శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వస్తున్నారు.. వెళ్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 9: జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి విచ్చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారి గంపెడాశలతో జిల్లావాసులు ఎదురుచూడడం, ఆయన రిక్తహస్తాలు చూపించి వెళ్లడం షరా మామూలై పోయిందనే విపక్షాల ఆరోపణలు వాస్తవ దూరం కాదన్నట్టుగా ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత నుంచి అందరి నోళ్లలో నానుతున్న నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి (నుడా), ఇంతవరకు ప్రాణం పోసుకోలేదు. నుడా ఏర్పాటుతో నెల్లూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల మంజూరు ఉంటుందని, అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని భావిస్తున్న నగరవాసులకు, ఆ భావన మాత్రమే మస్తిష్కంలో మిగిలిపోయింది. దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయనుకునే తరుణంలో స్వయానా ముఖ్యమంత్రి నోట కృష్ణపట్నం సమీపంలో పోర్టు ఏర్పాటుపై అధికారులు ఆలోచించాలనే మాట రావడంతో ఇక విమానాశ్రయానికి కూడా రెక్కలొచ్చాయనే వ్యంగ్యార్థాలు తీసేవారు బయల్దేరారు. ఇక జన్మభూమి కష్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. రేషన్‌కార్డులకు, పింఛన్లకు వేలల్లో దరఖాస్తులందితే, అర్హులని అధికారులు భావించి కార్డులు అందుకుంటున్నవారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. రేషన్‌కార్డులు ఇవ్వడంలో అధికారులు రకరకాల సాంకేతిక కారణాలు చెబుతుండడంతో వినడం తప్ప ప్రశ్నించలేని లేని గ్రామీణులను చూచి జాలిపడాల్సిందే. పోనీ.. రేషన్‌కార్డులు ఉన్నవారైనా ఏ సమస్య లేకుండా సరకులు తెచ్చుకుంటున్నారా! అంటే ఆ పరిస్థితి కూడా లేదు. కొత్తగా బ్యాంకుల అనుసంధానం ఏర్పాటు చేయడం, సర్వర్ల సామర్ధ్యం పెంచకపోవడంతో అవి కాస్తా మొరాయిస్తుండడంతో ప్రభుత్వం ఇచ్చే ఉచిత చంద్రన్న కానుకల పంపిణీ గత 10 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా సశేషంగానే ఉంది. పట్టిసీమ జలాల తరలింపుతో కృష్ణాజిల్లా రైతుల కష్టాలను తొలగించిన, పులివెందుల ప్రాంతానికి సాగునీటిని అందిస్తున్న అపర భగీరథుడిగా పార్టీ నేతల కీర్తినందుకున్న ముఖ్యమంత్రి తరచూ తాగు, సాగునీటి అవస్థల పాలవుతున్న గూడూరు డివిజన్ ప్రాంతాన్ని సమగ్రంగా ఆదుకునేందుకు ఏదైనా వినూత్న సాగునీటి పథకాన్ని ప్రకటిస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
గిరిజనుల్ని పట్టించుకున్న వారేరి?
