ఉత్తర తెలంగాణ

అంకుశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని పేరు పరాంకుశం. ‘అంకుశం’ అతని కలం పేరు ‘అవినీతి, అక్రమాలకు తన రచనలు ‘అంకుశం’ వంటివని అతనంటుంటాడు. వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డ అతని కథలు ‘అంకుశం కథలు’ అన్న పేరుతో ఈ మధ్యనే పుస్తకంగా అచ్చయ్యాయి.
అంకుశానికి ఇంగ్లీష్ భాష మీద పట్టుంది. అతడు ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదువుతాడు. మాటిమాటికి ఇంగ్లీష్ కొటేషనే్ల చెపుతాడు. అయితే అతని రచనలు చదివినవారు మాత్రం అవన్నీ చాలావరకు గ్రంథ చౌర్యాలే అంటారు. అతడు ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదువుతాడు కాబట్టి వాటిని కాస్త అటుఇటు మార్చి తెలుగులో రాస్తుంటాడని అంటారు. కాని అంకుశం వారి మాటల్ని ఒప్పుకోడు. తనకు ఇంగ్లీష్ బాగా వచ్చునన్న ఈర్ష్య చాలామందిలో ఉందని, అందుకే అలా అంటారని తిప్పికొడతాడు.
ఈ మధ్య ఒక వారపత్రిక ‘దొంగ’ అన్న పేరుతో అంకుశం నవలను సీరియల్‌గా ప్రచురిస్తోంది. ఆ సీరియల్ మూడు, నాలుగు వారాలు ప్రచురితమయిందో లేదో అది ఇంగ్లీషులోని ‘్థఫ్’ అనే నవలకు మక్కీకి మక్కీ అని విమర్శలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ విషయం మీద అంకుశాన్ని ప్రశ్నిస్తే అసలు తాను ‘్థఫ్’ నవలను చూడనే లేదని చెప్పాడు. ఇద్దరు రచయితల భావాలు ఒక్కలా ఉన్నంతమాత్రాన అది కాపీ రచన అని చెప్పడానికి వీల్లేదని అన్నాడు.
అంతవరకు బాగానే ఉంది. కానీ అంతలోనే తెలుగులోనే ఉన్న మరో పత్రిక పోటీగా ‘్థఫ్’ నవల తెలుగు అనువాదాన్ని సీరియల్‌గా ప్రచురించడం ప్రారంభించింది. దాంతో ఒక పత్రికలో ‘దొంగ’ సీరియల్, మరో పత్రికలో ‘్థఫ్’ తెలుగు అనువాదం ధారావాహికగా రావడం మొదలయ్యాయి.
ఇలా కొన్ని వారాలు గడిచేసరికి ‘దొంగ’ సీరియల్ ‘్థఫ్’ నవలకు కాపీ అని పాఠకులకు అర్థమవసాగింది. అయినా తనది గ్రంథచౌర్యమని అంకుశం ఒప్పుకోలేదు.
కొద్ది వారాల్లోనే విషయం మరింత రసవత్తరమయింది. ‘దొంగ నవలా రచయిత అంకుశం’ అనే విమర్శకులు రాను రాను అతన్ని ‘దొంగ అంకుశం’ అనడం ప్రారంభించారు. పాఠకులు కూడా పత్రికలకు రాసే ఉత్తరాల్లో ‘దొంగ అంకుశం’ అనే రాయడం మొదలుపెట్టారు. పరిస్థితిని గమనించిన అంకుశం తన సీరియల్‌ను నిలిపివేయమని పత్రిక యాజమాన్యాన్ని కోరాడు. కానీ ఆ సీరియల్‌పై జరుగుతున్న చర్చను, తద్వారా పెరుగుతున్న పత్రిక సర్క్యూలేషన్‌ను దృష్టిలో పెట్టుకున్న పత్రిక యాజమాన్యం అంకుశం కోరికను అంగీకరించలేదు. దాంతో అప్పటికే పెద్దమొత్తంలో రాయల్టీ తీసుకున్న అంకుశం ఏం చేయాలో తోచక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు!
సీరియల్ చదువుతోన్న పాఠకుల్లో కూడా ఉత్సుకత పెరిగింది. చదివేవాళ్లు రెండు పత్రికలు కొని రెండు ధారావాహికల్ని చదువుతున్నారు. రెండు పత్రికలకు ఉత్తరాలు రాస్తున్నారు.
ఇదంతా గమనిస్తున్న ఒక టివి ఛానల్ వారు ‘దొంగ’ నవల మీద ఒక చర్చను ఏర్పాటు చేశారు. అందులో సాహిత్యంలో పడిపోతున్న విలువల పట్ల ఒక విమర్శకుడు ఆవేదన వ్యక్తం చేసి అంకుశం ‘దొంగ రచయితే’ అన్నాడు. మరో విమర్శకుడు గ్రంథచౌర్యమే కాక సాహితీ విలువలను హత్య చేశాడని ఇలా పలు విధాలా అంకుశంను విమర్శించారు.
కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే టీవీ ఛానల్ వారు ఎస్‌ఎంఎస్ పోల్ ఏర్పాటు చేశారు. అందులో రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి ‘అంకుశం దొంగ అవునా? కాదా?’ అని. రెండోది ‘అంకుశానికి శిక్ష పడాలా? వద్దా?’ అని వీటికి స్పందిస్తూ తొంభై శాతానికి పైగా ప్రేక్షకులు అంకుశం దొంగేనని, అతనికి శిక్ష పడాలన్నారు. అలా అంకుశం దొంగ రచయితగా స్థిరపడిపోయాడు!
విమర్శలు ఇలా కొనసాగుతున్న కొద్దీ అరవై సంవత్సరాల క్రితం వచ్చిన ‘్థఫ్’ నవలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. దీన్ని గమనించిన ప్రచురణకర్తలు అప్పటికే నాలుగు ముద్రణలు పొందిన ‘్థఫ్’ నవలను ఐదో ముద్రణ వేసి సొమ్ము చేసుకున్నారు.
ఇక దీన్ని ఇంతటితో ఆపేద్దామనుకున్నారేమో, పత్రిక యాజమాన్యం వారు మిగతా! ‘దొంగ’ నవల మొత్తాన్ని ఒకేసారి ఒకే సంచికలో ప్రచురించి ముగింపు పలికారు.
అప్పుడే నవలను పూర్తిగా చదవని వారు చదివిన వారి నడిగి కథను తెలుసుకున్నారు. ఆ కథలో ప్రధానంగా అనివార్యమైన పరిస్థితుల్లో దొంగతనం చేస్తాడు. కోర్టు అతనికి మూడు సంవత్సరాల శిక్ష వేస్తుంది. అంతే కాదు దొంగతనం చేయాల్సిన పరిస్థితులు కల్పించిన సమాజాన్ని కూడా కోర్టు తప్పుపడుతుంది. అయితే సమాజానికి శిక్ష వేసిన ఉదంతాలు న్యాయ చరిత్రలో లేవని, శిక్షను ఎలా విధించుకోవాలనేది సామాజికుల నైతికతకే వదిలిపెట్టింది కోర్టు. కథ మామూలుదే అయినా అద్భుతమైన కథనము, ఆకట్టుకునే సన్నివేశాలు, హృదయాన్ని కలచివేసే సంఘటనలు, ప్రధానంగా సమాజ నిర్మాణంలో సామాజికుల బాధ్యతలు మొదలైనవి అనేకం ఉండడంతో ఆ రోజుల్లో ‘దీక్ష’ నవల ఒక ఊపు ఊపింది. అయితే ఇది ఇంగ్లీష్ తెలిసిన పాఠకులకే పరిమితమయింది.
అంకుశం కథ ఇంతటితో ఆగలేదు. సాహితీ విలువల్ని కాంక్షించే సాహితీ మిత్రులు కొందరు ‘సాహితీ విలువల పరిరక్షణ సమితి’గా ఏర్పడ్డారు. వారు సాహితీ అభిమానుల ఇంటింటికి తిరిగి వారిని భాగస్వామ్యులను చేస్తూ చందాలు సేకరించారు. ఆ డబ్బుతో అంకుశం ‘దొంగ’ నవలను పుస్తకంగా ముద్రించారు. ముద్రించడమే కాదు, దాని ధరను ఐదు రూపాయలే నిర్ణయించి, సాహితీ అభిమానులందరు ఆ నవలను కొని వచ్చే ఆదివారం నాడు తగుల బెట్టాలని కోరారు. దొంగ అంకుశానికి ఇదే సరియైన శిక్ష అని సమితి వారు ప్రకటించారు.
ఆ ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. సాహితీ అభిమానులు చాలామంది ఆ నవలను కొని ప్రధాన కూడళ్లలో ఆదివారం నాడు తగులబెట్టారు. తరువాత అన్ని పేపర్లలోను, టివి ఛానళ్లలోను అంకుశం నవలా దహనమే కనిపించింది!
మొదటి నుండి ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న సాహితీ పెద్దలు రకరకాలుగా స్పందించారు. కొందరు అంకుశానికి తగిన శిక్షపడిందన్నారు. మరికొందరు అంకుశానికి అది చాలదన్నారు. ఇంకొందరు సాహిత్యానికి మంచి రోజులొచ్చాయన్నారు.
ఇంత జరిగినా అంకుశం జాడలేదు. ‘అతడు మనలోనే ఉంటాడని, అతన్ని ఓ కంట కనిపెడుతూనే ఉండాలని’ సాహితీ విలువల పరిరక్షణ సమితి ఇప్పటికీ అంటోంది!

