శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నెల్లూరుకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 15: నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించడంతో ఇక మహర్దశ పట్టునున్నది. స్మార్ట్‌సిటీతో నెల్లూరు నగరం రూపురేఖలు మారునున్నాయి. నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటిస్తూ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కృష్ణపట్టణాన్ని స్మార్ట్‌సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుటి నుంచో నెల్లూరును స్మార్ట్‌సిటీగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ నెల్లూరును స్మార్ట్‌సిటీగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడంతో నెల్లూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నుడాతో అభివృద్ధిపథంలో నడుస్తుందని ప్రజల్లో పలు ఊహగానాలు వస్తున్నాయి. దానికితోడు స్మార్ట్‌సిటీగా నెల్లూరు నగరం కానుండడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. స్మార్ట్‌సిటీగా నిర్ణయించడంతో వందల కోట్ల అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా స్మార్ట్‌సిటీగా ఎంపికైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికాల్ మిషనరీ కింద (ఎస్‌పివి) వంద నుండి 300 కోట్ల రూపాయల వరకు నిధులను ప్రత్యేకంగా విడుదల చేయనున్నది. ఈ నిధులతో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు వీలుంటుంది. ఇప్పటికే అండర్‌గ్రౌండ్ డ్రైనేజి కింద హడ్కో రుణం 1100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇక స్మార్ట్‌సిటీగా కొనసాగితే నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు ఈ నిధులను ఖర్చు చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ నిధులతో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తారు. నగరంలో పలు సమస్యలు పరిష్కారం కానున్నాయి. స్మార్ట్‌సిటీగా కానుండడంతో ఇక నెల్లూరు నగరం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. స్మార్ట్‌సిటీ వల్ల నగరంలో కావాల్సిన వౌలిక వసతులను కల్పిస్తారని అంటున్నారు. స్మార్ట్‌సిటీలో విభాగంగా రోడ్లు, కాలువలు, డ్రైనేజి వ్యవస్థ కూడా పూర్తిగా మారుతుందని చెబుతున్నారు. ఇదిలావుంటే స్మార్ట్‌సిటీలో భాగంగా మురికివాడలను అభివృద్ధి చేసి అక్కడ ఉన్న పేద ప్రజలకు ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈనేపథ్యంలో నెల్లూరు నగరం అభివృద్ధిబాటలో నడుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అమరజీవికి ఘన నివాళి
నెల్లూరుసిటీ, డిసెంబర్ 15: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతనం ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, సంయుక్త కలెక్టర్ -2 రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంపద సృష్టించినప్పుడే అభివృద్ధి
వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం వెల్లడి
నెల్లూరుసిటీ, డిసెంబర్ 15: సంపద సృష్టించినప్పుడే అన్నివిధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం విజయవాడలో వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశల గురించి శాఖలవారిగా సమీక్షించడంతోపాటు పలు సూచనలు ఇచ్చారు.
ఎపికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్స్ అవార్డు
ఎపిఇపిడిసిఎల్‌కు దేశ వ్యాప్తంగా నాణ్యత పరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసినందుకు 2015-16 సంవత్సరానికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్స్ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో ఎపిఇపిడిసిఎల్ సిఎండిగా కలెక్టర్ ముత్యాలరాజు పనిచేశారని చెప్పారు. అదేవిధంగా 2016 సంవత్సరానికి గాను దేశంలో గ్రామీణ విద్యుద్దీకరణలో కూడా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం అవార్డు వచ్చిందన్నారు. ఆ అవార్డు కూడా అదే కాలంలో ప్రస్తుత జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సిఎండిగా పనిచేసిన కాలానికే వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాలరాజు, సంయుక్త కలెక్టర్-2 ఆర్‌ఎస్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లను ఆమోదించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు
నెల్లూరు కలెక్టరేట్, డిసెంబర్ 15: ప్రభుత్వ కళాశాలల్లో అంకిత భావంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల డిమాండ్లను వెంటనే ఆమోదించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం జెఎసి ఆధ్వర్యంలో ఎపి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. వీరి క్రమబద్ధీకరణ విషయాన్ని రాజకీయ కోణంలో కాక మానవతా దృక్పథంతో చూడాలన్నారు. ప్రభుత్వం కనీసం ఉద్యోగ భద్రత కల్పించి 10వ పిఆర్‌సిని అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రాష్టవ్య్రాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆందోళనలకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలకు సంఘీభావం ప్రకటించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ జెఎసి నాయకులు ఎస్‌వి నాగేంద్రప్రసాద్, కల్లూరి శ్రీనివాసులు, డాక్టర్ ఉమాశంకర్, పి కోటేశ్వరరావు, సునీల్‌శర్మ, దేవప్రసాద్‌రెడ్డి, వేదవతి, సుధామణి, ఎస్‌ఎప్‌ఐ, పిడిఎస్‌యు, ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎఫ్, వైసిపి విద్యార్థి సంఘాల ప్రతినిథులు నాయుడు రవి, సునీల్, కేశవ, వై మధు, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.

