శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 24: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అవి అందేలా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, పార్టీ యంత్రాంగం కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన టిడిపి జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ నేతలందరూ కలసికట్టుగా కృషి చేసినందు వల్ల జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలోనే జిల్లా 2వ స్థానంలోకి వచ్చిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో జనవరి 2వ తేది నుంచి జిల్లాలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జన్మభూమిలో కొత్తగా రేషన్‌కార్డులు, పింఛన్లు అందచేయనున్నామని, అవి అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగానిదేనని మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొన్నందున జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, తాగునీటి పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించారు. జిల్లాకు కొత్తగా ఎన్‌టిఆర్ భరోసా పథకం కింద 20 వేల పింఛన్లు మంజూరు చేశారని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానంలో పేర్కొన్నారు. జిల్లాలో జనచైతన్య యాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు సమావేశంలో అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బీద మస్తాన్‌రావు, ఆనం రామనారాయణరెడ్డి, పరసా రత్నం, నగర ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, డాక్టర్ జ్యోత్స్నలత, డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడాలి:జెసి
సూళ్లూరుపేట, డిసెంబర్ 24: భావితరాలు జీవించడానికి ఇప్పుడున్న భూవాతావరణాన్ని అందించాలంటే ప్రతిఒక్కరూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం స్థానిక గోకులకృష్ణ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఫ్లెమింగో కవి సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో విదేశాల నుండి వచ్చే విహంగాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అక్కడ శీతాకాలంలో వాతావరణం అనుకూలించక మన ప్రాంతాలకు విడిదికి వస్తాయని, అందుకు తగ్గ వాతావరణం ఇక్కడ ఉన్నందునే వలస పక్షులు ఇక్కడకు క్రమం తప్పకుండా వస్తున్నాయన్నారు. ఇది ఇలాగే కొనసాగాలంటే పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఇక్కడికి వచ్చే పక్షులకు, సాహిత్యానికి మధ్య సంబంధాలు ఉన్నాయని అందుకే ఈసారి 8 భాషల్లో కవి సమ్మేళన కార్యక్రమం పెట్టామన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇప్పటి నుండే ఇలాంటి కార్యక్రమాలపై అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ వీరయ్య మాట్లాడుతూ విద్యార్థులు కవులుగా ఎదిగి ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి కనబరిస్తే మంచిదన్నారు. పక్షుల వలే విద్యార్థుల్లో కూడా క్రమశిక్షణ ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని దీనిని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. అనంతరం పాత్రికేయుడు సుబ్బారావు రచించిన పక్షితీర్థం, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన భరత్‌కుమార్, కల్పన రచించిన మరో ఫ్లెమింగో పుస్తకాన్ని జెసి, ఇసి ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శీనానాయక్, తహశీల్దార్ రవీంద్రబాబు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల నుండి కవులు విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామిరెడ్డి, ఎవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన దేహ దారుఢ్య పరీక్షలు
* అర్హత సాధించిన 3,806 మంది అభ్యర్థులు
నెల్లూరు, డిసెంబర్ 24: పోలీస్ కానిస్టేబుల్, జైలువార్డర్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 19 నుండి జరుగుతున్న దేహ దారుఢ్య పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆఖరిరోజు పరీక్షలకు 700 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 553 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఆరు రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 5,850 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 3,806 మంది అభ్యర్థులు ఫైనల్ పరీక్షలకు ఎంపికైనట్లు అధికారులు తెలియచేశారు. శనివారం నిర్వహించిన పరీక్షలను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అభ్యర్థుల ఎత్తును కొలిచేందుకు ఈ దఫా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో కచ్చితమైన కొలతలు కలిగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయగలిగినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా శారీరక సామర్థ్య పరీక్షలైన లాంగ్‌జంప్, పరుగులో ప్రతిభ చూపి శారీరక కొలతల్లో నెగ్గలేకపోయిన అభ్యర్థులు అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చిన జిల్లా ఎస్పీ, అటువంటి అభ్యర్థులకు మరోసారి శారీరక కొలతలు నిర్వహించేందుకు గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
