శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దస్త్రాల్లో వాస్తవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 8: తమ ఇంటి నివేశన స్థలాలను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కబ్జా చేశారంటూ కొందరు బాధితులు జిల్లా అధికారులను ఆశ్రయించడం, కాకాణిపై కేసు నమోదు కావడం సంగతి విదితమే. అయితే ఈ కేసులో అసలు కబ్జాదారుడు ఎవరనే విషయంలో జిల్లా యంత్రాంగం వద్ద అన్ని దస్త్రాలు ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ మండలం వావిలేటిపాడులో సర్వే నంబరు 272/2 ఏలో ఎకరం భూమి మాత్రమే ఉన్న వ్యక్తి ఇళ్ల స్థలాల కోసం 2004లో 2.92 ఎకరాల భూమిని మూడు విడతలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. అడంగల్‌లో ఒక ఎకరా మాత్రమే సదరు వ్యక్తికి ఉండగా రిజిస్ట్రేషన్ సమయంలో అదనంగా వచ్చిన రెండు ఎకరాలు ఎక్కడివనే ప్రశ్నతో అధికారుల విచారణ మొదలైంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి భార్య విజిత పేరు మీద 6 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి పక్కన ఉన్న భూమినే 2.92 ఎకరాలుగా చూపించి రిజిస్ట్రేషన్ జరిపించడం, తదనంతరం చేతులు మారి రియల్ వ్యాపారులు ప్లాట్లుగా విభజించి అమ్మడంతో సమస్య మొదలైంది. అసలు లేని భూమిలో ప్లాట్లు అమ్మడం, విషయం తెలియని కొందరు సదరు ప్లాట్లను కొనుగోలు చేయడం, చివరకు తమ భూమిని కాకాణి ఆక్రమించుకున్నారంటూ స్టేషన్ మెట్లు ఎక్కడం చకచకా జరిగిపోయాయి. కలెక్టర్ ఈ అంశంపై వెంటనే పరిశీలన జరపాలని సంయుక్త కలెక్టర్‌ను ఆదేశించడంతో స్థలానికి సంబంధించి పుట్టుపూర్వోత్తరం మొత్తం వెలుగుచూసింది. వాస్తవానికి సర్వే నెంబరు 272/2 లో 10 ఎకరాల భూమి మాత్రమే ఉందనే విషయం అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు కాకాణి భూకబ్జా ఆరోపణల్లో వాస్తవాలు లేవనే విషయాన్ని గ్రహించి దస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయం సమాచారం. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అనుకూలంగా నివేదిక తయారయితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కొందరు అధికార పార్టీ నేతలు ఈ నివేదిక బహిర్గతానికి అడ్డుతగులుతున్నట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రేపో మాపో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, తమ నేత సచ్చీలుడనే విషయాన్ని ఇదివరకే జిల్లా ప్రజానీకానికి తెలుసునని, మరోసారి ఆ విషయం రూఢీ అవుతుందని కాకాణి అనుయాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అస్త్రాలుగా పోలీస్ కేసులు
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీస్ కేసులను అస్త్రాలుగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఎప్పట్నుంచో జిల్లాలో ఆయా పార్టీల నేతల నుంచే వింటున్నాం. అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం, వెనువెంటనే నమోదు చేయించడం వంటి చర్యలు గతంలో ఎప్పుడూ జిల్లాలో జరిగిన దాఖలాలు లేవు. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు మాత్రమే ఉండాల్సిన రాజకీయ పార్టీ నేతల నడుమ రోజురోజుకీ శత్రుత్వాలు పెరిగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. నిన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి రాయలేని భాషను కూడా ఉపయోగించిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. అయితే పోలీస్ కేసులు పెట్టడం ద్వారా సంకుచితంగా ఆలోచించే ధోరణి కొత్తగా కనిపిస్తోంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తప్పు చేశాడా, లేదా అనేది అధికారుల విచారణలో ఎలాగూ వెల్లడవుతుంది. ఒకవేళ ఆయన తప్పు చేయనట్లు అధికారుల నివేదికలో వెల్లడయితే, తమ తొందరపాటు చర్యల వల్ల తమ కంటే కూడా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారనే మచ్చ అధికారపార్టీ జిల్లా నేతలకు తప్పక వస్తుంది. అధికారమనేది మార్పిడి ప్రక్రియ. గత పాలకులు పాటించిన పద్ధతినే కొత్తగా వచ్చేవారు కూడా పాటించిన కేసులను అస్త్రాలుగా ఉపయోగించుకోవడం మొదలుపెడితే తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదలయ్యేందుకు నెల్లూరే నాంది పలికినట్లవడం గ్యారంటీ.

