శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గూడూరులో నేడే జెండా పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 19: దేవీ శరన్నవ రాత్రులకు ముందురోజు గూడూరు పట్టణంలో దుష్టగ్రహ సంహారకుడు ఆంజనేయ స్వామి జెండా పండుగ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఒక్కరోజే కోట్లాది రూపాయలు ఈ వేడుకలకు గూడూరులోని జెండా నిర్వహకులు ఖర్చు చేస్తారంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు. దేవి శరన్నవరాత్రి ముందురోజు పట్టణంలోని శక్తిరాళ్లకు వివిధ ప్రాంతాల నుండి తీసుకొని వచ్చిన గంగాజలంతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఫ్లెక్సీలపై ముద్రించి ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని వివిధ కూడళ్లలో వాటిని ట్రాక్టర్లపై ఉంచి బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామోత్సవం నిర్వహిస్తారు. 1.2 పట్టణాల్లో కలిపి దాదాపు 50 ఆంజనేయ స్వామి జెండాలు ఏర్పాటుచేస్తుండగా, ఎవరి శక్తికి తగ్గట్టు వారు ఈ వేడుకలను పోటా పోటీగా నిర్వహిస్తారు. ఇప్పటికే తూర్పువీధి ఆంజనేయ స్వామి జెండాకు సంబంధించి మహారాష్ట్ర ముంబయి నుండి ప్రత్యేకంగా తెప్పించి నరసింహస్వామి స్తంభం నుండి ప్రహ్లాదుని కోరిక మేరకు బయటకు వచ్చి హిరణ్యకశ్యపుడిని చంపే దృశ్యం ఇప్పటికే గూడూరుపట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కర్నాలవీధి, కోనేటిమిట్ట, మిట్టపాలెం, గమళ్లపాళెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే జెండా పండుగకు విశేషరీతిన డబ్బు ఖర్చు చేస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి గూడూరు ప్రాంతీయులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న గూడూరు వాసులు తప్పకుండా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గూడూరు పట్టణంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో భారీ కటౌట్లు, స్వామి, అమ్మవార్ల ఆర్చీలు, పట్టణంలో వెలిగి పోతున్నాయి. ఈ వేడుకల్లో ముఖ్యంగా తంజావూరు తప్పెట్లు, గరగ నృత్యాలు, భేతాళ నృత్యాలు, కీలుగుర్రాలు, విచిత్ర వేషధారణలు, తెనాలి బ్యాండు, తీన్మార్, డిజె వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. వీటిని తిలకించేందుకు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుండే ఏ వీధి చూసిన జనంతో ఇసుకేస్తే రాలనంతగా కిటకిటలాడి పోతుంది. పోలీసులు ఇప్పటికే జెండా నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహకులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసి ఉన్నారు. ఒకే ఒక రోజు కోసం గూడూరు పట్టణంలో జరిగే ఈ వేడుకలను తిలకించడానికి రెండు కళ్లు చాలవనే చెప్పాలి. ఆడ, మగా, చిన్నా పెద్దా తేడా లేకుండా పలువురు ఈ వేడుకలను తిలకించేందుకు జన జాతరలా తరలివస్తారంటే అతిశయోక్తి కాదని చెప్పవచ్చు.

