శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 6: దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు సుమారు 2 లక్షల 50 వేల మందికి ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టామని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ వెల్లడించారు. శుక్రవారం స్థానిక ఎసినగర్‌లోని మల్లెల సంజీవయ్య మున్సిపల్ పాఠశాలలో జరిగిన నాలుగో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 14వ డివిజన్ కార్పొరేటర్ ఉచ్ఛి భువనేశ్వర్‌ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత జన్మభూమిలో వచ్చిన అర్జీల్లో ఎంతమేర సఫలీకృతమయ్యాయి, మిగిలిన పనులు, కొత్త అర్జీలు తీసుకోవడం, కుటుంబ వికాసమే సమాజం వికాసమని, 15 సూత్రాల అమలు జన్మభూమి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో 43 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారని, వారికి 5,700 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇచ్చిన వాగ్ధానాల మేరకు వృద్ధాప్య పింఛన్లు 200 నుండి వెయ్యి రూపాయలకు, దివ్యాంగ పింఛన్లు ఐదు వందల నుండి 15 వందలకు పెంచినట్లు తెలిపారు. ఇచ్చిన వాగ్ధానాలలో 70 శాతం మేర పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటీ 43 లక్షల కుటుంబాలలో లక్షా 60 వేల కుటుంబాలకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా అదనంగా కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వృద్ధులు, వితంతువులు దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఐదు లక్షల 60 వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు. కోటీ 39 లక్షల 60 వేల మందికి రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. అసంఘటిత కార్మికులకు బీమా వసతి కల్పించే ఉద్దేశంతో చంద్రన్న బీమా పథకం ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వివిధ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు బీమా పథకంలో అమలులో ఉన్న విధంగా పేదలకు బీమా వసతి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కూడు, గుడ్డ, నీడ నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని, నిరుపేదలకు వసతి కల్పించాలనే ఉద్దేశంతో లక్షా 20 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న 2018 జనవరి నాటికి జిల్లాలో 7,700 పక్కా గృహాలను జి ప్లస్ 7 రీతిలో నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. చదరపు అడుగు నిర్మాణానికి టాక్స్‌లతో కలిపి రెండు వేల రూపాయల వంతున చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో నేల టైల్స్, వాల్ టైల్స్‌తోపాటు భవన సముదాయంలో అన్ని వౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 7,700 పక్కా గృహాలకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగిందని, షీర్వాన్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. దోమల బెడద నివారణ ముఖ్య ఉద్దేశంతో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో 11 వందల కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్ పనులను ప్రారంభించామన్నారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, జన్మభూమి - మా ఊరు కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేపట్టడం జరిగిందని, ఇవి ఓట్ల కోసం జరిగే సభలు కాదన్నారు. ప్రతి పేదవాడి మొఖంలో చిరునవ్వే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వృద్ధ, పేద, వితంతువుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి నారాయణ స్కూలు విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేశారు.

శకటంలేని జన్మభూమి
* ఆత్మకూరులో మహిళా ఉద్యోగుల అవస్థలు
