దక్షిన తెలంగాణ

పాపం ముసలవ్వ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అరె రాజిగా నా కళ్లముందు నికింత లగ్గమయితే సూత్తరా, నాకా శాతనైతలేదు. వూరుదూరంగావట్టే కాడుదగ్గరగావట్టే. మునపట్లెక్క లేదు పానం. నీకా పోరడేంపని జేత్తలేడని ఒక్కరన్నా పిల్లనిత్తలేకపోయిరి. నీకా యవుసప్పని రాకపాయే పెద్ద సదువుకు నాకాడ పైసల్లేకపాయె. పట్నంల నాలుగొద్దులు పనిచేసి నేను కలల కనిపిత్తన్నని అచ్చేత్తివి. పక్కింటి కొమురన్న కొడుకు నాలుగేండ్లు దుబాయ్ వొయ్యి మత్తు సంపాయించే. ఆ పిలగానికయితే ఎగవడి ఎగవడి పోల్లనిచ్చి లగ్గం చేసిరి. ఆ పోరి నీల్లాడే..నీ అవ్వయ్య బతికుంటే నాకీ బాధ తప్పుతుండే..ఇల్లు ఇడువాట్లేకపాయె భూన్జాగా గిన్తంతనే ఉండే. కాల్వ నీళ్లు రాక అయింతున్న ప ఒలమెండివట్టే. కరెంటు మీద మన్నువొయ్య అద్మరాత్రి రావట్టే..రాత్రి బాయి కాడికొయ్యే నీ అవ్వ సచ్చిపోయే..గిట్లయితెట్లరా..ఏదన్న పంజేసుకబత్కాలే..ఎప్పుడు ఈ గుడిసెల్నే వడుంటే నీకు లగ్గమెట్లగావాలె..బుక్కెడు బువ్వెట్లరా’..అంది పోశవ్వ మనవడు రాజన్నతో. రోజిట్లనే నచ్చచెప్తది. రాజన్నకు పోశవ్వంటే పాణం! అట్టి అమాయకుడు. ముసల్దాన్ని, ఆ గుడిసెను ఊరిని ఇడిసిపెట్టి ఉండలేడు. ‘గీపాట రోజున్నదే గాని బువ్వెయ్ ఆకలిదంచుతుంది..’ అంటూ రాజన్న నులుక మంచం నుండి లేసి కాళ్లు కడుక్కోవడానికి గిర్కి బాయి కాడికోయిండు. పక్కింటి రామక్క అప్పుడే పెరుగు వట్టుకచ్చింది..‘ఏందీ పోశవ్వ అల్లున్ని మల్ల తిడుతున్నవా అంది. పెరుగ్గంప దించుతూ..‘సూడత్త ఎప్పుడు ముసల్దాని కన్ను నా మీనే్న..నువ్వన్న చెప్పు..’ రాజన్న చేతులు లున్గికి తుడ్చుకుంటూ అన్నాడు. పోశవ్వ పెరుక్కు గంజు వట్టుకచ్చి..‘ఎంత మొత్తుకున్న మారడాడు. దున్నపోతుమీద వాన వడ్డట్టె. ఇట్లగాదిగ నేనున్నన్ని రోజులు గీడు పనిపాట జెయ్యడు. దేశం బొమ్మన్న వోడు..