- మెట్టు మురళీధర్
హన్మకొండ,
సెల్.నం.9949938833

****

పుస్తక సమీక్ష
--
దీర్ఘ కవితలో బందీ
మిషన్ కాకతీయ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ (మిషన్ కాకతీయ) పథకానికి ఆకర్షితులై కవి మియాపురం శ్రీనివాస్ ‘చెరువు’ పేరుతో ఓ దీర్ఘ కవితను ప్రకటించి.. వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలను విడమరిచి చెప్పారు. చెరువులకు మానవ జీవనానికి ఉన్న సంబంధాన్ని అందంగా అక్షరాల్లో బంధించారు.
చెరువులతోనే మానవ మనుగడ ముడిపడి ఉన్నదనీ.. పర్యావరణం, జలవనరులు, ప్రజల భాగస్వామ్యంతో రక్షణ వంటి అంశాలను దీర్ఘ కవితలో జొప్పించి పాఠకులను మెప్పించయత్నించారు. గ్రామీణ వృత్తులు, పర్యాటక రంగం జీవకోటి ఆధారం, పూడికమట్టితో ఉన్న ఉపయోగాలను కవిత్వంలో పొందుపరిచారు.
చెరువుల జాడలు తెలుసుకుని.. గొలుసుకట్టు చెరువులుగా పునరుద్ధరించి.. ఒక్కో నీటి చుక్కను ఒడిసి పట్టి.. జాతిని జాగృతం చేద్దామని కవి పిలుపునిచ్చారు.
తెలంగాణ చెరువులు ప్రపంచానికే ఆదర్శమనీ.. వేల వేల చెరువుల సంద్రం తెలంగాణ నేల అమృతమని వ్యాఖ్యానించారు.
పూడిక తీతలు చేపట్టి రతనాల రంగుల పంటలు పండిద్దామని.. అందుకు ప్రతి వ్యక్తీ ఒక భగీరథుడు కావాలని కాంక్షించారు. పల్లెల్లోని మన చెరువులు వెండి వెనె్నల వోలే మెరిసినప్పుడే.. పసిడి పంటలకు మోక్షం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని హరిత వర్ణం చేయాలంటే.. చెరువులకు ప్రాణం పోయాలనీ, చెరువు సల్లగుంటేనే.. భూగోళం చల్లగుంటుందని చెప్పారు. క్షామం, దుర్భిక్షాలు దరి చేరకుండా ఉండాలంటే చెరువులు నిండుగుండాలని కోరారు. చెరువు నిండితేనే.. గుండె నిండా సంతోషమనీ.. మన చెరువులే మన కల్పతరువులని గుర్తించి పునరుద్ధరించడానికి ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చెరువు మన బ్రతుకు చిత్రమనీ.. కుల వృత్తుల జీవన చిత్రమనీ.. రైతులను