ఉత్తర తెలంగాణ

శారధ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యా! దివ్యా! నా వాచ్ ఏది? కర్చ్ఫీ కూడా దొరకట్లేదు. ఓసారి వచ్చి పో! అంటూ కేకలేసాడు సందీప్.
‘అక్కడే ఎక్కడో ఉండుంటుంది. కాస్త సరిగ్గా చూడండి. నేను పిల్లల్ని స్కూల్‌కు రెడీ చేస్తున్నాను. అసలే ఇవాళ ఆలస్యమైంది కదా!’ అంటూ బదులిచ్చింది.
‘ఏ వస్తువు ఎక్కడ పెడతావో ఏం గుర్తుంచుకోవు కదా!’ చిరాగ్గన్నాడు.
‘అదేంటండి, నేను మీతోపాటే ఇప్పుడే కదా ఊర్నించి వచ్చాను. నాకు మాత్రం అన్ని అనుకున్న వెంటనే దొరుకుతాయా? వుండండి వచ్చి వెతుకుతాను’ అంది దివ్య.
ఆ ఆ! పెద్ద వెతికావులే! ఇల్లును సవరించడమే రాదు కానీ మాటంటే చాలు సమానత్వం, ఆత్మాభిమానాలంటూ పెద్ద లెక్చర్లు. ఉద్యోగం చేస్తే తెలుస్తుంది. టైం సెన్స్’ అంటూ విసుక్కున్నాడు సందీప్.
‘అవునండీ! నేను పెళ్లికి ముందు ఉద్యోగం చేసేదానే్న, మిమ్మల్ని కట్టుకుని, పిల్లల బాధ్యతంటూ ఇంటిపట్టునే వుండిపోయాను గానీ లేకపోతే నేను పడే కష్టానికి ప్రతిఫలం పొందేదానే్నమో!’
‘చేస్తావ్! చేస్తావ్! అక్కడేం ఉద్యోగాలు చెట్లకేం కాయట్లేదు. చేస్తే తెలుస్తుంది! పెద్ద ఇంట్లో ఏం మొద్దులు మోస్తున్నావనో’ అంటూ ధబాల్న తలుపేసి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం లంచ్‌బాక్స్ ఇస్తానని చెప్పి పిల్లలిద్దర్ని స్కూటీపై స్కూల్‌లో దింపేసి, మధ్యాహ్నం వంటకై మార్కెట్‌కి బయల్దేరింది. దారంతా సందీప్ ఆలోచనలే. పెళ్లయి పదేళ్లయినా సందీప్ ధోరణిలో ఏ మార్పు లేదు. ఆడవాళ్లంటే ఏం పనిలేక ఇంట్లో ఎప్పుడూ పడుకొని, టివి చూస్తూనో, సెల్‌లో సొల్లు కబుర్లు పెడుతుంటారని, బాగా తినీ తినీ కేజీలకు కేజీలు బరువు పెరుగుతారని అభిప్రాయం. ఎంతసేపు తనకు అన్ని అమర్చే ‘ఆల్‌వేస్ ఆన్ డ్యూటీ’ ఉద్యోగిగా తలుస్తాడే తప్ప అంతరంగాన్ని పట్టించుకోడు. ‘టమాటలు’, ‘టమాటలు’ అన్న కేకతో ఈ లోకంలోకొచ్చింది దివ్య. బండిని ఓ పక్కకు పార్కింగ్ చేసి సంచీతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
***
‘ఏందమ్మా! బాగున్నారా! వారం రోజుల్నించి కనబడ్డం లేదు. నా దగ్గర గాక ఇంకెక్కిడికన్నా పోతుండ్రా ఏంది? ప్రేమతో దబాయించింది శారద.