ఆత్మకూరు, జనవరి 6: జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి తరలివెళ్లేందుకై ఆత్మకూరు మండలంలో ఈ దఫా వాహన సదుపాయం అంటూ ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రధానంగా ఒక పంచాయతీ నుంచి మరో గ్రామానికి జన్మభూమి బృందం చేరుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వాహన సదుపాయాన్ని సమకూర్చేందుకై ఒక్కో మండలానికి ఇరవై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధుల్ని సమకూరుస్తుండటం గమనార్హం. అయితే ఆ మొత్తం వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపోకపోయినా గతంలో మండల స్థాయిలో అధికార యంత్రాంగమే ఏదో ఒక రూపేణా సర్దుబాటు చేయడం పరిపాటి. ఇంతేగాక సకాలంలో నిధులు విడుదల కాకున్నా అధికారులు ముందుగా వెచ్చించి తరువాత స్వీకరించడం ఆనవాయితీ. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి వెసులుబాటు కల్పిస్తున్నా అసలు వాహనమే ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కట్లు నెలకొంటున్నాయి. ప్రధానంగా విధి నిర్వహణ నిమిత్తమై జన్మభూమిలో హాజరయ్యే మహిళా ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతం. మారు మూల గ్రామాలకు చేరుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇలా గ్రామాలకు వెళ్లే సందర్భంలో సర్వీసు ఆటోలు విస్తృతంగా తిరుగుంటే పది రూపాయలు, ఇంకా దూరంలో ఉండే పంచాయతీకి అయితే పదిహేను రూపాయల వరకు చెల్లించి వెళ్లవచ్చు. ఈవిధంగా సొంత ఖర్చులతో వెళ్లడానికి కూడా అనుకూలించని దుస్థితి. అలా వెళ్లే సమయంలో సరిగ్గా సర్వీసు ఆటో అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు. లేకుంటే బాడుగకు ఆటో మాట్లాడుకుని వెళ్లాలంటే వ్యయం జాస్తి. ఎవరైనా ఆయా గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలకు రాజకీయ ప్రముఖులు తరలివస్తుంటే వారి వెంట బందోబస్తు కాన్వాయ్‌గా తరలివెళ్లే పోలీసు జీపులు, ఇతర వాహనాలు వెళ్తుంటాయి. శుక్రవారం ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య, మాజీ మంత్రి ఆనం తరలిరావడంతో పోలీస్ జీపులు జన్మభూమి సభలకు తరలివచ్చాయి. ఆ వాహనాల్లో ఇరుక్కుని మహిళా ఉద్యోగులంతా ప్రయాణించారు. ఆయా వాహనాల్లోనే జన్మభూమి - మా ఊరుకు చేరుకునేలా మహిళా ఉద్యోగులు సాయమడుగుతుండటం దీన పరిస్థితికి నిదర్శనం. మొత్తం తొమ్మిది రోజులపాటు ప్రస్తుతపు జన్మభూమి- మా ఊరు నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిధులే సరిపోయేలా ప్రస్తుతం బజార్‌లో సంచరించే టాటా మ్యాజిక్ వంటి వాహనాలు సరిపోతాయి. ఈ టాటా మ్యాజిక్ వాహనాల్లో ఎంత లేదన్నా పదిమందికిపైగానే వెళ్లవచ్చు. జిల్లాలోని దాదాపుగా అన్ని మండలాల్లోనూ జన్మభూమి శకటాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ నిధుల్ని నిబంధనల ప్రకారం ఖర్చు చేసేలా వాహన సదుపాయం ఆత్మకూరు మండలంలో లేకపోవడంతో వివిధ శాఖల అధికార్ల, ఉద్యోగుల నుంచి విమర్శలకు తావిస్తోంది.
వస్తే టీఏగా ఇస్తా: ఆత్మకూరు ఎండిఓ నిర్మల
రవాణా భత్యం వస్తే ఎవరివి వారికి విడిగా ఇస్తా. గతంలో 12 కార్యక్రమాలకు సొంత మొత్తం వెచ్చిస్తే అందులో పదింటికి మాత్రమే ఇప్పటి వరకు నిధులు వచ్చాయి. బ్యానర్లు, ఇతరాలకు ఇప్పటికే ఐదారువేలకు పైగా ఖర్చైంది.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి జవసత్వాలు
* పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అందాలి
* ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సూచన
కావలి టౌన్, జనవరి 6: అడ్డగోలు విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేహోదాకు కేంద్రం మోకాలడ్డుతోందని, పోరాడి తేవాల్సిన సిఎం చంద్రబాబు వారికి వంతపాడుతున్నారని, జనం మేల్కొని హోదాసాధనకు కదిలిరావాలని ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా వస్తే అనేక రాయితీలు, నేరుగా గ్రాంట్లు లభిస్తాయని, తద్వారా మాత్రమే రాష్ట్రానికి జవసత్వాలు చేకూరుతాయని, రాజకీయాలు పక్కనపెట్టి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబులు పోరుబాటపట్టాలని కోరారు. శుక్రవారం పట్టణంలోని 21వ వార్డులో కౌన్సిలర్ కేతిరెడ్డి శ్రీలత, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు జన్మభూమి-మావూరు కార్యక్రమానికి ఎంపి హాజరయ్యారు. లాంఛన కార్యక్రమాల అనంతరం ఎంపి మేకపాటి మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వానివి గొప్పల దిబ్బలని విమర్శించారు. 