శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎన్‌బికెఆర్‌తో జపాన్ బృందం ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, సెప్టెంబర్ 14:మెడిన్‌షా కార్పొరేషన్ (టోక్), ఫ్రెమ్ మీడియన్ సంస్ధ జపాన్ సాంకేతిన పరిజ్ఞాన నైపుణ్య బదలాయింపు కోసం కోట మండలంలోని విద్యానగర్‌లో గల నేదురుమల్లి బాలక్రిష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలతో గురువారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మెడిన్‌షా కార్పొరేషన్ డైరక్టర్ హీరకీవాకుయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులోఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటనకు వచ్చినపుడు అక్కడ ఉన్న తమ కంపెనీల డైరక్టర్లతో చర్చించారన్నారు. భారతదేశంలో మోదీ నేతృత్వంలో స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రధాని సూచనల మేరకు తన కంపెనీల పరిధిలోని పలు ఇంజనీరింగ్ కళాశాలను దృష్టిలో పెట్టుకున్నామన్నారు. అందులో భాగంగా తాము పరిశీలించిన ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలు అవసరమైన అన్ని వసతులు ఉన్నట్లు గుర్తించి అందులో 75మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు 45రోజులుపాటు శిక్షణ ఇస్తామన్నారు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ విభాగం నుంచి 60మందికి మెకానికల్ విభాగం నుండి 15మందిని ఎంపిక చేశామన్నారు. శిక్షణాంతరం నెల రోజులపాటు జిల్లాలోని మేనకూరులో ఉన్న తన కంపెనిలో ఇంటర్న్ షిప్ ఇచ్చి అందులో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కళాశాల కరస్పాడెంటు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ మెడిన్‌షా కంపెనీ తమ కళాశాలను ఎంచుకుని తమ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ శిక్షణకు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జపాన్ కంపెనీ నైపుణ్యాలపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను కళాశాల యాజమాన్యం జపాన్ బృందం మార్చుకున్నారు. అనంతరం కళాశాలలోని పలు విభాగాలను జపాన్ బృందం పరిశీలించారు. కార్యక్రమంలో ఫ్రైమ్ మీడియన్ సంస్ధ ప్రతినిధులు శ్తాస్రి, విజయకుమారన్, కృష్ణ, అభిజిత్ ప్రకాష్ కళాశాల డైరక్టర్ పి.విజయకుమార్‌రెడ్డి, ప్రాంగణ ఎంపిక అధికారి కిషందర్ వివిధ విభాగాధిపతులు, విద్యార్ధులు పాల్గోన్నారు.

వైభవంగా ముగిసిన పోలేరమ్మ జాతర
* అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
* వెంకటగిరికి పోటెత్తిన భక్తజనం
వెంకటగిరి, సెప్టెంబర్ 14: వేలాది భక్తజనుల మధ్య గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. ప్రతియేటా మాదిరిగా ఈసారి కూడా సాంప్రదాయబద్దంగా అత్యంత వైభవంగా జాతర జరిగింది. బుధవారం రాత్రి అమ్మవారి ప్రతిమను పుట్టినిల్లైన కుమ్మరి వీధిలో తయారుచేసి అక్కడ రాత్రి పదకొండు గంటల వరకు ఉంచారు. అక్కడ నుంచి అమ్మవారిని అత్తవారిల్లైన జీనిగలవారి వీధికి నిరాడంబరంగా తీసుకెళ్లారు. సాంప్రదాయబద్దంగా వచ్చే కాంపాళెం గాలిగంగలు రాగానే అమ్మవారికి కళ్లు, దిష్టిచుక్క పెట్టి వేలాది భక్తుల నడుమ అట్టహాసంగా అమ్మవారిని పట్టణ నడిబొడ్డునున్న ఆలయం వద్దకు తెల్లవారుజామున మూడు గంటలకు తీసుకొచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులు వెంకటగిరి ఇలవేల్పును దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి పోలేరమ్మను రథం ఎక్కించి వేలాది భక్తుల నడుమ వైభవంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు. దీంతో అమ్మవారి జాతర ముగిసింది.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో వెంకటగిరి రాజకుటుంబీకులు సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, బిజెపి నాయకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.
కొనసాగిన రాజాల సాంప్రదాయం
అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను వెంకటగిరి రాజులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అమ్మవారికి చీర, రవిక, పూలు, గాజుల పెట్టాక నిమజ్జనం కార్యక్రమానికి బయలుదేరేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం ఈ సాంగ్యాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు ఊరేగింపుగా వస్తున్న సమయంలో సాయికృష్ణ యాచేంద్ర, రామ్‌ప్రసాద్ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర రాజాప్యాలెస్ నుంచి అమ్మవారిపై పూలు చల్లి దర్శించుకున్నారు.
డిఆర్ ఉత్తమ్ హోటల్
ఆధ్వర్యంలో అన్నదానం
గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ప్రతిఏటా మాదిరిగా ఈ సంవత్సరం కూడా నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్ అధినేత కొడవలూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని తూర్పువీధిలో జాతరకు వచ్చిన భక్తులకు భారీ అన్నదానం చేశారు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పోలీసుల ఇష్టారాజ్యం
పోలేరమ్మ జాతరలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కేవలం విఐపిలకే ఏర్పాటు చేసిన క్యూలైన్లో పోలీసుల బంధువులను గుంపులు గుంపులుగా పంపి తమ అధికార దర్పాన్ని చాటుకున్నారు. పది రోజులుగా అటు నాయకులు, అధికారులు విఐపి లైన్లో ఎవరినీ అనుమతించని చెబుతూ వారి పని వారు చేసుకుంటూ పోయారు. దీంతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోలీసులపై మండిపడ్డారు. ఎవరిష్టానుసారం వారు తమ వారిని పంపుకుంటూపోతే ఇక ప్రత్యేక క్యూల్లైన్లు ఎందుకు ఏర్పాటు చేశారో వారికే తెలియాలి.
ఆలస్యంగా అమ్మవారి రథం
అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లాడానికి రావల్సిన రథం గంట ఆలస్యంగా వచ్చింది. అయితే ఉదయం రాజులు అమ్మవారికి సాంప్రదాయబద్దంగా తీసుకొచ్చిన సాంగ్యం విషయంలో మరో వర్గానికి చెందినవారు వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాజుల ఆధీనంలో అమ్మవారి రథాన్ని పంపకుండా ఆపివేశారు. దీంతో నాయకులకు, పోలీసులకు అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. స్థానిక సిఐ శ్రీనివాసరావు రాజులతో చర్చించి రథాన్ని గంట ఆలస్యంగా తీసుకొచ్చారు. దీంతో అమ్మవారి ఊరేగింపు మొదలైంది.
విఐపి క్యూలో ఆవుల హల్‌చల్
అమ్మవారి జాతరలో విఐపిల కోసం ఏర్పాటు చేసిన క్యూలో రెండు ఆవులు ప్రవేశించి పది నిమిషాలు హల్‌చల్ చేశాయి. వందల మంది పోలీసులు ఉన్నా క్యూలోకి ఆవులు ఎలా వచ్చాయో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు శ్రమించి వాటిని బయటకు పంపారు.
ఒకరికి తీవ్రగాయాలు
పోలేరమ్మ ఊరేగింపు శివాలయం వద్దకు వచ్చేసరికి జనం తొక్కిసలాట జరిగింది. దీంతో మల్లమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన అంకయ్య రథం కింద పడడంతో అతడి కాలుకు గాయమైంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

విలీన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
*మంత్రి సోమిరెడ్డి సూచన
నెల్లూరు రూరల్, సెప్టెంబర్ 14: కార్పొరేషన్‌లో విలీనమైన 15 గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌కు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. గురువారం రెండవ డివిజన్ అయిన అల్లీపురం, జన్నత్ హుస్సేన్ కాలనీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, జన్నత్ హుస్సేన్ కాలనీలో డ్రైన్ల కోసం 20 లక్షలు, శ్మశానం కోసం 28 లక్షలు ఇవ్వడం జరిగిందని శ్మశానవాటికను గురువారం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అల్లీపురం నారాయణరెడ్డిపేట, కోడేరుపాడు, నవలాకులతోట, నారాయణరెడ్డిపేట గ్రామాలు సొంత గ్రామాలని ఈ గ్రామాలతో విడదీయని అనుబంధం ఉన్నట్లు సోమిరెడ్డి తెలిపారు. రెండవ డివిజన్ అయిన అల్లీపురంలోని తాను నివాసం ఉంటున్నానని ఆయన అన్నారు. అనంతరం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామని నుడాకు వచ్చే నిధులను ఎక్కువ శాతం విలీన ప్రాంతాలకే ఖర్చుపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రెండవ డివిజన్‌కు రెండున్నర కోటి నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. మంత్రి చెప్పిన విధంగా విలీన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లంచం కేసులో ఆర్‌ఐకు రెండేళ్లు జైలు
నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 14: ఫ్యామిలీ సర్ట్ఫికెట్ మంజూరు చేయడానికి గాను లంచం డిమాండ్ చేసి తీసుకున్నారని నమోదైన కేసులో అప్పటి ముత్తుకూరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నన్నం నాగరాజుపై ఆరోపణలు రుజువైనందున అతనికి రెండేళ్ల జైలుశిక్ష, పది వేల రూపాయల జరిమానా విధిస్తూ నెల్లూరు ఎసిబి కోర్టు స్పెషల్ జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తుకూరు మండలం దువ్వూరుపాళెంకు చెందిన ఫిర్యాది ఎన్ మోహన్ తండ్రి గుండె ఆపరేషన్ నిమిత్తం ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యశాలలో సంప్రదించాడు. కాగా, అందులో పేరు రాలేదు. దానివల్ల ఫిర్యాది తండ్రికి సంబంధించి ఫ్యామిలీ మెంబరు సర్ట్ఫికెట్ తీసుకొచ్చిన పక్షంలో ఆరోగ్యశ్రీ కింద గుండె ఆపరేషన్ చేయించవచ్చునని సంబంధిత ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఫిర్యాది మోహన్ ముత్తుకూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో తమకు ఫ్యామిలీ మెంబరు సర్ట్ఫికెట్ మంజూరు చేయమని అర్జీ దాఖలు చేశాడు. దీనిని నిందితుడు నాగరాజుకు కార్యాలయం వారు అప్పగించారు. కాగా, ఫ్యామిలీ మెంబరు మంజూరుకు రెండు వేల రూపాయలు లంచం ఇవ్వాలని నిందితుడు నాగరాజు ఫిర్యాది మోహన్‌ను డిమాండ్ చేశాడు. కాగా, లంచం పైకం ఇవ్వడానికి ఇష్టపడని ఫిర్యాది ఈ విషయాన్ని సంబంధిత ఎసిబి అధికారులకు తెలిపారు. ఈనేపథ్యంలో 2014 జూన్ 6న తన కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగరాజును ఎసిబి అధికారులు చాకచక్యంగా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈమేర రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పిపి పివి సుబ్బయ్య వాదించారు.
బ్యాంక్ మేనేజర్‌కు మూడేళ్లు జైలు శిక్ష
తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఖాతాలు తెరచి బంగారం కుదువ పెట్టకుండానే డబ్బులు తీసుకున్నారనే నమోదైన కేసులో అప్పటి వెంకటాచలం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గంగాల అరుణకుమార్‌పై ఆరోపణలు సాక్షాధారాలతో రుజువైనందున ఆయనకు మూడు సంవత్సరాలు జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు నాల్గవ అదనపు మేజిస్ట్రేట్ వాసుదేవన్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన నిందితుడు గంగాల అరుణకుమార్ వెంకటాచలం ఎస్‌బిఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈయన దురుద్దేశంతో తమ కుటుంబ సభ్యుల పేర అదే బ్యాంకులో ఖాతాలు తెరిచారు. ఆ ఖాతాల పేరు మీద ఉన్న వారు బంగారం కుదువ పెట్టారన్న దానిపై దాదాపు రూ. 3 లక్షల 70 వేలు అప్పుగా బ్యాంకు పైకాన్ని తీసుకున్నారు. 2013 జూన్ 24న జరిగిన ఆడిట్ విచారణలో నిందితుడు అరుణకుమార్ బ్యాంక్‌లో ఎలాంటి బంగారం కుదువ పెట్టకుండానే బ్యాంకులో పైకాన్ని అక్రమంగా తీసుకొని నమ్మక ద్రోహం చేసినట్టు తేలింది. ఈమేర బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అరుణకుమార్‌పై కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పైమేర తీర్పు చెప్పారు.

నాణ్యత లేని ఆహార పదార్థాలు
అమ్మేవారిపై కేసుల నమోదు:జెసి
వేదాయపాళెం, సెప్టెంబర్ 14: నాణ్యత లేని ఆహారపదార్థాలు, మంచినీటి సీసాలు అమ్మేవారిపై కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తూనికలు, కొలతలశాఖ, ఫుడ్ సేఫ్టీ, పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ, నాణ్యత లేని వస్తువులు, ఆహారపదార్థాల వల్ల అనారోగ్యంతోపాటు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్రధాన కూడళ్లు అయిన బస్టాండులు, రైల్వే స్టేషన్, సినిమాహాళ్లు, తదితర ప్రదేశాల్లో నిర్ణీత ధరలకన్నా ఎక్కువ ధరకు అమ్మితే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తూనికలు, కొలతలు, ఆహారభద్రత అధికారులు, ప్రజాపంపిణీ అధికారులు ఉమ్మడిగా తనిఖీ చేపట్టాలన్నారు. అనంతరం తూనికలు, కొలతలు శాఖాధికారులు నమోదు చేసిన కేసుల వివరాలను జేసికి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ధర్మారెడ్డి, తూనికల, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ కె.్థమస్ రవికుమార్, ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ ఫలాల పందేరంపై తమ్ముళ్ల లుకలుకలు
* టిడిపి సమావేశంలో రచ్చకెక్కిన వివాదం
ఆత్మకూరు, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపరంగా తాము సూచించిన అర్హులైన పేదలకు అందకపోవడం అన్యాయమని పలువురు టిడిపి నేతలు మూకుమ్మడిగా వాపోయారు. గురువారం టిడిపి ఆత్మకూరు మండల కమిటీ సమావేశంలో భాగంగా తమ్ముళ్ల నడుమ వాదోపవాదాలకు తావిచ్చింది. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి మాజీ ఇన్‌చార్జి కన్నబాబు వర్గీయులు తొలుత ఆనం అనుచరులపై ధ్వజమెత్తారు. ఆనం అనుచర నేతగా మెలుగుతున్న టిడిపి మండల కమిటీ అధ్యక్షులు సుంకర పెంచలయ్య చౌదరి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈయన తీరును పలువురు ఆనం వర్గీయులు సైతం తప్పుబట్టడం గమనార్హం. సంక్షేమ రుణాల సంగతిపరంగా, గృహ నిర్మాణాల అంశంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే తప్పా కనీస మానవతా దృక్పథంతో కొనసాగడం లేదని ఆరోపించారు. అయితే దురుద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు సంధిస్తున్నారంటూ అసభ్యకర పదజాలాన్ని జోడించి ఈ సందర్భంగా పెంచలయ్య చౌదరి స్పందించడంతో వివాదం మరింతగా రాజుకుంది. ఈనేపథ్యంలో స్వతహాగా సౌమ్యుడైన టిడిపి మండల కమిటీ మాజీ అధ్యక్షులు దావా పెంచలరావు సైతం చౌదరి వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. దావాతో సహా మహిమలూరు, బట్టేపాడు, అప్పారావుపాళెం గ్రామ నాయకులైన వల్లూరు రమణారెడ్డి, వాసిపల్లి మల్లిక్, కిలారి సుబ్రహ్మణ్యంనాయుడు సంక్షేమ ఫలాల పంపిణీలో వ్యత్యాసాలను దుయ్యబట్టిన నేతల్లో ఉన్నారు. ఆనం వెంట పార్టీలోకి వచ్చిన కొత్తవారిదే పెత్తనం అధికంగా ఉన్నదంటూ వల్లూరు రమణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. తన స్వగ్రామంలో విపక్ష వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులకు వివిధ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యమిస్తూ భంగపాటుకు గురిచేస్తున్నారంటూ వాసిపల్లి మల్లిక్ సభాముఖంగా వాపోయారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు, టిడిపి మండల కమిటీ ప్రధానకార్యదర్శి కేతా విజయభాస్కరరెడ్డి, ఎంపిటిసి సభ్యులు గార్లపాటి వేణుగోపాలనాయుడు, దామినేని నరసింహులునాయుడు, టి బాబు, దావా పెంచలరావు, కిలారి సుబ్రహ్మణ్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం గోదాముల పరిశీలన
ఉదయగిరి, సెప్టెంబర్ 14: స్థానిక అటవీ రేంజ్ కార్యాలయంలో ఎర్రచందనం గోదాముల నిల్వను గురువారం ఆ శాఖ సిసిఎఫ్ కె సూర్యనారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయగిరిలో ఎర్రచందనం నిల్వలను రేణిగుంటలోని సెంట్రల్ గోదాముకు తరలించాలన్నారు. జిల్లాలో మూడువందల హెక్టార్లలో ఫ్లాంటేషన్ సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చేయాల్సి ఉండగా, ఈ ఏడాది ముందుగానే చేపట్టామన్నారు. జిల్లాలో 140 హెక్టార్లలో ఎర్రచందనం మొక్కలను నాటుతున్నట్లు చెప్పారు. ఈయన వెంట డిఎఫ్‌ఓ రామ్మోహనరావు, కావలి ఏసిఎఫ్ ఆనంద్, రేంజర్ అల్లాభక్షు ఉన్నారు.

గూడూరులో ఉరుములు, మెరుపులతో వర్షం
గూడూరు, సెప్టెంబర్ 14: గూడూరులో గురువారం సాయంత్రం ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులతో వర్షం కురిసింది. ఉరుములతో గూడూరు పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. మెరుపులు, చెవులు చిల్లులు పడేలా ఉరుములు ఈ ప్రాంత ప్రజలను గడగడలాడించాయి. సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆకాశం మేఘావృతమై గాలులతో పాటు మెరుపులు, ఉరుములతో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎక్కడో తప్పకుండా పిడుగు పడి ఉండవచ్చునని ప్రజలు భావించారు. పెద్దగా వర్షం పడకపోయినా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు భానుడు తన విశ్వరూపం ప్రదర్శించడంతో గత కొద్ది రోజులుగా ఈ వేసవితాపానికి ప్రజలు తట్టుకోలేక అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలావుంటే వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వేలాది మంది అమ్మవారిని దర్శించుకొనేందుకు సుదూర ప్రాంతాల వారు గూడూరు మీదుగా వెంకటగిరికి వెళ్లే క్రమంలో వర్షం అడ్డంకిగా మారింది. గూడూరు సమీపంలోని మర్రిపల్లి మడుగు నుండి ఇటీవల వందలాది ట్రాక్టర్ల మట్టిని ప్లాట్లకు పలువురు తరలిస్తుండడంతో ఆ మట్టి అంతా ప్రధాన రహదారిపై పడిపోవడం, దానిని నిర్వాహకులు తొలగించకపోవడంతో ఈ వర్షానికి రోడ్డు అంతా బురదమయమై పలువురు ద్విచక్ర వాహనచోదకులు కింద పడ్డారు. అలాగే కామాక్షినగర్ రోడ్డులో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జాతరకు వెళ్లి వచ్చే వాహనాలతో ఈ మార్గంలో గురువారం సాయంత్రం నుండి రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో వర్షం పడటంతో రోడ్డుపై బంకమట్టి పేరుకుని ఉండటం, కొత్తవారికి తెలియకపోవడం వల్ల పలువురు ఈ మార్గంలో కిందపడ్డారు. గురువారం సాయంత్రం గూడూరు, సైదాపురరం, మనుబోలు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.

సమస్యలపై నిలదీసిన ప్రజలు
* నీళ్లు నమిలిన టిడిపి నేతలు
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 14: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో గురువారం లాంఛనంగా ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలకే పరిమితమైంది. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆలస్యంగా హాజరుకావడంతో 11:30 గంటలకు ప్రారంభమైంది. దీనితో ఎండ తీవ్రతను తట్టుకోలేక కార్యక్రమానికి వచ్చిన ద్వితీయశ్రేణి నేతలు చెట్ల కింద సేదతీరారు. కేవలం ఎమ్మెల్యే, ఆయన సన్నిహితులు మాత్రమే ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జొన్నవాడ గ్రామాన్ని వదిలి కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలలో కార్యక్రమాన్ని చేపట్టి మమ అనిపించారు. గత కొద్డి రోజులుగా తాగునీరు, పారిశుద్ధ్య లోపాలతో ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని జొన్నవాడ గ్రామ మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. 32మందికి మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పుకున్నా .. చేస్తా, చూస్తామంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదని వాపోయారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో రోడ్లపై మురుగునీరు చేరి పారిశుద్ధ్యం మరీ దారుణంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ నుండి వెళ్ళిపోయారు. వెంటనే ఎంపీడీవో సుజాతను ఫోన్‌లో సంప్రదించి జొన్నవాడలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలావుండగా గురువారం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ కార్యక్రమం అయినందున పలువురు ముందుగా జొన్నవాడకు చేరుకుని ఎమ్మెల్యే వచ్చే వరకు ఉండి హాజరు వేసుకొని వెళ్ళిపోయారు. దీంతో కార్యక్రమం నేతలు లేక వెలవెలబోయింది.

పిడుగుపడి రెండు గేదెలు మృతి
మనుబోలు, సెప్టెంబర్ 14: మండల పరిధిలోని మడమనూరు గ్రామంలో గురువారం పిడుగుపడడంతో రెండు గేదెలు మృతి చెందాయి. దీంతోపాటు పలు విద్యుత్ స్తంబాలు నెలకొరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మడమనూరు గ్రామానికి చెందిన ఉడతా విజయ్‌కు చెందిన గేదెలు పశువుల మేతకు చిన్నచెరువు వద్దకు వెళ్ళాయి. సాయంత్రం పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో విజయ్‌కు చెందిన రెండు గేదేలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రూ.లక్ష రూపాయలు పైబడి ఉంటుందని వాపోయారు. అలాగే సయాబులపాలెంలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

వీరంపల్లి వద్ద కారు దగ్ధం
*త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
మనుబోలు, సెప్టెంబర్ 14: వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి జాతరకు వెళ్లి తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటల వ్యాపించి కారు దగ్ధమైంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయగిరికి చెందిన మేడా హరిహర, ఉమామహేశ్వరరావు తమ కుటుంబాలతో (మరో ముగ్గురు మహిళలు) కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర చూడడానికి తమ బంధులు ఇంటికి వెళ్లారు. పోలేరమ్మ జాతరను తిలకించి ఇంటికి వెళ్లడానికి తమ సొంత కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో మనుబోలు మండల పరిధిలోని వీరంపల్లి క్రాస్‌రోడ్డుకు చేరుకునే సమయంలో కారులో పొగలు రావడంతో వెంటనే కారును నిలిపివేశారు. కారులో ఉన్న తమ వస్తువులను బయటకు తీసుకుని బయటకు దిగిన తర్వాత ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. గూడూరు ఫైర్ స్టేషన్ ఎస్‌ఎఫ్‌ఓ వి.్భస్కర్‌రావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, సిహెచ్ రఘునాధరెడ్డి, ఎం.నరసింహులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ సమయంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో డీజిల్ లీక్ కావడంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడు హరిహర మాట్లాడుతూ కారు విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. మనుబోలు ఎఎస్‌ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్రికెట్ పంటర్ల అరెస్ట్
నెల్లూరు, సెప్టెంబర్ 14: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు పంటర్లను 1వ నగర పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక పెద్దబజార్ కుమ్మరవీధిలో నలుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న 1వ నగర ఎస్సై తన సిబ్బందితో కలిసి గురువారం ఉదయం 10.30లకు దాడి చేశారు. అక్కడ టివి ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న షేక్ మహమూద్ బాష, షేక్ హాజీ, షేక్ రఫీ అహ్మద్, షేక్ నజీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 సెల్‌ఫోన్లు, రూ.7,800 నగదు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.