ఉత్తర తెలంగాణ

ధిక్కార స్వరం.. ‘చింతం’ కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 96, వెల: 100/-
ప్రతులకు: చింతం యాదవ్వ
16-10-236, శివనగర్,
వరంగల్-506002
సెల్.నం.9346886143
--

ప్రపంచీకరణ వెతలకు అద్దం పడుతూ కవిత్వాన్ని పండించిన డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ ‘గ్లోబలి’ గ్రంథంలో ఆద్యంతం ధిక్కార స్వరాన్ని వినిపించారు. మసకబారుతున్న మానవ సంబంధాలు..బతుకునివ్వని చదువులు..లుప్తమవుతున్న విలువలు..అన్నింటా విస్తరిస్తున్న వ్యాపార ధోరణి..కంప్యూటర్ యుగంలోనూ కుల వైరస్..బాధ్యతారాహిత్యపు పాలకులు తదితర అంశాలు గ్లోబలికి ప్రేరణలని ప్రకటించిన ప్రవీణ్ కుమార్ ధిక్కార స్వరంతో పాటు నిరసన, ప్రతిఘటనలకు పెద్దపీఠ వేస్తూ ఇందలి కవితల్ని రూపుదిద్దారు. గ్లోబల్ కబంధ హస్తాల్లో..గూడు చెదిరిన పక్షుల్లా..చెట్టుకొకరం..పుట్టకొకరమైనప్పుడు..సహచరులు..జాపకాలు..ఆవేదనలు ఆర్థిక స్పర్శతో తొలిగిపోయే దినాలు..మనిషిని అనామకుడిని చేస్తున్నాయని వాపోయారు. ‘ప్లాస్టిక్ దునియా’లో కరచాలనాలు కౌగిలింతలు..చిరునవ్వులు..మాటలు చివరికి బతుకులు..అంతా ఆర్ట్ఫిషియల్..అంతా ప్లాస్టిక్ జమానా అని వ్యాఖ్యానించారు.
‘నా తెలుగు’ కవితలో..మాతృ దేశంలోనే..ఇప్పుడొక మరుగున పడ్డ పదం తెలుగు అని అభిప్రాయపడ్డారు. ‘మనిషి రక్తం పులుముకుని..వాడి ఆస్తిపంజరపు అలంకరణతో..శవాల దిబ్బలపై ఊరేగే..ఏ మతాన్ని నేను పొగడలేను..నాది మనిషి తనం..వాడి ఆనందమేనా అభిమతం’ అని కవి ప్రవీణ్ నినదించారు.
ఎడారిలో..నీళ్లు దొరకని చోట..కన్నీళ్లయినా తాగి బతుకగలను..కానీ..కులమున్నచోట ఎన్ని జీవనదులున్నా బతకలేనని తెగేసి చెప్పడంలో కుల వైరస్ పట్ల ఆయనకున్న ఆలోచనను ఇట్టే అర్థం చేసుకోగలం.
విశ్వవిద్యాలయాలు నేడు కుల మయమై పోయాయని తన ఆవేదనను వ్యక్త పరుస్తూ ‘కులవర్సిటీ’ కవిత రాశారు. ఈ కవితలో కవి పొందుపరిచిన భావాలు నేటి వర్సిటీల దుస్థితికి అద్దం పట్టేలా వున్నాయి. విద్యలేకనే కులమనీ..విజ్ఞానంతో బలమన్న..విద్యాలయాల్లో..కుల డ్రైనేజీకి ముక్కు పుటాల దురుతున్నాయ్..విజ్ఞానమేమో ల్యాబుల్లో కులుకుతోందని తమ బాధను ప్రకటించారు.
వర్సిటీల్లో కులమేందని గగ్గోలు పెట్టే విద్యాజీవి రొమ్ము విరిచే లోపు..ఒక్క నవ్వు నవ్వి..కులం ఆయనను జెండాకెక్కిస్తున్నదని వాపోయారు.
ఎన్ని సముద్రాలు ధారపోసినా..జీవధారనివ్వని ఎడారిలా..ఎన్ని వసంతాలు గుమ్మరించినా..ఒక్క చిగురునివ్వని..తడిలేని విత్తనంగా ప్రపంచీకరణను అభివర్ణించారు.
‘అపార్ట్‌మెంట్’ పేరుతో రాసిన కవితలో..ఎంచక్కా అపార్ట్‌మెంట్ ఆవాసం..ప్రక్క వాటావారెవరో తెలియదు పాపం..అన్న చందాన ఎవరికి వారే యమునా తీరువోలే ఒకరి కొకరు పట్టని వైనంపై కవి తమ కలాన్ని సంధించారు.
మునుపిక్కడ ఊరుండేది..ఇప్పుడు రోడ్డుంది.. మునుపిక్కడ మనుషులుండేవారు ఇప్పుడు శవాలుంటున్నాయి!
ఊరు కాటకల్సి..రోడ్డయిందనీ..రోడ్డు ఊరును మింగి..బరియల్ గ్రౌండ్ అయ్యిందని ‘రింగు రోడ్డు’ కవితలో కవి తమ ఆవేదనను ప్రకటించారు.
‘నేను-నువ్వు’ కవిత కవితాత్మకంగా మలచబడింది.
సమానతలు..అసమానతలు సరే! వాడి సంపదనెలాగో మనం బదలాయించుకోలేము! మన ఆకలినైనా వాడికి బదలాయిద్దామని ఒక కవితలో హితవుపలికారు.
‘బికారీ’ కవిత ఆర్ద్రంగా రాయబడింది..అతుకుల బొంతలాంటి..బతుకులు కావచ్చు వాళ్లవి..కానీ..వాళ్ల మనసుకు ఏ చిరుగూ ఉండదనీ..వాళ్లు..వాళ్ల బ్రతుకులో చందమామ చల్లదనాన్నీ కలగనడం లేదనీ.. మండుతున్న ఆకలి సూర్యుడి కింత.. ‘పచ్చిపులుసు ముద్ద’ అంటే చాలంటున్నారని చక్కని ముగింపునిచ్చారు. ‘గరీబు’ మెదడు సమ్మెకట్టి’..కాళ్లు చేతులు మొరాయించినా..శ్రమ గంటలు బ్రతుకును లెక్కిస్తూనే ఉంటాయ్.. ఆకలి గంటలు అతని కడుపులో మోగుతూనే ఉంటాయ్ అన్న పంక్తులు మనల్ని కదిలిస్తాయి.
ఇలా కవి డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ ఈ గ్రంథంలో..పొందుపరిచిన కవితల్లో చాలావరకు ధిక్కార స్వరాన్ని చూస్తాం..ఆయన సామాజిక బాధ్యతను గమనిస్తాం..
‘కవీ’ కవితలో ఆకాశంలో రాసే అక్షరాలకెప్పుడూ..రూపముండదు..జీవముండదని భావించే ఆయన ఆకాశంలో ఎగిరే పతంగం లాంటి కవిత్వం కావాలనీ..దారం లాంటి కవి కాదని కాంక్షించిన తీరు బాగుంది. ఓ మంచి కవితా సంపుటిని వెలువరించిన కవి చింతం గారికి అభినందనలు తెలుపుదాం.. మున్ముందు మరింత కవిత్వాంశతో మన ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం!

- సాన్వి, కరీంనగర్ సెల్.నం.9440525544