2004కు ముందు కేవలం 17 లక్షల మందికి రూ.70 పింఛన్ అందుతుండగా దానిని రూ.200కు పెంచి 73 లక్షలమందికి దివంగత సిఎం వైఎస్‌ఆర్ అందించారన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర అనేక పథకాలు అందించి ఆయన జననేతగా నిలిచిపోయారన్నారు. దేశమంతా 48 లక్షల ఇళ్లు కట్టిస్తే అప్పట్లో ఒక్క ఎపిలోనే 45లక్షలు ఇళ్లు నిర్మించారన్నారు. నేడు పార్టీ రహిత, సమదృష్టి లోపించాయన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా పార్టీ రంగులు చూసి పథకాల లబ్ధి చేస్తున్నారని, నిరుపేదల విషయంలో పార్టీలొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మాటలకే సరిపెడుతున్నారన్నారు. సభకు హాజరైన టిడిపికి చెందిన మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కిర్మాణీ జన్మభూమి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బీద స్ఫూర్తి దాయకమని, ఇస్కపల్లి గ్రామం అభివృద్ధి, బిఎంఆర్ ట్రస్టు సేవలు ఉదాహరణగా చెప్పగా ఎంపి మేకపాటి వ్యంగ్యాస్త్రాలతో స్పందించారు. బహుశా రాష్ట్రంలో బిఎంఆర్‌ను చూసి సిఎం చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాలను చేపట్టారేమో అన్న అనుమానం టిడిపి నేతల మాటలను బట్టి కలుగుతుందని చమత్కరించారు. అధికార యంత్రాంగం కచ్చితంగా వ్యవహరించి కార్యక్రమాలలో రాజకీయాలకు తావు ఇవ్వకుండా చూడాలని, వైసిపి వార్డులపై ప్రతీకార ధోరణి మాని మంచినీరు, పారిశుద్ధ్యం, రోడ్ల అభివృద్ధి కనీస సౌకర్యాలను సమస్థాయిలో ఏర్పాటు చేయాలని హితవు పలికారు. స్వచ్ఛ విషయంలో ప్రధాని మోదీని అందరూ అనుసరించి విజయవంతం చేయాలని కోరారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై అనేక ఆలోచనలు ఉన్నాయని చెబుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే జన పాలన అందుతుందన్నారు. అంతకుముందు టిడిపి నేతల ప్రసంగంపై వైసిపి రాష్ట్ర సేవాదళ్ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అభ్యంతరం చెప్పగా, జన్మభూమి పథకానికి సంబంధించే మాటలు పరిమితం కావాలంటూ తేల్చి చెప్పారు. దీనిపై ఇరుపక్షాల నేతలతో పాటు పోలీసులు, ఎంపి, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని గొడవ పెద్దది కాకుండా సర్ది చెప్పారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
నెల్లూరు రూరల్, జనవరి 6: రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం తగిలి బ్రెయిన్ డెడ్ కావడంతో డాక్టర్ల సలహా మేరకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రాంతానికి చెందిన బిట్రా విజయకుమార్ (43) కూల్‌డ్రింక్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ తేదీ పని నిమిత్తం కందుకూరులో వెళ్తుండగా అతను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో అతని తలకి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలపడంతో అక్కడ నుండి నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. మూడవ తేదీ నుండి చికిత్సకు స్పందిస్తూ ఉన్నాడు. శుక్రవారం పూర్తిగా చలనం లేకుండా పడిపోవడంతో పూర్తిస్థాయిలో బ్రెయిన్ డెడ్ అయిందని నారాయణ డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు అవయవదానానికి ముందుకు వచ్చారని డాక్టర్లు తెలిపారు. లివర్‌ను విజయవాడలోని ఆయుష్ వైద్యశాలకు, ఒక కిడ్నీని గుంటూరులోని వేదాంతి ఆసుపత్రికి, మరో కిడ్నీని నారాయణకు, కళ్లను నెల్లూరులోని మోడ్రన్ ఐ ఆసుపత్రికి తరలించినట్లు నారాయణ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విజయకుమార్‌కు భార్య సుజాత, కుమారుడు హేమంత్, కుమార్తెలు ప్రత్యూష, రేణుక ఉన్నారు. అంత బాధలో కూడా పలువురికి మరో జన్మ ఇవ్వాలని సంకల్పించిన ఆ కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. ఈ అవయవాలను తరలింపును ప్రత్యేక వాహనాల ద్వారా ఆయా వైద్యశాలలకు తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

