ఉత్తర తెలంగాణ

నెమలి పాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చెప్పులు ఆగమయినయి!
నా వెంట వొచ్చినోడు తప్పిపోయినట్టు
ఆ గుడిబయట ఇడిసిన నా చెప్పులే
ఎవని కాళ్లో పట్టుకొని పోయానని
గట్టిగా అరవలేని మూగవేదన
చిన్న పిల్లాడిలా కాళ్లు నేలక్కొడుతూ
ఏడువలేని పాదదుఃఖం
దారిలో ఏమేకు పంటికో తగిలి
పాద బుగ్గలు చిట్లుతాయని
తుమ్మముల్లు గుచ్చుకున్నట్టు
కాళ్ల చుట్టూ తిరుగుతున్న
చెప్పులు పోయిన బాధ
కళ్ల ముందు అరవై ఏండ్లుగా
చెప్పులు లేకుండా కదులుతున్న
నాన్న పాదాల నడకపాట!
రాళ్ల బాటయినా
తివాచీలా పరుచుకునే ఆ పాటంటే
పదును తల ఎత్తిన
ముల్లుకూడా గడ్డి పూవై
ఎండ ఆ పాద చక్రాల క్రింద
ముక్కలయ్యే నాన్న నగ్న పాదచలనం
ప్రశ్నాపత్రం చదువుకున్నట్టు
‘ఇంకా చెప్పులు తొడుగవా’ అని
ఎవరైనా అడిగితే..
అప్రయత్నంగా నాన్న పాదాల వంక చూసుకొని
‘కాలం అలా నడిచి పోతోందని’
చిరునవ్వు పూయించే పూదోట
నా పిల్లల బుడి బుడి అడుగులకు
చిట్టి చెప్పుల పీక రాగం కొని తెచ్చినట్టు
నాన్న పాదాలకు
ఒక కొత్త అడుగుల చప్పుడు కొనివ్వాలని
నవయుగ పాదుకలు తొడిగితే
ఆ నెమలి పాదాలు ఎలా వుంటాయో
నాన్న నడక ఎలా వుంటుందో
నాన్న ఎలా వుంటాడో చూడాలని.
- గజ్జెల రామకృష్ణ
భూదాన్ పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795
--

నేనూ - నువ్వు

అతివగా..
విజయాలెన్ని సాధిస్తే ఏం లాభమని అనుకోకు!
జీవిత పోరాటంలో నేను పరాజితనని భావించకు!
నీదేం గొప్పని ప్రశ్నించకు!
సమాజమంటే..
నేనూ..నువ్వేనని గ్రహించు!
అమ్మగా, సోదరిగా, ఇల్లాలిగా
విశ్వసృష్టికే ప్రతి రూపాలుగా
మహిళలు భాసిల్లినా..
పురుషుల అండతోనే కదా..
బ్రతుకు బండిని లాక్కొని వెళుతూ
జీవన యానం సాగిస్తున్నామనే..
ఆధిపత్యపు పోరుకు నువు తెర తీయొద్దు!
కుటుంబ బండికి..
ఇరువురం చక్రాల్లాంటి వాళ్లం!
కనుక..మన మధ్య..
అహంకార మద మాత్రర్యాలకు తావియ్యొద్దు
అవగాహన, అన్యోన్య తత్వాన్ని
మదిన నింపుకుందాం!
చేవనిచ్చి..జీవం పోసే
నేస్తాలుగా మారుదాం మనం!
నువ్వు బీజమైతే..క్షేత్రాన్ని నేను!
నేనే నువ్వై..నువ్వే నేనై..ఏకమై..
మమేకమై..జగతిన సృష్టికర్తల్లా నిలుద్దాం!
- బి. హరి రమణ
నిజామాబాద్, సెల్.నం.9490148904
--

మధ్య తరగతి

జననం, మరణం మధ్య
ఊగిసలాడుతున్న మనిషి జీవితం
మధ్య తర‘గతై’ పోయింది..
రోజూ పెరుగుతున్న నిత్యావసరాల
ధరలు ‘్భగ్గు’మంటున్నాయి!
ఆ మంటల ఆవిరిలో ప్రాణాలు బుగ్గిపాలౌతున్నాయి..
ఎప్పుడూ ‘సామాన్యుడు’ పాతాళం వైపూ...
‘ఉన్నోడు’ ఇంకా ఇంకా పైకి..పైకి..
ఇన్నాళ్లు కొనసాగిన ఈ
‘విచిత్రం’ ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉంటుందా..?
‘సామాన్యుడి’ బ్రతుకులో ఆనందం వెల్లివిరిసే దెప్పుడో?

- గుండు రమణయ్య, పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809
---

ప్రకృతి పరంపరలు

పూరించినప్పుడల్లా
శంఖంలో నుండి ఉదయించేది నాదమే!
మ్రోగించినప్పుడల్లా
కంచు గంటలు వినిపించేది గణగణలే!
గాలి వీచినప్పుడల్లా
కొమ్మల చివరన చిగురులు ఊగేది ఊయలలే!
సముద్రంలో కలిసే ఏ నీటికైనా
చిరునామా కోల్పోవాల్సిందే!
ఘనీభవించిన మేఘం కరగడానికే
చిటపట చినుకులుగా కురవడానికే
సూర్యోదయం, సూర్యాస్తమయంలా
సహజంగా కొన్నీ
మేకపోతు గాంభీర్యంలా
మార్జాల మందహాసంలా
అసహజంగా మరికొన్నీ
సింహగర్జనలు, కోతుల కిచకిచలు
కోకిలల కిలకిలా రావాలు,
శ్రావణ సమీరాలు
ఎండమావులు, ఎడారి ఇసుక తినె్నలు
సహజా సహజాలైనా, సాధ్యాసాధ్యాలైనా
ప్రకృతి పరవశ, ప్రకోపాల పరంపరలే!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, సెల్.నం.7893366363
--

అక్షరాల ఊటబావి

ఒకే కప్పు - ఒకే నేల
జ్ఞానార్జనకు నెలవది
మనిషి ప్రగతికి బాసటైనది
తరతరాలకు తరగని జ్ఞాన నది
కోవెల కన్నా పవిత్రమైనది
బాల్యం బందీ అనుకుంటాం గాని
భవిష్యత్‌కు అది మూలం!
ప్రకృతి దారులు పసిడి బాటలై..
ప్రపంచపు రహస్యపు తలుపులు
తెరుచుకుంటాయి!
అక్కడ మట్టి ముద్దలు
బహుముఖాలుగా రూపుదిద్దుకుంటాయి!
చిరుప్రాయపు శూన్య మనోఫలకంపై..
అక్షరాలు లిఖించబడుతాయి
అద్భుత నిలయమా!
అక్షరాల ఊటబావి!
- దామరకుంట శంకరయ్య
కరీంనగర్
సెల్.నం.9440876788

--

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. ౄళూఖఔఖరీశూబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

merupuknr@andhrabhoomi.net