రారాజులను చేసేందుకు.. వివిధ వృత్తులను నిర్వహించే వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చెరువులను కాపాడుకుందామని కోరారు. మన చెరువు నిండితేనే.. బావులు, బోర్లు జీవించే ఉంటాయనీ.. అందుకే సాగునీరు, తాగునీరుకు శ్రీకారం చుడదామని పేర్కొన్నారు.
చెరువు మన ఊరి ముచ్చట్ల కూడలి అనీ.. ఊరి కష్టాలు చెప్పుకునే అరుగు అని అభివర్ణించారు.
చెరువు నిండితేనే చేపలు చెంగు చెంగుమంటాయనీ, చెరువులతోనే పశువులకు పబ్బమనీ.. అందుకే చెరువుల పునరుద్ధరణను ప్రజల భాగస్వామ్యంతో ఓ ఉద్యమంలా చేపట్టాలని కవి కాంక్షించారు. తెలంగాణ చెరువులు ధరణి దర్పణాలంటూ రామప్ప, పాకాల, లక్నవరం, ఘణపురం, బయ్యారం చెరువులను ప్రస్తావించారు.
కాకతీయ కాలువలు.. ఊరూరా చెరువులు సిరుల పంటల జల్లులనీ, ప్రగతి సిరుల వెలుగులని అభివర్ణించారు. చెరువుల పునరుద్ధరణ మన విధి.. చెరువు నీళ్లు మన నిధి అని గుర్తు చేశారు.
దీర్ఘ కవిత ద్వారా ఇలా చెరువు యొక్క ప్రాశస్త్యాన్ని సీక్వెన్స్ దెబ్బ తినకుండా విభిన్న కోణాల్లో ఆవిష్కరించిన కవి మియాపురం శ్రీనివాస్‌ను అభినందిద్దాం.. ఆయన కాంక్షించినట్లు.. తెలంగాణ చెరువులు భరత మాత నీటి పూదోటలు కావాలని కోరుకుందాం.. జలం విషయంలో.. ముఖ్యంగా చెరువు విషయంలో జన చైతన్యానికి దోహదపడేలా దీర్ఘ కవిత ముస్తాబై రావడం ముదావహం!
అయితే కొన్ని భావాలు అక్కడక్కడ రిపీట్ కాకుండా చూస్తే బాగుండేది. దీర్ఘ కవితను కొనసాగించే క్రమంలో కొన్ని పంక్తుల్ని బలవంతంగా కవిత్వాంశ ఏ మాత్రం లేకుండా.. ప్రతీకలకు ఆస్కారం లేకుండా జొప్పించినట్లు కనిపించినా.. కవి యొక్క సామాజిక చింతనను మెచ్చుకోకుండా ఉండలేము! చాలా పంక్తులు నినాదాలుగా కనిపిస్తాయి.. సామెతలను తలపిస్తాయి! అయినా వాటి మాటున దాగిన భావాలు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి.
- సాన్వి, కరీంనగర్,
సెల్.నం.9440525544

