నమ్మండి! ఇది నిజం!!

ఉడతా ఉడతా హూచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది. ఓ ప్రదేశంలోని జీవరాశి సమసిపోకుండా, అలాగే విపరీతంగా పెరిగిపోకుండా ప్రకృతి సమస్త జీవరాశిని సమానంగా కాపాడుతూంటుంది. ఏ ప్రదేశంలోనైనా సరే ప్రతీ జీవరాశి సంఖ్య మించకుండా, తరగకుండా ఉండే ఏర్పాటు అద్భుతం అని కొన్ని సందర్భాల్లో మనకి అర్థం అవుతుంది. చరిత్రలో అలాంటి సందర్భాలు అనేకం వచ్చాయి. ఓ ప్రదేశంలోని జంతువులని అవి లేని మరో ప్రదేశానికి తీసుకెళ్లడం, తర్వాత వాటి సంతతి అనూహ్యంగా పెరిగిపోవడం అనేక దేశాల్లో జరిగాయి. వాటిని పరిమితి చేయలేక ఆ దేశ ప్రభుత్వాలు చాలా అవస్థలు పడ్డాయి.
ఆఫ్రికా ఖండంలోని కెన్యా అడవుల్లో మాత్రమే జీవించే రాక్షస నత్తలని కొందరు అమెరికాలోని హవాయ్ ద్వీపానికి తీసుకువెళ్లినప్పుడు, ఆస్ట్రేలియాకి కుందేళ్లని తీసుకు వెళ్లినప్పుడు వాటి సంతతి అమితంగా పెరిగి స్థానికులు ఎన్నో అవస్థలకి గురవ్వాల్సి వచ్చింది. బ్రిటన్ కూడా నేడు ఇలాంటి ఓ సమస్యని ఎదుర్కొంటోంది.
అవి రోగాలని అంటిస్తాయి. స్థానిక వనరులని నాశనం చేస్తాయి. దాడి కూడా చేస్తాయి. ఏటా అవి బ్రిటన్‌కి కొన్ని కోట్ల పౌన్ల నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎక్కువ పిల్లల్ని పెట్టే అవి బూడిదరంగు ఉడతలు!
వాటి గురించి తెలుసుకుంటే సైన్స్ ఫిక్షన్ నవల చదువుతున్నట్లుగా ఉంటుంది. నార్త్ అమెరికాకి చెందిన బూడిద రంగు ఉడతలు బ్రిటన్ దేశానికి చేరాయి. 1876లో ఎవడో ధనవంతుడు పెంపుడు జంతువులుగా వీటిని బ్రిటన్‌కి తెచ్చుకున్నాడు.
బ్రిటన్‌కి చెందిన థామస్ బ్రాకెల్ హర్‌స్ట్ ప్రపంచ యాత్రికుడు. అతను ఓ బూడిదరంగు ఉడతల జంటని తెచ్చాడని, తన ఎస్టేట్‌లోకి అవి పంజరంలోంచి తప్పించుకున్నాయని ఓ కథనం. కాని వాటిని ఆయన తెచ్చినట్లుగా ఎక్కడా స్థానిక రికార్డుల్లో లేదు.
మరో కథనం ప్రకారం పదకొండో డ్యూక్ ఆఫ్ బెడ్‌ఫోర్డ్ న్యూజెర్సీ నించి పది ఉడతల జంటలని తెచ్చి బెడ్‌ఫోర్డ్ షైర్‌లోని తన ఎస్టేట్‌లో వదిలాడు. ఈయన జులాజికల్ సొసైటీ ఆఫ్ లండన్‌కి అధ్యక్షుడు అవడం విశేషం. కొన్నిటిని లండన్‌లోని రీజెంట్ పార్క్ క్యూ గార్డెన్స్‌కి కూడా బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నించి బూడిద రంగు ఉడతల సంతతి పెరుగుతూ వస్తోంది.