ఎసిబి వలలో అవినీతి అవినేని
* ఎసిబి అధికారులకు పట్టుబడిన కమిషనర్
నాయుడుపేట, సెప్టెంబర్ 19: వచ్చిన కొద్దిరోజుల్లోనే అవినీతి అక్రమాల్లో అందెవేసిన చేయిగా విమర్శలు పాలైన నాయుడు పేట నగర పంచాయతీ కమిషనర్ అవినేని ప్రసాద్ చివరకు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో మంగళవారం ఉదయం నుండి ఏకకాలంలో ఆరుచోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా నాయుడుపేట కమిషనర్ కార్యాలయంలో గుంటూరు రేంజి ఇన్‌స్పెక్టర్ టివివి ప్రతాప్‌కుమార్ తన బృందం సభ్యులతో కలసి రికార్డులు స్వాధీనం చేసుకొని సోదాలు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు స్థానికంగా ఉన్న బడా వ్యాపార వేత్త తిరుమలనాయుడు అనే వ్యక్తిని కార్యాలయానికి పిలిచి విచారణ చేపట్టారు. నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు చెందిన ఎసిబి అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో జరిపిన దాడుల్లో శ్రీకాళహస్తిలోని ప్రసాద్ తల్లిపేరుతో ఉన్న బహుళ అంతస్థుల భవనంలోను, కడప, రాజంపేట ప్రాంతాల్లోని ఆయన స్నేహితుల ఇళ్లల్లోను, తిరుపతిలోని తన స్వంత ఇంట్లో, నెల్లూరులోని తన అత్త, కుమార్తెలు నివాసం ఉంటున్న ఇంటిలో సోదాలు నిర్వహించడంతో పాటు నాయుడుపేటలో సోదాలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో సుమారు పదికోట్ల రూపాయల ఆస్తులు అదికారులు గుర్తించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా నాయుడుపేట నగర పంచాయతీగా ఏర్పడిన తరువాత తొలి ఇన్‌చార్జి కమిషనర్‌గా అవినేని నియమితులయ్యారు. గడచిన మూడేళ్లుగా పట్టణాభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయి. వాటి వినియోగంలో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు ఆరోపణలున్నాయి. పట్టణంలో 18 ఎస్సీ, ఎస్టీ కాలనీలుండగా, వాటి అభివృద్ధి కోసమే మంజూరైన సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేసినా కాలనీకి 2, 3 సిసి రోడ్లు తప్ప ఒరిగిందేమి లేదన్న విమర్శలున్నాయి. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పట్టణ సుందరీకరణ పేరుతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించి పలు విమర్శలకు లోనయ్యారు. అందిన చోట అందినంత పుచ్చుకొని తన ఇష్టానుసారం ఆక్రమణలను తొలగించారు. కొన్ని వీధులు పెద్దవిగాను, కొన్ని చిన్నవి గాను, రోడ్లు వెడల్పు చేసి కొన్ని వీధుల్లో ఆక్రమణలు తొలగించకపోవడంతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్న విమర్శలున్నాయి. వీటిపై స్పందించిన ఎసిబి అధికారులు దాడులు పట్టణంలో సంచలనం సృష్టించింది.

ఇసుక, సిలికా రవాణా వాహనాలకు జిపిఎస్ తప్పనిసరి:ఎస్‌పి
నెల్లూరు, సెప్టెంబర్ 19: ఇసుక, సిలికా రవాణా చేసే వాహనాలు జిల్లా మైనింగ్ శాఖ సూచనల మేరకు వాహనాలకు విధిగా జిపిఎస్ పరికరాలను అమర్చుకోవాలని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఫలానా నిర్ణీత కంపెనీకి చెందిన జిపిఎస్ పరికరాలను మాత్రమే అమర్చుకోవాలని తాము ఎవరికీ సూచించలేదన్నారు. వాహనదారులు తమ ఇష్టమైన ప్రభుత్వ ఆమోదం ఉన్న కంపెనీ జిపిఎస్ పరికరాలను అమర్చుకోవచ్చని, ఈ విషయంలో ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అమర్చుకున్న జిపిఎస్ పరికరపు లాగిన్ డేటాను సంబంధిత పోలీస్‌స్టేషన్, స్పెషల్ బ్రాంచి, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులకు తప్పనిసరిగా తెలియచేయాలని స్పష్టం చేశారు. జిపిఎస్ పరికరాలను అమర్చుకోని వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తొలగించిన ప్రదేశాల్లో వ్యాపారాలు చేస్తే చర్యలు
ప్రజల సౌకర్యార్ధం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇటీవల నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్, కూరగాయల మార్కెట్, లీలామహల్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించామని, ఇక్కడ తిరిగి స్థలాలు ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పి హెచ్ డి రామకృష్ణ, నగర కమిషనర్ ఎస్.్ఢల్లీరావులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో హెచ్చరించారు. రోడ్డు మార్జిన్‌లో వ్యాపారాలు చేస్తున్న ఆక్రమణదారులను, హాకర్లను తొలగించడం జరిగిందని, తొలగించిన ప్రదేశాల్లో ఎవ్వరైనా తిరిగి ఆక్రమించుకోదలచిస్తే చర్యలు తప్పవన్నారు. అటువంటి సంఘటనలు జరుగుతుంటే నగరవాసులు తమకు 93907 77727 నెంబరుకు వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని వారు సూచించారు.