***

మనోగీతికలు
---
పునర్జన్మ

స్నేహితులెందరున్నా
సంపదలెన్ని ఉన్నా
కదనరంగంలోనో
కార్ఖానాల్లోనో
రోడ్డు ప్రమాదంలోనో
రోజువారి పనుల్లోనో
ప్రాణాపాయ సమయానికి
అవయవాలనందించి
ప్రాణదీపం వెలిగించే
దయార్ద్ర హృదయులు
అవయవదాతలు
కవచకుండలాలనే
లెక్కచేయని
కర్ణుడి వారసులు
అంతిమ తీర్పు దేవుడిదైనా
అవయవ దానంతో
మృత్యువునే ఓడించే
శక్తివంతులు
మృత్యువుతో దూరమైనా
తమవారింకా
మరణానంతరం దేహంలో
ఉపయోగపడే అవయవాలను
మట్టిలో కలిసిపోనీయకుండా
మంటలో కాలి మసైపోనీకుండా
మరో మనిషికి అందజేసే
పునర్జన్మతో
తమతోనో ఉన్నారన్న భావన దాతల బంధు మిత్రుల్లో
ప్రతిఫలిస్తుంది
పరహితమే
అభిమతమైనపుడు
మానవత్వం గుబాళిస్తుంది
- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల
సెల్.నం.9948748982
****

అర్థం కాని తెలుపు

తెలుపు.. ఆమెకెంతిష్టమో
చిన్ననాటి వైట్ స్కూల్ డ్రెస్సు
దూదిపింజల్లాంటి మబ్బులు
తాత నుదుటన విభూతిరేఖలు
ఆమె మధురస్మృతులు
కాలం గడిచింది
ఆమె ఇల్లాలయింది
నిజంగానే ఆమె జీవితం
పచ్చని వాకిలిలో
తెల్లని ముగ్గులా
సిగలో తురిమిన
తెల్లని మల్లెలా
ఉయ్యాల్లో పాప
తెల్లని పాల పండ్లలా
ఆమె తీపి జ్ఞాపకాలు
కాలం గడిచింది
అదే తెలుపు
ఇప్పుడదంటే
ఆమెకెంత కోపమో!
అవును
సిగలో తెల్లని మల్లెలు
శాశ్వతంగా మాయమై..
తెల్లని విభూతిరేఖలు
నుదుట్లోవెలసి ఆమె
దురదృష్టాన్ని వెక్కిరిస్తున్నాయి!
తెల్లని మేఘాల్ని చూసినప్పుడల్లా
తాను కట్టిన తెల్లని చీరను
చూసినట్లయి..
తెల్లని ఆమె కళ్లల్లో
ఎర్రని కన్నీళ్లు
నల్లపూసలు లేక తెల్లబోయిన
మెడ తెల్లని అద్దంలో
నల్లగా ప్రత్యక్ష్యం!
ఘల్లు ఘల్లుమని మోగిన
ఆమె తెల్లని పట్టీల సవ్వడి
మూగబోయినట్టు
ఆమె వెక్కిళ్ల సవ్వడే సాక్ష్యం
ఇప్పటికీ..
ఆమెకు అర్థం కానిదొకటే..
పుట్టుకతో వచ్చిన..
బొట్టు పూలు
మధ్య వచ్చిన పుస్తెలతో..
ఎందుకు మాయమైనాయోననీ!

- పెనుగొండ సరసిజ
కరీంనగర్
సెల్.నం.7386806499

***

మనం ‘రెండోసారి’