‘అదేంటి శారదా! అంతమాటన్నావు! ఐదేళ్ల నుంచి నిన్ను కాదని ఇంకెక్కడన్నా కూరగాయలు కొంటున్నానా? పండక్కి అమ్మ దగ్గరికి, అత్తమ్మ దగ్గరికో వెళ్లొచ్చాను! పిల్లలకి సెలవులు కదా!’ అంది.
‘అవునూ! ఇంతకీ నీ బిడ్డ పండుక్కొచ్చిందా? ఏం పెట్టావేంటి? ఎంతైనా తొలుసూరి పండగ్గదా?’ అడిగింది దివ్య.
‘అబ్బే! నేనేం పెడతానమ్మా! ఏదో ఉన్నంతలో బిడ్డకు, అల్లునికి బట్టలు బెట్టా. ఏదో కొద్దిగా పిండివంటలు చేసా!’ అంది శారద.
‘అవును శారదా! మీ ఆయనేం చేస్తున్నాడు? ఎప్పుడూ అడుగుదామనుకుంటాను గాని మరిచిపోతున్నాను’ అంది దివ్య.
‘అదెందుకడుగుతావమ్మా? మాయదారి సచ్చినోడు రోజంతా తాగి తందనాలాడి నన్ను తన్నటానికే ఇంటికొచ్చెటోడు. వాని బాధలు భరించలేక వాన్ని ఇడిసిపెట్టి ఇగో గిట్ల కూరగాయల దుకాణం బెట్టిన. మీరు సూత్తనే వున్నరు గదమ్మా! దీని మీద వచ్చిన ఆమ్‌దానీతో బిడ్డ పెళ్లికి తెచ్చిన అప్పుకూడా తీరుస్తున్నా’ బదులిచ్చింది శారద.
‘అదేంటీ శారద! నువ్వు మీ ఆయన్ని వదిలేశావా? నినె్నవరు ఏం అనలేదా! తోడు లేంది ఎట్లా బతుకుదామనుకున్నావ్? నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపరా?’ అడిగింది దివ్య.
‘ఎడవడమ్మా? యేలెత్తేది? ఒక్కేలు నన్ను సూపితే నాలుగేళ్లు వాన్ని సూపుతయి. ఇగ తోడంటరా? అమ్మ కడుపుల్నించి ఒక్కదానే్న వచ్చినా, కష్టాల గడ్డక్కూడా ఒక్కదానే్నపోతా! మాటలనేటోళ్లు మార్గం సూపుతారామ్మా! మీరొగలు! మనం తప్పు చేయనంతవరకు ఎవ్వలకు భయపడద్దమ్మా’ అంటూ బదులిచ్చింది శారద.
ఒక్కసారిగా దివ్య షాకయ్యింది. ఎంత ఆత్మవిశ్వాసం, ఎంత పట్టుదల? చదువు, సంధ్య లేని శారద ధైర్యం ముందు తనెంత పిరికిదాన్నో అని అనిపించింది.
‘ఇదిగో శారద! నా పేరుమీద నీ బిడ్డకు పండక్కి ఓ చీర కొనివ్వు’ అంటూ డబ్బులిచ్చి బయల్దేరింది.
‘శారద మాటలతో జీవితాన్ని చదివిన ఆమె చదువుల తల్లి శారద తోచింది. బండి గేట్ ముందు పార్క్ చేసి, తొందరగా వంట ముగించుకుని, లంచ్ బ్యాగ్‌లో అన్నంతో పాటు తన పేజీ సర్ట్ఫికేట్లను కూడా వెంట తీస్కుని ఉద్యోగానికి బయల్దేరిన దివ్యకు అంతకంటే దివ్యమైన ముహూర్తం లేదనిపించింది తన ఆత్మవిశ్వాసాన్ని చాటడానికి!