కరెన్సీ కష్టాలు 30
* పండగ నెలపై నోట్ల రద్దు ప్రభావం
* ఎటిఎంలు, బ్యాంక్‌ల వద్ద తప్పని పడిగాపులు

నెల్లూరు, డిసెంబర్ 8: నోట్ల రద్దుకు నేటితో నెల వయస్సు. బ్యాంకుల్లో కొనసాగుతున్న రద్దీలో ఇసుమంత మార్పు లేదు. ఏటిఎంల వద్ద పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. నగదు కొరత, చిల్లర కష్టాలు సామాన్యులను విడిచిపెట్టలేదు. వాస్తవానికి రూ.24 వేలు గరిష్టంగా విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించినప్పటికి, చాలాచోట్ల అది సాధ్యపడడం లేదు. నగదు నిల్వలనుబట్టి రూ.4వేల నుంచి రూ.10వేల వరకు మాత్రమే ఖాతాదారులకు బ్యాంకులు ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో లావాదేవీలు నిలిచిపోయాయి. డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. విత్‌డ్రాల కోసం జనం ఎగబడుతున్నారు. ఈనెల మొదటి వారంలో ఉద్యోగులు, పింఛనుదారులతో పాటు పేదలు, సామాన్యులు, వ్యాపారులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బ్యాంకుల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నా, సాయంత్రానికి కనీసం రెండు వేలు కూడా తీసుకోలేని దుస్థితి. స్వైపింగ్ మిషన్లు, మినీ ఎటిఎంలు అంటూ అధికారులు హడావుడి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని మొదట్లో మెజార్టీ ప్రజలు స్వాగతించారు. నల్లకుబేరుల భరతం పడతారని అనుకుంటే, తమ భరతం పడుతున్నట్లు పరిస్థితి ఉందంటూ సామాన్యులు వాపోతున్నారు. నెల రోజులుగా నానా ఇక్కట్లు పడుతున్న ప్రజలు బ్యాంకుల వద్ద ఎదురుచూస్తు ఎటియంల వద్ద క్యూలో నిలబడుతూ నిత్యం ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దినసరి కొనుగోళ్లలో ముఖ్యంగా కూరగాయలు, పాలు, పండ్లు నిత్యావసరాలే ప్రథమ స్థానంలో నిలిచాయి. రోజువారీ కొనుగోళ్లకు జిల్లాలో రూ.5 కోట్ల వరకు ప్రజలు వెచ్చిస్తున్నారు. ఇలా 30 రోజులు లెక్కిస్తే వీటి అవసరాలకు రూ.150కోట్లు సరిపోతుంది. ఇక దుస్తులు, బంగారు ఆభరణాలు అనేవి అవసరాన్నిబట్టి కొనుగోలు చేసే జాబితాలో ఉంటాయి. నిత్యావసరాలకే నగదు లేకపోవడంతో ఇక అదనపు అవసరాల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదనే ధోరణిలో సామాన్యులు ఉన్నారు. రాబోయే నెల రోజులు పండగల సీజన్. క్రిస్మస్ మొదలు జనవరి 1, సంక్రాంతి పండగలతో ప్రజలు బిజీగా గడిపే కాలం. అయితే ప్రస్తుత నోట్ల రద్దు ప్రభావంతో ఏ మేరకు ఈదఫా పండగ నెలను ప్రజలు ఆస్వాదిస్తారో తెలియడంలేదు. ఇప్పటికే దుస్తులు, పండగ సామాను కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉండగా, ఎంతటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నా దుకాణాల ముందు జనం పలుచగా కనిపిస్తుండడం విశేషం. ప్రభుత్వం ఇకనైనా త్వరగా రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నగదును అందుబాటులోకి తీసుకురావాలని సగటు సామాన్యుడు వేడుకుంటున్నాడు.