జన్మభూమిలో ఇప్పటి వరకు 24 వేల అర్జీల స్వీకరణ
* జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడి
గూడూరు, జనవరి 6: జన్మభూమి ఇతరత్రా వస్తున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఈ నెల 2వ తేదీ నుండి జిల్లాలో నిర్వహిస్తున్న జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 24 వేల అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాల రాజు వెల్లడించారు. శుక్రవారం ఆయన డివిజన్‌లోని అన్ని శాఖల అధికారులతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సిఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి పురోగతిని సూచిస్తూ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. జన్మభూమి గ్రామసభలో పాల్గొనే అధికారులందరికీ పాసులు జారీ చేయాలని సూచించారు. జన్మభూమి ముగింపు రోజైన 11వ తేదీ నెల్లూరులో జిల్లా ఇన్‌చార్జీ మంత్రి శిద్దా రాఘవరావు నేతృత్వంలో భారీ సభ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజల నుండి జన్మభూమిలో వచ్చిన అర్జీలను 24 శాతం అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని, మిగతా అర్జీలను కంప్యూటరీకరించినట్లు చెప్పారు. ప్రజల నుండి వస్తున్న అర్జీల్లో ఎక్కువ శాతం ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లతో పాటు రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని వస్తున్నాయని, వీటిని వీలును బట్టి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెసి ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చెన్నూరులో 10న జరిగే జన్మభూమి గ్రామసభ ప్రదేశాన్ని, ముఖ్యమంత్రి దిగే హెలీపాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, రాక పోకలకు, పార్కింగ్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రజలందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, తొక్కిసలాట లేకుండా సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

పట్టాలు తప్పిన ఎఫ్‌ఆర్‌ఎం ఇంజన్
* పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

నెల్లూరు, జనవరి 6: నెల్లూరు నగర శివార్లలోని వేదాయపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రైల్వే ట్రాక్ పైన, పక్కన కంకరను పరిశీలిస్తూ సరిచేసే ఎఫ్‌ఆర్‌ఎం ఇంజన్ పట్టాలు తప్పింది. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే ట్రాక్‌పై ఈ సంఘటన జరిగింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడూరు-విజయవాడల నడుమ పలు ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైళ్లను నెల్లూరు జిల్లా వెంకటాచలం రైల్వేస్టేషన్ నుంచి నెల్లూరు వేదాయపాలెం రైల్వే స్టేషన్ వరకు ఒకే ట్రాక్‌పై నడపాల్సి రావడంతో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం ఏర్పడింది. నిర్మానుష్య ప్రాంతాల్లో రైళ్లను గంటల తరబడి నిలిపివేయడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
వెంకటాచలంలో
వెంకటాచలం: సాంకేతిక సమస్య ఏర్పడటంతో గూడూరు - నెల్లూరు మధ్య నడిచే పలు రైళ్లు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి. వివరాలిలా ఉన్నాయి. వెంకటాచలం మండలం మీదుగా రైళ్ల రాకపోకలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు గూడూరు నుంచి నెల్లూరు మార్గంలో వెళ్లే పలు ఎక్స్‌ప్రెక్స్, పాసింజర్, గూడ్సు రైలు ఆలస్యంగా నడిచాయి. నెల్లూరు వేదాయపాళెం సమీపంలో రైలు పట్టాలు మరమ్మతులు చేసే రైలు యంత్రం సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోవడంతో గూడూరు నుంచి నెల్లూరు వైపు వేళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో గూడూరు నుంచి వచ్చే పలు రైళ్లు వెంకటాచలం, మనుబోలు రైల్వేస్టేషన్, గూడూరు తదితర ప్రాంతాల్లో వద్ద నిలిపివేశారు. రైలు నిలిచిపోవడంతోప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రయాణికులు బస్సు, ఆటోలలో ప్రయాణాలు సాగించారు. దీనిపై రైల్వే అధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు వెనుక ఉన్న నిజాలపై