లగ్గం కాదు..ఈనికన్న ఎన్కసిరి లగ్గమయినోల్లకి ఈనెత్తు పిల్లలు కావట్టిరి..ఈనిగ్గాంది ఈస్తమ్ముడు చేసుకోడాయె..ఎంతకని చెప్పాలే? ఎక్కడ నాలుగొద్దులు కూడా పని చ ఎయ్యడు. మల్ల నాదగ్గరికి ఉరికత్తడు..నేను బతిగుండగా ఈడేం పంజయ్యడు ఈన్కి లగ్గం కాదు. నేనే నుయ్యొ గొయ్యొ సూస్కుంట అంటూ..పోశవ్వ గుక్కవట్టి ఏడవ సాగింది. రాజన్నకు మనుసు కలుక్కువంది. లోజెరువు కట్టకేసి నడవసాగిండు..బువ్వ దిండ్లే, జోన్నలరాసి గుట్టెక్కి పరుబ్బండపై గూసుండి బతుకుపై గట్టిగా దిమాక్ పెట్టి ఆలోచిన్చిండు. ముసలవ్వ సంబురపడే అద్భుత ఆలోచన మెరిసింది. వెంటనే వురికినట్టే ఇంటికి నడవసాగిండు..రచ్చబండకాడ ఏదో లొల్లి..‘చంద్రవ్వకు పాన్గుట్టింది జైతాలేసుకపోవాలే రాజన్న ఇంట్లెవ్వల్లేరు జల్దిరావా బాంచన్..అంటూ కాల్లమీద వడ్డది ఎల్లక్క..రాజన్న మరో ఆలోచన చేయకుండా ఎగిర్తపడుతూ ‘సీనన్న జల్దిరావా బాంచన్. అంటూ కాళ్లమీద వడ్డది ఎల్లక్క..రాజన్న మరో ఆలోచన చేయకుండా ఎగిర్తపడుతూ ‘సీనన్న అటో ఉందిగదా జల్దేసుకుపోదాం పదండ్రి..’ అంటూ సీనాటోని పిల్చుకొచ్చి జైతాలకు ఎల్లిండ్రు..పాంకేసని సీరియస్ గుందని.
ప్రైయివేటు దవాఖాన్ల పట్లే..అక్కన్నుంచి కరీంనగరేసుకపోయిండ్రు..జప్పజెప్పన దవాఖానకు తోల్కపోవుడుకు చంద్రవ్వ బతికింది.
రాత్రంతా నిద్రలేదు. గుల్కొసులు వెడుతుండ్రు. రెండోద్దుల్లో తీస్కపోవచ్చండ్రు. రాజన్న ఇంటి తొవ్వ వట్టిండు మబ్బుల బస్ దొరక్క రాజన్న వొల్లెకొచ్చేటప్పటికి పొద్దెక్కింది..ఇంటి ముందు జనం. శోకాలు. రాజన్నకు గుండెల్ల బండ వడ్డట్టయ్యింది! ముసలవ్వను వాకిట్ల సాపల పండవెట్టిండ్రు తలాపుకు వూదుబత్తులు ఇర్సిగిరిన బండిలేక్క కూలవడ్డడు. రాజన్న గుండె వల్గేటట్టు ఏడిసిండు. తమ్ముడు లచ్చన్నతో పాటు.