* జడ్పీ సమావేశంలో మంత్రి నారాయణ
నెల్లూరు, డిసెంబర్ 24: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తాగునీటి సమస్యలపై ఆందోళన వెలిబుచ్చారని, వేసవిలో సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగానే తగిన చర్యలను తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 78 శాతం వర్షపాత లోటుందని, తాగు, సాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. త్వరలో అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి కాల్వలకు సాగునీటి విడుదలపై స్పష్టత తీసుకువస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యల పరిష్కరించడంలో భాగంగా త్వరలో జెట్టీల నిర్మాణం, పులికాట్ సరస్సు ముఖద్వారం ఓపెన్ చేయడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని, అందుకోసం ముఖ్యమంత్రి అడ్వాన్స్ నిధులను కూడా మంజూరు చేశారని తెలిపారు. అసంపూర్తి అంగన్‌వాడీ భవనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఆత్మకూరులో అందరికీ ఇళ్లు
హౌసింగ్ ఎండి దివాన్ స్పష్టం
ఆత్మకూరు, డిసెంబర్ 24: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరువాసులకు కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఈ సదుపాయం సమకూరనుందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దివాన్ పేర్కొన్నారు. శనివారం ఈ పథకంలో భాగంగా తొలి విడతగా ప్రభుత్వం తరపున చేపట్టే 1028 పక్కాగృహాలకు సంబంధించిన స్థలాన్ని 32 ఎకరాల వరకు మున్సిపాలిటీ నుంచి స్వాధీనపరచుకున్నారు. ఈ స్థలంలో గృహ నిర్మాణాలను చేపట్టేందుకు మరో పక్షం రోజుల్లోగా టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఒకటిన్నర ఏడాదిలోగా నిర్మాణాలు చేపట్టి మున్సిపాలిటీకి అప్పగించడం జరుగుతుందన్నారు. అలాగే స్థలాలు కలిగి ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు నిర్దేశించిన పేద కుటుంబాల నిర్మాణపరంగా కూడా తమ శాఖ తరపున పర్యవేక్షణ ఉంటుందన్నారు. అదేవిధంగా మరో రెండు నుంచి మూడు వేల వరకు పక్కాగృహాలను సమకూరిస్తే ఆత్మకూరులో పేదలందరికీ ఇళ్లు సమకూరినట్లేనని మున్సిపల్ కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడ్ని ఇటీవల కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అందుకు సంబంధించిన పనులు కూడా మరికొద్ది నెలల్లోనే ప్రారంభం కానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఇంకా ఆత్మకూరు పురపాలక అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాగి వనమ్మ, సందానీ, గృహ నిర్మాణ సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ పేరుతో మోసం
గూడూరు, డిసెంబర్ 24: ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు అధికమైపోతున్నాయి. టివిల్లో తక్కువ ధరకే అన్నిరకాల ఆండ్రాయిడ్ ఫోన్లు అతి తక్కువ ధరకే చెల్లిస్తామని ప్రకటనలు గుప్పించి ఆకట్టుకుంటున్న వ్యాపార ప్రకటనలు చూసి ఫోన్లపై మోజు ఉన్న జనాలు ప్రకటనలకు మోసపోతున్నారు. తాజాగా గూడూరుకు బొగ్గులదిబ్బ ప్రాంతానికి పగడాలపల్లి జగదీష్ అనే వ్యక్తి తనకు జరిగిన మోసాన్ని శనివారం విలేఖర్లకు తెలిపాడు. 4 వేల రూపాయలకు శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ అందచేస్తామని ఢిల్లీ నుండి తన నంబర్‌కు ఫోన్ కాల్ వచ్చిందని, మీ నంబర్ లక్కీడిప్‌లో రావడంతో శామ్‌సంగ్ ఫోన్ కేవలం నాలుగు వేల రూపాయలకే పంపుతామని చెప్పారని పేర్కొన్నాడు. వారు శనివారం తనకు పోస్ట్ఫాసులో పార్శిల్ వచ్చిందని చెప్పి వచ్చి తీసుకొని వెళ్లమని చెప్పడంతో నాలుగు వేలు చెల్లించి పార్శిల్‌ను తీసుకున్నానని చెప్పాడు. పార్శిల్ తెరిచి చూడగా అందులో లక్ష్మీదేవి ఫొటో, పాదాలు చూసి లబోదిబోమన్నాడు. ఎవరూ ఇటువంటి వాటికి ఆకర్షితులై మోసపోవద్దని అతడు తనకు జరిగిన మోసాన్ని వివరించాడు.

మలేషియాలో రావిపాడు వాసి మృతి
ఓజిలి, డిసెంబర్ 24: మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన కె రాజేశ్వరి (46) అనే మహిళ బతుకుదెరువు నిమిత్తం 2014లో మలేషియాకు వెళ్లింది. కాగా శుక్రవారం రాత్రి మిద్దె పైనుండి పడి మృతి చెందినట్టు మృతురాలు పనిచేస్తున్న ఇంటి యజమాని తెలిపారని ఆమె బంధువులు తెలిపారు. భార్య ఊరుకాని ఊరులో మృతి చెందిడంతో భర్త రత్నయ్య భోరున విలపించాడు. మృతదేహం సోమవారం గ్రామానికి వస్తుందని తెలిపారు.

