రాష్ట్రీయం

మందుకూ మంజీర నీరు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రూవరీస్ వ్యాపారం ఢాం
కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకం
ఎక్సైజ్ ఆదాయానికి గండి
గలగలా గోదారి..బిరబిరా బీరు!

సంగారెడ్డి, నవంబర్ 30: ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర అని మహాకవి దాశరధి మంజీర నది వంపుసొంపులను కీర్తించగా, మంజీర నీరు మధురామృతంగా భావించిన బ్రూవరీస్ యాజమాన్యాలు బీర్ల కంపెనీలను స్థాపించి మందు బాబులకు కిక్కునిచ్చే వివిధ రకాల పేర్లతో బీర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి, గుంతపల్లి గ్రామాల శివార్లలో క్రౌన్, కాల్స్‌బర్గ్, యూబి, ఖజూర బీరు పరిశ్రమలు వెలిశాయి. ఖజూర పరిశ్రమ లాకౌట్ పడింది. పుల్కల్ మండలం శివ్వంపేట గ్రామ శివారులో మంజీర నది పరివాహక ప్రాంతంలో చార్మినార్ బ్రూవరీస్ బీర్ల ఉత్పత్తి చేస్తోంది. చార్మినార్ బ్రూవరీస్ యాజమాన్యం నదిలో ప్రవహించే రా వాటర్‌ను శుద్ధి చేసుకుని నీటి అవసరాలు తీర్చుకుంటోంది. అయతే, ప్రస్తుతం నదిలో నీరు ప్రవహించే పరిస్థితి లేకపోవడంతో ఈ పరిశ్రమకు నీటి కష్టాలు తప్పవా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొండాపూర్ మండలంలో ఉన్న బీరు పరిశ్రమలకు సింగూర్ నుండి హైదరాబాద్‌కు సరఫరా చేసే పెద్దాపూర్ ఫిల్టర్ బెడ్ నుండి నీటిని అందిస్తున్నారు. ఒక్కో పరిశ్రమకు సరాసరి రోజుకు 60 వేల లీటర్ల చొప్పున మంజీర నీటిని సమకూరుస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చే అనుమతికి అనుగుణంగా పరిశ్రమల్లో బీర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. యుబి పరిశ్రమ నెలకు పది లక్షల కేసుల బీర్లను తయారు చేస్తుండగా, క్రౌన్‌లో 4 లక్షలు, కాల్స్‌బర్గ్‌లో 5 లక్షల కేసుల వరకు బీర్ల ఉత్పత్తి జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగూర్ ప్రాజెక్టులో నీరు అడుగంటిపోయింది. దీంతో జంట నగరాలకు సైతం సింగూర్ నీటి సరఫరాను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల లెక్క ప్రకారం సింగూర్‌లో 1.5 టిఎంసిల నీరు ఉందని చెబుతున్న ప్రాజెక్టులో నీరు అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బీరు పరిశ్రమలకు ఈ నెల 1వ తేదీ నుండి నీటి సరఫరా నిలిపివేస్తున్నామని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు యాజమాన్యాలకు నోటీసులు అందజేసారు. ఆందోళన చెందిన పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. రెండు, మూడు నెలల వరకు బీర్ల లభ్యతకు కొరత ఉండకపోయిన భవిష్యత్‌లో బీరు లభించని పరిస్థితి నెలకొననుంది. ఈ దృష్ట్యా బోర్లు తవ్వుకునేందుకు పరిశ్రమ యాజమాన్యాలకు వాల్టా చట్టం మొకాలడ్డుతోంది. బీర్ల ఉత్పత్తి నిలిచిపోతే ఎక్సైజ్ శాఖ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడుకోవడం, కార్మికులకు ఉపాధి కల్పించడం, మద్యం ప్రియులకు బీరు కొరత రాకుండా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఎక్సైజ్ శాఖ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. నగరానికి చేరుకున్న గోదావరి జలాలనైన అందించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీరు పరిశ్రమల్లోకి గోదావరి గళగళా ప్రవహిస్తే మద్యం ప్రియుల ముందుకు బిర బిరా బీరు పరుగెత్తుతుంది. లేనిపక్షంలో చల్లని బీరు ధరలు ఒక్కసారిగా వేడెక్కవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బీర్ల పరిశ్రల్లో ఉత్పత్తి నిలిచిపోతే రోజుకు వందల సంఖ్యలో తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలు కూడా కనిపించకపోవచ్చు. దీంతో హమాలీలు, డ్రైవర్లు, క్లీనర్ల బ్రతుకులు భారంగా మారే ప్రమాదం పొంచిచూస్తోంది. ఐదారేళ్లుగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా బీర్ల ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలకు ఊహించని విధంగా మంజీర నది గట్టి షాక్ ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నీటి గండంతో కొట్టుమిట్టాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలను గట్టెక్కిస్తే అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుంది. (చిత్రం) సింగూర్ ప్రాజెక్టు గేట్ల వద్ద అడుగుల లోతుకు తగ్గిన నీటి మట్టం