‘ముసల్ది అయిల్ల మంచిగుండే. అన్నంత పని చేసింది. దాని ఇద్దరు పోరగాండ్ల గతెట్ల! పెద్దోడు అట్టి అమాయకుడు. చిన్నోడు ఆవారాగాడు. పోరగాండ్ల అయ్య బాకీల బాధకు ఉరేసుకునే పాపం అల్లవ్వ కరెంట్ షాక్‌గొట్టి సచ్చిపోయే..అప్పట్నుంచి పోశవ్వ గొడ్డుకట్టం చేసుకుని గీ మనవల్ని సాదుకరావట్టే..పెద్దోని పెండ్లిచేయ్యల్నని ముసల్దానికి బగ్గ కారుూశుండే..బండకు బండుండే ముసల్ది పురుగుల మందు దాగి పని చేత్తదనుకోలే..‘ఊరంతా గుస గుస.. దహనం చేసి, ఖర్మసేసి నెలదినం పెట్టిండ్రు..రాజన్న లచ్చన్న..కాలం ఆగకుంట ఉర్కవట్టే..గుడిసంతా భయానక నిశ్శబ్ధం! రాజన్న లచ్చన్న ముసులవ్వ ఫోటో జూస్కుంట ఎక్కెక్కి ఏడ్సుకున్నరు. ‘అన్నా జాబుకోసం పట్నంల ఎన్ని తిప్పలు వడ్డవో..కంపిన్లల్ల నీకెందుకు కొలువు దొరక లేదో ముసల్దానికేం దెల్సు..! పైసల్లేక పల్కువడిలేక లగోడికిలేక లంగపనులు చెయ్యలేక సచ్చీ బతికి అరిగోస వడ్తివి..ఇక ఈ వూరికి మనకు బాకీ తీరిందన్న ఎల్దాం పద..బొంబాయిల బోల్లుదోముకోనన్న బతుకుదాం..నేను గూడ పొద్దుమాపు కట్టపడ్త..గరీబోల్ల బతుకులు గింతే అన్నాగింతే..అంటూ లచ్చన్న పట్టరాని దుఖంతో అన్న నల్ముకుని సంటిపిల్లనె్లక్క ఏడ్సిండు..
ఉన్నూరిని, ఆడకట్టుని, తెలంగాణని దాటి బొంబాయి బస్ వేగంగా దూసుకుపోతోంది..కిటికీ పక్కన విండో జరిపి బయటకు చూస్తున్నడు లచ్చన్న..గుట్టలు, వాగు వంకలు, ఈదులు, తాళ్లు, పొలాలు వేగంగా వెనక్కెళ్లిపోతున్నాయి. అన్నా రాజన్న! అమ్మ పోయింది. అయ్యావోయిండు..ఆఖరికి ముసులవ్వా పోయింది..ఊరిడిసి పొట్టచేత పట్టుకుని బొంబాయి తొవ్వ వట్టినం మనం..ఎందుకైతుందే గిట్లా? ఏమ్పాపం చేసినం..! ఇలా ఎంతకాలం..లచ్చన్న ప్రశ్నలకు రాజన్న జవాబు చెప్పలేదు..ఏదో ఒక రోజు మనకూ మంచి రోజులు వత్తాయని..ఆశిస్తూ..అశ్రువుల్ని అదిమిపట్టాడు..పడమటి కొండల్లోకి సూరీడు బాధగా వొదిగిపోయాడు.