విదేశాల నించి స్థానికంగా లేని జంతువులని దిగుమతి చేసుకోవడం ఆ రోజుల్లో నిషిద్ధం కాదు. దాంతో అది స్టేటస్ సింబల్‌గా ఉండేది. కాని వారు దాని ఫలితాలని ఊహించలేక పోయారు. బ్రిటన్‌లో అప్పటికే ఉన్న ఎర్రరంగు ఉడతల కన్నా ఇవి ఎక్కువ తింటాయి. అవి పాతిపెట్టిన గింజలని, విత్తనాలని బూడిద రంగు ఉడతలు తవ్వి తీసి తినడమే కాక వాటి మీద దాడి చేయసాగాయి. అంతేకాక ఓక్ లాంటి వృక్షాల మీదకి పాకి పచ్చి గింజలని కూడా ఇవి తింటాయి. దాంతో వాటిని మళ్లీ పాతిపెట్టే సమయం వచ్చినపుడు చెట్లకి విత్తనాలు ఉండేవి కావు. ఎర్ర ఉడతలు వాటిని తినవు.
బూడిదరంగు ఉడతలు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. అవి కొత్త ప్రదేశాలకి వలస వెళ్లడంతో వాటి జనాభా బ్రిటన్ అంతా త్వరలోనే పాకింది. అవి తెలివిగలవి. ముందుగా కొన్ని వెళ్లి ఆహార వసతులు, నీరు మొదలైనవి చూసి వచ్చాకే మిగిలినవి వెళ్లేవి. ఈ ఉడతలకి ఉండే స్క్విరల్ ఫాక్స్ వైరస్ అనే వ్యాధి వాటిని బాధించకపోయినా అది ఎర్ర ఉడతలకి సోకి అవి మరణించేవి.
బ్రాకెల్ హర్‌స్ట్ బూడిద రంగు ఉడతలని అమెరికా నించి తెచ్చిన ఏభై ఏళ్లకి ఎర్ర ఉడతల సంఖ్య బాగా తగ్గి, బూడిద ఉడతల సంఖ్య బాగా పెరిగిపోయింది. జులై 1928లో యు.కె. ప్రభుత్వం మొదటిసారి వీటి మీద దృష్టి సారించింది. యుకె ఫారెస్ట్రీ కమిషన్‌కి బూడిద ఉడతల సమస్య అర్థం అయింది. బూడిద రంగు ఉడత తల కాని, తోక కాని తెస్తే అధికారులు అర షిల్లింగ్‌ని చెల్లించేవారు. క్రమంగా అది రెండు షిల్లింగ్‌లకి పెరిగింది.
నవంబర్ 1928లో న్యూయార్క్ టైమ్స్ అమెరికన్ ఉడతలని ఇంగ్లండ్‌లో చంపేస్తున్నారని ఘాటుగా విమర్శించింది. 1932 కల్లా అవి కొంత అదుపులోకి వచ్చాయి. బూడిద రంగు ఉడతలని దేశంలోకి తీసుకొచ్చి వదలడం చట్ట వ్యతిరేకంగా బిల్ పాస్ అయింది. 1937 నించి ఈ ఉడత కనిపించినప్పుడు అధకారులకి తెలియజేయకపోతే ఐదు పౌన్ల జరిమానాని విధించేవారు. 2014 దాకా ఈ చట్టం అమలులో ఉంది. ఐనా వాటి అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. కారణం వాటిని చంపే సహజ శత్రువు యు.కె.లో లేకపోవడమే.
నేడు బ్రిటన్‌లో ముప్పై లక్షల బూడిద రంగు ఉడతలు ఉన్నాయని అంచనా. ఎర్ర ఉడతల సంఖ్య లక్షా అరవై వేలే. ఇవి కూడా స్కాట్లండ్, నార్తరన్ ఇంగ్లండ్‌లలో మాత్రమే ఉన్నాయి. బూడిద రంగు ఉడతల సంఖ్య తక్కువగా ఉన్న చోట ఇవి ఉన్నాయి.