బాణసంచా పేలుడు దుర్ఘటనలో నెల్లూరు నగరంలో 14 మంది గిరిజనులు చనిపోవడం, మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంగతి విదితమే. ఈ సంఘటనలో ఏదోఒక 5 కుటుంబాలకు చంద్రన్న బీమా పరిహారాన్ని అందచేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వ పెద్దలు, ఆ తర్వాత అటువైపు కూడా చూడలేదు. ప్రభుత్వంలో సంబంధిత శాఖా మంత్రి కూడా తమను పరామర్శించేందుకు రాలేదని యానాదాలు నగరంలో భారీ నిరసన కూడా చేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో చీమకుట్టిన భావన కూడా కనిపించకపోవడం విచారకరం. జిల్లా చరిత్రలోనే అత్యంత దుర్ఘటన జరిగినా రాష్ట్ర ప్రతినిధిగా ఏ ఒక్కరు కూడా హాజరుకాలేదు. జిల్లా మంత్రి మాత్రం సంఘటన తర్వాత ఒకేఒక పర్యాయం కుటుంబాలను పరామర్శించారు. అప్పటికి కేవలం 5 మంది మాత్రమే మృతిచెంది ఉన్నారు. కానీ ప్రస్తుతం వారి సంఖ్య 14కు చేరింది. ఇంతటి దుర్ఘటన జరిగినా ఎవరూ రాలేదనే యానాది సమాఖ్య నాయకుల మాటల్లో నిజం, వారి ఆరోపణల్లో ఆవేదనతో కూడిన వాస్తవం ఉంది. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి స్పందించి తమను పరామర్శించి తమకు జీవనోపాధి కల్పిస్తారనే ఆశతో ఆ గిరిజన కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే వల్లెవేసి వెళ్లిపోయే ముఖ్యమంత్రి ఈసారైనా నెల్లూరు జిల్లాలో నూతనంగా ప్రత్యేకించి జిల్లావాసులకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి పథకమేదైనా ప్రకటించకపోతారా..! అనే ఆశతో కర్ణాలను రిక్కరించి, కన్నుల్ని విప్పారించి జిల్లావాసులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు
నెల్లూరు, జనవరి 9: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు-1,2 డిపోలకు చెందిన ఎన్‌ఎంయు నాయకులు సోమవారం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎంయు నెల్లూరు రీజనల్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శులు పిఎస్ రెడ్డి, కె.లుక్సన్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి 2013 ఆర్‌పిఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని, గత ఏడాది జూలై నుంచి రావాల్సిన కరవు భత్యాన్ని కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో కార్మికులు చేసిన సమ్మె 8 రోజుల కాలం జీతాన్ని సంస్థ ఇంతవరకు చెల్లించలేదని, గతంలో అంగీకరించిన మేరకు సమైక్యాంధ్ర సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవులుగా మార్చాలని కోరారు. గ్యారేజీల్లోని అన్ని కేటగిరీల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నష్టాల పేరుతో రద్దు చేసిన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని, అక్రమంగా ఆర్టీసీ రూట్లలో తిరుగుతున్న ప్రయివేటు సర్వీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం కూడా తమ నిరసన కొనసాగుతుందన్నారు. సంస్థ న్యాయబద్ధమైన తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తొలిరోజు 12 మంది కార్మికులు నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు నెల్లూరు 1, 2 డిపోల అధ్యక్ష, కార్యదర్శులు టిఎంఎం రెడ్డి, షేక్ మునీర్, నాయకులు విపిఎన్ రెడ్డి, ఏఎస్‌ఆర్ కుమార్, టియు శంకర్, జానా వెంకటేశ్వర్లు, ఆర్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

400 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కోట, జనవరి 9: అక్రమంగా తరలిస్తున్న 400 రేషన్ బియ్యం బస్తాలను, లారీని సోమవారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తడ మండలం సెల్వకుప్పం గ్రామం నుంచి కోట మండలం పుచ్చలపల్లి గ్రామం వైపు రేషన్ బియ్యంతో లారీ వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ వెంకటనాధ్‌రెడ్డి తన సిబ్బందితో పుచ్చలపల్లి వద్ద కాపుకాచి లారీలో తరలిస్తున్న 400 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు వుంటుందని, లారీని సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి, బియ్యాన్ని వాకాడు పౌరసరఫరాల స్టాక్ పాయింట్‌లో భద్రపర్చినట్లు డిఎస్పీ తెలిపారు. పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొందరు పాలిష్‌పెట్టి అధిక ధరకు విక్రయిస్తూన్నారని తెలిపారు. లారీ డ్రైవర్ కాలేషా, క్లీనర్ మునుస్వామి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐలు శ్రీనివాసులు, వెంకటనారాయణ, ఎవో ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు సిఎం గూడూరు రాక
గూడూరు, జనవరి 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానసపుత్రిక అయిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం జిల్లా పర్యటనకు విచ్చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటించే గూడూరు మండలం చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెలీప్యాడ్‌లను సోమవారం ఆయన జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌లతో కలసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లకు ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తెలియచేశారు. ముందుగా చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుండి హెలికాప్టర్‌లో చెన్నూరు పొలాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి పక్కనే జరిగే జన్మభూమి-మావూరు గ్రామసభకు హాజరుకానున్నట్టు తెలిపారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జన్మభూమి సభకు హాజరై సుమారు 3 గంటలపాటు ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.
సిఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో జరిగే జన్మభూమి గ్రామసభలో పాల్గొనడానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ విశాల్ గున్నీ, జెసి ఇంతియాజ్ అహ్మద్, అదనపు ఎస్పీ శరత్‌బాబు, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్‌రెడ్డి, గూడూరు డిఎస్పీ శ్రీనివాస్ హెలిప్యాడ్‌ను, హైస్కూల్లో నిర్వహించే జన్మభూమి సభాస్థలిని వారు పరిశీలించారు. సిఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నాల్గవ విడత జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా ఈనెల 2వ తేది నుండి జరుగుతున్న కార్యక్రమంలో 8వ తేది వరకు జిల్లాలో ప్రజల నుండి జన్మభూమి సభకు 51 వేల అర్జీలు రాగా అందులో 43 వేల అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్లు చెప్పారు. 24 వేల అర్జీలకు సంబంధించి విచారణ నిర్వహించి నివేదికలు అందించనున్నట్లు తెలిపారు. పింఛన్‌దారులకు నగదు చెల్లింపులను ఆన్‌లైన్‌లో 93.5 శాతం చేశామన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించి 20.80 కోట్ల రూపాయల విలువ కలిగిన వాటిని తెల్లరేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ మంగళవారం తన నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట టిడిపి నాయకులు, ఇతర అన్ని శాఖల అధికారులు ఉన్నారు.

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
గూడూరు, జనవరి 9: ఎవరికీ అనుమానం రాకుండా రొయ్యల చెరువు వద్ద కాపలా ఉండే ఓ పూరిగుడిసెలో దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసే 22 ఎర్రచందనం దుంగలను సోమవారం అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన చిల్లకూరు మండలంలో చోటుచేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిల్లకూరు మండలం ఏరూరు రిజర్వాయర్ వద్దనున్న రొయ్యల గుంట వద్ద కాపలా ఉండేందుకు యజమాని కాపలాదారునికి పూరిగుడిసె వేయించి ఇచ్చాడు. ఈ గుడిసెలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. వెంటనే అటవీ సెక్షన్ అధికారి శ్రీనివాసులు, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా గుడిసెలో సుమారు 2 లక్షల రూపాయల విలువ చేసే 22 ఎర్రచందనం దుంగలున్నట్టు గుర్తించారు. వీటిని ఎవరు నిల్వ ఉంచారన్న దానిపై అధికారులు సమాచారం రాబడుతున్నారు. ఒక గుడిసెలో ఇంత విలువైన దుంగలను కాపలాదారా, లేక రొయ్యల గుంట యజమాని దీనికి పాల్పడ్డాడా అన్నది అధికారుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. దుంగలను స్వాధీనం చేసుకొన్నట్టు అటవీ శాఖ అధికారి తెలిపారు.

కృష్ణపట్నం పోర్టులో బ్యాగేజ్ స్కానర్ ప్రారంభం
ముత్తుకూరు, జనవరి 9: కృష్ణపట్నం ఓడరేవులోని కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం బ్యాగేజ్ స్కానర్‌ను కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ పోర్టు సిఇఓ అనిల్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. బ్యాగేజ్ స్కానర్‌తోపాటు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ మాట్లాడుతూ, పోర్టులో భద్రతా చర్యల్లో భాగంగా కోటి రూపాయల విలువ చేసే బ్యాగేజ్ స్కానర్‌తోపాటు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయడం శుభపరిణామని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు సాగరతీరాన ఆణిముత్యంలా ఉందని ప్రశంసించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఫ్లీడర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పీయర్స్ ఇస్తున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో కస్టమ్స్ సిబ్బందిని మరింత పెంచుతామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది తమ శాఖకు 1650 కోట్ల ఆదాయం చేకూరగా ఈ ఏడాది రెండు వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాబోవు రోజుల్లో ఓడరేవులో కంటైనర్ల రవాణా విస్తృతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తరువాత ఓడరేవు సిఇఓ అనిల్ మాట్లాడుతూ బ్యాగేజ్ స్కానర్ ప్రారంభించడం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అన్నారు. కొలంబో, సింగపూర్ అభివృద్ధికి పోర్టులే కీలకమని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టు ప్రధానపాత్ర పోషిస్తుందని అనడంలో ఎలాంటి సందేహాం లేదన్నారు. అనతి కాలంలో ఓడరేవులో కంటైనర్ కార్గో పెంచుకోవడం జరిగిందని, ఈ ఏడాది రెండు లక్షల 30 వేల కంటైనర్ల కార్గో రవాణా లక్ష్యమని అన్నారు. పోర్టు అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 12 బెర్తులను పూర్తిచేసుకొని దేశ, విదేశాలు ఆశ్చర్యపడేలా దిగుమతులు, ఎగుమతులు సాధిస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రామ్మోహన్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ కె రామారావు, పోర్టు సిఇఓ జితేంద్ర, కస్టమ్స్ అధికారి మూర్తి, పోర్టు అధికారులు, మీడియా మేనేజర్ బి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వినూత్నరీతిలో కాంగ్రెస్ నిరసన