- పెనుగొండ సరసిజ
కరీంనగర్, సెల్.నం.7386806499

పుస్తక సమీక్ష
ప్రేమ కవితల
ప్రణయ కావ్యం!
కవి వేముల సత్యనారాయణ తమ తొలి కవితా సంపుటిగా ‘సౌందర్యలహరి’ గ్రంథాన్ని వెలువరించి భావ కవిత్వంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. అందరు ముక్కున వేలేసుకునేలా..ఏకంగా అరవై ప్రేమ కవితలను ఏర్చి కూర్చి ఈ గ్రంథాన్ని తీర్చి దిద్దారు. అత్యాధునిక యుగంలో క్రమంగా ప్రేమ కవిత్వం రాసే కవుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో..సత్యనారాయణ ప్రేయసిని సంబోధిస్తూ తమ అంతరంగంలోని మధుర భావాలకు అక్షర సొబగులద్దినారు.
మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేసేది ప్రణయం..పది మందిని కదిలించేది ప్రణయకావ్యం. వేముల సత్యనారాయణ ప్రకటించిన ప్రణయ వీచికలు రసజ్ఞ పాఠకులను అలరింపజేసేలా రూపుదిద్దుకున్నాయి! ఇందలి భావచిత్రాలు ప్రియా! అని సంబోధిస్తూ కొనసాగాయి. ప్రతి కవితలో.. ప్రేమను వ్యక్తీకరించినప్పటికీ.. ప్రతి కవితలో ప్రణయ గీతాలకు పెద్దపీఠ వేసినప్పటికీ.. ఒక్కో కవిత ద్వారా పాఠకులు ఓ మధురానుభూతి పొందడానికి వీలుగా తీర్చిదిద్దడం విశేషం! స్ర్తి, పురుషుల మధ్య ఉండే ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ, అనుబంధాన్ని ఈ కవితల్లో చూడగలం!
‘నీకిది తెలుసా?’ కవితలో..ప్రియా..! అంటూ సంబోధిస్తూ ఆమె జడలో దాల్చిన సుమాన్ని, నుదిటిపై దిద్దుకున్న తిలకాన్ని, కంఠానికి అలంకరించుకున్న హారాన్ని, చేతులకు వేసుకున్న గాజులను, పాదాలకు పెట్టుకున్న పట్టీలను, ధరించిన వస్త్రాలను ఒక్కొక్క దాని వెనుక ఉన్న గుట్టును విప్పి..ప్రేయసికి తెలియజెప్పిన తీరు రమణీయంగా ఉంది.
‘న భూతో..’ కవితలో.. ‘నేను.. ఎందరో గొప్ప గొప్ప శిల్పులు చెక్కిన..ఎనె్నన్నో అందమైన శిల్పాలను చూశాను.. కానీ.. ప్రియా.. ఎందులోనూ.. నీ రూపంలోని సౌందర్యం లేదని’ కొనియాడటం బాగుంది. ఇదే కవితలో ఇంద్రజాలికులు, చిత్రకారులు, సంగీతకారులు, మహాకవులు, పాక ప్రవీణులు, తళుకు తారకలు, శోభాయమానపు శరద్రాత్రుల కాంతులు, గుండు తుమ్మెదలు, సుమలతలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రేయసి ముందు అన్నీ దిగదిడుపే అని చెప్పడం బాగుంది! అలాగే ‘చూస్తే..చాలు‘ కవితలో ప్రేయసి ముద్దుమోము, చిరునవ్వు, విలాసపు నడక, పసిడి పలుకులు, సౌగసైన కన్నులు, మేని అందాలు, నడుము ఒంపు సొంపులు, దేహకాంతి, సహృదయ సౌజన్యత, హుందాకను, సంస్కారపు సౌశీల్యత, హృదయ ఔన్నత్యం, అధర మాధుర్యం, అపూర్వ సుందరూపం చూస్తే ప్రకృతే గులామై ప్రేయసీ నీకు సలాం పెడుతోన్న భావం ధ్వనించేలా పదబంధాలను అందంగా అమర్చినారు. ‘ఏమవి?’ కవితలో.. ప్రేయసి చూపులను, నవ్వులను, జడలోని పువ్వులను, పెదవులను, చక్కని ఉపమానాలు, ప్రతీకలతో అభివర్ణించారు. ‘ఎలా పోల్చను?’ కవితలో సైతం ప్రేయసినే ఉన్నతంగా నిలిపారు.. ఆమె ముందు వసంతం, గులాబీ బాల, మెరుపు, పారిజాతాలు, ఎల్లోరా కళాఖండాలు మొదలగునవి ఆమెతో పోల్చడానికి తులతూగవని తేల్చి చెప్పారు.
‘అమూల్యం’ కవితకు నీ రూప సౌందర్యాన్ని దర్శించాక..నీ సుందర రూపాన్ని తిలకించాక.. కోహినూర్ వజ్రం ఒక్కసారిగా.. కోనేటిలోని గులక రాయయిందని చక్కని ముగింపునిచ్చారు. ‘నీరాజనం’ కవితలో విభిన్న ఆరాధనా పద్ధతులను ప్రస్తావిస్తూ.. ప్రేయసీ! నినె్నలా సేవించను?.. నినె్నలా పూజించను? అని ప్రశ్నించారు.
ఇలా.. ప్రతి కవితలో.. ప్రేయసనే సర్వోత్తమురాలిగా, సౌందర్యరాశిగా, స్వర్గ సుందరిగా, కవి నిలపడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం! కవి యొక్క మదిలో కదలాగే ఊహల ఊసులకు కావ్యనాయికను కేంద్రంగా చేసుకుని విభిన్న కోణాల్లో ప్రేమను ప్రకటించారు. విరహం, నిరీక్షణ,వీక్షణ, నేపథ్యంలో ప్రేయసి పట్ల పొందే అనుభూతిని అందంగా ఆవిష్కరించారు. ఆమెను చూస్తే అలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఎలానో ఉంటంది, ఏదోలా ఉంటుంది. సర్వం నీవేనంటూ స్వప్న దేవతగా మనముందు నిలపడంలో కవి సఫలీకృతులైనారు.
చక్కని భావుకతను సొంతం చేసుకున్న, కవి సత్యనారాయణ గారు.. సమకాలీన సంఘటనలపై, ప్రకృతిపై, మానవ సంబంధాలపై, సమాజంలోని రుగ్మతలపై, అక్రమాలపై, తమ కలాన్ని ఝళిపించి సామాజిక చైతన్యానికి దోహదపడే కవిత్వాన్ని మున్ముందు మనకు అందిస్తారని ఆశిద్దాం.