ఇరకం దీవి సమస్యలపై దృష్టిసారించండి
జెసికి ఎంపి వరప్రసాద్ సూచన
తడ, డిసెంబర్ 24: ఇరకం దీవిలో ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని, వార్ధా తుఫాను వల్ల నష్టపోయిన వారికి గృహాలు, రేషన్‌కార్డులు లేని వారికి రేషన్‌కార్డులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు తిరుపతి ఎంపి వరప్రసాద్ కోరారు. శనివారం ఎంపి ఇరకం దీవిని సందర్శించి దీవిలోని ప్రజల సమస్యలపై నివేదికను తయారుచేసి జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపి వరప్రసాద్ మాట్లాడుతూ ఆ గ్రామంలో గతంలో 70 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు సిజెఎఫ్‌ఎస్ భూములను అందించారని, రెవిన్యూ అధికారులు ఇంతవరకు హద్దులు చూపలేదని, పట్టాలు కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు తెలిపారన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని జెసిని కోరడంతో స్పందించిన జెసి ఆ గ్రామంలోని భూములను పరిశీలించి నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు నట్టం శ్రీను, కోదండం, వరాల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పండుగలా ఫ్లెమింగో ఫెస్టివల్
కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడి
సూళ్లూరుపేట, డిసెంబరు 24: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే 9 మెగా ఫెస్టివల్స్‌లో పక్షుల పండుగ ఒకటని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. శనివారం ఆయన జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్, జిల్లా అధికారులతో కలసి సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో జరుగుతున్న పక్షుల పండుగ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడ వేదికపై విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. రాష్ట్రంలో 9 పండుగల వలే ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈసారి సందర్శకులకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. నిర్వహణకు జెసితో కలిపి అధికారులను ప్రత్యేక కమిటీగా వేశామని, వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయన్నారు. నేలపట్టు, బివి పాళెం, అట్టకానితిప్ప వద్ద కూడా అన్ని వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశం ఉందన్నారు. మూడు రోజులపాటు సినీ సంగీత కార్యక్రమాలు, నృత్యాలు, పండరి భజనలు, డప్పులు, కోలాటాలు ఉంటాయన్నారు. ముఖ్యంగా 27న టీవీ నటుల కార్యక్రమం, 28న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటకచేరి, 29న ఆలీతో జాలిగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. సందర్శకులకు సూళ్లూరుపేటకు నుండి షార్, నేలపట్టు, బివి పాళెం పడవల రేవుకు వెళ్లేందుకు ఉచితంగా బస్సు వసతి కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎజెసి రాజ్‌కుమార్, జిల్లా టూరిజం డైరెక్టర్ చంద్రవౌలి, జడ్పీ సిఇవో రామిరెడ్డి, డ్వామా పీడి హరిత, డిఆర్‌డిఎ పీడి లావణ్యవేణి, ఆర్డీవో శీనానాయక్, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి, దొరవారిసత్రం జడ్పీటిసి విజేత, తహశీల్దార్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

శరవేగంగా పక్షుల పండుగ ఏర్పాట్లు:కలెక్టర్
తడ, డిసెంబర్ 24: పక్షుల పండుగ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం ఆయన భీములవారిపాలెం పడవల రేవును సందర్శించి పడవల రేవు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పడవల రేవు నుండి పడవ విహారానికి 26 బోట్లు బోటుషికారు కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటిలో 20 బోట్లకు మోటార్లను అమరుస్తున్నామని, ఆరు సాధారణ బోట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. రేవు వద్ద భోజన వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే క్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పర్యాటకులకు బుక్‌స్టాల్స్, ఐస్‌క్రీం స్టాల్స్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మత్స్యకారులు తమ సమస్యలపై ఎన్నోసార్లు విన్నవించుకొన్నా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. ఈ దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మీరు ప్రతిసారి అధికారులు వచ్చినప్పుడు మాత్రం సమస్యలను తీసుకొస్తున్నారని, మిగతా సమయాల్లో ఈ సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి నాయకుడు వేనాటి కలుగజేసుకొని మత్స్యకారుల సమస్యలపై కలెక్టర్ మంత్రితో చర్చించారని, పులికాట్‌లో ముఖద్వారాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, వాటిని కూడా త్వరలో పరిష్కరించేందుకు మంత్రి హామీ ఇచ్చారన్నారు. తమకు ఏళ్ల తరబడి సరిహద్దు సమస్య ఉందని, దానిని పరిష్కరించాలన్నారు. పులికాట్ సరిహద్దు ప్రాంతంలో 16 బోటు లీడింగ్ ఛానెళ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో జెసి ఇంతియాజ్ అహ్మద్, ఆర్డీవో శీనానాయక్, తడ తహశీల్దార్ ఏడుకొండలు, ఎస్సై సురేష్‌బాబు పాల్గొన్నారు.

పరిసరాల శుభ్రతతోనే స్వచ్ఛ ఆంధ్ర
స్వాస్థ్య విద్యావాహిని పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ
నెల్లూరు సిటీ, డిసెంబర్ 24: ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, పరిసరాల పరిశుభ్రతతోనే స్వచ్ఛ ఆంధ్ర కల సాకారమవుతుందని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శనివారం ఆయన స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014లో ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్భారత్ ప్రారంభించారని, దాని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛ ఆంధ్రా మొదలుపెట్టారని వివరించారు. దానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వాస్థ్య విద్యావాహిని ప్రారంభించారని చెప్పారు. ప్రతిఒక్కరు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యం, ఆరోగ్యంపై అవగాహన లేక గ్రామీణ పేదలు ఎక్కువగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వైద్య విద్యార్థుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని ఆరోగ్య సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఎక్కువగా ప్రజలు చిన్న చిన్న వ్యాధులకు గురై రోజువారి పనులు చేసుకోలేక పోతున్నారని అన్నారు. సమాజంలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో వైద్య, నర్సింగ్, కళాశాల విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య, నర్సింగ్ విద్యార్థులు ప్రతిఒక్కరు కనీసం సంవత్సరానికి వారం రోజులు గ్రామాలకు వెళ్ళి ప్రజలకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పెంపొందించడానికి కృషి చేస్తారని చెప్పారు. ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంవల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయన్నారు. మృతుల్లో పేదలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఉంటున్నారన్నారు.
ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతా:మంత్రి
రాష్ట్రంలోనే ఆదర్శ కళాశాలగా నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలను తీర్చిదిద్దుతానని మంత్రి నారాయణ చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా ప్రమాణాలు, ఉత్తమ ఫలితాలు సాధించడంపై ప్రిన్సిపాల్, అధ్యాపకులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలలో అధ్యాపకుల కొరతను వెంటనే పరిష్కారిస్తానని చెప్పారు. ఈనెల 27వ తేదీన మంత్రి కామినేని శ్రీనివాస్‌తో చర్చించి వెంటనే సిబ్బందిని సమకూరుస్తానని తెలిపారు. ఈ సమావేశంలో నగర టిడిపి ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, చాట్ల నరసింహారావు, పరసా రత్నం, కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు, వహీదా తదితరులు పాల్గొన్నారు.

పక్షుల పండుగను వైభవంగా నిర్వహించాలి
* కలెక్టర్ ముత్యాలరాజు పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, డిసెంబర్ 24: జిల్లాలో సూళ్లూరుపేట వద్ద నిర్వహించే పక్షుల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎసి సుబ్బారెడ్డి స్టేడియం వద్ద పక్షుల పండుగ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎసి స్టేడియం నుండి కస్తూరిదేవి హైస్కూల్ వరకు వేలాది మంది విద్యార్థులతో సాగింది. ఈ సందర్భంగా కస్తూరిదేవి హైస్కూల్ వద్ద జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న పక్షుల పండుగ జిల్లాలో సూళ్లూరుపేట వద్ద ఈనెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పండుగ కార్యక్రమంలో నేలపట్టు వద్ద పక్షుల సందర్శన, భీములవారిపాళెం వద్ద పడవల పోటీలు, సూళ్లూరుపేట వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, షార్‌కు సంబంధించి రాకెట్ ప్రయోగ నమూనా ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు పక్షులను చూసి ఆనందించాలని ఆయన కోరారు. అనంతరం జెసి ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ, పక్షుల పండుగ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సినీతారలు, ప్రముఖ సంగీత గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి, టీవీ నటుల బృందం వారిచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 27వ తేదీన పక్షుల పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, శిద్దా రాఘవరావు, పార్లమెంటు సభ్యులు, మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జడ్పీటిసి సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ, పక్షుల పండుగ వేడుకలు ఈనెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ వేడుకలకు ప్రముఖ సినీతారలు అనుష్క, నయనతార తదితరులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పక్షుల పండుగ వేడుకలలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో జెసి కలెక్టర్-2 రాజ్‌కుమార్, టూరిజం కార్పొరేషన్ ఇడి చంద్రవౌళి, డిఎస్‌ఓ, అధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