శే్వతపత్రం విడుదల చేయాలి: పనబాక
నెల్లూరుసిటీ, జనవరి 6: నోట్ల రద్దు వెనుక ఉన్న నిజానిజాలపై ఎన్‌డిఎ ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులలో, ఏటిఎంలలో నగదు తీసుకోవడంపై ఉన్న ఆంక్షలు పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో జరిగే లావాదేవీలపై ఉన్న సర్వీస్ చార్జీలు, పన్నులను పూర్తిగా తొలగించాలని కోరారు. నోట్ల రద్దు అనేది పెద్ద కుంభకోణం అని, నోట్ల రద్దు వెనుక ఎన్నో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని, వీటిని ఏన్‌డిఎ ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలన్నారు. నోట్ల రద్దు వల్ల కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, యువత అధికంగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రతి ఒక్క మహిళ బ్యాంకు ఖాతాలో 25వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేయాలన్నారు. నగదు రహిత విధానం ఒక బూటకమని, ఎన్‌డిఏ ప్రభుత్వం సామాన్య ప్రజల నుంచి పన్నుల రూపంలో చార్జీలు వసూలు చేసి లక్ష 50వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు చేసిన పెద్ద ఎత్తుగడ అని ఆరోపించారు. విదేశీ బ్యాంకులలో ఉన్న స్వదేశీ ధనాన్ని 85లక్షల కోట్లను వెనక్కి తీసుకురావడంతో వైఫల్యం చెంది భారతదేశ సామాన్య ప్రజలను భిక్షగాళ్లగా చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, దేవకుమార్‌రెడ్డి, చెంచలబాబు యాదవ్, కేశవ నారాయణ, శివాచారి, ఆసీఫ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నిందితుల అరెస్ట్
* రూ. 50లక్షల దుంగలు స్వాధీనం
నెల్లూరు, జనవరి 6: రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.50లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని శుక్రవారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలియచేసిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉదయగిరి సిఐ రమణకు సీతారామపురంరం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను దాచిపెట్టి రవాణాకు సిద్ధం చేస్తున్నారనే సమాచారం అందింది. ఆయన వెంటనే సీతారామపురం ఎస్సైను అప్రమత్తం చేశారు. ఎస్సై తమ సిబ్బందితో, సీతారామపురం, ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలాల అటవీ సిబ్బందితో కలిసి సీతారామపురం మండలం చిన్నాగంపల్లి సమీపంలోని పాపిరెడ్డిగుంట వద్ద అక్రమంగా నరికిన ఎర్రచందనం దుంగలను కుంట పక్కన దాచిపెట్టి ఉండటాన్ని గుర్తించారు. దుంగలను రవాణాకు సిద్ధం చేస్తున్న ప్రకాశం జిల్లా చెన్నపనాయునిపల్లి గ్రామానికి చెందిన బట్టు నాగయ్య, యనమల నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద రవాణాకి సిద్ధంగా ఉంచిన 42 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ మార్కెట్‌లో రూ.50లక్షల పైబడి ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులపై పిడి యాక్ట్, బయో డైవర్సిటి చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. దీంతో పాటు నిందితుల ఆధార్, ఇతర వివరాలను కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతర్జాలంలో ఉంచామని, భవిష్యత్తులో ఇతర చోట్ల ఇదే తరహా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల సమయంలో నిందితుల వివరాలు వెంటనే తెలుసుకోగలమని తెలపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఉదయగిరి సిఐ, సీతారామపురం ఎస్సైలతో పాటు హెడ్‌కానిస్టేబుళ్లు కె.వెంకటసుబ్బయ్య, కె.రమణయ్య, కానిస్టేబుళ్లు షేక్ అబ్దుల్ ఖాదర్, పి.జనార్ధన్, హోంగార్డులు షేక్ నాయబ్, కె.మల్లయ్య, ఎం.రాము, షేక్ అబ్దుల్‌లను ఎస్పీ అభినందించారు.