బూడిద రంగు ఉడతలకి మద్దతు పలికే వారి నించి వ్యతిరేకతని గమనించాక గ్రే స్క్విరల్ ఏన్‌హిలేషన్ లీగ్ పేరుని, రెడ్ స్క్విరల్ ప్రొటెక్షన్ పార్టనర్‌షిప్‌గా మార్చారు. 2006లో ది సన్ డే టైమ్స్‌లో ఇలా రాశారు.
‘ఉడతలు మాట్లాడలేక పోవచ్చు. కాని వాటికి మాటలు వస్తే, నా చర్మానికి బూడిద రంగు ఉన్నందుకు నన్ను చంపుతారా? అని అడుగుతాయి. వీటిని పట్టుకుని తల మీద ఓ సుత్తితో మోది చంపడం అన్యాయం’
2012లో ది డైలీ మెయిల్‌లో ఇలా రాశారు.
‘ఏటా మన ఎకానమీకి కోటీ నలభై లక్షల పౌన్ల మేరకి నష్టాన్ని కలిగించే చట్టవిరుద్ధమైన వలసదారులు ఈ బూడిద రంగు ఉడతలు. ప్రాణాంతక వ్యాధిని కలిగి ఉన్న ఇవి మన ఎర్ర ఉడతలని చంపడమే కాక, వన్య మృగాలకి, అడవులకి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటివల్ల నలభై శాతం ఓక్ వృక్షాలని ఇప్పటికే యుకె నష్టపోయింది. అలాంటి వాటి మీద యుద్ధం చేయడం సబబు కాదా?’
2014లో ప్రిన్స్ ఛార్లెస్ ఉడతల సమస్య గురించి ఏదైనా చేయాలని అనుకున్నాడు. కలప పరిశ్రమకి, అడవుల పెంపకానికి చెందిన ముప్పై ఐదు మందితో స్క్విరల్ అకార్డ్ అనే సంస్థని స్థాపించాడు. దీని ఉద్దేశం బూడిద రంగు ఉడతలని అదుపు చేసి, ఎర్ర ఉడతలని రక్షించడం. ఈ సంస్థ బూడిద రంగు ఉడతలని చంపాలన్న విషయాన్ని మరుగుపరచకుండా బాహాటంగా చెప్పింది. బూడిద రంగు ఉడతలని పూర్తిగా నిర్మూలించడం ద్వారానే బ్రిటీష్ దేశ వాతావరణం పూర్వపు స్థితికి చేరుకుంటుందని బిబిసి అభిప్రాయపడింది.
నగరవాసులు చూసే మొదటి వన్యమృగం బూడిద ఉడతే. వారు పక్షుల కోసం ఉంచిన బర్డ్ ఫీడర్లలోంచి ఇవి విత్తనాలని దొంగిలించడం అంతా చూసి ఉంటారు. బూడిద రంగు ఉడతని రాజకీయ నాయకులు కూడా వదల్లేదు. సాధారణంగా మొదటి దెబ్బ చంపదని, మనుషులకి, జంతువులకి ప్రాణం విషయంలో తేడా లేదని, అవి ఇంకో దేశం నించి వచ్చిన కారణంగా చంపడం అవివేకం అని కొందరు రాజకీయ నాయకులు బాహాటంగా చెప్పారు. నేడు యుకెలో ఈ ఉడతల వల్ల ఏటా ఇళ్ల కప్పుల రిపేర్‌కి ఇరవై లక్షల పౌన్లు ఖర్చవుతుంది. వ్యవసాయ రంగంలో జరిగే నష్టాన్ని లెక్కపెట్టలేం. 2020కల్లా వీటిని పూర్తిగా నిర్మూలించాలని ఫారెస్ట్రీ కమిషన్ నిర్ణయించింది.
అక్కడ లేని జంతువులని ఇంకో ప్రదేశం నించి తీసుకురావడం ద్వారా ఎంత ప్రమాదమో ఈ బూడిదరంగు ఉడతల ఉదంతం తెలియజేస్తోంది.

పద్మజ