తుంది. అమితంగా చలవ చేస్తుంది. వాత వ్యాధులు, పైత్య వ్యాధుల్లో బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటినీ పోగొడుతుంది. కడుపులో అల్సర్లతో బాధపడే వారికి దీన్ని పెడుతుంటే పేగుపూత వ్యాధి త్వరగా తగ్గుతుంది. ముఖ్యమైన ప్రయోజనం గుల్కందు మృదు విరేచనకారి. కాల విరేచనం కాని వారు విరేచనం మాత్రల మీద ఆధారపడకుండా ఇలాంటి ఉపాయాలను పాటించవచ్చు. ఎంత మోతాదులో తీసుకుంటే ఒక్క విరేచనం ఫ్రీగా అవుతుందో చూసుకుని, అంత మోతాదులో తీసుకోవచ్చు.
తాజా గులాబీ రేకుల్ని ఓ బేసిన్ లాంటి పాత్రలో పలుచగా పరిచి దానిపైన పంచదార చల్లుతారు. దానిపైన మళ్లీ గులాబీ రేకుల్ని పరిచి మళ్లీ పంచదార చల్లుతారు. ఇలా అనేక పొరలుగా గులాబీ రేకుల్ని పంచదారనీ ఉంచి, మూతపెట్టి భద్రంగా ఉంచండి. ఒకటీ లేక రెండు రోజుల్లో ఈ గులాబీ రేకులన్నీ పంచదారతో కలిసి ముద్దగా అవుతాయి. అందులో కొద్దిగా నెయ్యి, జీడిపప్పు, పచ్చకర్పూరం వగైరా ఇష్టమైనవి కలిపి హల్వాలాగా చేసుకుని ఓ సీసాలో భద్రపరచుకుని రోజూ ఉదయం లేదా రాత్రిపూట చెంచా మోతాదులో ప్రతీరోజూ తీసుకోవచ్చు. గులాబీ రేకుల్ని నేతితో వేయించి ముద్దలా చేసి పాకం పట్టి హల్వా చేసుకోవచ్చు కూడా. మీ యుక్తిననుసరించి తీసుకోవచ్చు.
వేపపూల మాదిరే, గులాబీ రేకుల్ని ఎండించి నేతితో వేయించి కారప్పొడి కొట్టుకుని అన్నంలో మొదటి ముద్దగా కొందరు తింటారు. కమ్మగా తినేందుకు వీలుగా ఎలా తయారుచేసుకోవాలో కొత్తగా ఆలోచించండి!
బీపీ వ్యాధి, గుండె జబ్బులూ, పేగుపూత, కీళ్లవాతం, సయాటికా నడుం నొప్పి, మైగ్రేన్ తలనొప్పీ ఉన్నవారికి ఇది హితకరంగా ఉంటుంది. మూత్రంలో మంట తగ్గించి, మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా హృదయ వ్యాధుల్లో గులాబీని ఏదో ఒక రూపంలో కడుపులోకి తీసుకోవటం మంచిది. చాలామంది గులాబీ పూలతో షర్బత్ తయారుచేసి వాడుకుంటారు. అంటే గులాబీ పూల కషాయంలో పంచదార వేసి చిక్కగా కాచిన పానకం చాలా మేలు చేస్తుంది.
గులాబీలలో అనేక రకాలున్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా అన్ని గులాబీలకూ ఉంటాయి. అయితే స్థానికంగా మనకు దొరికే గులాబీ రంగు గులాబీ పూలే మంచివి.
(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com