శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 18: తెలుగుదేశం పార్టీని తమ భుజస్కంధాలపై మోస్తున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరంలోని నారాయణ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో మృతి చెందిన 55 మంది టిడిపి కార్యకర్తల కుటుంబసభ్యులకు ఆయన రూ.2లక్షల వంతున ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీనే పరమావధిగా భావించిన ఎందరో కార్యకర్తలు నక్సలైట్లు, ఫ్యాక్షనిస్ట్ గొడవల్లో వందల సంఖ్యలో మరణించారని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 55 మంది 2004 నుంచి ఇప్పటిదాకా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఏదైనా భరోసా కల్పించాలనే సదుద్దేశ్యంతో మహానాడులో ఆర్థిక తోడ్పాటు తీర్మానం చేశానని గుర్తు చేశారు. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల్లో కలిపి 28వేల వరకు వివిధ సహాయాల నిమిత్తం దరఖాస్తులు అందాయని, వాటిలో 4వేల వరకు ఆర్థిక సహాయం అందించామని, 1200 మందికి ఉపాధి కల్పించామని, 300కుపైగా కుటుంబాలకు కుటీర పరిశ్రమలు పెట్టించామని వివరించారు. కార్యకర్తలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 55లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీగా టిడిపి ఆవిర్భవించిందని, ఈ ఏడాది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 50లక్షల సభ్యత్వం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, శిద్ధా రాఘవరావు, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
వ్యక్తిపై హత్యాయత్నం
నెల్లూరు, నవంబర్ 18: ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం దుకాణంలో మద్యం సేవించే సమయంలో ఏర్పడిన గొడవ చివరకు ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక వెంకురెడ్డినగర్‌కు చెందిన కృష్ణ అలియాస్ కిట్టు కారుడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తరచూ మద్యం సేవించే కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక పద్మావతి సెంటర్‌లోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించాడు. అదే సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న మహమ్మద్ వలీ అనే వ్యక్తితో కృష్ణకు మాటామాటా పెరిగి చివరకు మహమ్మద్ వలీపై కృష్ణ చేయిచేసుకునే వరకు వెళ్లింది. పక్కనున్నవారు సర్దుబాటు చేయడంతో వలీ ఇంటికి వెళ్లిపోయాడు. తనపై కృష్ణ దాడిచేసిన విషయాన్ని వలీ తన కుమారుడు రషీద్‌కు తెలిపాడు. గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న రషీద్ మరికొందరు స్నేహితులతో కలిసి సాయంత్రం మద్యం దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ మద్యం సేవిస్తున్న కృష్ణను తన స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన కృష్ణను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న సిఐ మంగారావు హత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కృష్ణ పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం బొల్లినేని వైద్యశాలకు తరలించారు.

నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించాలి
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం

నెల్లూరు, నవంబర్ 18: సామాన్య ప్రజానీకానికి నగదు సమస్య లేకుండా నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగదురహిత లావాదేవీల నిర్వహణపై అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా కలెక్టర్, బ్యాంకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.100, రూ.50 చిన్న నోట్లను దాదాపు రూ.10 వేల కోట్లు రాష్ట్రానికి పంపాలని ఆర్‌బిఐని కోరినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకొని మొబైల్ లావాదేవీల ద్వారా అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణపై జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులందరు అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ లావాదేవీలపై ఆయా ఎటిఎంల వద్ద ఉన్న వ్యక్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఎటిఎంల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా టోకెన్ పద్ధతిన నగదు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-పాస్ మిషన్స్, ఆన్‌లైన్ లావాదేవీల పద్ధతిపై బ్యాంక్ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో పటిష్టంగా అమలుచేసి ప్రజానీకానికి ఎలాంటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకొని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రజల్లోకి వెళ్లడంలో నేతలు ఫెయిల్
* సమన్వయ కమిటీ సమావేశంలో లోకేష్ ఫైర్

నెల్లూరు, నవంబర్ 18 : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా టిడిపి నేతలు నిర్లక్ష్యంగా ఉన్నారని, ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా నేతలకు చురకలంటించారు. తన పర్యటనలో భాగంగా పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేస్తూ సుతిమెత్తని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ విజయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా నేతలంతా సమన్వయంతో వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కలసికట్టుగా ఉంటూ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచిస్తున్న సమయంలో జిల్లాకు పలువురు నేతలు పార్టీ సభ్యత్వ నమోదు గడువు మరో 10 రోజులు పొడిగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పాత నోట్ల రద్దు కారణంగా చిల్లర కొరత ఎక్కువగా ఉందని, సభ్యత్వ రుసుం చెల్లించే విషయంలో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన లోకేష్ గడువు తేదీని పొడిగించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీనిచ్చారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, నామినేటెడ్ పదవుల కోసం సభ్యత్వం పొందాలని చూసేవారు ఎక్కువయ్యారని సూచించారు. అలాగే సభ్యత్వం లేని వారికి నామినేటెడ్ పదవుల కోసం రెకమెండ్ చేయవద్దని జిల్లా నేతలకు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, జిల్లాలో జరిగే పలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై తనకు పూర్తి సమాచారం ఉందని, ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నది, ఎవరు పార్టీకి నష్టం కలిగిస్తున్నది తనకు తెలుసునని, ఇకనైనా పద్ధతులు మార్చుకొని పార్టీకి తద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేయాలని, రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్న తమ నేత చంద్రబాబుకు బాసటగా నిలవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టిడిపి నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్లపాక అనూరాధ, బీద మస్తాన్‌రావు, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, పరసా రత్నం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

లోకేష్‌కు తెలుగు తమ్ముళ్ల నీరాజనం
* నగరంలో పసుపుదండు స్కూటర్ ర్యాలీ
నెల్లూరు, నవంబర్ 18 : జిల్లాలో జరుగుతున్న టిడిపి జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన నారా లోకేష్‌కు పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకొని నగరం మొత్తం పసుపురంగు పులుముకుంది. నగరంలో పలుచోట్ల, లోకేష్ పర్యటన జరిగే మార్గంలో ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున జిల్లా టిడిపి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన టిడిపి నేతలు పలువురు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో పోటీపడ్డారు. శుక్రవారం ఉదయం తాను బసచేసిన మినర్వా గ్రాండ్ హోటల్ నుంచి లోకేష్ యాత్రలో పాల్గొనేందుకు బయల్దేరారు. ఆయన ర్యాలీకి ముందు, వెనక టిడిపి కార్యకర్తలు స్కూటర్ ర్యాలీ చేపట్టారు. భారీసంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరు కావడంతో కార్యక్రమం ఘనంగా సాగింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు తదితరుల ఆధ్వర్యంలో నగరంలో భారీ స్వాగత ఏర్పాట్లు జరిగాయి. నగరంలోని ప్రధాన రహదారి వెంట ర్యాలీ కొనసాగుతూ టిడిపి కార్యాలయంకు చేరుకుంది. నగరంలో ర్యాలీ సాగే సమయంలో ప్రజలకు లోకేష్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి తనయుడ్ని చూసేందుకు నగరవాసులు కూడా ఆసక్తి కనబరిచి, లోకేష్ సంజ్ఞలకు బదులిస్తూ తాము కూడా చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. అక్కడ పార్టీ జెండాను లోకేష్ ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి, కార్యకర్తలకు ఆర్థిక సహాయం, సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. లోకేష్ నగరంలో పర్యటన కొనసాగుతున్నంత సేపు ఆయన దృష్టిలో పడేందుకు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీకి చెందిన ప్రధాన నేతలందరూ లోకేష్ పర్యటనలో కనిపించారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన గూడూరులో జరిగే జనచైతన్య యాత్రలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు.

పెంచలకోన దేవస్థానం
హుండీ ఆదాయం 61.7 లక్షలు
రాపూరు, నవంబర్ 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానం హుండీలను శుక్రవారం లెక్కించారు. దేవస్థానంలోని స్వామి, అమ్మవార్ల, ఆంజనేయస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ మూడు ఆలయాల్లో భక్తులు సమర్పించిన నగదు రూ.61 లక్షల 71 వేల 180 వచ్చినట్లు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి రవీంద్రరెడ్డి తెలిపారు. అలాగే 280 గ్రాముల బంగారం, మూడు కిలోల 66 గ్రాముల వెండి, అమెరికాకు చెందిన ఏడు డాలర్లు, కువైట్‌కు చెందిన 85 దినార్లు వచ్చినట్లు చెప్పారు. నిత్యాన్నదాన సత్రం వద్ద ఉన్న హుండీని లెక్కించగా, రూ.లక్షా 45 వేల 243 ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ హుండీలను లెక్కించినట్లు తెలిపారు. ఈ నగదును స్థానిక గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు వివరించారు. ఈ లెక్కింపులో దేవస్థానం సహాయ కమిషనర్ ఎస్ రామ్మూర్తి, ట్రస్టుబోర్డు సభ్యులు పీర్ల సోమయ్యయాదవ్, సిబ్బంది శ్రీ్ధర్‌నాయుడు, పెంచలరెడ్డి తదితరులు ఉన్నారు.

నీపాప పరిశీలించిన అస్ట్రేలియా బృందం
వింజమూరు, నవంబర్ 18: రెమిడీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న నీపాప కార్యక్రమాలను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బృందం శుక్రవారం ఊటుకూరు పంచాయతీ తక్కెళ్లపాడు ఎస్సీ కాలనీలో పరిశీలించింది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కెమిన్ హుబర్ కాలనీవాసులను ఆరా తీసిన సమస్యలపై ఆస్ట్రేలియా దేశం నుంచి స్రెడ్ సంస్థకు సహకారం అందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బికెఏకెఎఫ్‌బి కన్సల్టెంట్ ఇలాంగో బృందంతో సహా గౌరీశంకర్, ప్రసాద్, జయలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న రైతు క్షేత్రాలు కుంభకోణంపై నేడు విచారణ?
కావలి, నవంబర్ 18 : సాగులో శాస్ర్తియ విధానాలను రైతులకు తెలియజేసి వారిని అటువైపుగా మళ్లించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించే అంశంపై అవగాహన కలిగించేందుకు గ్రామాల్లో గత ఏడాది చంద్రన్న రైతు క్షేత్రాల పేరిట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో కావలి సబ్ డివిజన్‌లోని కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో 26క్షేత్రాలను ఎంపిక చేసి ఆయా మండలాల్లోని ఏఓ, ఏఇఓ, ఎంపిఇఓలకు ఒక్కొక్కరికి ఒక్కో క్షేత్రాన్ని అప్పగిస్తూ పర్యవేక్షించి తేడాను తెలియచెప్పాలని అధికారులు నిర్దేశించారు. ఇందులో భారీ రాయితీతో విత్తనాలు, ఎరువులు, క్రిమి నియంత్రకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే అమల్లో ఏమీ చేయకుండానే మొత్తం చేసినట్లు చూపి రైతులకు ఇవ్వకుండానే దాదాపుకోటి రూపాయలకు పైగా స్వాహా చేసినట్లు రాష్ట్రప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆత్మ పిడి దొరసానిని విచారణ అధికారిగా నియమించి మొత్తం విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వమని ఆదేశించినట్లు తెలిసింది. కాగా శనివారం కావలి సబ్ డివిజన్‌లో గల మండలాల్లో విచారణ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సిబ్బంది చెప్తున్నారు. ఇందులో ఏ మాత్రం అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయినా ఏకంగా సంబంధిత సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించాలన్న ఆలోచనతో ఉన్నతాధికారులు ఉన్నట్లు చెప్తుండగా వారిలో గుబులు రేపుతోంది. ఈ విషయమై సహాయ సంచాలకులు బాలాజీనాయక్‌ను సంప్రదించగా విచారణ చేపడుతుండటం వాస్తవమేనని తెలిపారు.