ఒకసారి మనం కన్నుమూసినా
రెండోసారి మన కన్ను అంధునికి కొత్త చూపై నడిపిస్తుంది
ఒకసారి ఆయుప్రమాణం ముగిసినా..
రెండోసారి మన లివర్ మరొకరి దేహంలో తన పవర్
చూపెడుతూ తన పని తాను
మళ్లీ ఎప్పటిలాగే చేసుకుంటూ పోతుంది
కిడ్నీ చనిపోయిన మనిషి నుండి
దానమై మరొకరి దేహంలో నిరంతర వడబోత
కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది అవిశ్రాంత శ్రామికునిలా!
ఒకసారి గుండె ఆగిపోయినట్లు అనిపించినా
ఇంకొకరి దేహంలో మళ్లీ లబ్‌డబ్ ఎత్తిపోతలతో
మళ్లీ ఇంకో జీవితానికి శ్రీకారం చుడ్తాయి!
మనకు వంద సంవత్సరాలు ఆయుప్రమాణమైతే
మన అవయవాలకు రెట్టింపు సంవత్సరాలుగా ఆయుప్రమాణం
పొడిగింపబడి సార్థకం అవుతున్నాయి!
మన మొత్తం దేహం నిర్జీవమైనా
వైద్య విద్యార్థికి సర్జరీ పాఠాలను కంటిముందు ప్రదర్శిస్తుంది!
మరణాంతరం మనిషికి పునర్జన్మ ఒక ‘నమ్మకం’
మన అవయవాలకు మరో వ్యక్తి దేహంలో
రెండోసారి పునర్‌జన్మ పరమసత్యం
ఒకరి అవయవ దానం
మరొకరికి ఆయు ప్రధానం!
ఇది దయామయ ప్రకృతి మాత ప్రసాదించిన సంజీవనీ కృతి!

- కందాళై రాఘవాచార్య
నిజామాబాద్, సెల్.నం.9908612007
***

ప్రకృతి మాత!

అడవుల నెల్ల.. అమ్ముతూనే
ఈ.. కరువుకు కారకుడెవరనే
పాలించే.. పాలకుడే.. అంటుంటే..!
కంచె చేను మేసినట్లుంది...
లక్షలాది మొక్కల వనసంపదల
గుట్టల.. గుండెలను పిండి..
‘అపార సంపద కుబేరులు’
అసలు.. సిసలు.. దళారులు..
వన మహోత్సవ.. ప్రారంభోత్సవాలు చేస్తుంటే..
గొర్రెలన్ని..కసాయితో.. కలసి నడిచినట్లుంది..!
నీటి చుక్క..కరువైందని..
నిజాయితీ..మాటల మోసగాళ్లు
‘జీవవైవిధ్య’ వినాశకుడెవరని.. ప్రశ్నిస్తుంటే..!
‘దయ్యాలు..వేదాలు’ వల్లించిన
అలికిడి విన్నట్టుగా ఉంది..!
ప్రకృతి వినాశనం చేస్తూనే..
‘తోడేలు’ శాకాహారిగా మారానని చెపితే..
‘గొర్రెలు’ పుర్రెలు ఊపినట్లు
ఊపుతూనే ఉన్నాయి!!
ఖరీదు ఖద్దరులు.. నవ్వుతూనే ఉన్నాయ్!
మెల్కొలుపు లేని.. మెదళ్లను చూసి..
నీటి కరువుకు కారకులెవరో కనిపెట్టేదాకా..!
‘వర్షించే..మేఘం’ మొఖం చాటేస్తనంటోంది!
‘ప్రకృతిని..కాపాడే’ కంటికి రెప్పోలే..అంటు..
మనుజులంతా..ఏకంగా ‘ఎత్తి పిడికిలిని బిగించి’
‘తెల్లని చొక్క చాటున.. చీకటిని..
చీల్చి చండాడే.. సూర్యులై లెమ్మంది..!
ఉద్యమించి.. ఉదయించమన్నది..
ప్రకృతి మాత..!

- ఇన్‌గంటి సూర్యారావు
వావిలాలపల్లి, సెల్.నం.9441548829
****

ఓ దుర్మిఖీ!

మధురిమలందిస్తావని
మనసున ఒక కోరిక
వెలుతురు కిరణమై...
దారి చూపిస్తావని ఒక భావన
ఆశల పల్లకిలో విహరించే మాకు
అందుబాటులోకి వస్తానని నమ్మకం!
జల ధారలు నింపి
సస్యశ్యామలంగా
సుభిక్షితం చేస్తావని
సుఖ శాంతులతో
ప్రశాంతమైన జీవితం అందిస్తావని
ఓ దుర్ముఖీ నిన్ను ఆహ్వానిస్తున్నాం
ఆదరంగా!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్, సెల్.నం.9912118554
***

ఔచిత్య విమర్శ

శ్రుతి మించిన స్వేచ్ఛ
గతి తప్పిన రాగం వంటిది
హద్దు మీరినతనం
హానికర ప్రవర్తనం
సమాజానికి చేటు
అల్పబుద్ధికి అందలం
అనర్థాలకు హేతువు
పేనుకు పెత్తనమిస్తే
తెల్లవార్లూ కుట్టకమానదు
శునకానికి సింహాసనం
కనకానికి చెత్తకుండీ
అతకనే అతకదు
పదవిని ముద్దాడే పెదవికి
స్నేహ రసం రుచిస్తుందా?
గాడిదకు గంధం చెక్క ఎందుకు?
పంది మీద
పన్నీరు చల్లడం అవసరమా?
యోగ్యతకు గౌరవం అందం
అర్హతకు పీఠం ఉచితం
శోభావహం!
నేత్రోత్సవం!!
- డా. అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557
***

నాడు.. నేడు

నాడు..
మల్లెలాంటి మనసున్న
మనుషులతో..
విరాజిల్లిన పల్లెలు..
నేడు..
ప్రపంచీకరణ పుణ్యమా అని..
చల్లని మనసులు కరువై
ఒకరికొకరు.. దూరమై!
‘మమతలు’ మాయమై
బోసిపోతున్నాయి!
నాడు.. ‘పల్లె’ అంటే గుడిసెలు
కుమ్మరి గూనతో ఆవాసాలు!
చల్లదనంతో..
సేదతీర్చే పేదల కుటీరాలు
నేడు.. ఆకాశ, హర్మ్యాలు..
కాంక్రిట్, సిమెంట్‌తో నిర్మాణాలు
ఎవరికి వారే
యమునాతీరే చందంలా
మనుషుల తీరుతెన్నులు!
పంచుతారు
కాగితం పూలలాంటి నవ్వులు!

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809
***

గుట్ట

గుడి గోపురము వోలే గుండ్రంగ వుండచ్చు
తలమీద శీల పెట్టినట్టు నిటారుగ వుండచ్చు
కొన్ని గుట్టలేమో లైను గీసినట్టు
మట్టి కుప్పలు వోసి రాళ్లు పేర్చినట్టు
సహజసిద్ధమైన సంబురాలగుట్ట
సుప్రభాత సూరీడికి స్వాగతమిచ్చేగుట్ట
ఊరి హద్దు గీసి నిలపెట్టే గుట్ట
అడవులను పెంచి బరువుమోసే గుట్ట
రాతి బొమ్మల గుట్ట, గుండ్రని రాళ్ల గుట్ట
రాజ భవనాలతో రాటుదేలినగుట్ట
చెట్ల పొదలతోటి చిందులాడుగుట్ట
జంతు జీవజాల జాతరల గుట్ట
వానలు కురిపించి మనల కాపాడుగుట్ట
తంగేడు వనములతో పులకించునీ గుట్ట
గుట్టల మీద గుళ్లు మన సంప్రదాయ బళ్లు
గుట్టలన్నీ తవ్వే సంస్కృతిని ఆపండి
వేల ఏళ్ల చరిత వాటిలో వున్నదని గ్రహించండి!

- రాజేశ్వరి బొమ్మిదేని
పెద్దపల్లి, సెల్.నం.9160908045
****

జీవనం

తెల్ల కాగితంపై
ఓ సిరా చుక్క చాలు
మదిలోని కారు చీకట్లు పారద్రోలడానికి
ఓ అగ్గిపుల్ల చాలు
పెద్ద గడ్డివాము దగ్ధం కావడానికి
పచ్చని సంసారం
విచ్ఛిన్నం కావడానికి
ఓ అనుమానం చాలు
పరస్పర విశ్వాసమే ఆలంబనగా
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా
జీవనం కొనసాగించాలి
నందన వనంగా
మార్చుకోవాలి జీవితం!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551
****

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
***

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com