కావలిలో రోడ్డు ప్రమాదం
* సైక్లిస్ట్‌ను తప్పించబోయి కారు- ఆర్టీసీ బస్సు ఢీ
* డ్రైవర్‌తోపాటు శిక్షణలో ఉన్న ఇద్దరు యువకుల మృతి
* చావుబతుకుల్లో మరొకరు
కావలి, డిసెంబర్ 8: కావలి పట్టణం ఉత్తరశివార్లలో ట్రంకురోడ్డుపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో కారులోని డ్రైవర్ బోగోలు మండలం చెన్నారెడ్డి పాలెంకు చెందిన పల్సాపురి రాజశేఖర్ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. శిక్షణ నిమిత్తం అందులో ఉన్న వెంకటేశ్వర థియేటర్ ప్రాంతానికి చెందిన కనుమర్లపూడి యశ్వంత్ (27), బాపూజినగర్‌కు చెందిన మొదుకట్ల దుర్గాప్రసాద్ రెడ్డి (32), కావలి కొత్తబజారుకు చెందిన జలగం రవిలకు తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో ఏరియావైద్యశాలకు, అక్కడినుంచి నెల్లూరుకు తరలించారు. మార్గమధ్యంలోనే యశ్వంత్, ప్రసాద్‌రెడ్డి ప్రాణాలు కోల్పోగా, జలగం రవి నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఘటనకు కారణంగా భావిస్తున్న సైక్లిస్ట్ కావలి పాత ఊరుకు చెందిన ఆళ్ల చంద్రశేఖర్‌రెడ్డికి గాయాలు కాగా, స్థానిక ఏరియావైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితం కాగా ఘటనను కళ్లారా చూసిన వారు వెంటనే బస్సుదిగి బతుకు జీవుడా అనుకుంటూ అందుబాటైన వాహనాలలో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఘటన విషయం తెలిసిన వెంటనే 108 వాహన సిబ్బంది, డిఎస్పీ రాఘవరావు, సిఐ వెంకట్రావు, ఎస్సైలు అంకమ్మ, నాగరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుష్మ, ట్రాఫిక్ అధికారి డివి బసవయ్య తదితరులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఘటన జరిగేందుకు కారణాలను ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలమేరకు ఇలా ఉన్నాయి. బాపూజీనగర్‌కు చెందిన విఎన్ రెడ్డి డ్రైవింగ్ స్కూల్‌కు చెందిన కారులో డ్రైవర్‌తో పాటు మృతులు, క్షతగాత్రుడు శిక్షణలో భాగంగా మద్దురుపాడు వైపు వెళుతున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ హైర్ బస్సు వస్తుండగా ముందువైపున రుద్రకోట నుంచి కావలికి చంద్రశేఖర్‌రెడ్డి అనే 60 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై వెళుతున్నారు. తొలుత అతను రోడ్డు మార్జిన్‌లోనే వెళుతుండగా సైకిల్ వెనుక వైపు లగేజి ఉండగా అది కదలడంతో సైకిల్ ఆటోమేటిక్‌గా రోడ్డు మధ్యభాగంలోకి వచ్చేసింది. దీంతో అతడిని తప్పించబోయిన బస్ డ్రైవర్ వాహనాన్ని కుడి చేతి వైపుకు తీసుకురాగా ఎదురుగా వస్తున్న శిక్షణలోని కారు చోదకులు దానిని గమనించక ముందుకు అలాగే రావడంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్‌ను ఎంతగా కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆగలేదని, కారును ముందుకు తోసుకుంటూ వెళ్లి ఓ తాటి చెట్టును ఢీకొనగా అది కూలిపోగా బస్ నిలిచింది. కారు ముందుభాగం బస్సు లోపలికి వెళ్లిపోగా కారులోని క్షతగాత్రులు బయటపడే మార్గం లేక అలానే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీస్ అధికారులు జెసిబిలను తెప్పించి వాటిని వేరు చేసే సమయానికే కారు డ్రైవర్ చనిపోగా మిగిలిన ముగ్గురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో శిక్షణ కోసం వచ్చిన వారిలో ఒకరు కారు నడుపుతున్నట్లు, ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గాలు ఉన్నప్పటికీ అనుభవ రాహిత్యంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని అధికారులు అంటున్నారు.
