శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వాదోపవాదాలు... చివరకు తీర్మానం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 8: తొలి పంటకు సాగునీటి విడుదల కోసం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఆద్యంతం ప్రభుత్వ, విపక్ష సభ్యుల వాదోపవాదాల నడుమ కొనసాగింది. సమావేశ ప్రారంభంలోనే మంత్రి నారాయణ ‘సభ్యులెవరైనా కేవలం సాగునీటి విడుదల గురించి మాత్రమే మాట్లాడండి’ అంటూ సూచన చేశారు. అయినప్పటికీ మధ్య మధ్యలో చర్చ పక్కదారి పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలా జరిగే ప్రతిసారి స్వయానా మంత్రే కలుగజేసుకొని చర్చను తిరిగి సాగునీటి వైపుకు పరిమితం చేసేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. ఒకానొక దశలో మంత్రి సైతం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ‘కెమెరాల్లో పడేందుకు ఏదంటే అది బిగ్గరగా మాట్లాడవద్దు’ అన్నారు. శ్రీ్ధర్‌రెడ్డి సైతం తానేమి టివిల్లో కనిపించేందుకు మాట్లాడట్లేదని, తానేమి మాట్లాడాలో మంత్రి నిర్దేశించాల్సిన అవసరం లేదని ప్రతిస్పందించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వేల ఎకరాల ఆయకట్టుకు 2.5 టిఎంసిల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాలువల్లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగించే చర్యలను వెంటనే చేపట్టాలని, దీనిపై సమావేశంలోనే ప్రకటన చేయాలని, లేనిపక్షంలో తాను సమావేశ మందిరాన్ని వదిలి వెళ్లనని భీష్మించారు. దీనిపై ఇరిగేషన్ అధికారుల చేత మంత్రి సమాధానం ఇప్పించారు. పూడికతీత పనులు 9వ తేది నుంచే ప్రారంభిస్తామని వారు ఎమ్మెల్యేకు హామీనిచ్చారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సోమశిలలో ఆశాజనకంగా సాగునీరు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అధికారులకు ముందుచూపు లేకపోవడం, మితిమీరిన విశ్వాసం వల్లనే ప్రస్తుతం జలాశయంలో నీరు అడుగంటే పరిస్థితి వచ్చేలా చేసిందని ఆయన ధ్వజమెత్తారు. మొదటి పంటకు నీటి విడుదలలో మెట్ట ప్రాంతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ సూళ్లూరుపేట ప్రాంతంలో ప్రజలకు తాగునీరు కూడా లేదని, పశువులకు తాగేందుకు నీరు లేక పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సాగునీరు కేటాయించలేదని, అయినప్పటికీ కనీసం తాగునీటి అవసరాల కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ న్యాయం జరిగేలా అధికారులు సాగునీటి విడుదల చేయాలని సమావేశంలో సూచించారు.
ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఒక టిఎంసికి 10వేల ఎకరాల వంతున లెక్కకట్టి సాగునీటిని విడుదల చేస్తే మరికొంత మంది ఆయకట్టు రైతులకు న్యాయం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆలస్యమైందని, వెంటనే సాగునీటిని విడుదల చేయాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి వంటి దక్షిణ ప్రాంత నియోజకవర్గాల్లో తాగు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీటినైనా విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. పెన్నా డెల్టా కమిటీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీరు విడుదల చేసే విషయంలో రైతులను ఒప్పించి రొటేషన్ పద్ధతిలో నీటిని సరఫరా చేస్తే మరింత మందికి మేలు చేయొచ్చన్నారు.
అలిగి వెళ్లిపోయిన జడ్పీ చైర్మన్
ఐఎబి సమావేశంలో మరోసారి డెల్టా, నాన్ డెల్టా తకరారు జరిగింది. జడ్పి చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ సోమశిల జలాశయం ఆత్మకూరు ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడి రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని, ప్రతిసారి కేవలం డెల్టా రైతుల ప్రయోజనాలకే పెద్ద పీట వేయడం సరికాదన్నారు. కనీసం రెండో పంటకైనా డెల్టాకు నిలిపి నాన్ డెల్టాకు నీటిని విడుదల చేయాలని సూచించారు. ఈ సమయంలో టిడిపి ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రలు కలుగజేసుకొని రెండవ పంట గురించి ప్రస్తుతం వాదనలు వద్దని, దానికి సమయం ఉందని, రైతుల మధ్య గొడవలు సృష్టించవద్దన్నారు. అయినా జడ్పి చైర్మన్ మరింత గట్టిగా డెల్టా రైతులకు రెండో పంటకు నీటిని ఇవ్వాలని ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనలేదని వాదనకు దిగారు. ఆయన వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచి ఎటువంటి మద్దతు రాకపోవడం గమనార్హం. ఈ సమయంలో సభలో ఎక్కువ మంది ఆయనతో విభేదించడంతో ఆయన సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. చివరకు 3లక్షల ఎకరాలకు సాగునీరు తొలి పంటకు ఇచ్చే విషయమై సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయించారు.