శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

18వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 3: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 18వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేస గాలిమరల రెక్కలతో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇఫ్కో సెజ్‌లో గమేస కంపెనీ రూ. ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు. ఈ పరిశ్రమ వలన సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేశానని చెప్పారు. ఉదయ్ పథకం ద్వారా 8,256 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పంపిణీ నష్టాలను తగ్గించకలిగామన్నారు. రానున్న రోజుల్లో 18వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రెండు రోజుల్లోనే 18 వందల కోట్ల పెట్టుబడులతో పలు కంపెనీలు పనులు ప్రారంభించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, కళాశాలలు లేవని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పెద్దఎత్తున అర్బన్ పాపులేషన్ ఉండాలని ఆయన తెలిపారు. ఇంకోపక్క పరిశ్రమలు ఉండాలని అప్పుడే సర్వీసు సెక్టార్ అభివృద్ధి అవుతుందని ఆయన తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని రాబోయే రోజుల్లో 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నట్లు చంద్రబాబునాయుడు వివరించారు. ప్రధాని మంత్రి మోదీ కూడా సౌర విద్యుత్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది పవన విద్యుత్ 2,094 మెగావాట్లని, 974 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, 9,700 సోలార్ పంపుసెట్లు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యుత్ ఆదాకు వినూతన ఆలోచన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సదస్సులో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఎంఓయులు ఒప్పందం కుదుర్చుకుందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చాలా కంపెనీలు ఏర్పాటు కాబోతున్నట్లు చంద్రబాబునాయుడు వివరించారు. విశాఖలో రెండోసారి జరిగిన భాగస్వామ్య సదస్సులో 655 అవగాహన ఒప్పందాలు జరిగాయని వీటితో పది లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ 175 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని ఆయన వివరించారు. విద్యుత్, భూములు, నీటి వసతి కల్పించడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని ఆయన తెలిపారు. పెట్టుబడులు వచ్చేటప్పుడు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. యువతకు అవసరమైన స్కిల్ శిక్షణ కూడా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గమేస ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ కైమల్, గమేస చీఫ్ కార్పొరేటర్ జనరల్ సెక్రటరీ జోస్ అంటోనియా కోర్టాజరేనా, రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, పి నారాయణ, ఎంఎల్‌సిలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, బీద రవిచంద్ర, ఎంఎల్‌ఎలు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జెసి ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
* కృష్ణపట్నంలో మత్స్యకారుల మహాధర్నా
* కృష్ణపట్నం పోర్టు, ఎన్‌సిసి, ఎపి జెన్‌కో, గాయత్రీ యాజమాన్యాలపై మత్స్యకారుల ఆగ్రహం
* విద్యుత్ ప్రాజెక్టులకు నిలిచిన బొగ్గు సరఫరా
* నష్టం కోట్ల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా
ముత్తుకూరు, ఫిబ్రవరి 3: కృష్ణపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామాలైన రాంనగర్, అర్కాటిపాళెం గ్రామాలకు చెందిన సుమారు ఆరు వందల కుటుంబాలకు సంబంధించి సుమారు 1200 మంది మత్స్యకారులు ఎన్‌సిసి, ఎపిజెన్‌కో, గాయత్రీ, ఓడరేవు యాజమాన్యాలు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ పలు డిమాండ్ల సాధనకై కూటమిగా ఏర్పడి మహాధర్నా నిర్వహించారు. శుక్రవారం బకింగ్‌హామ్ కెనాల్ అవతల కృష్ణపట్నం పోర్టు నార్త్ ఈస్టు గేటు వద్ద ప్రాజెక్టుల నిర్లక్ష్య తీరుకు నిరసనగా పై రెండు గ్రామాల మత్స్యకార ప్రజలు శాంతియుతంగా మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ గతంలో కంపెనీలు ఇచ్చిన మహిళల ప్యాకేజీ, బోటు ప్యాకేజీ, నెలసరి జీవన భత్యం హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో కృష్ణపట్నం ఓడరేవు నుండి బెల్టుమార్గం ద్వారా ఎపిజెన్‌కో, ఎన్‌సిసి, గాయత్రీ పవర్ ప్రాజెక్టులకు సరఫరా అవుతున్న బొగ్గును డాప్ట్‌కోల్డ్ యార్డు వద్ద బొగ్గు సరఫరా నిలిపివేశారు. ఓడరేవు టు ఎపి జెన్‌కో రోడ్డు మార్గంలో పెద్దఎత్తున షామియాలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రాజెక్టు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ, ప్రాజెక్టుల నుండి సముద్రంలోకి విడుదలవుతున్న వ్యర్థజలాలతో సముద్రంలోని మత్స్య సంపద ప్రశ్నార్థకంగా మారిందని, దీంతో వేటలు లేక జీవనభృతి కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నెలసరి జీవన భత్యాన్ని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2008లో ఓడరేవు నిర్మాణ సమయంలో మత్స్యకార గ్రామాలకు చెందిన మగవారికి 76 వేల చొప్పున ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని, అదే సమయంలో పై ప్రాజెక్టుల యాజమాన్యాలు మత్స్యకార మహిళలకు ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారని, సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టు యాజమాన్యాలను సంప్రదిస్తున్నా సరైన సమాధానం చెప్పకపోగా ప్యాకేజీ అందని ద్రాక్షపండులా మారిందని, వెంటనే మత్స్యకార మహిళల ప్యాకేజీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పైరెండు మత్స్యకార గ్రామాల ప్రజలకు ఫైబర్ బోటు ప్యాకేజీని కూడా ఇస్తామని కంపెనీలు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో మత్స్య సంపద కోల్పోయి జీవనభృతి ప్రశ్నార్థకంగా మారటంతోపాటు కాలుష్యంతో నీరు, ఆహారం పూర్తిగా కలుషితమై రోగాలబారిన పడుతున్నామని, ఈ నేపథ్యంలో గాయత్రీ ప్రాజెక్టు యాజమాన్యాన్ని గ్రామానికి ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయమని కోరగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్హత, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మత్స్యకార కుటుంబానికి పైప్రాజెక్టులో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న తహశీల్దార్ చెన్నయ్య, ధర్నా జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారులతో మాట్లాడి వారి డిమాండ్‌లను అడిగి తెలుసుకొన్నారు. పై డిమాండ్లను ఉన్నతాధికారులతో చర్చించి అమలయ్యేలా చూస్తామని, ధర్నా విరమించాలని కోరగా, అందుకు మత్స్యకార గ్రామల ప్రజలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న గాయత్రీ ప్రాజెక్టు ఉన్నతాధికారి ప్రభాకర్‌వర్మ, అసిస్టెంట్ మేనేజర్ వంశీకృష్ణ, పలువురు అధికారులు మత్స్యకారులతో డిమాండ్లపై చర్చించారు. డిమాండ్ల అమలుకు కొంత సమయం కోరగా మత్స్యకారులు అందుకు నిరాకరించడంతోపాటు ప్రాజెక్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాదనలకు దిగారు. పై కంపెనీలకు ఇచ్చిన హామీలను ఒక్కటిగా వచ్చి ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించే ప్రసక్తే లేదని కరాఖండిగా మత్స్యకారులు తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వ అధికారులతో పాటు ప్రాజెక్టు అధికారులు వచ్చిన దారినే వెనుదిరిగారు. ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రాజెక్టుల యాజమాన్యాలను హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మత్స్యకారులు పొందూరు శీనయ్య, అక్కయ్యగారి మొలకయ్య, కోడి మల్లికార్జున్, మేకల లక్ష్మయ్య, వావిల రోశయ్య, కృష్ణయ్య, అక్కయ్యగారి వెంకటరమణ, కె బాలకృష్ణ, ఆవుల పాండురంగయ్య, ఆవుల బాబు తదితరులు పాల్గొన్నారు.

విశేష పూజలందుకున్న ఆదిత్యుడు
* ఆలయాల్లో ఘనంగా రథసప్తమి వేడుకలు
నెల్లూరు, ఫిబ్రవరి 3: ‘సప్తశ్వరథ మారుఢం, ప్రచండం కస్యపాత్మజం
శే్వతప్మద ధరం దేవం తం సూర్య ప్రణమామ్యహం’ అంటూ ఆదిత్యుని పారాయణ సేవలో భక్తులు తరించారు. శుక్రవారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాల్లో అశ్వరూఢుడైన ఆదిత్యునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని పలు శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. వేకువజామునే శివాలయాల్లోని ఆదిత్యునితోపాటు నవ గ్రహాల్లోని ఇతర గ్రహాలకు కూడా పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. ఆరోగ్యాన్ని, ఉపాధిని అందించే సూర్యభగవానుడికి నమస్కరించుకొని తమకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని భక్తులు వేడుకున్నారు. నగరంలోని మూలాస్థానేశ్వరస్వామి, వాసవి కన్యకాపరమేశ్వరి, ఇరుకళల పరమేశ్వరి, శ్రీరాజరాజేశ్వరిదేవి దేవస్థానంలో నవగ్రహాలను దర్శించుకుని పూజలు నిర్వహించుకునేందుకు వచ్చిన భక్తుల కోసం ఆయా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నీటి తడి కరవు... ఎండుతున్న పంటలు
* ఆత్మకూరు రైతుల ఆక్రందన
ఆత్మకూరు, ఫిబ్రవరి 3: నీటి తడి కరవై ఆత్మకూరు రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎప్పుడూ నీటి తడిలోనే ఉండాల్సిన వరి సేద్యానికి సంబంధించి ఈ దఫా వర్షపాతం లోటు కావడంతో అడుగడుగునా సమస్యలు నెలకొంటున్నాయి. వరి సేద్యం చేస్తున్న భూమి నీటి తడిలేక నెర్రెలు బారుతుండటం బాధాకరం. కాగా, సోమశిల జలాశయం నుంచి ఉత్తరకాలువ ద్వారా ఆత్మకూరు చెరువుకు నీరు చేరడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉత్తర కాలువ నుంచి ఏబి ఛానల్ ద్వారా ఆత్మకూరు చెరువుసప్లై ఛానల్ (ఏటిఎస్)లోకి నీటి ప్రవాహం చేరాల్సి ఉంది. అయితే మండలంలోని నాగులపాడు, చెర్లోఎడవల్లి గ్రామాల రైతులు ఏటిఎస్ ఛానల్‌లో నీటి ప్రవాహాన్ని మోటార్లతో తమ పంటలకు మళ్లించుకుంటున్నారు. ఇందుకోసమై ఆత్మకూరు సాగునీటి సంఘాల నేతలు ఆ రెండు గ్రామాల రైతుల నుంచి తలా కొంత మొత్తం వంతున దండుకోవడం పరిపాటి. అయితే నీటి లభ్యత సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదమయ్యేది కాదు. ఈ ఏడాది సగటున 65 శాతం వరకు సాలుసరి వర్షపాతానికి లోటుగా నమోదు కావడంతో పంటలకు సాగునీరు చేరడం కష్టతరమవుతోంది. ఆత్మకూరు చెరువుఆయకట్టు పరిధిలో అందరికీ నీరు అందే వైనం ఆగమ్యగోచరంగా మారుతోంది. దీంతో ఆయకట్టులో ముందు, వెనుక రైతులు కలహపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీటి తడి కరవవుతుండటంతో ఇప్పటి వరకు సాగైన పంటకు సంబంధించి కలుపుమొక్కల బెడద కూడా తీవ్రతరమవుతోంది. ఆ కలుపు పీకుదామంటే వరి మొక్కలు కూడా వేళ్లతో సహా బయటకు వచ్చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఎకరాకు ఎంత లేదన్నా రూ.12 వేలకుపైగా ఖర్చు చేసి నెలరోజులకు పైగానే సాగు చేసిన పంట నిలువునా ఎండిపోతుండటం ఆవేదనకు గురిచేస్తోంది. నీటి నిర్వహణకు సంబంధించి సాగునీటి సంఘం నిలువునా చేతులు ఎత్తివేస్తుండటాన్ని ఉద్దేశించి ఆత్మకూరు కర్షకుల్లో కలకలం రేపుతోంది. ఇదేమిటంటే నీటిని సరఫరాగావిస్తున్నా చీలి కాలువల్లో పూడిక చిక్కుల వల్ల ప్రవాహం ఆయకట్టు భూముల వరకు చేరడం లేదని సంగతి ఆత్మకూరు సాగునీటి సంఘ ఉపాధ్యక్షులు మాదాల మస్తాన్‌నాయుడు చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ చీలికాలువల సమస్యను కొలిక్కి తీసుకువచ్చేందుకు సాగునీటి సంఘం వద్ద కార్యాచరణ అంటూ లేదు. మైళ్లదూరంపాటు కాలువల్లో ప్రవాహం వెళ్తున్న దృష్ట్యా అంతటి భారీ నిడివితో కాలువల పూడిక తీసే వ్యవహారం సగటు రైతులకు సాధ్యపడే తంతు కాదు. కొన్నాళ్ల క్రితమే ఆత్మకూరు చెరువులో కర్రతుమ్మను వేలం వేయగా, నాలుగు లక్షల రూపాయలకు పైగానే వసూలైనా ఆ సొమ్ముతోనైనా ఈ ఏడాది నీటి నిర్వహణ ప్రక్రియ బాధ్యతాయుతంగా చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నీటి జాడ తమ పొలాల్లోకి వచ్చేలా సరిచూసుకునేందుకు రాత్రివేళల్లో సైతం పడిగాపులు పడుతున్నామని వాపోతున్నారు. అలాగే ఆత్మకూరు రెవెన్యూ పరిధిలో వెంకట్రావుపల్లి, నరసాపురం రైతులకు చెందిన భూములు సాగులో ఉన్నాయి. ఆత్మకూరు చెరువు నుంచి వెళ్లే సందిరేవి కాలువ నుంచి పెద్దిరెడ్డి కాలువలోకి నీరు చేరడం లేదు. ఈ పంట కాలువకు అడ్డంగా ఆత్మకూరు పురపాలక సంఘానికి సంబంధించి డ్రైనేజి కెనాల్ నిర్మిస్తున్నారు. దీంతో పంటలకు వెళ్లే సాగునీటిని అడ్డుకోవడంతో రైతులకు తీరని అన్యాయమే జరుగుతోంది. శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సందానీ, సిపిఎం నేతలు గంటా లక్ష్మీపతి, చేవూరు రామకృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టిడిపి పక్ష నేత తుమ్మల చంద్రారెడ్డితో చర్చించారు. రైతుల సమస్యల్ని ఆలకించిన కమిషనర్ సాగునీటిని తరలించేందుకు అడ్డంకుల్ని అదుపులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
నష్టపోకుండా కాపాడండి
* రైతు పందిపాటి ఇంద్రసేనారెడ్డి
పంట సాగుకు పూనుకున్న దృష్ట్యా నష్టపోకుండా కాపాడేలా చూడాలంటూ అధికారులు, సాగునీటి సంఘాన్ని ఉద్దేశించి ఆత్మకూరుకు చెందిన పందిపాటి ఇంద్రసేనారెడ్డి కోరుతున్నారు. తనతోపాటు మరికొందరి పంట పొలాలు ఎండుముఖం పడుతున్నట్లు వాపోయారు.

ప్రయోగ పరీక్షలు ప్రశాంతం
నెల్లూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 3: జంబ్లింగ్ విధానంలో ప్రారంభమైన ఇంటర్ ప్రయోగ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన సైన్స్ ప్రయోగ పరీక్షలకు 1998 మంది విద్యార్థులకు గానూ 1936మంది హాజరుకాగా 62మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా విభాగంలో 322మందికి గానూ 300మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన ప్రయోగ పరీక్షలకు 1598మంది విద్యార్థులకు గానూ 1566మంది విద్యార్ధులు హాజరుకాగా 32మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఒ బాబూ జాకబ్ నగరంలోని శ్రీచైతన్య కళాశాల, స్టోన్‌హౌస్‌పేటలోని కెఎసి కళాశాలలను తనిఖీ చేశారు. డిఇసి సభ్యులు గూడూరు, వెంకటాచలం, నగరంలోని పలు కళాశాలలను తనిఖీ చేసి ప్రయోగ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆందోళన
* ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయన ప్రేమికుడు
నెల్లూరు, ఫిబ్రవరి 3: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మానాలను దోచుకున్నాడు. చివరికి ముఖం చాటేసాడు. అయినా ఆ అబల 300 కిలోమీటర్లు దాటి వచ్చి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన స్థానిక భక్తవత్సలనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయవాడ భవానీపురంకు చెందిన కీర్తికి ఏడాదిన్నర క్రిందట నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన వెంకటసాయితో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డారు. ఈక్రమంలో కీర్తిని కలిసేందుకు పలుమార్లు వెంకటసాయి విజయవాడ వెళ్లి వచ్చాడు. వారి ప్రేమ వ్యవహారం వెంకటసాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు అతన్ని కీర్తిని కలవకుండా అడ్డుకున్నారు. కీర్తి, వెంకటసాయికి ఫోన్ చేసి కారణాలు కోరడంతో కులాలు వేరు కావడం వలన ఇంటిలో వారు తమ ప్రేమను అంగీకరించడం లేదని, తాను ఇకపై కలవలేనని చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన కీర్తి గత ఏడాది జూన్ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రియుని మోసంపై అప్పట్లో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటసాయి ఇంటిలో ఎవరికి చెప్పకుండా విజయవాడకు వెళ్లి కీర్తితోనే ఉంటానని ఆమెను నమ్మించాడు. ఖమ్మం జిల్లా మధిరలో బంధువుల వద్ద ఉంటూ ఉద్యోగం చేస్తానని, తరువాత వివాహం చేసుకుందామని కీర్తిని నమ్మించాడు. అతని అవసరాల కోసం తన బంగారు వస్తువులను అమ్మి రూ. 20 వేలు ఇచ్చింది. ఈ డబ్బుతో మూడు నెలలపాటు జల్సా చేసిన వెంకటసాయి, కీర్తిని కూడా శారీరకంగా లోబరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో కీర్తి గతంలో తనపై పెట్టిన కేసును కొట్టివేయించుకున్నాడు. తాను అనుకున్న పని పూర్తి కావడంతో చెప్పాపెట్టకుండా నెల్లూరు వచ్చేసాడు. కీర్తి ఫోన్ చేస్తే మాట్లాడటం మానివేశాడు. చివరకు రెండు రోజుల క్రితం కీర్తి ఫోన్‌లో గట్టిగా నిలదీయడంతో, నీవు నెల్లూరు వచ్చి మా కుటుంబ సభ్యులను ఒప్పిస్తే వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలను నమ్మిన కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం భక్తవత్సలనగర్‌లోని వెంకటసాయి ఇంటికి వచ్చింది. అక్కడ వెంకటసాయి, అతని తల్లి, అక్కా బావలు కీర్తిని కులం పేరుతో దూషించి దాడి చేశారు. అడ్డుకోబోయిన వారి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఎంతకొట్టినా తనను వివాహం చేసుకుంటేనే ఇంటి వద్ద నుండి వెళతానని కీర్తి భీష్మించుకొని కూర్చోవడంతో వెంకటసాయి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి, ఎటో వెళ్లిపోయారు. తనను వెంకటసాయి ప్రేమించి మోసగించాడని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

బొడ్డువారిపాలెంలో ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన
కొడవలూరు, ఫిబ్రవరి 3: కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాలెం ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఇండస్ట్రిస్టీయల్ పార్క్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం శంకుస్థాపన గావించారు. వౌలిక వసతులు, వృత్తి నైపుణ్యాల కోసం ఈ పార్క్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఐసిసి చైర్మన్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మొక్క నాటిన ముఖ్యమంత్రి
కొడవలూరు, ఫిబ్రవరి 3: రాచర్లపాడులో గల గమేసా పరిశ్రమ ప్రాంగణంలో తొలుతగా ముఖ్యమంత్రి స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముందు కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఆయనకు కంపెనీ యాజమాన్యం సాదరస్వాగతం పలికి ఆహ్వానించారు. తర్వాత గమేసా పరిశ్రమను ప్రారంభించారు.

గట్టి పోలీసు బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి పర్యటన
కొడవలూరు, ఫిబ్రవరి 3 : ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంమీద కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతమైంది. తొలుత ముఖ్యమంత్రి దగదర్తి మండలంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన పరిశ్రమకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అదనపు ఎస్‌పిలు, ఐదుగురు డిఎస్‌పిలు, పదిమంది సిఐలు, 34 మంది ఎస్‌ఐలు, 51మంది ఏఎస్‌ఐలు, 182 మంది కానిస్టేబుళ్లు, 11మంది మహిళా కానిస్టేబుళ్లు, 115 మంది హోమ్‌గార్డులు, మూడు ప్రత్యేక బృందాలు, 25 సాధారణ బృందాలు, ఏఆర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆటో ట్రాలీ బోల్తా
* 18 మందికి గాయాలు
నెల్లూరు రూరల్, ఫిబ్రవరి 3: పొట్ట కూటి కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చి జీవనం సాగిస్తున్న పేదలు పొదలకూరులో భవన నిర్మాణం కోసం వెళ్లి తిరిగి నెల్లూరు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడి పలువురు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 18 మంది భవన కూలీలు శుక్రవారం నెల్లూరు నుండి పొదలకూరుకు వెళ్లారు. వృత్తి పూర్తి చేసుకొని నెల్లూరుకు ట్రాలీ ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వచ్చే సమయంలో నెల్లూరు మండలం దొంతాలి గ్రామ సమీపాన వారు ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో అతి వేగాన్ని అదుపు చేయలేని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి బోల్తాపడింది. ఆ సమయంలో 18 మంది ట్రాలీలో ప్రయాణిస్తున్నారు. వారిలో 14 మందికి స్వల్ప గాయాలు కాగా, మిగిలిన నలుగురికి తీవ్ర గాయలైనట్లు రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని, బాధితులు చికిత్స పొందుతున్నారని సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. బాధితులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తెలిపారు.