వైద్యుల తీరుపై విమర్శలు
రక్తస్రావంతో ప్రాణాపాయంలో ఉన్న క్షతగాత్రులను ఏరియా వైద్యశాలకు తీసుకురాగా వైద్య సిబ్బంది ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాంసపు ముద్దలుగా రక్తస్రావంతో బాధితులను వైద్యశాలకు తీసుకురాగా రక్తస్రావాన్ని అదుపు చేసేలా చికిత్స చేయలేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు పంపే సమయంలోనూ ఆక్సిజన్ వంటి సదుపాయం లేకుండా పంపారని, వైద్యుల నిర్లక్ష్య ధోరణి కారణంగానే సగం ప్రాణాలు పోయాయని బందువులు, స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు.
కన్నీరు మున్నీరవుతున్న బాధిత బంధువులు
కారు డ్రైవర్ రాజశేఖర్ వివాహితుడు కాగా భార్య కమల, ఇద్దరు మూడేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వారు, అతనిపై ఆధారపడి జీవించే కుటుంబ సభ్యులు వైద్యశాలకు చేరుకుని భోరున విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. చిన్నారులు నాన్నా అంటూ ఏడుస్తుండగా వారి బాధ చూసి స్థానికులూ భోరుమన్నారు. దుర్గాప్రసాద్‌కు భార్య రజిని, కుమారుడు చాణక్య ఉండగా, మరో మృతుడు యశ్వంత్ అవివాహితుడు, ఎంఫార్మసి చదువు పూర్తి చేశారు. వారి సోదరుడు అమెరికాలో చదువుతుండగా తండ్రి నరసింహారావు గుహ పెయింట్ల ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. గాయపడి మృత్యువుతో పోరాడుతున్న రవిది పట్టణంలోని కొత్తబజారు కాగా తండ్రి రత్తయ్య ఉన్నారు. వారంతా తీవ్ర వేదనలో మునిగిపోగా కన్నీరు మున్నీరవుతున్నారు.

వైభవోపేతంగా దొరసానమ్మ గంధోత్సవం
అనుమసముద్రంపేట, డిసెంబర్ 8: ఎఎస్ పేటలోని శ్రీ హజరత్ ఖాజానాయబ్ రసూల్‌వారి 243వ ఉరుసు గంధ మహోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున హజరత్ బీబీ హబీబా ఖాతూన్ (దొరసానమ్మ) గంధ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మహల్‌లోని సజ్జదానషీన్ షాగులామ్ నక్షాబంద్ హఫీజ్ పాషా ఇంటి నుంచి గంధోత్సవం నిర్వహించారు. వెండి గంధ కలశంలో సుగంధ ద్రవ్యాలతో దంచిన గంధాన్ని కలిపారు. అనంతరం హఫీజ్‌పాషా తలపై వెండి గంధ కలశాన్ని నెత్తిన పెట్టుకోగా పూల దుప్పట్లు, గలేఫ్ వస్త్రాలను అతని సోదరులు తీసుకుని మేళతాళాలు, బాణాసంచా కాలుస్తూ ఫకీర్ల జరాబులు, కొబ్బరి దివిటీల నడుమ గంధోత్సవాన్ని ఊరేగింపుగా దర్గాలోపలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గంధాన్ని దర్గాలోపల ఉన్న శ్రీ హజరత్ ఖాజానాయబ్ రసూల్, దొరసానమ్మల సమాధులపై గంధాన్ని లేపనం గావించారు. గలేఫ్ వస్త్రాలు, పూల దుప్పట్లను ఉంచి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ షేక్ ఖాజావలి ఆధ్వర్యంలో ఏఎస్‌పేట ఎస్సై, పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తును నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా చిరాగా
దొరసానమ్మ గంధోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి చిరాగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ఆవరణలోని కోనేరు చుట్టూ, దర్గా ఆవరణలో దీపాలను వెలిగించి ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. కార్యక్రమంలో దర్గా ట్రస్టీ సయ్యద్ సైఫూర్ రహమాన్ ఖాద్రి, భక్తులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డిఆర్‌ఎం
వెంకటగిరి, డిసెంబర్ 8: గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ అమితావజ్జి గురువారం వెంకటగిరి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. రేణిగుంట నుంచి గూడూరు వరకు ట్రాక్, స్టేషన్ల తనికీల్లో బాగంగా వెంకటగిరిలో కూడా ఆయన తనికీలు నిర్వహించారు. స్టేషన్‌మాస్టర్ రూమ్, స్టేషన్ పరిసరాలు, ట్రాక్‌ను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానికులు వెంకటగిరిలో శబరి-యశ్వంత్‌పూర్ రైలుకు వెంకటగిరిలో స్ట్ఫాంగ్ ఇవ్వాలంటూ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట స్టేషన్‌మాస్టర్ శేషగిరిరావు, సౌత్ డిఈ రమేష్‌కుమార్, డిఈఈ దినేష్‌రెడ్డి, డిఎఎస్‌టి ప్రసాద్, డిఆర్‌డిఎ మధు, ట్రాక్ ఎడిఈ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