పేజీలు: 128, వెల: 120/-
ప్రతులకు:
వేముల సత్యనారాయణ
ఫ్లాట్ నం: 209
సూర్యటవర్స్ అపార్ట్‌మెంట్
సుదర్శన్‌రెడ్డి నగర్,
చింతల్, కుత్బుల్లాపూర్,
హైదరాబాద్ - 500054
సెల్.నం.9603255063

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

సాహిత్య సమాచారం

24న ‘అవలోకనం’ గ్రంథావిష్కరణ
ప్రముఖ కవి, విమర్శకులు దాస్యం సేనాధిపతి రచించిన ‘అవలోకనం’ గ్రంథ సమీక్షా వ్యాసాల సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిల్మ్‌భవన్‌లో జరగనున్నట్లు సాహితి గౌతమి ఒక ప్రకటనలో తెలిపింది. కెఎస్ అనంతాచార్య అధ్యక్షతన జరిగే ఈ సభలో ముఖ్య అతిథి బైస దేవదాసు గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. డా. పోరెడ్డి రంగయ్య గ్రంథ పరిచయం చేస్తారు. ఎం.వి.నరసింహారెడ్డి, డా. గండ్ర లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, అనుముల దయాకర్, గోపాల్, స్వామి అతిథులుగా హాజరవుతారు.

మనోగీతికలు

భరోసా

మొక్కల కోసం మనం
మన కోసం మొక్కలు
మన కోసమే మొక్కలు!
మనమంతా అనుకుంటే
కలిసి నడుం బిగిస్తే
తలో మొక్కా
ఇంటింటా నాటేస్తే
ప్రకృతి సిద్ధంగా
పెరిగిన మొక్కలను
పదిలంగా సంరక్షిస్తే
స్వార్థానికి స్వస్తి పలికి
మానవత్వానికి
మెరుగులు దిద్ది
అడవులను నరకడం ఆపేస్తే
పచ్చదనం పసిడి పందిరి క్రింద
అందివచ్చిన
ఆరోగ్యపు భరోసాతో
బతుకంతా ఆనందమయం కాదా!
భావితరాలకు మనం
అందించే బహుమతి ఇదే కదా!!
అందుకే -
మొక్కల కోసం మనం
మన కోసం మొక్కలు
మన కోసమే మొక్కలు!
రేపటి తరం కోసం
మనం అందిస్తున్న మణిహారం
ఈనాటి హరితహారం!

- డా. కె.ఎల్.వి. ప్రసాద్
ఆర్.కె.కాలనీ, హన్మకొండ
9866252002

రావయ్యా పుష్కరుడా!
కృష్ణమ్మ కోసం వచ్చు పుష్కరుడా
స్వాగతం నీకు సుస్వాగతం!
కృష్ణమ్మా ఆహ్వానించవమ్మా నీ పుష్కరుడిని,
పనె్నండు వత్సరాలకు వచ్చే పుష్కరుడా..
స్వాగతం! సుస్వాగతం!
భూ మాతకు వాలు జడవై ప్రవహించే కృష్ణవేణి,
నీ సిగలలోన నెలవంక సిగపువ్వై మెరియంగ,
గాజుల్ల గలగలలు సవ్వడులే సేయంగ,
ఆకుపచ్చని చీరలో అలరారు కృష్ణమ్మా,
నీ కాలి అందెయిలు ఘల్లు, ఘల్లుమని మ్రోగ
వయ్యారి నడకతో వచ్చు కృష్ణమ్మా
ఆహ్వానించవమ్మా నీ పుష్కరుడిని!
పడమట సూరీడు సింధూరమై మెరియంగ
పుష్కరాగమన మయ్యిందని కోయిలలు పాడగ,
వయ్యారి నడకతో రాయించలే రాగ
తొలకరి జల్లులకు మయూరమ్ములే ఆడ,
రావయ్యా పుష్కరుడా స్వాగతం, నీకు సుస్వాగతం!

