రాష్ట్రీయం

సీజేకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: సుప్రీంకోర్టులో మంగళవారం అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించాలంటూ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుని అందరిని ఆశ్చర్యంలో పడవేసింది. వెంకయ్య నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్ సింగ్ బాజ్వా, ఆమీ హర్షధ్యాయ యాగ్నిక్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.
ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు దారితీసిన పరిస్థితులను సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మంగళవారం విలేఖరుల సమావేశంలో వివరించారు. వెంకయ్య నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే.సిక్రి, జస్టిస్ ఎస్‌ఏ.బోబ్డే, జస్టిస్ ఎన్‌వి.రమణ, జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఏకే.గోయెల్‌తో కూడిన ఈ బెంచ్ పిటిషన్‌పై విచారణ జరుపవలసి ఉండగా కాంగ్రెస్ అకస్మాత్తుగా ఉపసంహరించుకోవటం చర్చనీయాంశంగా మారింది. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో బెంచ్‌ను ఎవరు ఏర్పాటు చేశారనే విషయం చెప్పనందుకే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు కపిల్ సిబల్ తెలిపారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు? ఎలా ఏర్పాటు చేశారనేది తమకు తెలియచేయాలని కపిల్ సిబల్ వాదించారు.
బెంచ్ ఏర్పాటుపై తాము ఏడు ప్రశ్నలను సుప్రీం కోర్టు ముందు పెట్టినట్లు కపిల్ సిబల్ వివరించారు. బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన జుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు ఇవ్వటం లేదని ఆయన ప్రశ్నించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకున్న పక్షంలో తాము దీనిని కోర్టులో సవాల్ చేస్తామని కపిల్ సిబల్ నిన్న స్పష్టం చేసిన విషయం విదితమే. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించేందుకు సంబంధించిన అంశంపై విచారణ జరిపేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేసే అధికారం ఎక్కడిదని కపిల్ సిబల్ అడిగారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశం తమకు లభించనంత వరకు కోర్టులో వాదించలేం కాబట్టే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పారు. పిటిషన్‌లో పేర్కొన్న అంశాల యోగ్యతలపై వాదించటం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు వ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల తమకు ఎలాంటి వ్యక్తిగత కక్ష, కోపం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఉద్దేశ్యమేదీ లేదని, న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రాన్ని రక్షించేందుకే పోరాడుతున్నామన్నారు. న్యాయ ప్రక్రియ స్వచ్ఛంగా ఉండాలనే లక్ష్యంతోనే పిటిషన్లు వేశామని కపిల్ సిబల్ వివరణ ఇచ్చారు.
న్యాయ వ్యవస్థ పరువు, ప్రతిష్టను కాపాడాలన్నదే తమ అంతిమ లక్ష్యమని ఆయన చెప్పారు. పిటిషన్‌లో రాజకీయపరమైన ఎలాంటి అంశాన్ని తాము ప్రస్తావించలేదని కపిల్ సిబల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎవరినో వ్యతిరేకిస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది.. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని ఆయన చెప్పారు. తమ పిటిషన్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కపిల్ సిబల్ తెలిపారు. కొందరు వ్యక్తులు వ్యవహరించిన తీరు మూలంగా అనుమానాలు తలెత్తాయి కాబట్టే పిటిషన్ వేయవలసి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ దురుద్దేశ్యంతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందనే ఆరోపణలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. కొందరు న్యాయమూర్తులు ఆరోపణలు చేశారు కాబట్టే సుప్రీం కోర్టు అంతర్గత పని ప్రక్రియపై అనుమానాలు కలిగాయని కపిల్ సిబల్ చెప్పారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశం తమకు అందిన తరువాత భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేసుకుంటామని ఆయన తెలిపారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశం గురించి తనకు తెలుసనడం అన్యాయమని కపిల్ సిబల్ చెప్పారు. పిటిషన్‌పై వాదించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాన్ని తమకు ఇవ్వాలి కదా అని ఆయన ప్రశ్నించారు.