దొంగల ముఠా అరెస్ట్
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబర్ 8: గత కొంతకాలంగా నెల్లూరు రూరల్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బుచ్చి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తంబి సతీష్, విడవలూరు మండలానికి చెందిన మడపర్తి వంశీ, నెల్లూరు నవాబ్‌పేటకు చెందిన వాసా సునీల్ బుధవారం సాయంత్రం జొన్నవాడ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో వారు వివిధ మండలాల్లోని ఇళ్లల్లో ఎవరూ లేని ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడినట్లు దొంగలు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 4 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్, ఒక హీరోహోండా బైక్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బుచ్చి సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

పురాతన బంగారు నాణేలు గల్లంతు
నెల్లూరు, డిసెంబర్ 8: ఆలయం నిర్మాణ సమయంలో శ్లాబులో ఉంచిన పురాతన బంగారు నాణేలు గల్లంతు కావడంపై 3వ నగర పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంతపేటలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 1975వ సంవత్సరంలో శ్లాబు పెచ్చులూడి అందులో దాచిన 20-30 బంగారు, వెండి నాణేలు కిందపడ్డాయి. ఆలయ నిర్మాణకర్తలు దాచిన బంగారం కావడంతో తిరిగి బంగారాన్ని యథాస్థానంలో ఉంచి శ్లాబ్‌ను సిమెంటుతో అప్పట్లో కప్పేశారు. తిరిగి 1989వ సంవత్సరంలో గర్భాలయంలో గంటను పునర్నిర్మించే సమయంలో తిరిగి శ్లాబ్ పగిలి అక్కడ ఉంచిన బంగారు నాణేలు మరోసారి బయటపడ్డాయి. అయితే అప్పుడే ఈ నాణేలను తిరిగి యథాస్థానంలో చేర్చినట్లు అందరూ భావించారు. ప్రస్తుతం గత నెల 24వ తేదిన గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనులు చేసే సమయంలో శ్లాబ్‌ను తొలగించి చూడగా అక్కడ ఎటువంటి బంగారు నాణేలు ఆలయ అధికారులకు కనిపించలేదు. దీంతో 1975 నుంచి 1989 వరకు పనిచేసిన అప్పటి ఆలయ పూజారి రాఘవేంద్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆలయ కార్యనిర్వాహణాధికారి జి.రామకృష్ణ 3వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3వ నగర ఎస్సై ఎస్.వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇ చలానాలను వెంటనే చెల్లించాలి:డిఎస్‌పి
నెల్లూరు, డిసెంబర్ 8: జిల్లాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఇ చలానా ద్వారా జరిమానాకు గురైన వాహన యజమానులు వెంటనే చలానా చెల్లించాలని ట్రాఫిక్ డిఎస్పీ నిమ్మగడ్డ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనాలకు వరుసగా మూడు పర్యాయాలు ఇ చలానా చెల్లించనట్లయితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. వాహనాలను అమ్మే సమయంలో వెంటనే ఓనర్‌షిప్ మార్చుకోవాలని పాత యజమానులకు సూచించారు. అలా చేయకుంటే కొత్త యజమాని ఇ చలానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనర్లు వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే సంబంధిత వాహన యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు నగర వాసులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ముగిసిన ఖేల్ ఇండియా క్రీడా పోటీలు
నెల్లూరు, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఖేల్ ఇండియా పోటీలు గురువారంతో ముగిశాయి. స్థానిక ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీలు పలు క్రీడాంశాల్లో క్రీడాకారులకు నిర్వహించారు. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంయుక్త కలెక్టర్-2 సాల్మన్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారులకు అత్యంత అధునాతన క్రీడా శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఖేల్ ఇండియాను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారిని రాష్టస్థ్రాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆహుతులు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, డిఎస్‌డిఓ రమణయ్య, స్థానిక కార్పొరేటర్ మేకల రజని తదితరులు పాల్గొన్నారు.