నెల్లూరు, డిసెంబర్ 24: జిల్లాలోని క్రైస్తవులందరూ సుఖ సంతోషాలతో ఏసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవాలని కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని క్రైస్తవులందరూ ఆనందోత్సాహాల నడుమ క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్ని జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

అవే కేకలు.. అవే అరుపులు
* చర్చ గోరంత.. రచ్చ కొండంత
* సవాళ్లు విసురుకున్న అధికార, ప్రతిపక్షాలు
* కాకాణి ఆరోపణలపై విచారణ కోరిన టిడిపి సభ్యులు
వాడి వేడిగా జడ్పీ సమావేశం
నెల్లూరు, డిసెంబర్ 24: ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనతో అధికారులు ముసిముసి నవ్వులు నవ్వుకొనే పరిస్థితి. ఒక దశలో స్వపక్షంలోనూ సభ్యుల మధ్య వాదోపవాదాలు. అవే అరుపులు.. అవే కేకలు, అడిగిన ప్రశ్నకు సంబంధం లేని వాదనలు సమావేశ సమాప్తందాకా కొనసాగాయి. ఏవో కొన్ని ప్రశ్నలకు సభ్యులు ఎలాగోలా సమాధానాలైతే పొందగలిగారు కానీ సంతృప్తి చెందలేకపోయారు. ఒక సభ్యుడు ఏకంగా జిల్లాస్థాయి అధికారిపై వ్యక్తిగత, అవినీతి ఆరోపణలకు దిగడం, కలెక్టర్ గట్టిగా వ్యతిరేకించడం జరిగాయి. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశ తీరుతెన్నులివి.
జిల్లాలో తాగు, సాగునీటికి తీవ్ర సమస్య ఏర్పడిందని వెంటనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, స్థానిక జడ్పీటిసి సభ్యురాలు సమావేశంలో ప్రస్తావించారు. అదే సమయంలో చిత్తూరుకు నీటిని తరలించింది వాస్తవం కాదా? అంటూ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధికారులను ప్రశ్నించడంతో సమావేశంలో వాగ్వివాదం చోటుచేసుకొంది. టిడిపి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ చిత్తూరుకు కండలేరు నీటిని విడుదల చేసినట్లు రుజువు చేస్తే ఎటువంటి చర్యలకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల నడుమ మాటల యుద్ధం నడిచింది. జడ్పీ చైర్మన్ సైతం అధికారులు, అధికార పార్టీ సభ్యులతో వాదనకు దిగారు. చివరకు మంత్రి నారాయణ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఇతర సభ్యులు, ఎమ్మెల్యే పోలంరెడ్డి మాటలతో ఏకీభవించారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ రెండుసార్లు సమావేశమైందని, త్వరలో మరోసారి పరిశ్రమల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
డిఇఓ అవినీతిపై సభలో రచ్చ
ప్రలోభాలతో ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేస్తున్నారంటూ పెళ్లకూరు జడ్పీటిసి సభ్యుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి డిఇఓను ప్రశ్నించగా, సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు సరిగా రారని తమ విచారణలో వెల్లడైనందున మరొకరిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసినట్లు సమాధానమిచ్చారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని సభ్యుడు డిఇఓ రామలింగం అవినీతి అధికారని, ఆయన గురించి తమకంతా తెలుసంటూ కేకలు వేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులపై ఆరోపణలకు సభ వేదిక కాదని, మంచి పరిణామం కాదంటూ టిడిపి ఎమ్మెల్యేలు, సభ్యులు ఎదురు దాడికి దిగారు. కలెక్టర్ జోక్యం చేసుకొని ఒక అధికారిపై సమావేశంలో ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలు ఉంటే తన వద్దకు తీసుకురావాలని, తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. సమావేశంలో అధికారుల్ని కించపరిచేలా మాట్లాడడం సరికాదంటూ ఖండించారు. కలెక్టర్ స్పందనతో అధికారులు బల్లలు చరిచి తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
టిడిపి సభ్యుల వినతిపత్రం
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరుతూ టిడిపి జడ్పీటిసి సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. విచారణలో తమ నేతపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎటువంటి చర్యకైనా సిద్ధమని, ఆరోపణల్లో నిజం లేకపోతే కాకాణిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, జడ్పీటిసి సభ్యులు పాల్గొన్నారు.
-