గృహ నిర్మాణ శాఖలో లక్ష్యాలు సాధించాలి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం

నెల్లూరు, డిసెంబర్ 15: గృహ నిర్మాణాలలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. గురువారం నగరంలోని గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో ఆయన హౌసింగ్‌పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకసారి లబ్ధిదారులకు పట్టా ఇచ్చిన తరువాత హౌసింగ్ శాఖ అధికారులు ఆ భూములను పరిశీలించాలన్నారు. కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఫారెస్ట్, ఇతర ఇబ్బందులు లేకపోతే ఆ గృహాలను వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కేటాయించిన స్థలాలకు సమస్యలుంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇటుకలను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఇటుకబట్టీదారుల నుండి లబ్ధిదారులకు అందచేయాలని కలెక్టర్ కోరారు. లబ్ధిదారులు వేగవంతంగా తమ గృహాలు నిర్మించుకొనే విధంగా హౌసింగ్ శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రౌండింగ్‌లో సమస్యలుంటే ఎప్పటికప్పుడు తెలియజేసి పరిష్కారాలు కనుగొని గ్రౌండింగ్ నూటికి నూరు శాతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హౌసింగ్ శాఖ పిడి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు ఇటుకల సరఫరాపై శ్రద్ధ వహించి లబ్ధిదారులకు ఇటుకలు అందేవిధంగా చూడాలని కోరారు. ఇళ్ల స్థలాలపై పొజిషన్ సర్ట్ఫికెట్ ఇచ్చిన తరువాత వాటిని పరిశీలించి గ్రౌండింగ్ చేయాలన్నారు. గ్రౌండింగ్ చేసిన తరువాత వాటిని ఆన్‌లైన్‌లో ఉంచాలని కలెక్టర్ తెలిపారు.

ఆత్మకూరులో రెట్టింపు
టిడిపి సభ్యత్వాలు 67 వేలు
నమోదు ప్రక్రియలో తమ్ముళ్ల జోరు
ఆత్మకూరు, డిసెంబర్ 15: ‘‘గత నెల 1వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, జన చైతన్య యాత్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జన చైతన్యయాత్ర గత మాసాంతంతోనే ముగించారు. గురువారంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా పూర్తిచేశారు. తొలుత ఈ కార్యక్రమాన్ని కూడా నెల రోజులపాటు మాత్రమే నిర్దేశించుకుని అనంతరం ఒకటిన్నర మాసం జరుపుకునేలా పార్టీ అధిష్ఠానం సూచించింది. మొత్తమీద సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఆత్మకూరు నియోజకవర్గం ముందంజలో నిలుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 67వేల వరకు సభ్యత్వాలు చేరడం ఎంతైనా విశేషమే. రెండేళ్ల క్రితం జరిగిన ఇదే సభ్యత్వ నమోదుతో పోలిస్తే రెట్టింపుగా ఉండటం గమనార్హం. నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్టణంలో సభ్యత్వాల సంఖ్య 12వేలకు పైబడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.’’
ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ద్వైవార్షికంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదు ప్రక్రియతో సహా సంస్థాగత ఎన్నికలు అనివార్యం. అయితే సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికల స్థానంలో ఎంపిక తంతు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రహసనమే. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గతంగా ఇవే విన్యాసాలు జరుగుతున్నాయనే చెప్పాలి. ఇదిలాఉంటే ఆత్మకూరు నియోజకవర్గం వరకే ప్రస్తావించుకుంటే ఈదఫా ఆసక్తికరమైన అంశాలే చోటుచేసుకున్నాయి. రెండేళ్ల క్రితం సభ్యత్వ నమోదు సందర్భంలో పార్టీ ఇన్‌చార్జిగా గూటూరు కన్నబాబు వ్యవహరించారు. ఆ తరువాత కాలంలో జిల్లాలో రాజకీయంగా పేరొందిన ఆనం కుటుంబం తెలుగుదేశంలోకి ప్రవేశించారు. నాలుగు మాసాల క్రితం ఆ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి తెలుగుదేశం ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి హోదా లభించింది. కాగా, ఇన్‌చార్జిగా కన్నబాబు ఉన్నప్పుడు పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే తొలి స్థానంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని నిలిపారు. అలాగే రాష్ట్రంలోని పది నియోజకవర్గాల్లో ఒకటిగా ఆత్మకూరును తీర్చిదిద్దారు. ఈ దఫా గణాంకాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. ఆత్మకూరు ఏ స్థానంలో ఉందో ఇతమిత్థంగా తెలియరావడం లేదు. అయితే గతంతో పోలిస్తేమాత్రం సభ్యత్వాల సంఖ్య రెట్టింపుకావడం విశేషం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో ఆ పార్టీకి వెనుకడుగే. అయితే ఆత్మకూరు మున్సిపాలిటీలోనూ ఈదఫా సభ్యత్వాలు అధికమయ్యాయి. టిడిపికి చెందిన దళిత కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో ఐదారు వందలకుపైగా సభ్యత్వాలు చేర్పించడం ప్రత్యేకత సంతరించుకుంది. మున్సిపాలిటీలోని 12వ వార్డులో కౌన్సిలర్ బొగ్గవరపుశ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అలాగే 22వ వార్డుల్లో కౌన్సిలర్ డక్కా రమణమ్మ, మల్లిఖార్జున్ దంపతులు, 23వ వార్డులో చెరుకూరు పద్మావతమ్మ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అదేవిధంగా పట్టణ కమిటీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తన వార్డుపరిధిలోకి వచ్చే అనంతరాయని ఏని గిరిజనకాలనీలో సభ్యత్వాల్ని అనూహ్యంగా చేర్పించారు. అలాగే పార్టీకి చెందిన పట్టణ కమిటీ నేతలు ఆదిశేషయ్య, చల్లారవి, ఇందూరు రమణారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. అదేవిధంగా రూరల్ మండలంలో తెలుగుదేశంపార్టీ పరిశీలకులుగా హాజరైన సాగరం సొసైటీ ఉపాధ్యక్షులు అల్లంపాటి జనార్ధనరెడ్డి, బట్టేపాడు సొసైటీ అధ్యక్షులు వాసిపల్లి మల్లిక్, టిడిపి మండల అధ్యక్షులు దావా పెంచలరావు, సర్పంచుల సంఘ నేత కేతా విజయభాస్కరరెడ్డి చొరవ చూపారు.

పంట గట్టెక్కాలంటే...