బావిలో పడి వివాహిత మృతి
అనుమసముద్రంపేట, నవంబర్ 18 : మండల పరిధిలోని పొనుగోడులో జవంగల లక్ష్మీకాంతమ్మ (30) అనే వివాహిత మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. భర్త శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో భర్త శ్రీనివాసులు పశువుల్ని మేతకు తీసుకెళ్లిన సందర్భంలో ఆయనకు భోజనాన్ని తీసుకెళ్లింది. ఆ సందర్భంలో అక్కడి బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారి పడి మృతి చెందింది. అయితే ఆమె ఆచూకీ లేకపోగా, రాత్రంతా వెతికినా కనపడలేదన్నారు. ఉదయాన్ని బావి వద్ద పరిశీలించగా, లక్ష్మీకాంతమ్మను విగతజీవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ తెలిపారు.
నగదు రహిత లావాదేవీలు పెరగాలి
* జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్
నెల్లూరు, నవంబర్ 18: శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినా, నగదు రహిత లావాదేవీలు పెరగకపోవడం శోచనీయమని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన నగదు రహిత ప్రొవైడర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో చాలామంది మొబైల్‌ఫోన్లు వాడుతున్నారని, కాని సరైన అవగాహన లేకపోవడం వల్ల మొబైల్‌ఫోన్ల వల్ల కలిగే లాభాలను విస్మరిస్తున్నారని అన్నారు. మొబైల్‌ఫోన్లలో నగదు రహిత అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా చిల్లర వర్తకాల నుంచి విమాన ఛార్జీల వరకు ఫోన్ల ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా తదితర మొబైల్ కంపెనీల ప్రతినిధులు, అమరావతి నాలెడ్జ్ కేంద్ర జిల్లా అభివృద్ధి అధికారి ఎం అనిల్‌కుమార్, కృష్ణచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం
నెల్లూరు, నవంబర్ 18: కార్తీక మాసం సందర్భంగా నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విపిఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సౌజన్యంతో కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా కళాశాల మైదానంలో 11 అడుగుల ఎత్తయిన శ్రీ ఉమాపార్తివేశరస్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం 9 గంటలకు గణపతి పూజతో మొదలైంది. సాయంత్రం 6 గంటలకు ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా సాగాయి. తొలుత వేమిరెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు రుద్రాభిషేకం నిర్వహించేందుకు బారులుతీరారు. రాత్రి 8 గంటలకు ఉజ్జయిని మహాకాళేశ్వరుని దేవస్థానంలో జరిగే విధంగా వేదమంత్రోచ్ఛరణ నడుమ స్వామివారికి విభూతి అభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వహకులు దీపాలు వెలిగించుకొనేందుకు తైలం, ఒత్తులు, దీపపు కుందెలను ఉచితంగా అందజేశారు. నగరంలో తొలిసారిగా భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9 గంటలకు 108 దంపతులచే శతరుద్ర హోమం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడకు చెందిన వేదాంతం రాజగోపాలం చక్రవర్తిచే ‘కార్తీక మాసం-దీపం’ విశిష్టతపై ప్రవచనం అనంతరం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపనందేద్ర సరస్వతీ మహాస్వామి వారి అనుగ్రహభాషణం జరగనున్నది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో దీపోత్సవ కమిటీ ప్రతినిధులు కంచర్ల భాస్కరశర్మ, మద్దిన విశ్వనాథ్, వి సంపత్‌రాజు, ఆమంచర్ల ప్రభాకరరావు, వాకాటి విజయకుమార్‌రెడ్డి, సర్వేపల్లి అజయ్‌కుమార్, పాముల రమణయ్య, అరుణా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం సహకారంతో ప్రసాదాల వితరణ జరిగింది.