- డా. సింహాచలం లక్ష్మణ్ స్వామి
జగిత్యాల
సెల్.నం.9440511239

చిన్న కథ

పాలేరు తీర్పు!

నేను నందని, ఎమ్మెల్యే నందని. గెలిచాను. ఎలక్షన్లలో కాదు, అఫ్ట్రాల్ ఒక పాలేరు కొడుకు అధికారిగా ఎదిగి నాకే ఎదురు తిరిగినందుకు ఎటువంటి శాస్తి జరిగిందో చూశావా పిఏ, నాకు సహకరించిన నా శ్రేయోభిలాషి అర్జున్ గారికి ఫోన్ కలుపు అంది.
హలో! అర్జున్ ఉన్నఫళంగా వెంటనే.. వెంటనే రా..
ఎమ్మెల్యే నంద పిలుపు అందుకున్న గంటలోపే ఆమె ముందు వాలాడు అర్జున్.
ఇద్దరి ముఖాల్లో ఆనందం పరవళ్లు తొక్కుతుంది అనుకున్న విధంగా అయినందుకు.
అహర్నిశలు రైతు గుండెల్లో గూడు కట్టుకున్న వారి కళ్లలో కోటి కాంతులను వెలిగించిన, ఆత్మహత్యలు లేకుండా వారిలో అంతరాత్మ మేల్కొలిపి జైకిసాన్ అనే నినాదమే తన జీవిత ఆశయంగా బతికిన వ్యవసాయ అధికారి కృష్ణ.
మంచి విత్తనాలను రైతులకు అందించాలని అనుకుంటాడు. అలాంటి కంపెనీ నుంచే విత్తనాలు కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చెయ్యాలి అనుకుంటాడు. అందుకు గాను టెండర్ ప్రకటన ఇస్తాడు. టెండర్లు వచ్చాక వాటిని అన్నింటిని పరిశీలించిన నాణ్యమైన విత్తనాలు అందించే కంపెనీకి అనుమతి ఇస్తాడు ఎమ్మెల్యే రికమెండ్ చేసిన నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీల టెండర్లను పక్కకు పెట్టి.
ఈ విషయం ఎమ్మెల్యే నందకు తెలుస్తుంది. నా ఇంట్లో వాడి తండ్రి పాలేరు పనిచేసేవాడు, మా ఇంట్లో మిగిలిన అన్నం తిని బతికిన కులం తక్కువోడు. ఉన్నత చదువులు చదివేసరికి బాగా పొగరు పెరిగిందా. నా ముందే కార్లో తిరుగుతూ, బంగళాలో బతుకుతున్నందుకు వాడికి ఇంత బలుపొచ్చిందా, నా సంగతేంటో చూపిస్తా. నా కులం బలం, నా రాజకీయ బలం, నా డబ్బు బలంతో వాడిని ఏ విధంగా అధఃపాతాళానికి తొక్కేస్తానో. వాడు మళ్లీ అదే రైతులతో పొలం పనులు చేసుకునేలా చేస్తా అని శపథం చేసింది నంద!
అగ్రికల్చర్ కమిషనర్ అర్జున్‌తో రిపోర్టులు సృష్టించి సస్పెండ్ చేయించింది.
ఈ వార్త కృష్ణ కంటే రైతుల గుండెల్నే పిండేసింది. వాళ్ల కళ్ల నుండి వర్షధారలాగా కన్నీటి ధారలు కాలువలై ప్రవహించాయి!
రైతుల కోసం తపించే మనిషికి ఎంతటి అన్యాయం చేశారు. అని వారి రోదన అరణ్యరోదన అయ్యింది. కాని అది భగవంతుని చెంతకు చేరింది.
రైతులతో పొలం గట్టుమీద నిల్చుని కృష్ణ వాళ్లకు సలహా ఇస్తూ తన పొలం పనులు చేయించడంలో నిమగ్నమయ్యాడు.
ఎమ్మెల్యే నంద రోడ్డుమీద నుండి కారులో వెళ్తూ ఒక్కసారి కారు ఆపి.. అందులోంచి చప్పట్లు కొట్టి కృష్ణను చూస్తూ వేలు పెట్టి పగలబడి నవ్వుతూ పాలేరు.. పాలేరు.. అంటూ కారులో ముందుకు దూసుకెళ్లింది.
రైతులందరు నివ్వెరపోయారు. వారి అంతరాత్మ ఆలోచించసాగింది. ఈ వార్త జిల్లా అంతా దావానంలా వ్యాపించింది. ఒక్కమాట చాలు. కాలం ఆగదు.. నంద మళ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తలదించుకునే రోజు రానే వచ్చింది!
పాలేరు తీర్పుతో న్యాయం గెలిచింది. అర్జున్ తప్పుడు పత్రాలు సృష్టించినందుకు శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించారు. కృష్ణను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకున్నారు!

- డా. గంధం విజయలక్ష్మి, నిజామాబాద్, సెల్.నం.9948181458

పుస్తక సమీక్ష

‘యోగా’తో శతమానం భవతి!

పేజీలు: 159
వెల : అమూల్యం
ప్రతులకు: ఎస్.సంపత్ కుమార్
పవన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్
కరీంనగర్-505001
సెల్.నం.09346435123

‘శతమానం భవతి.. శతాయుః పురుషః శతేంద్రియ ఆయుః.. క్షేమేంద్రియ ప్రతితిష్ఠతి’ అన్న శుభాశీస్సులతో నూరేళ్లు క్షేమంగా జీవించుమని ఆశీర్వదించడంలోనే గొప్ప భావన ప్రస్ఫుటమవుతుంది.
వృద్ధాప్యం సమీపిస్తున్నకొద్దీ ప్రశాంతతను కోరుకుంటాం..అలాంటి ప్రశాంతతను సముపార్జించుటకు ‘యోగా’ గొప్ప సాధనమంటూ..యోగాతో శతమానం భవతి గ్రంథాన్ని యోగాచార్య ఎస్.సంపత్ కుమార్ ఓ గ్రంథాన్ని గుండవరం వేంకట భాస్కర్ రావు గారి సౌజన్యంతో వెలుగులోకి తెచ్చారు. ఆధ్యాత్మిక చింతన, భగవంతుని యెడల భక్తి భావం, మనల్ని నిత్య నూతనంగా వుంచుకాయనీ..వాటికి తోడు ‘యోగా’ అనుసరించినట్లయితే.. అద్భుతాలు ఆరోగ్య పరంగా సాధించగలమని ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. యువకులైనా..వృద్ధులైనా..రోగులైనా.. బలహీనులైనా.. చురుకుగా యోగాభ్యాసం చేసినట్లయితే మంచి ప్రయోజనాలు పొందగలమని యోగ విద్య ప్రాశస్త్యాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. నవ్వు ఓ దివ్యమైన ఔషధంలా పని చేస్తుందని రచయిత చక్కగా ఇందులో తెలిపారు.
సాధారణ వ్యక్తులతో పాటు డెబ్బది ఏళ్లు దాటి వారూ శౌచం, శుచీ, శుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలనీ.. అందుకోసం అనుసరించాల్సిన శుద్ధిక్రియలను ఇందులో చూస్తాం.. ఆసనాలు ఎలా వేయాలో ఛాయాచిత్రాల ద్వారా వివరించారీ గ్రంథంలో! ఆరోగ్యం కోసం పుష్టికరమైన ఆహారం ఎలా తీసుకోవాలో.. ఏవి తీసుకోవాలో ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. వ్యాయామం, ఈత కొట్టడం వంటిపై శ్రద్ధ చూపి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న సంగతిని ఈ గ్రంథం గుర్తు చేస్తుంది. జలనేతి సాధనా విధానాన్ని చక్కని చిత్రాలతో వివరించారు. నాభి తొలిగితే అనుసరించాల్సిన మెలకువలను ఇందులో చూస్తాం..మెడనొప్పి, కీళ్ల నొప్పులు, నడుంనొప్పి తదితర రుగ్మతలకు ఈ గ్రంథం ద్వారా పరిష్కారాలను వెతుక్కోవచ్చు. ఉదర పటిష్ఠతకు ‘అగ్నిసార్ క్రియ’ ఎలా ఉపయోగపడుతుందో రచయిత సంపత్ కుమార్ చక్కగా వివరించారు. విసర్జన కండరాలకు వ్యాయామాలు..అశ్వనీముద్ర మరియు మూల బంధం ఎంతో మేలు చేస్తాయని తెలిపిన తీరు బాగుంది. పరుగుల ప్రంపంచంలో ఒత్తిడి చట్రంలో మనిషి బందీ అయినాడనీ..ఆ చట్రం నుండి బయటకు ఎలా రావాలో ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో వెలువడిన ఈ గ్రంథంలో బీపి, షుగర్ వ్యాధులు, తలనొప్పులు, కేన్సర్ వంటి వాటికి ‘యోగా’నే సరియైన పరిష్కారాలు సూచించడం జరుగుతుందని ఇందులో చక్కగా ప్రస్తావించారు. వారానికో రోజు ఉపవాసం వ్యాధి నిరోధక ఔషధంగా పేర్కొనవచ్చనీ..ఉపవాస ద్వారా దేహంలోని అన్ని వ్యవస్థలు తిరిగి పుంజుకుంటాయని రచయిత సోదాహరణంగా వివరించారు. హృదయ సంబంధ వ్యాధుల బారిన పడకుండా ‘యోగా’ ఉపయోగపడుతుందనీ..నడుము, పొట్ట తగ్గడానికి, అలసటను అధిగమించడానికి ‘యోగా’నే సరియైన మార్గమని సూచించారు..ప్రాణాయామంతో నాడులు, కండరాలను అనుసంధానం చేసుకోవచ్చనీ..‘యోగా’ ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఆయుష్షును పెంచుకోవచ్చని తెలిపే ఈ గ్రంథాన్ని సంపత్ కుమార్ చక్కగా రూపుదిద్దారు. అన్ని వయసుతో నిమిత్తం లేకుండా అందరూ చదువాల్సిన గ్రంథమిది. ఉద్యోగ విరమణ చేసి ఇంటి వద్ద ఉండే వృద్ధులకు చాలా చక్కని అంశాలతో పాటు మంచి మనసును.. ప్రశాంతతను ప్రసాదించే గ్రంథమిది.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