నీటి వినియోగంలో సమష్టి బాధ్యత
ఆత్మకూరు, డిసెంబర్ 15: జిల్లా సాగునీటి సలహా సంఘ సమావేశంలో స్థిరీకరించిన ఆయకట్టు కంటే రెట్టింపు విస్తీర్ణంలో పంటల సాగుబడి ఆరంభమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీటి విస్తీర్ణం తగ్గించినా జిల్లాలో ఎక్కడా ఖాళీ భూములైతే కనిపించడం లేదు. అంతటా సేద్యం పనులు ఆరంభమవుతూనే ఉన్నాయి. అయితే రెండురోజుల క్రితం వార్ధా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల పరిస్థితి ఒకింత మెరుగుపడిందనే చెప్పాలి. కాగా, పంట మొత్తం గట్టెక్కాలంటే సాగుకాలం చివరిరోజుల్లో ఉత్కంఠత ఎదురయ్యే అవకాశాలున్నాయి. జిల్లాకు వరప్రసాదినిగా భావించి సోమశిల జలాశయానికి చేరిన 40 టిఎంసిల నీటి నిల్వను అనుగుణంగా రిజర్వ్ అవసరాలు పోను, మిగిలిన పరిమాణం జిల్లాలో వరి పంటల సాగుకు కేటాయింపులు చేపట్టారు. ఒక్క టిఎంసి నీటితో పది వేల ఎకరాల్లో పంట సాగులోకి వచ్చేలా ఈ కేటాయింపులు చేశారు. అయితే వాస్తవ కోణంలో చూస్తే సాగు నీటి వినియోగంలో ఆదా మార్గాల్ని అనుసరిస్తేనే కేటాయింపులకంటే అధికంగా సాగులోకి వస్తోన్న పంటలు గట్టెక్కే అవకాశాలుంటాయి. ఒక్కో టిఎంసి నీటి పరిమాణంతో కనీసం 15వేల ఎకరాలైనా పంటను సాగుచేసే అవకాశాలుంటాయని శాస్ర్తియకోణంలో విశే్లషణలున్నాయి.
‘‘ఒక టిఎంసి అంటే శతకోటి ఘనపుటడుగులు.’’ వర్షాలు అంతంత మాత్రంగానే కురిసి పంటలు నీటి తడి కోసం వెంపర్లాడుతున్న సందర్భాల్లో ఒక్క టిఎంసి నీటి పరిమాణంతో 16వేల ఎకరాల వరకు సాగు చేసిన దాఖలాలున్నాయి. వర్షాలు పుష్కలంగా కురిసి జల వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక్క టిఎంసి నీటితో కేవలం 12వేల ఎకరాలు సాగవుతున్నాయి. సాగునీటి పంపిణీ విధానం బాధ్యతాయుతంగా సాగడం అనేది సవాల్‌గా మారుతోంది. వాస్తవంలో కూడా నీటి అందుబాటు, వినియోగం అధికంగా ఉన్నప్పుడు కంటే అంతంత మాత్రం తడితోనే పంటలు గట్టెక్కించిన సందర్భంలో వ్యవసాయోత్పత్తుల రాశి కూడా అధికంగా లభించిన దాఖలాలు అనేకం. నీరు సమృద్ధిగా ఉంది కదా అని అధికంగా వినియోగిస్తే సస్యరక్షణకు ఆటంకాలు ఎదురై పంటల దిగుబడి తగ్గేలా పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వ్యవసాయ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని చెరువుల్లో చేకూరిన నీటి నిల్వ కూడా అంతంత మాత్రంగానే ఉండటం రైతులకు ఆశాభంగం. జిల్లాలోని గూడూరు డివిజన్ పరిధిలోకి వచ్చే సూళ్లూరుపేట, తదితర ప్రాంతాల్లోనే సగటుకంటే అధిక వర్షపాతం నమోదైంది. దీనికితోడు చెరువుల రిజిష్టర్డ్ కంటే అన్ రిజిష్టర్డ్ ఆయకట్టు ఏటేటా పెరిగిపోతున్న దృష్ట్యా నీటి పంపిణీ లెక్కల్లో ఎన్నో చిక్కుముళ్లున్నాయి. రైతుల నడుమ వివాదాలు సైతం తరచూ చుట్టుముడుతున్నాయి. రాయలసీమ వల్ల కురిసే వానలే సోమశిల జలాశయానికి ఆయువుపట్టు. ఈ దఫా రాయలసీమలోనూ అత్తెసరు వర్షాలే కురిశాయి. కృష్ణానదీ జలాలు శ్రీశైలం జలాశయ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలివచ్చినది అంతంత మాత్రంగానే. ఇదిలాఉంటే నెల్లూరు, సంగం బ్యారేజిల నిర్మాణాలు సమీప భవిష్యత్‌లో ఓ కొలిక్కి వచ్చే అవకాశాల్లేవు. జలయజ్ఞం పథకం కింద రూ. వందల కోట్ల అభివృద్ధిపనులు