బుకీల బృందానికి హైకోర్టులో చుక్కెదురు
నెల్లూరు, సెప్టెంబర్ 19: జిల్లాలో సంచలనం రేకెత్తించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన బుకీలైన కృష్ణసింగ్, షంషేర్, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. జిల్లా కోర్టులో ఇప్పటికే రెండు పర్యాయాలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురైన నేపధ్యంలో కొందరు వ్యక్తులు కృష్ణసింగ్ బృందం కోసం హైకోర్టు గడప తొక్కారు. బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో కృష్ణసింగ్ తదితరులు జిల్లా కోర్టులో మరోసారి పిటిషన్ వేసుకునే అర్హత కోల్పోయారు. తిరిగి హైకోర్టులోనే వారం రోజుల్లో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు తమ న్యాయవాదుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.

రైలు ఢీకొని యువకుడు మృతి
నెల్లూరు, సెప్టెంబర్ 19: రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొనడంతో కందలూరి సుబ్రమణ్యం (26) అనే యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మన్సూర్‌నగర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం వంట మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం నగరంలోకి వచ్చిన సుబ్రమణ్యం సోమవారం రాత్రి ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే సమాచారం అధికారులకు ఆలస్యంగా అందింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

థియేటర్లలో అధిక ధరలకు
అమ్మేవారిపై కేసులు నమోదు:జెసి
వేదాయపాళెం, సెప్టెంబర్ 19: సినిమా థియేటర్లలో అధిక ధరలకు మంచినీరు, తినుబండారాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు వస్తున్నాయని అలా విక్రయించేవారిపై కేసులు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్‌లో సినిమా థియేటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై అధికారులు, సినిమా థియేటర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ సినిమా థియేటర్లలో వాటర్ బాటిల్స్ అధిక ధరలకు అమ్ముటపై సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు అందాయన్నారు. ఎస్-2 థియేటర్లో అరలీటరు కిన్‌లీ వాటర్‌బాటిల్ రూ.40లకు ఎందుకు అమ్ముతున్నారని థియేటర్ల యజమానులను వివరణ కోరగా దాంతో వారు సమాధానం ఇస్తూ కోకో కోలా కంపెనీ వారు ప్రత్యేకంగా మల్టి ఫ్లెక్సీలు, ఎయిర్ పోర్టులలో విక్రయించుటకు తయారు చేస్తున్నారన్నారు. రెగ్యులేషన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం నేషనల్ కన్సుమర్ డిస్‌ప్యూట్స్ రెడ్రపల్ కమీషన్, న్యూఢిల్లీ వారి ఉత్తుర్వుల ప్రకారం ప్రతి సినిమా థియేటర్‌లో ఉచితంగా ప్యూరిఫైర్ వాటర్‌ను ప్రేక్షకులకు ఉచితంగా ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ బాటిళ్లు ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరలకు విక్రయించరాదన్నారు. అధిక ధరలు తనిఖీలు చేయడానికి లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారి, వాణిజ్యపన్నులశాఖ అధికారి, పౌరసరఫరాల అధికారి, మున్సిపల్ హెల్త్ అధికారి, నెల్లూరు తహసిల్దారులతో కమిటీ వేసి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసినా చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు ఆర్డి ఓ డి.హరిత, నెల్లూరు తహసిల్దారు నరసింహులు, ఫుడ్‌సేఫ్టీ అధికారి బి.శ్రీనివాస్, మున్సిపల్ హెల్త్ అధికారి శివనాగేశ్వరరావు, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ కె.టి.రవికుమార్, అధికారులు, సినిమా థియేటర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

రుణ పంపిణీ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయండి
* బ్యాంకర్లకు కలెక్టర్ సూచన
వేదాయపాళెం, సెప్టెంబర్ 19: జిల్లాలోని బ్యాంకులకు నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. మంగళవారం స్థానిక గోల్డెన్ జూబ్లీహాలులో బ్యాంకర్ల జిల్లాస్థాయి సమితి సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2017 జూన్ మాసం వరకు రుణ పంపిణీ లక్ష్యం 24.51శాతం మాత్రమే ఉందన్నారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి మొత్తం రుణ పంపిణీ రూ.11932.23కోట్లు కాగా, ఈ సంవత్సరం జూన్ ఆఖరు వరకు రూ.2924.86కోట్లు పంపిణీ మాత్రమే జరిగిందన్నారు. డి ఆర్ డి ఏ, మెప్మా అధికారులు పొదుపు మహిళలకు రుణాలు మంజూరు చేయడమే కాకుండా తిరిగి బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసంగా బ్యాంకు అధికారులకు సహకరించాలన్నారు. కౌలు రైతులకు ఎల్ ఇసి, సి ఓసి కార్డులను ఎక్కువ సంఖ్యలో విడుదల చేసి రుణాలు మంజూరు చేయించాలన్నారు. ఇప్పటి వరకు 266 ఎల్. ఇసి కార్డుదారులకు రూ.1.34కోట్లు రుణాలు ఇచ్చారని, ఈ పంపిణీ సంతృప్తికరంగా లేదన్నారు. అదేవిధంగా ముద్రా రుణాలు పంపిణీ సంతృప్తికరంగా లేదన్నారు. ఉపాధిహామి కార్మికులకు, గృహనార్మాణాల లబ్దిదారులకు చెల్లింపు చేసేటప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు పేదలందరికి చేరాలన్నారు. అందుకు తగినట్లుగా రుణాలు పంపిణీ జరగాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి, ఎల్ డి ఎం వెంకట్రావ్, లీడ్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ హరిశంకర్, ఎ ఎంజి, ఆర్ డి ఐ రమేష్‌బాబు, నాబార్డు ఏజి ఎం నరసింహారావు, జిల్లా కో ఆర్డినేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమ పనులు ఆపండి
* తిరుపతి ఎంపి ఆదేశం
రాపూరు, సెప్టెంబర్ 19: ప్రజలకు తీవ్ర ముప్పు కల్పించడమే కాకుండా భయంకర విషవాయువుల కారణంగా వేలాది మంది రోగాలకు కారణమయ్యే ఫ్యాక్టరీ పనులను వెంటనే నిలుపుదల చేయాలని తిరుపతి పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ సంబంధిత ఫ్యాక్టరీ మేనేజర్ బ్రహ్మయ్యను ఆదేశించారు. మండల పరిధిలో భోజనపల్లి పంచాయతీ రావిగుంటపల్లి గ్రామ సమీపంలో కోస్టల్ వెస్ట్ కంపెనీ నిర్మించనున్న ఫ్యాక్టరీ పనులను ఆపాలని ఇటీవల ఈ ప్రాంత ప్రజలు జిల్లా కలెక్టర్‌తోపాటు పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల మొరను ఆలకించి స్పందించిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు మంగళవారం నిర్మాణమయ్యే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తమను కలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలో ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరపవద్దని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే విషవాయువుల కారణంగా భయంకర రోగాలబారిన పడవల్సి వస్తుందన్నారు. అలాగే భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందని వెంటనే ఈ పనులు ఆపాలని స్థానికులు ఎంపిని కోరారు. దీనికి స్పందించిన ఆయన ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగే ఈ ఫ్యాక్టరీ పనులను ఆపాలని ఫ్యాక్టరీ మేనేజర్‌ను ఆదేశించారు. ఆయన వెంట వైసిపి జిల్లా నాయకులు పాపకన్ను దయాకర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. ఇదిలావుండగా భయంకర విషవాయువులు వెదజల్లే ఈ ప్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఏవిధంగా ఇచ్చారనే దానిపై భోజనపల్లి పంచాయతీ సర్పంచ్ ఆవుల పెంచలనర్సయ్యను ప్రశ్నించగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది తానేనని తెలిపారు. యాజమాన్యం కోరిన సందర్భంలో అప్పటి పరిస్థితుల్లో తాను ఈ అనుమతులు లిఖితపూర్వకంగా ఇచ్చానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.

అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
* మంత్రి నారాయణ ఆకాంక్ష
నెల్లూరు టౌన్, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. మంగళవారం నగరంలోని 7వ డివిజన్‌లోని నవాబుపేట బివిఎస్ బాలికల హైస్కూల్ నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టిడిపి నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, ఆ డివిజన్ కార్పొరేటర్ కినె్నర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి నారాయణ పాల్గొని జలకన్య సెంటర్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా ఐదు లక్షల 43 వేల ఇళ్లు నిర్మించాల్సి ఉందని, వీటిలో ఇప్పటికే లక్షా 39 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా 46 లక్షల పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. 24 వేల కోట్ల రైతు రుణమాఫీ, 86 లక్షల మందికి డ్వాక్రా రుణమాఫీ, కోటీ 42 లక్షల పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీతోపాటు చంద్రన్న బీమా, ఎన్‌టిఆర్ వైద్యసేవ, కాపు, బ్రాహ్మణ, బిసి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్‌షిప్పులు పారిశ్రామిక రుణాలు అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నూనె మల్లికార్జున యాదవ్, తాళ్లపాక అనూరాధ, ఎం విజేత, బివి లక్ష్మి, షంషుద్దీన్, వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి శ్రీదేవీ శరన్నవరాత్రులు
*రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు
నెల్లూరు కల్చరల్, సెప్టెంబర్ 19: నగరంలోని దుర్గామిట్టలో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు గురువారం నుండి వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో, ప్రాంగణం వెలుపల వివిధ దేవతల ఆకృతుల్లో విద్యుద్దీపాలంకణను శోభాయానంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు తగు వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 21 నుండి 30వ తేదీ వరకు దశరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. తొలిరోజు కలశ స్థాపన కార్యక్రమంతో మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం పూలంగిసేవ, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలంకరణ తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. 21న శ్రీ చండీ అలంకారం, 22న శ్రీ భవాని అలంకారం, 23న శ్రీ గాయత్రి అలంకారం, 24న శ్రీ అన్నపూర్ణ అలంకారం, 25న శ్రీ గజలక్ష్మి అలంకారం, 26న శ్రీ కాళికాలంకారం, 27న శ్రీ సరస్వతీ అలంకారం, 28న శ్రీ దుర్గా అలంకారం (దుర్గాష్టమి), 29న శ్రీ మహిషాసుర మర్ధిని అలంకారం (మహర్నవమి), 30న శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. చివరి రోజున రాజరాజేశ్వరి అమ్మవారికి నగరోత్సం వైభవోపేతంగా జరగనుంది. ఉత్సవాలు జరుగు అన్ని రోజులు వివిధ సాంస్కృత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
భక్తులకు భద్రత
కోర్కెలు తీర్చే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా భక్తులకు పూర్తి భద్రత, సౌకర్యాలు ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఇందుకుగాను ఉదయం 6 గంటల నుండి అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. ఆలయం, ప్రాంగణంలో, వెలుపల తదితరచోట్ల సుమారు 16 సీసీ కెమేరాలు అధికారులు ఏర్పాటు చేశారు. మహోత్సవాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విఐపిలు కూడా అమ్మవారి దర్శనార్ధం కేటాయించిన టికెట్‌లు కొనుగోలు చేయాలని నిర్వాహకులు తెలిపారు.
ఇరుకళల పరమేశ్వరీ ఆలయంలో..
నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 21వ తేదీ నుండి నవరాత్రుల మహోత్సవాలను నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించనున్న సందర్భంగా తగు వసతు కల్పనలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు. విశేషంగా అమ్మణ్ణికి పూజలు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. నగరోత్సవం తదితర సేవలు, అలంకారాలు అమ్మవారికి చేపట్టనున్నారు.

దివ్య దర్శనానికి 20 మండలాలు పూర్తి
* దేవాదాయ అధికారి రవీంద్రరెడ్డి వెల్లడి
నెల్లూరు కల్చరల్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్య దర్శన కార్యక్రమం జిల్లాలోని 20 మండలాలు పూర్తయ్యాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి.రవీంద్రరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. జిల్లాలో పేదలైన భక్తులకు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలను దర్శింపజేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందులో భాగంగా ఇంకా 26 మండలాల నుంచి భక్తులను దివ్య దర్శనం ద్వారా ప్రముఖ దేవాలయాల దర్శనాలు చేయించనున్నామన్నారు. మంగళవారం చిట్టమూరు, వాకాడు మండలాల భక్తులను దివ్యదర్శనానికి పంపించామని తెలిపారు. ఆ రెండు మండలాల్లో 128 మంది భక్తులను 3 బస్సుల్లో దైవ దర్శనాలకు పంపించామని తెలిపారు. మల్లాంలోని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నుంచి దివ్య దర్శనం బస్సులు బయలుదేరాయని తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఉంటారన్నారు. దీంతో దివ్య దర్శనం యాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. దసరా మహోత్సవాల అనంతరం దివ్యదర్శనం యాత్ర యథాతధంగా కొనసాగుతుందని తెలిపారు. భక్తుల సౌకర్యాలకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతులతో ఇప్పటి వరకు యాత్రను అద్భుతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. తొలుత కోవూరు భక్తులతో స్థానిక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి దివ్యదర్శన యాత్ర ప్రారంభమైందన్నారు. బుచ్చిరెడ్డిపాళెం, వరికుండపాడు, ఉదయగిరి, దుత్తలూరు, కావలి, ఇందుకూరుపేట, ముత్తుకూరు, వెంకటాచలం, డక్కిలి, పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, చిల్లకూరు, కోట, చిట్టమూరు, వాకాడు, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాల భక్తులకు దివ్యదర్శనం కల్పించామని ఆయన తెలిపారు.