మధుర జ్ఞాపికలు!
వాకిళ్లలో
హరివిల్లును తలపించేలా
కొలువుదీరే
రంగు రంగుల రంగవళ్లులు..
మగువల కళాత్మక
సృజనకు ప్రతిరూపాలు!
వివిధ వర్ణాలను
ఆహార్యంగా మలచుకుని ముస్తాబై..
ముంగిట విరబూసే సుమాలు!
ఇంటికొచ్చే అతిథులకు కనువిందు చేస్తూ..
సుమనోహరంగా ఆహ్వానం పలికే
స్వాగత తోరణాలు!
చుక్కల సరసన ఏం చక్క ఒదిగి
మన మదిని ఆహ్లాదపరిచే కాంత రేఖలై..
వౌనంగా ఆలపిస్తాయి మహిళల మనోగీతికలు!
ముగ్గులు వనితల సున్నితత్వానికి ప్రతీకలు!
అవి గృహానికి అందాలనొసగే ఆభరణాలు!
అతివల అంతరంగం నుండి జాలువారే..
ఓ సుందర పూలతరంగాలు!
ఆనంద సోయగాలను పంచే
అపురూప వర్ణచిత్రాలు!
మనసును సేదతీర్చే..
మధుర జ్ఞాపికలు!

- డి.సవీణ, కరీంనగర్
సెల్.నం.9440525544

గుండె దండోరా !
ఒక విషాద సమయాన..
ఆకాశం చిర్నవ్వు నవ్వటం
రేపటి విజయానికి తార్కాణం
రేపటి విజయం నాదే!
ఒక చీకటి రాత్రి
కోకిల పాట పాడి మనసును
వెనె్నల చేయటం
రేపటి వెలుగుకు తార్కాణం!
రేపటి వెలుగు నాదే
జీవిత యుద్ధరంగంలో
ఓడిపోయిన ఒక రోజు...
ఒక గులాబీ ముళ్లును దాటి
నా కళ్లలో ఆవిష్కరించటం
ఓటమి తాత్కాలికానికి నిదర్శనం
నేను రేపు తప్పక గెలుస్తాను!
తత్వం కాదు
అతీత శక్తుల ప్రమేయమసలే లేదు!
ఆత్మవిశ్వాసం, గుండె దండోరా
శ్రమైక జీవన సౌందర్యంతో..
ఈ చీకటిని ఎదిరిస్తాను నేను!

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486122

గిరి పుత్రుల నీళ్ల గోస
గూడెం గుట్టల గుడిసెల బతుకులు
గుక్కెడు నీటికోసం
మైళ్ల నడకలు
రోజంతా పాట్లు - ఒళ్లంతా పోట్లు
గట్టుమీద శ్రామిక జీవుల
చీమల వరుసలు
గుట్టకింద బావులకు
నడువెత్తిన సూరీడు
నడుమెత్తిన కడువలు
ఒళ్లంతా ఉప్పుమేటలు
‘వాళ్లంటే ప్రకృతికి కూడా
ఎకసెక్కాలే..!
బయట ఎండ అగ్గిబుక్కుతున్నా
పందిట్ల పొయ్యిరాజెయ్యాలి
సత్తు బోకెల గంజి ఉడ్కాలంటే
ముసలోల్లు - ముతకోల్లు
పిల్లలు - జల్లలు
ఎవరికీ మాఫీ లేదు
బింద పట్టుకొని గుట్ట
జర్రున జారాల్సిందే
జర్రంతగాని అటు ఇటు అయిందో
మోకాలు చిప్ప పగులుడే
కాళ్లకింది తుమ్మసూది గుచ్చుడే
ఎండుతున్న గొంతుల
గుక్కెడు నీటికోసం
ఎగుడు దిగుడు గుట్టల
ఎదురీదుతున్న ‘అపర భగీరతులు’
గుట్టలల్ల - ‘ఎడారి ఓడలు’
‘గిరిపుత్రులు’ - ‘అడవి బిడ్డలు’
ఊళ్ల బావిని చూస్తే ‘అతిశయోక్తి’
పాతాళం కన్పిస్తది
కోరలోకి మాత్రం నీళ్లు రావు
ఎండుతున్న గొంతులను చూసి
వట్టిపోయిన బావులు బావురు మంటే
‘చెలిమె’లన్నా దిక్కైతయనుకుంటే
గుడ్లు తేలేసిన గులకరాళ్లు
ఫక్కుమని నవ్వినయి
దిన దిన గండము...
‘మూడుకాళ్ల ముసల్ది’ నుల్కమంచము మీద
చెయ్యినొసలి మీద
కండ్లెమో ఆకాసం మీద
వాన పడక పోదా - పాణం లేచిరాదా..
మఘంకేమి మాయదారి రోగమో
చెడగొట్టువానలు కుర్సి - వడగాళ్లురాల్చి
దేవుడి దీపపు - పత్తి పింజలను
గంజికాసకునే - జీన్న పిలకలను
పండవెట్టి పోయింది
ఏడ్చీ ఏడ్చీ కుండలు నిండినయి కాని
బిందలల్ల మాత్రము నీళ్లు నిండలేదు
కడుపు నిండ జీతాలు పెంచిన
దొరబాబులు - సల్లగుండ
చెంబునిండా - నీళ్లున్నా ఇయ్యకపోతరా!
‘ఇంద్రజాలం’ - అన్నా చేసి ‘జలజాలాన్ని’
గుట్టలల్ల జల్ది పూర్తి చేస్తే
బిందలల్ల నీళ్లు నిండి
నెత్తిన బరువు దిగుతది
‘గిరిపుత్రుల నీళ్లగోస’ తీరి
బతుకు వెలుగుపూల వనమైతది!