జరగాల్సి ఉంటే ఏళ్ల తరబడి ఈ పనుల్లో జాప్యం జరుగుతున్నా నివారించే నాధుడే కరవు. పెన్నాడెల్టా పరిధిలో నిర్దేశించిన ప్యాకేజిలకు తగ్గట్లు భారీ యంత్ర సామగ్రి సమకూర్చుకునేందుకు అవసరమైన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు అందచేసి పుష్కరకాలం దాటినా పనుల పురోగతి నత్తనడకే. నిర్ధిష్టమైన కార్యాచరణ దిశగా కాంట్రాక్టర్లు పనులు చేసేలా అధికార్ల పర్యవేక్షణాలోపంపైనే విమర్శలున్నాయి. నిర్మాణక్రమం ఎంతగా జరిగితే అంతవరకు బిల్లులు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం నుంచి హామీ వచ్చినా స్పందన కరవు. గడచిన సంవత్సరం అక్టోబర్‌లో సిఎం చంద్రబాబు స్వయంగా వచ్చి ఏడాదిలోగా నెల్లూరు, సంగం బ్యారేజిల నిర్మాణాలు పూర్తి కావాలంటూ హెచ్చరికలు చేశారు. సిఎం హెచ్చరికలతోనైనా అటు కాంట్రాక్ట్ ఏజెన్సీలు, ఇటు అధికార్లలో పరివర్తన రావాలని రైతులు కోరుకున్నారు. ఆ ఏడాదికాలం దాటి మరో రెండు మాసాలు కూడా వెళ్లిపోయాయి. ఇంకో అర్ధసంవత్సరమైతే కూడా నిర్మాణక్రమంలో స్పష్టతకు అవకాశాల్లేవు. ఇలాంటి బృహత్తర నిర్మాణాలు అందుబాటులోకి వస్తే వరద మెరుపులా వచ్చినప్పుడు నిల్వ చేసుకుని భవిష్యత్ అవసరాలు తీర్చుకునేందుకు అనుకూలత ఏర్పడుతుంది.

నెల్లూరులో నోట్ల మార్పిడి ముఠా?
పోలీసుల అదుపులో హైదరాబాదీలు

నెల్లూరు, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులను గురువారం సాయంత్రం నెల్లూరు నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు స్థానిక మినర్వా హోటల్‌లో బస చేశారు. వీరు నగదు మార్పిడికి పాల్పడుతున్నారంటూ స్థానిక పోలీసులకు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్ డిఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి, ఎస్‌బి డిఎస్‌పి కోటారెడ్డి, మహిళా స్టేషన్ డిఎస్‌పి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఈ దాడులు నిర్వహించింది. హోటల్ గదిలో ఉన్న నలుగురు వ్యక్తులను ఈ బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని విచారించగా, నగరంలో తాము కొంత భూమిని గతంలో కొనుగోలు చేశామని అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉన్నామని, మిగతా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు వచ్చామని వారు పోలీసులకు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం తీసుకొచ్చిన సొమ్ము ఎక్కడ అని పోలీసులు ప్రశ్నించగా, హోటల్ బయట పార్కింగ్‌లో ఉన్న తమ కారులో ఉంచినట్లు వారు తెలిపారు. పోలీసులు ఆ కారు వద్దకు వచ్చేలోగా వారితో వచ్చిన మరో వ్యక్తి ఆ కారును తీసుకొని అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో సదరు వ్యక్తులపై అనుమానంతో అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారిని స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరానికి తరలించి అదనపుఎస్‌పి డి శరత్‌బాబు నేతృత్వంలో విచారిస్తున్నట్లు తెలిసింది. పరారైన కారులో దాదాపు రూ. 40 కోట్లు మేర నగదు ఉన్నట్టు, నెల్లూరు నగరంలో నగదు మార్పిడి చేసేందుకు ఈ ముఠా సభ్యులు హైదరాబాద్ నుండి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.