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల గ్రామం, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9493210293

రాతను మార్చే గీత
గీతలలో తలరాతలున్నాయి
గీత చక్కగా ఉంటే
చేతలు బాగుంటాయి
గీచిన గీతను
దాటకుండా ఉండాలి
దాటకుండా ఉండే గీత
తరతరాలకూ మార్గదర్శకం
గీతలు చేతుల్లోనే ఉంటాయి
గీతలు చేతల్లోనే ఉంటాయి
గీతకున్న విలువ
ఏ రాతకూ లేదు
రాతను కూడా మార్చగలిగే శక్తి
గీతకే ఉంది
గీత సుగీత కావాలని
తాతలూ తండ్రులూ చెప్పారు
నీతి పథం గీతలోనే
ఖ్యాతిరథం గీతలోనే
అందుకే గీతకేదీ సాటిరాదు
అది శాశ్వతం!
అదే మానవహితం!!

- అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి,
సెల్.నం.9440468557

పచ్చతోరణం
చెట్లే మన ఆయువు పెంచును
చెట్లే మన మనుగడ నిలుపును
చెట్లు లేక లేము మనం
చెట్లతోనే బతుకు ఘనం

భూతాపం తగ్గాలన్నా
భూగర్భ జలాలు నిండాలన్నా
వానలు విరివిగా కురవాలన్నా
పంటలు పుష్టిగా పండాలన్నా
ప్రకృతే పచ్చతోరణం అవగా
పచ్చని చెట్లను పెంచాలె.
నేలతల్లి పులకించగా
ప్రకృతమ్మ పరవశించగా
నవభారతికి జై అంటూ
అందరూ ఒక్కటిగా కదలాలె
ఏపుగ చెట్లను పెంచాలె
హరిత హారమై నిలవాలె
ప్రకృతిని పరిరక్షించాలె
మనల్ని మనం రక్షించుకోవాలె

- అడపా రాజు
సీతారాంపురం, పరకాల మండలం
9177825265

లెక్కలు తీయండి!
ఒక లెక్క తీయండి!
అదే ఇదే పనికిరాని గణాంకాల వేటలో
పాలకులు ఉక్కిరి బిక్కిరవుతున్న వేళ
ఉక్కబోత గదిలో ఎసి పెట్టినట్టు
ఒక్క సలహా
ఈ దేశంలో ఏడుస్తున్న వారెంత?
నవ్వుతున్న వారెంత?
దొంగ ఏడ్పుల లెక్కలు వద్దు
కల్తీ నవ్వుల కథలొద్దు
గుండెలోతుల ఏడ్పు లెక్కలు గావాల
కన్నీటి చుక్కల లెక్కలు చాలవు
మనసు ఏడ్పు, చీకటి ఏడ్పు
ఓటమి ఏడ్పు, అప్పుల ఏడ్పు
ఆత్మహత్యల ఏడ్పు లెక్కలు కావాలి
నిరుద్యోగులను వదల కండీ వారివి కన్నీటి వరదలే
లెక్కలు తీయండీ
గణాంకాలు కావాలి
డబ్బు నవ్వు, పదని నవ్వు, దోపిడి నవ్వు
చట్టం నవ్వు కల్తీ నవ్వు, దొంగ నవ్వు
వెనె్నల నవ్వు, వెలుగు నవ్వు
లెక్కలు గావాలి
లెక్కలు తీయండీ
దేశంలో ఏడుస్తున్న వారెంత?
నవ్వుతున్న వారెంత?

- సిహెచ్.మధు, నిజామాబాద్
సెల్.నం.9949486122

నేను భారతీయుడ్ని
నేను భారతీయుడ్ని - విశ్వబంధువుని
సత్యసనాతన ‘్ధర్మ’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - సుగుణజల సింధువుని
శాంతికాముక ‘సమర’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - ప్రకృతి ఆరాధకుడిని
ఘనమాతృ ‘సంస్కృతి’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - సృష్టి రహస్యకుడిని
శాస్త్ర విజ్ఞాన ‘చరిత్ర’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - సౌభ్రాతృత్వ వారధిని
సామరస్య ‘యోగ’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - ఆధునికతపు ఆర్యుడిని
ప్రాచీనతత్వ ‘మూల’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - ఏకతామంత్ర సారధిని
విశ్వకుటుంబ ‘విలువల’ వారసుడిని..
నేను భారతీయుడ్ని - మార్పుకు మారు పేరుని
మానవత్వ ‘సందేశ’ వారసుడిని...