- మడిపల్లి హరిహరనాథ్,
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9603577655

ప్రకృతి కాంతకు...
బీడు భూములపై వానచినుకు
శ్రామికుని చెమట చుక్క
ఈ రెండూ ఏకమైతే...
ఇంకేముంది?
పుడమి తల్లి వొల్లు పులకరించదా!
వరణుడు పరవిశించి..
వరముల నొసగడా!
నేల తల్లి పురిటి నొప్పులు వదిలితే..
పచ్చని పైరులు రెక్కలు విప్పవా?
శ్రామికుడు నిద్రలేచి
నవ నవోనే్మషంతో
ఆనంద తాండవం చేయడా!
ప్రకృతి కాంతకు..
ప్రణమిల్లడా!!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551

నీ స్పర్శకోసం !
ఓ మరపురాని నేస్తమా!
మధురమైన జ్ఞాపకమా!
పులకరించే అందమా
పలకరించే అధరమా
మరచిపోలేను ప్రియతమా
మైమరచిపోయే నీ రూపమా
మదిని దోచిన వౌనరాగమా
మనసున పూచిన మల్లెతీగవా
చెదిరిపోని స్వప్నమా
కదలిరాని శిల్పమా
పరితపిస్తున్నాను
నీ ప్రేమకోసమే..
జపిస్తున్నాను
నీ నామగానమే!
సదా నా మది కోరుకుంటుంది నీ స్నేహమే!

- కె.సురేష్ బాబు
సుల్తానాబాద్

అన్నదాత !
మనిషి బతుకులో మెతుకువు నీవే రైతన్నా
ఈ దేశానికి నువు వెన్నుపూసవే మాయన్నా
అన్నదాత నీ ఆత్మహత్య ఏ చరితకు సంకేతం
అది ఏలేవాడికి మూడిన గడియల అంతిమ సందేశం
నీ కండలనే కరిగించి - భూమండలమే దునే్నసి
నీ నెత్తురు చెమటగా మార్చి - ఆ చెమటతో చేలను తడిపే
బురదలో నుండి బువ్వను దీసి - పసిడి పంటలకు ప్రాణం పోశావు!
బ్యాంకులోడు అప్పులీయడు - ఏలేటోడు నీ గోడినడు
పైస పైస మిత్తికి దెచ్చి - పంటచేళ్లో పైకం పెడితే
గిట్టుబాటు ధర రాకపోయెనా - మొదటికే నీకు మోసపోయావు!
దుక్కిలో వేసిన విత్తనాలలో - పుచ్చులు ఎన్నో పురుగులు ఎన్నో
పంట పొలంలో చల్లే మందులు - అసలువి ఎన్నో నకిలివి ఏవో
పత్తి మందే పరమాన్నమాయెనా - ఉరితాడే నీ ఊపిరిదీసేనా?
ఈ నకిలి విత్తనాల నాటకమేందో - ఆ కల్తీ మందుల కమామిషేంది
అన్నదాత మనమండగ ఉందాం - కలం హలంతో కవాతు చేద్దాం!

- తోటపల్లి భూమన్న, మంచిర్యాల
ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9963859920
email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.
merupuknr@andhrabhoomi.net

- డా. సింహాచలం లక్ష్మణ్ స్వామి