నెల్లూరుసిటీ, జనవరి 9: నోట్ల రద్దు వెనుక ఉన్న నిజానిజాలపై ఎన్‌డిఏ ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద ఖాళీ ప్లేట్లతో సోమవారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ బ్యాంకులు, ఎటిఎంలలో నగదు తీసుకోవడంపై ఉన్న ఆంక్షలు తక్షణమే ఎన్‌డిఎ ప్రభుత్వం తొలగించాలన్నారు. ఆన్‌లైన్‌లో జరిగే నగదు లావాదేవీలపై ఉన్న సర్వీసు చార్జీలు పూర్తిగా తొలగించాలన్నారు. ప్రతి మహిళకు బ్యాంకు ఖాతాలో 25 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేయాలన్నారు. రేషన్ సరుకుల ధరలను సగానికి తగ్గించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను రెట్టింపు చేయాలన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పౌరుని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎంత నల్లధనం బయటకు తెచ్చారో శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న చిన్నతరహా వ్యాపారులు, దుకాణదారులకు అమ్మకం పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సివి శేషారెడ్డి, దేవకుమార్‌రెడ్డి, పిసిసి ప్రధానకార్యదర్శి చెంచలబాబు యాదవ్, గాలాజు శివాచారి, ఆసీఫ్, పత్తి సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు
* మంత్రి నారాయణ స్పష్టం
నెల్లూరు రూరల్, జనవరి 9: కార్పొరేట్ స్కూళ్లలో బోధించే విద్యతో సరిసమానమైన రీతిలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు విద్యను అందించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ స్కూళ్లలో పిల్లలను చేర్చడం కోసం ఎదురుచూసేలా పరిస్థితిని తీసుకొస్తామన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో లక్షా 40 వేల మంది నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి విద్యార్థులు ఉన్నారని, రాష్టవ్య్రాప్తంగా 12 లక్షల మంది అంగన్‌వాడీ పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు. అన్ని విషయాల్లో చూపిస్తున్న శ్రద్ధ అంగన్‌వాడీ స్కూళ్లపై మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలకు నేర్పించాల్సిన ఇంగ్లీషు రైమ్స్‌ను వీడియోల ద్వారా ప్రదర్శించారు. మోడరన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా తయారుచేయడం పట్ల అంగన్‌వాడీ టీచర్లు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను అత్యాధునిక పద్ధతుల్లో తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, సూళ్లూరుపేట జడ్పీటిసి సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి, ఆత్మకూరు టిడిపి నాయకుడు కన్నబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రూ.లక్ష విలువైన గుట్కాలు స్వాధీనం
వెంకటగిరి, జనవరి 9: పట్టణంలోని క్రాస్‌రోడ్డు వద్ద ఆటోలో తరలిస్తున్న లక్ష రూపాయలు విలువ చేసే గుట్కాలను సోమవారం స్థానిక ఎస్‌ఐ కె కొండపనాయుడు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి క్రాస్‌రోడ్డు వద్ద ఆటోలను తనికీ చేస్తుండగా, ఒక ఆటోలు లక్ష రూపాయలు విలువ చేసే గుట్కాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఆటోడ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నారాయణ
గూడూరు, జనవరి 9: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం జన్మభూమి - మాఊరు గ్రామసభలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి రానుండటంతో సభా వేదిక, హెలీప్యాడ్ ప్రదేశాలను, భద్రతా ఏర్పాట్లను సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో మంత్రి పి నారాయణ పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం, వేదిక, సమావేశానికి హాజరయ్యే ప్రజలకు ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి ఆయన ఆరా తీశారు. సిఎం సభలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. జన్మభూమి - మాఊరు గ్రామసభ జరిగే ప్రాంతంలో ఎటువంటి తొక్కిసలాటకు తావులేకుండా విశాలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈయన వెంట గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, డిఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో వెంకటసుబ్బయ్య, జడ్పి సిఇఓ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు బొల్లినేని కోటేశ్వరరావు, టిడిపి నాయకులు ఉన్నారు.