- సామల కిరణ్, జూలపల్లి,
కరీంనగర్ జిల్లా, సెల్.నం.9949394688

ముదిమి
బాల్యం బడిలో నలిగి నలిగి నలిగి
యవ్వనం బాధ్యతలతో మునిగి తేలి..
విశ్రాంతి లేని మనిషికి
ముదిమి ఒక వరమే..
జీవితం చివరి మజిలీలో
విశ్రాంతిని కోరుతుంది
రోగాలతో అనారోగ్యంతో
బాధతో మూలుగుతుంది!
కన్న పిల్లల సంరక్షణ
ఆయన వాళ్ల ఆదరణ
ముదిమిని మరిపిస్తుంది
ఆనందంతో మురిపిస్తుంది
అలాంటి బ్రతుకే అయితే..
ముదిమి నిజంగా ఒక వరమే!
మనుమలతో ఆడుకుంటూ..
కన్న పిల్లల గౌరవాన్ని
సంతోషంగా స్వీకరిస్తూ..
నల్లేరుపై బండిలా
నడిచి పోతుంది ముదిమి!
ప్రేమతో విత్తనం నాటి
కంటి పాపలా పెంచిన చెట్టు
నీడనివ్వనని మొరాయిస్తే..
ఆ మనసు ముక్కలైపోతుంది!
కనుపాపే కాటేస్తానంటే
ఆహృదయం బద్ధలైపోతుంది!
ముదిమి శాపంగా పరిణమిస్తుంది!

- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి, సెల్.నం.9493702652

తడారని జ్ఞాపకాలతో..
దేహం నిశ్శబ్దమై
శ్వాస వౌనమై
మరణం లేని దుఃఖం
నిశ్చలత్వాన్ని తట్టి లేపుతుంటే..
ఒలికిన కన్నీళ్లను
చప్పరిస్తూ!
ఉమ్మ నీటిలో పావనమై
జనన పొత్తిళ్లను మరచిన
ఏ నెత్తుటి గాయాల
తాలూకో
వాళ్లు!
తడారని జ్ఞాపకాలతో..
ఊపిరి సలపని
వెక్కిళ్లుగా మారి..
శిథిలమైన అనుబంధాలు
గుండె గొంతుకలో ప్రకంపనలై!
జీవన రుతువులు
ఒక్కటై తొలగిపోతుంటే..
భవ బంధాలు విడివడుతూ
చివరి యాత్రకు సన్నిద్ధులై
ఏ మానవత్వపు మూలనో (ఆశ్రమాల్లో)
తల దాచుకున్న వాళ్లు!
ఎవరి జన్మ దాతలో కదా!
అనాథలై..
ఒక చల్లని పిలుపు కోసమో
ఏ బిడ్డ వెచ్చటి స్పర్శ కోసమో
ఏ అతిథి రాక కోసమో
కళ్ల నిండిన కన్నీటితో..
ఎదురు చూస్తున్నట్టుగా వాళ్లు..!!!
- రామానుజం సుజాత
కరీంనగర్, సెల్.నం.9701149302

పయనం!
ఆరంభ శూరత్వానికి అంకితమై పోక..
నీరసతనానికి నిచ్చెనలు వేయక..
నక్కజిత్తులను ఆశ్రయించక..
నంగనాచి గుణాన్ని అవలంభించక
వినయ విధేయతల కలివిడితో
విపులతత్వాన్ని ఆస్వాదిస్తూ
సంస్కారయుతంగా నమస్కరిస్తూ..
సచ్చీలతతో సాగించు పయనం!
ముఖం తామరలా అందంగా లేకున్నా ఫరవాలేదు
మాటల ఈటెలతో ఇతరుల
మనసును ముక్కలు చేయక..
కరుణరస హృదయంతో పలుకరించు!
కడుపులో కత్తులు పొదుగుకొని కౌగిలించుకోకు
సహజ వనరుల నుంచి
పరోపకారాన్ని అలవరచుకో!
చీమల బారు చూసి క్రమశిక్షణ నేర్చుకో!
స్వలాభాపేక్ష నాశించకుండా
స్వధర్మ బుద్ధిని ఆశ్రయిస్తూ..
మహానీయులాశీస్సులు
మంత్రబలంగా స్వీకరించు!

- రాకుమార, గోదావరిఖని, సెల్.నం.9550184758

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- పెనుగొండ సరసిజ