శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పల్లెల్లో మద్యం జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు
* ఎమ్మార్పీకి తిలోదకాలు
నెల్లూరు, డిసెంబర్ 22: జిల్లాలో మద్యం వ్యాపారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. లాటరీ పద్ధతిలో అతి తక్కువ ధరకు షాపులు దక్కించుకున్న పలువురు అదనపు ఆర్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిబంధనలును అతిక్రమించి అక్రమ అమ్మకాలకు తెరతీశారు. పల్లె గొంతులకు బెల్ట్ బిగించారు. వేళాపాళా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. మరోవైపు ఎమ్మార్పీ ధరలకు తిలోదకాలిచ్చి క్వార్టర్ బాటిల్‌పై 10 నుండి 20 రూపాయల వరకు అదనంగా అమ్ముతున్నారు. పల్లెల్లో అర్ధరాత్రి కూడా గ్లాసులు గలగలలాడుతున్నాయి. దాబా హోటళ్లలో దర్జాగా సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో అక్రమ అమ్మకాలను అడ్డుకోవలసిన ఎక్సైజ్ అధికారులు మిన్నకుండటం విమర్శలకు తావిస్తోంది. వ్యాపారుల నుండి నెలవారీ మాముళ్లు ముట్టడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మెత్తం 342 మద్యం దుకాణాలు ఉండగా జిల్లాలో 44 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం నెల్లూరు నగరంలో 34, కావలిలో 7, గూడూరులో 3 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో కొత్త బార్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతో కొత్త బార్లు ఏర్పాటుకు వ్యాపారులు మెగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. షాపుల కంటే బార్లు నయం అనే విధంగా వ్యాపార వర్గాల్లో కనిపిస్తోంది. 2006లో బార్లు లైసెన్స్ మంజూరు చేసిన ఎక్సైజ్ శాఖ తిరిగి పదేళ్లకు కొత్త పాలసీతో బార్లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా అందుకు 10 రెట్లు బెల్టుషాపులు ఉన్నాయి. అధికారులు కూడా టార్గెట్ల లక్ష్యంగా బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎంఆర్పీ ధర కంటే సుమారు 10 నుండి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ నిరుపేదల కడుపు కొడుతున్నారు. విచ్చలవిడి బెల్ట్‌షాపుల వల్ల పచ్చని కుటుంబాలు గుల్లవుతున్నాయి. అలాగే గ్రామాల్లో తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపధ్యంలో పలు గ్రామాల ప్రజలు అధికారులను కలసి బెల్ట్‌షాపుల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. వాటిని ఎత్తివేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ అధికారుల నుండి స్పందన నామమాత్రమే. కేవలం ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నా వాళ్లు మాత్రం వ్యాపారులు నెలనెల ఇచ్చే మాముళ్లకే మెగ్గు చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా చాలా మద్యం షాపుల్లో నిబంధనలు పాటించడం లేదు. వేళాపాళా లేకుండా మందును విక్రయిస్తున్నారు. మద్యం షాపును ఆనుకుని సిట్టింగ్‌లు ఏర్పాటు చేసి మందుబాబులకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవేమీ ఎక్సైజ్ అధికారులకు కన్పించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.