తనిఖీ కేంద్రంపై ఎసిబి దాడులు
అదుపులో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులు
రూ.59,700 నగదు స్వాధీనం
తడ, జనవరి 9: ఆంధ్ర- తమిళనాడు సరిహద్దుల్లోని భీములవారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై సోమవారం తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న 59,700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ తోట ప్రభాకరరావుతో పాటు 9 మంది సిబ్బంది, మీడియేటర్ల సాయంతో తనిఖీ కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంతో పాటు రవాణాశాఖ కార్యాలయంలో ఏకకాలంలో ఈ దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ తోట ప్రభాకరరావు మాట్లడుతూ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు తడ ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుఝామున 2 గంటలకు ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ శాఖలతో పాటు రవాణాశాఖ కార్యాలయంలో మూడుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించామని తెలిపారు. ఆదాయ, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసుకొన్న షెడ్డులో వాసు, వీరబాబు అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 22,450 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఔట్‌గోయింగ్ వాణిజ్య పన్నుల శాఖ సమీపంలో శీను అనే ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకోగా సెల్వం అనే వ్యక్తి పారిపోయాడని, శీను వద్ద 37,250 స్వాధీనం చేసుకొన్నామని వివరించారు. రవాణా శాఖ కార్యాలయంలో మాత్రం ప్రైవేటు వ్యక్తులు కలెక్షన్‌లు నిర్వహించడం లేదని తేలిందన్నారు. ఈ అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్టు ఆయన తెలిపారు.
తీరుమారని తనిఖీ కేంద్ర సిబ్బంది
ఎసిబి డిఎస్పీగా తాను విధులు చేపట్టి ఈ తనిఖీ కేంద్రంపై మూడవసారి దాడులు నిర్వహిస్తున్నామని, ఈ తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహించే అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఎసిబి డిఎస్పీ తోట ప్రభాకర్ అన్నారు. తనిఖీ కేంద్రం వద్ద ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు తాత్కాలిక షెడ్డులను ఏర్పాటుచేసి వాహనదారుల నుండి వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. వీరి పనితీరులో ఎలాంటి మార్పు రావడం లేదని, అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. రవాణా శాఖ అధికారులు మాత్రం ప్రైవేటు వ్యక్తులను నియమించకొనకుండా కొత్తపంథాలో వాహనదారుల నుండి నెల మామూళ్లను తీసుకొంటున్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు. వాటిపై కూడా దృష్టిసారించి ఆ దిశగా దాడులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇకపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మార్పు రాకుంటే గతంలో రవాణా శాఖ అధికారులు ఇళ్లల్లో దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైళ్లకు పంపిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఇకనైనా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీరుమారాలని ఆయన సూచించారు. అక్రమాస్తులను బట్టబయలు చేసే రోజులు దగ్గరున్నాయని అన్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ వాహనదారుల నుండి 50, 100 రూపాయల లంచాల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వాహనదారులు లంచాల భారం భరించలేక తమకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో ఈ దాడులు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. తనిఖీ కేంద్రం వద్ద గతంలో ఎసిబి అధికారుల ఫోన్ నంబర్లు ఉంచేవారని, ప్రస్తుత అధికారులు ఆ నెంబర్లను లేకుండా చేశారన్నారు. ఎవో రవికుమార్, డిసిటివోలను తనిఖీ కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈదాడుల్లో కడప సిఐ శివశంకరనాయక్, నెల్లూరు సిఐ శివకుమార్‌రెడ్డి, ఎస్సై శ్రీహరిరావులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.